ఇంటర్ లో వుండగా లక్ష్మి ఆర్టు క్లాసుకు వెళ్ళి అందులో అభివృద్ధి సాధించుకుంది. క్రికెట్ పట్ల కూడా జ్ఞానాన్ని బాగా పెంచుకుంది. తను తయారుచేసిన స్క్రాప్ బుక్ గురించి వ్రాసుకుంది. అది తమ్ముడి పుట్టినరోజుకి బహుమతిగా యిస్తే ఎంత పొంగిపోయాడో వివరించింది.
కిరణ్మయి ఒక విషయం స్పష్టంగా గమనించింది. అపురూపలక్ష్మి క్రికెటర్ల గురించి, సినిమా యాక్టర్ల గురించి ఎంత వ్రాసుకున్నా, వాళ్ళలో ఆర్తుని గురించి గొప్పగా వ్రాసుకుందే తప్ప ఎక్కడా వాళ్ళ వ్యక్తిగత విషయాల గురించి ఏమీ వ్రాయలేదు. ఫలానా డ్రస్ లో స్మార్ట్ గా వున్నాడనో, ఫలానా ఫోజులో అందంగా కనిపించాడని కూడా ఎక్కడా కనిపించలేదు. ఆమె వాళ్ళని ఆ దృష్టితో చూడలేదన్నది గమనార్హం-
కిరణ్మయి డైరీ మూసేసి ఆలోచనలో పడింది. తన కుటుంబానికి లక్ష్మి ఫ్యామిలీకి ఎంత తేడా! రక్త సంబంధం తప్ప తమ మధ్య ఎలాంటి బంధమూ పెరగలేదు. మమతానురాగాలతో పెరిగిన పొదరిల్లు వాళ్ళది తండ్రి తననెన్నడూ సినిమాకు, షికారుకి తీసుకెళ్ళలేదు. లక్ష్మి మొదట చూసిన సినిమా 'మాయాబజార్' అని వాళ్ళ నాన్న ఆమె చరిత్ర ఫైల్ లో రాశాడట. చిన్నప్పుడు చూసి ఆనందించడానికి పెద్దయ్యాక మళ్ళీ చూసి అర్ధం చేసుకుని ఆనందించడానికి తేడా వివరించి వ్రాసుకుంది లక్ష్మి ఎంతమంది తండ్రులకి ఆ ఆలోచన వుంటుంది?
అంతటి ఆత్మీయతా బంధంలో చిక్కుకున్న ఆ కుటుబంలో లక్ష్మి మరణం ఎంతటి తుఫాను రేకెత్తి వుంటుంది? 'లక్ష్మి ఇక మామధ్య లేదు' అన్న ఆలోచన ఎంతటి అశాంతిని కలిగించి వుంటుంది? ఏ పండగ వచ్చినా, ఏ సందర్భంలోనయినా తమమధ్య లేని ఆ అమ్మాయి గురించి తలుచుకుని వాళ్ళు ఎంత దుఃఖిస్తూ వుంటారో, ఎంత కుమిలి కుమిలి ఏడుస్తున్నారో కదా! ఎంత దురవస్థ అది. ఆ పరిస్థితినుంచి తేరుకుని వాళ్ళు మామూలు మనుషులవడం సాధ్యమేనా? తలుచు కుంటేనే కిరణ్మయికి బాధగా అనిపించింది.
ఇంకొక్కడైరీ మిగిలింది. అది గత సంవత్సరానిది. అంటే అపురూపలక్ష్మి హాస్టల్ కి వచ్చినప్పటిది. అది తీస్తుంటే కిరణ్మయి చెయ్యి వణికింది. ఎలాంటి వార్తలున్నాయందులో?
ఆ డైరీలో మొదట్లో ఎక్కువగా వ్రాయలేదు. ఇంటర్ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి అనీ, చదువు గురించీ - వ్రాసుకుంది.
ఇంటర్ రిజల్ట్సు వచ్చాయి. అనుకునట్లుగానే ఫస్టు క్లాసు వచ్చింది. అమ్మ వూళ్ళో అందరికీ స్వీట్సు పంచింది. బాబాయి కొత్త చీరతోపాటు, ఆయిల్ పెయింట్స్ సెట్ కొన్నాడు. తాతయ్య పెన్ కొనిచ్చాడు.
ఇప్పుడో సమస్య వచ్చింది. నాన్నగారికి ప్రమోషన్, ట్రాన్స్ ఫర్ వచ్చేట్లున్నాయి. నేనెక్కడ కాలేజీలో చేరాలి? 'హైదరాబాద్ లోనే చేరమ్మా. హాస్టల్ లో వుండి చదువుకోవచ్చు. సమస్యలుండవు' అన్నారు నాన్న. 'హాస్టల్లోనా, అది మనల్ని వదలి ఉండగలదా నాన్నా' అంది అక్కయ్య ఏడుపు గొంతుతో.
నిన్నరాత్రి నేను పడుకోబోతుంటే సౌందర్య వచ్చింది - "అక్కా నేను నీ దగ్గిర పడుకోనా?" అంది. 'అదేమిటి కొత్తగా' అన్నాను. 'నువ్వు హాస్టల్ కెళ్ళేవరకు నీకు దగ్గరగా పడుకుంటానక్క' అంది ఏడుస్తూ. దాన్ని దగ్గరకు తీసుకుని పడుకున్నాను. వీళ్ళందరినీ వదిలి ఎలా వెళ్ళగలను? నాన్నగారితో మాట్లాడాలి.
* * *
నాన్నగారు నన్ను కూర్చోపెట్టి ఎంతో వివరంగా చెప్పారు. తన ఉద్యోగ బాధ్యత, వచ్చే రెండేళ్ళలో తనకెలా ట్రాన్స్ ఫర్లయ్యేది. ఆ డిపార్టుమెంటులో కష్టనష్టాలు అన్నీ వివరించారు. నేను హైదరాబాద్ లో కాలేజీలో చేరాలి. హాస్టల్లో వుండి చదువుకోవాలి. తప్పదు అని సామరస్యంగా చెప్పారు. నిజమే. నేనిక డానికి తయారవ్వాలి.
* * *
సీటు వచ్చింది. చాలా మంచి కాలేజీ అట. హాస్టల్ కూడా చాలా పెద్దదట. నాలుగురోజుల్లో ప్రయాణం. అక్క నన్ను ఒక్క పనీ చేయనివ్వడం లేదు. అన్నీ సిద్దంచేసి పెడుతోంది.
రేపు హైద్రాబాద్ ప్రయాణం. అన్నీ సర్దుకోవడం అయిపోయింది. దగ్గర పడుతున్నకొద్దీ దిగులు ఎక్కువవుతోంది. నన్ను ఉత్సాహపరచడానికి అందరూ శ్రమపడుతున్నారు. వాళ్ళు దిగులుపడకూడదని నేనూ ఉత్సాహం నటిస్తున్నాను. అమ్మా, అక్కా, చెల్లి నేనేదో అత్తగారింటికి వెళ్ళిపోతున్నట్లు రకరకాల వంటలుచేసి తినిపిస్తున్నారు. తమ్ముడు సాయంత్రం వేళల్లో ఆడుకోవడానికి కూడా వెళ్ళటం లేదు.
ఇన్నాళ్ళూ కష్టం ఎరాక్కుండా బ్రతికినదాన్ని అది పెద్ద సిటీ అక్కడివాళ్ళంతా నాగరికులు వాళ్ళమధ్య ఈజీగా కలిసిపోగలనా? అందరూ నన్ను చూసి నవ్వుకుంటారేమో ఫస్టుక్లాసు వచ్చిందిగాని ఇంగ్లీషు సరిగ్గా మాట్లాడటం కూడా రాదు. సిటీకి వెళుతున్నానని ఎంత ఎగ్జయిటింగ్ గా వుందో, అంత భయంగానూ ఉంది. 'అక్కడ చక్కగా క్రికెట్ మ్యాచ్ లు ప్రత్యక్షంగా చూడొచ్చు నక్కా' అంటాడు తమ్ముడు, నన్ను ఎంకరేజ్ చేయడానికి వాడులేకుండా నేను క్రికెట్ మ్యాచ్ చూసి ఎంజాయ్ చేయగలనా?
ఈ రోజే ప్రయాణం. అక్క చాక్ లెట్ ఫుడ్డింగ్ చేసింది. తమ్ముడు చిరంజీవి డాన్స్ చేసి నవ్వించాడు. చెల్లెలు నా కిష్టమయిన పాటలన్నీ పాడింది. రేపీపాటికి హాస్టల్లో వుంటాను. ఎలా వుంటుందో ఏమో.
రేపటినించి నా జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కాబోతుంది.
--* * *--