ఒక్కసారిగా తనకు మెలకువ వచ్చేసి, ఇదంతా పీడకల అని తెలిసిపోతే ఎంత బాగుండు? అప్పుడుగానీ తను మళ్ళీ పనిలో పడలేదు.
పని చెయ్యకపోతే కొత్తగా డబ్బులు రావు, ఇదివరకు సంపాదించినది మెల్లమెల్లగా ఖర్చయిపోతుంది.
కూర్చుని తింటే కొండలు కూడా తరిగిపోవూ!
హఠాత్తుగా ఏదో గుర్తుకొచ్చినట్లు లేచి బ్యాంక్ పాస్ బుక్ తీశాడు బాలూ. అది జాయింట్ అకౌంట్! తనూ, సౌదామినీ ఇద్దరూ కలిసి ఓపెన్ చేశారు ఇద్దరిలో ఎవరైనా డబ్బు విత్ ద్రా చేయవచ్చు. అందులోనుంచి చూశాడు బ్యాంక్ బేలెన్స్ సంతృప్తి కరంగానే వుంది.
కానీ ఇదేమిటీ? నిన్న పదివేలు విత్ డ్రా చేసినట్లు ఎంట్రీ.
తను తియ్యలేదే!
సౌదామిని తీసిందా! అంత డబ్బు ఒక్కసారిగా ఎందుకు?
మళ్ళీ గాలపు ముల్లు మెదడులో దిగబడి ఆలోచన్లని సౌదామిని వైపు లాగటం మొదలెట్టింది.
ఏం చేసి వుంటుంది అంత డబ్బు? ఇంటి ఖర్చులకి తను తీసుకుంటూనే వుంటుంది అకౌంటులోనుంచి కానీ ఒక్కరోజులో పదివేలా? ఎంట్రీలు మళ్ళీ చూచాడు. పదిరోజుల క్రితం మరో పదివేలు ఎందుకు?
"సౌదామినీ!" అని పిలిచాడు. కాదు గావుకేక పెట్టాడు.
వెంటనే వచ్చింది సౌదామిని.
"ఏమిటిది? పదిరోజుల్లో ఇరవైవేలు తీశావా బ్యాంక్ లో నుంచి?"
ఒక్కక్షణం సేపు సౌదామిని కళ్ళల్లో భయం కనబడింది వెంటనే దానిని కప్పి పుచ్చుకుంటూ అంది-
"తీశాను"
"ఎందుకు?"
"కొత్త డైనింగ్ టేబుల్ ఆర్డర్ ఇద్దామనుకున్నాం. మర్చిపోయారా? రివాల్వింగ్ టైపు కావాలని చెప్పారు మీరే. గుండ్రటి టేబుల్, మధ్యలో కూరలూ, అవి పెట్టివుంచే చెక్క గుండ్రంగా తిరుగుతూ అందరికీ అందుబాటులో ఉంటుంది."
"అది ఇరవైవేలా?"
"మంచి రోజ్ ఉడ్, డెకోలమ్ టైపు అరడజను కుర్చీలు మొత్తం ఎనిమిది వేలు"
"మరి మిగతా పన్నెండు వేలూ!"
కొద్దిగా తడుముకునిఉ చెప్పింది సౌదామిని.
"సోఫా సెట్టు కూడా ఆర్డరిచ్చాను. మీరే బిజీగా ఉన్నారు గదా! అందుకని నేనే వెళ్ళాను"
"ఇంకా డెలివరీ చెయ్యలేదా వాళ్ళు?"
"లేదు ఆర్డర్ ఇచ్చాంగదా! చెయ్యడానికి టైమ్ పడుతుందట."
'ఏ షాపు?' సౌదామిని సమాధానం చెప్పకుండా ఏదో పనివున్నట్టు అక్కన్నుంచి వెళ్ళిపోయింది.
16
రైలు వేగంగా వెళుతూంది.
తిరుగు ప్రయాణానికి విమానంకన్నా రైలు బావుంటుందని - కూపే ఏర్పాటు చేశాడు మార్తాండ్. కొత్తగా వేసిన గౌతమీఎక్స్ ప్రెస్. బాలూ మొహంలో సంతోషం కనబడలేదు సరికదా చిరాకు అణచుకుంటున్నట్టు కనబడ్డాడు. అంతకుముందు ప్రతిసారీ ప్రోగ్రామ్ లు ఇవ్వటానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడూ ఫస్ట్ క్లాస్ కూపే దొరికినా దాన్ని సద్వినియోగపర్చుకునేవాడు. కానీ ఈవేళ ఈ కూపేనే ఇరుగ్గా నరకకూపంలా కనబడుతూంది.
గౌతమీ ఎక్స్ ప్రెస్ విజయవాడ చేరింది. రాత్రి పన్నెండయింది.
సౌదామిని వెల్లకిలా పడుకుని ఏదో పుస్తకం చదువుకుంటూంది.
బాబు పై బెర్తుమీద నిద్రపోతున్నాడు.
బాలూ కిటికీదగ్గర కూర్చుని బయట చీకట్లోకి చూస్తున్నాడు.
పడుకున్న సౌదామిని తల దగ్గిర దీపం వెలుగు, వాలుగా ఆమెపై పడుతోంది. ఆ భంగిమలో ఆమె వక్షస్థలం మరింత ఎత్తుగా కనబడుతూంది. కూపేలో భర్త తప్ప మరెవరూ లేకపోవడంతోఆమే నిర్లక్ష్యంగా పడుకుని చదువుకుంటూంది తల దగ్గిర వున్న బాలూకి ఆమె మెడ క్రింద చీకటి రెండుగా విడిపోతూ స్పష్టంగా కనిపిస్తూంది. ఆ సరళరేఖ పాదాలవరకూ నిలువుగా కనబడుతూన్నట్టు తోచింది. ఆమె మామూలుగానే పడుకుని వుంది. కానీ ఏ ఆరోగ్యవంతమైన పురుషుడికైనా ఆ భంగిమ రెచ్చగొట్టేదిలా వుంది. 'ఇది తన స్వంతం' అనుకుంటేనే చాలు- భర్తకి ఎంతో సంతృప్తి కలిగించే శరీర సౌష్టవం ఆమెది. కానీ ఇదే భంగిమలో ఏ ఆచ్చాదనా లేకుండా ముందే ఆమెని మరో పురుషుడు చూశాడన్న ఆలోచనే అతడిని కాల్చేస్తూంది.
తనతో వివాహం కాకముందు-
ఆమె కన్యగా - ఫ్రెష్ గా వున్నప్పుడు-
ఆంజనేయుల్తో -రెల్లుగడ్డి మధ్య- ఇలాగే పడుకుని ఎంజాయ్ చేసి వుంటుంది. కిలకిలా నవ్వుతూ అతడి చేతలకి సహకరించి వుంటుంది. బాబు పుట్టకముందు ఈ శరీరమంతా పొందిగ్గా వుండేది. వివాహం కాకముందు ఇంకా ఎంతో బింకంగా వుంటుంది. ఆ కొత్త అందాలన్నీ ఆంజనేయులు పీల్చి పిప్పి చేసిన చెరుగ్గడని తనకి అందించాడు. తను దాన్నే అపురూపంగా తీసుకెళ్తూ వుంటే-
-బహుశ నవ్వుకుని వుంటాడు.
తనొక బఫూన్ లా కనబడి వుంటాడు. అతడికి శరీరం మండిపోతున్నట్టు అనిపించి ఇక ఆపుకోలేక- "సౌదామినీ" పిలిచాడు.....కామ్ గా.
భర్త పిలుపుకి, పుస్తకం చదువుతున్న సౌదామిని, దాన్ని పక్కన పడేసి, అతడివైపు ఆశ్చర్యంగా చూసింది. చాలాకాలం తర్వాత అంత ప్రేమగా పిలవటం....
ట్రైన్ విజయవాడనుంచి బయల్దేరి, కృష్ణానది చేరుతోంది.
హైద్రాబాద్ చేరటానికి ఇంకా ఆరు గంటలు టైముంది.
"ఏమిటండీ".
అతడో క్షణం ఆగి, నెమ్మదిగా అన్నాడు.
"ఆంజనేయులికీ నీకూ మధ్య వున్న సంబంధం నాకు తెలిసిపోయింది సౌదామినీ".
* * *
రైలు కృష్ణా బ్యారేజిమీద వెళ్తూంది. తెరిచి వున్న కిటికీ సందుల్లోంచి, పెద్ద శబ్దంతోపాటు గాలికూడా రివ్వున వీస్తోంది.
ఆమె చప్పున లేచి కూర్చుంది.
"ఏమిటి మీరనేది?"
"నీ వివాహానికి పూర్వం వున్న సెక్స్ సంబంధం గురించి.... సారీ ఇంతకన్నా విపులంగా చెప్పలేను".
"మీరు పొరపాటు పడుతున్నారు".
"సౌదామినీ! నువ్వంటే నాకెంతో ప్రేమ! గౌరవం!! నా జీవితానికి నిచ్చెన వేసింది నువ్వే. ఆ గౌరవాన్ని చివరివరకూ నిలుపుకుంటే సంతోషిస్తాను. అబద్దాలతో వాదించాలనుకుంటే- నువ్వు మాట్లాడేకొద్దీ ఆ గౌరవము తగ్గిపోతుంది".
"మీరేదో మనసులో పెట్టుకుని-"
ఆమె మాటలు పూర్తికాకుండానే "నీకు ఏడో నెలలో డెలివరీ కావటానికి అసలు కారణం నాకు తెలిసింది. ఆంజనేయుల్ని ఈ మధ్య నువ్వు చాటుగా కలుసుకుంటున్నావన్న సంగతి కూడా నాకు తెలుసు. నీ గుండె బ్రద్దలయ్యే మరో నిజం చెప్పమంటావా సౌదామినీ! బాబు రక్తం పరీక్షింపచేశాను. వాడు నా కొడుకు కాడు". ఆమె మొహం పాలిపోయింది.
ఏ ఆధారమూ దొరక్క నడిప్రవాహంలో కొట్టుకుపోతున్నదానిలా అయిపోయింది. నిశ్చేష్టురాలై అతడివైపే చూస్తూ వుండిపోయింది.
"ఎందుకు? ఎందుకు చేశావ్ సౌదామినీ నన్నింత మోసం.... ఆగు, ఏడవకు నాకసహ్యం. విషయం చెప్పు. మనం దీన్ని ఎంత తొందరగా తేల్చుకుంటే అంత మంచిది".
ఆమె కొద్దిసేపు మౌనంగా వుండి అన్నది- "నిజమే మీతో వివాహం కాకముందు నాకు అతడితో సంబంధం వుండేది".
"నన్ను చూశాక, నేను బెటర్ ఛాయిస్ అనిపించింది అవునా!"
ఆమె మాట్లాడలేదు.
"నేను కొంతకాలానికి పాతబడగానే మళ్ళీ పాత ప్రియుడి మీద మనసు పోయింది" చాలా ఆశ్చర్యంగా, అతడి స్వరంలో ఆవేశం లేదు. ఆమె జవాబు చెప్పలేదు.
"నీలాంటిదాన్ని చంపితే నాకు పాపం అంటుతుందా సౌదామినీ?" అతను ఆగి అన్నాడు "...నిజానికి నీ మీద ఇప్పటికి రెండు మూడుసార్లు హత్యాప్రయత్నం చేశాను. అదృష్టవశాత్తు తప్పించుకున్నావు. కానీ నాకెందుకో ఇదంతా నీకు చెప్పిన తరువాతే నిన్ను చంపాలనిపించింది. నువ్వు నాపట్ల సిన్సియర్ గా లేవు. కాని నేను నీ మరణంపట్ల సిన్సియర్ గా లేవు. కాని నేను నీ మరణంపట్ల సిన్సియర్ గా వుందామనుకుంటున్నాను. చెప్పు యెలా చంపమంటావు నిన్ను".
చాలాసేపు మౌనం. రైలు బ్రిడ్జీ మీద వేగంగా వెళ్తూంది. ఒక నిర్ణయానికి వచ్చినట్టు ఆమె నెమ్మదిగా లేచి తలుపు దగ్గిరకి వెళ్ళింది. "నన్ను హత్యచేసే ప్రయాస మీకొద్దు" అంది అక్కడ నిలబడి. "మీరు నన్నెంత ప్రేమించారో నాకు తెలుసు. కానీ నేను మీకు ద్రోహం చేశాను. మీరు నాకు అన్నీ అమర్చారు. అయినా నేను పరాయి మోజులో పడడను. జీవిత భాగస్వామికి ద్రోహం చేసినందుకు ఉరిశిక్ష లేకపోవడం మన న్యాయశాస్త్రం చేసుకున్న దురదృష్టం. ఆ శిక్ష నాకు నేనే విధించుకుంటాను".
అతడు మాట్లాడలేదు. ఆమె చివరి ప్రశ్నగా-
"మరి బాబు-?" అని అడిగింది.
"ఆ సంగతి నేను చూసుకుంటాను".
"వెళ్లొస్తాను".
"మంచిది".
ఆమె కారిడార్ లో నడవటం కనిపిస్తూంది.
అతడు అటే చూస్తున్నాడు.
లాక్ చేసి వున్న తలుపు తెరిచింది. గాలి రివ్వున వీచింది లోపలికి. తలుపు దగ్గిర వున్న రాడ్ పట్టుకుని మెట్టుమీద అడుగు పెట్టింది. వంతెన తాలూకు స్థంభాలు వేగంగా వెనక్కి వెళ్తున్నాయి.
తలతిప్పి అతనివైపు చూసింది.
ఇద్దరి చూపులూ కలుసుకున్నాయి.
అతడు మొహం తిప్పుకున్నాడు.
ఆమె రాడ్ ని వదిలేసింది.
ఆ వేగానికి ఆమె శరీరం వెళ్ళి వంతెన తాలూకు రెయిలింగ్స్ కి విసురుగా కొట్టుకుంది. ఎన్ని భాగాలుగా ఛిన్నాభిన్నమైపోయిందో తెలీదు. నది అలలు చెదిరాయి. ఆ శబ్దాలన్నీ రైలు శబ్దాల్లో కలిసిపోయాయి.
* * *
మెలకువ వచ్చింది బాలూకి. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. కొంచెం సేపు ఏమీ అర్ధంకాలేదు. రైలు వేగంగా వెళ్తోంది.