Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 39

           

                                                      అధ్యాయం- 7
   
   
    "రూమ్ నెంబరు పదమూడు...." అంది కేర్ టేకర్ - తాళంచెవి ఇస్తూ.
   
    నా సామాన్లు పట్టుకొని, ఒక్కొక్క గదీ వెతుక్కుంటూ వెళ్ళాను. చివరికి కనిపించింది.
   
    13.
   
    తాళం తీసి గదిలో ప్రవేశించాను. గదిలో ఎవరూ లేరు. మొత్తం మూడు మంచాలున్నవి. నా రూమ్మేట్స్ వి అనుకుంటాను, సమానులు ఒకమూల సర్ది వున్నాయి. ఎందుకో మనసంతా దిగులుగా వుంది. బాగా ఏడవాలని వుంది ఇంతలో అడుగుల చప్పుడయింది. గదిలోకి ఒకమ్మాయి వచ్చింది. నా రూమ్మేట్ కాబోలు.
   
    "ఏమిటి నీ పేరు?" అంది. స్వరం అంత కఠినంగా వుందేమిటి? కళ్ళు మూసుకుని వినివుంటే జగ్గయ్యగారేమో అనుకునేదాన్ని!
   
    "నా పేరు అపురూపలక్ష్మి" అన్నాను.
   
    "ఏమిటీ?" అంది నిటారుగా నిలబడి"- అపురూపలక్ష్మా? అదేం పేరు!" అని పడిపడి నవ్వింది. ....."ఎవరు పెట్టారు ఆ పేరు?"
   
    "మా బామ్మ-"
   
    "బామ్మా....?!? మీవూళ్ళో ముసలోళ్ళకి కూడా మంచి పేర్లు వస్తాయన్న మాట" అని మళ్ళీ గట్టిగా నవ్వింది. నాకు ఆ మాటలకి కోపం కంటే భయం ఎక్కువ వేసింది. నా రూమ్మేట్ వెళ్ళిపోయింది. పుస్తకాలు సర్దుకుందామని సూట్ కేస్ తెరిచాను.
   
    పైనే కాగితం....
   
    "గుడ్ మార్నింగ్ అక్కాహవ్ ఎ నైస్ డే....." అని వ్రాసివుంది. బయల్దేరేటప్పుడు తమ్ముడు పెట్టి వుంటాడు. వాడి చేతివ్రాత చూడగానే కళ్ళెంబట వీళ్ళు తిరిగాయి. ఎలాగో దిగమ్రింగుకున్నాను.

    హాస్టల్ లో భోజనం దరిద్రంగా వుంది. నీళ్ళ మజ్జిగ-చారు-వంకాయకూర జావలా వుంది. కొద్దిగా కూడా తినకుండా లేచిపోయాను. రూమ్ కొచ్చి, పెట్టెలో అమ్మ పెట్టిన స్వీట్స్ (కజ్జికాయలు) తిన్నాను. అలాగే లోపల్నుంచి పచ్చళ్ళు తీసి బల్లమీద సర్దుకున్నాను. తరువాత కాలేజీ ఆఫీసుకి వెళ్ళి ఎప్పుడు మొదలవుతుందో కనుక్కున్నాను. మధ్యాహ్నం గదికొచ్చేసరికి స్వీట్లు మొత్తం ఖాళీ అయి, కాగితాలు వెక్కిరిస్తున్నట్టు కనిపించాయి. పచ్చళ్ళ సీసాలు మాయమయ్యాయి.
   
    నాకేమో కసి, ఉక్రోషం కలిగాయి. రాత్రి భోజనం చెయ్యకుండానే పడుకున్నాను. రూమ్మేట్స్ ఇద్దరూ వచ్చేసరికి పదకొండు అయింది. ఏడ్చి ఏడ్చి ఉబ్బిపోయిన నా కళ్ళని చూసి ఇద్దరూ ఒకటే నవ్వులు.
   
    ఆ రాత్రి నాకు నిద్ర పట్టలేదు. ఆకలి కూడా లేదు.
   
    నాకు చచ్చిపోవాలని వుంది.
   
                                 *    *    *
   
    ఈ రోజు ఇంటినుంచి ఉత్తరం వచ్చింది. ఒకే కవర్లో ఎనిమిది ఉత్తరాలు అందరూ విడివిడిగా వ్రాసారు. అమ్మ బెంగపెట్టుకోవద్దని వ్రాసింది. వద్దు అనుకుంటే పోయేదా బెంగంటే?
   
    కవరు విప్పగానే అన్ని ఉత్తరాలు కాగితాలు క్రింద పడుతూంటే నా రూమ్మేట్స్ ఒకటే నవ్వు నీళ్ళకి నిజంగా ప్రేమంటే తెలీదనుకుంటాను.
   
    నా రూమ్మేట్స్ పేరు రజని, జయంతి.
   
    జయంతి కయితే అసలు సిగ్గులేదు. నా ముందే బట్టలు మార్చుకుంటుంది. బ్రా హుక్సు పెట్టుకునేటప్పుడు కూడా గోడవైపు తిరగదు. మొన్నయితే సినిమానుంచి వచ్చి నాముందే పెట్టీకోట్ మార్చుకోబోవటంతో నాకే సిగ్గేసి, గోడవైపు తిరిగి కళ్ళు మూసుకున్నాను.
   
    ఇంట్లో అందరికీ పేరు పేరునా ఉత్తరాలు వ్రాసి ఒకే కవర్లో పెట్టి పోస్ట్ చేశాను ప్రొద్దున్న. స్టాంపులు సరిగ్గా అంటించానో లేదో అని ఇప్పుడు అనుమానం వస్తోంది. రేపు మళ్ళీ వ్రాయాలి. ఒకవేళ ఈ వేల్టిదికూడా అందితే ఇంట్లో అందరూ నవ్వుకుంటారేమో. నవ్వుకుంటే నవ్వుకోనీ, నాకేమమ్మా.
   
    ఈ రోజుకూడా కాలేజి లేదు. పదకొండింటికే వచ్చేశాను. ఏమీ తోచలేదు. నా రూమ్మేట్స్ ఎప్పుడూ గదిలో వుండరు. వాళ్ళకు తోచకపోవటం అనేదే వుండదనుకుంటా. ఇద్దరూ కుర్రాళ్ళ స్కూటర్ మీద ఎప్పుడూ తిరుగుతూ వుంటారు.
   
    కొంచంసేపు ఏదైనా పుస్తకం చదువుకుందామనుకుంటే పుస్తకాలు లేవు. జయంతి మంచం పరుపు క్రిందనుంచి ఏదో పుస్తకం కనపడితే లాగాను. అట్టవేసి వుంది.
   
    పేజీ తిప్పి లోపల బొమ్మచూడగానే ఒక్కసారి పాముని చూసినట్టు భయంవేసి, గబుక్కున పుస్తకాన్ని క్రిందపడేశాను. అసలిలాటి పుస్తకాలు, బొమ్మలు వుంటాయని తెలీదు నాకు. గుండెదడ చాలాసేపటి వరకూ తగ్గలేదు. పుస్తకం తీసి తిరిగి వున్నచోట పెట్టటానికి కూడా భయం వేసింది.
   
    కొంచెంసేపటికి భయం తగ్గింది.
   
    మొగాళ్ళు - ఆడాళ్ళ మధ్య ఏదో వుంటుందని పదోక్లాసులో అరుంధతి చెప్పింది. దానికీ సరిగ్గా తెలీదు. ఈ బొమ్మలు అలాగే వున్నాయి. చూడనా.
   
    అమ్మో.
   
    చూస్తుండగా ఎవరైనా వస్తే?....కొంచంసేపు ఏం చెయ్యాలో తోచనట్టు కూర్చున్నాను.
   
    తలుపులు వేసుకుంటే మధ్యలో జయంతిగానీ, రజనిగానీ వస్తే లోపల గడియ ఎందుకు వేసుకున్నావని అడగరూ?
   
    బయటకెళ్ళి చూశాను. వరండాలో ఎవరూ లేరు.
   
    చేతులు వణికాయి. గబగబా బొమ్మలన్నీ చూశాను. అంతా అర్ధమైంది. కానీ అసహ్యం వేసింది. మరీ అంత సిగ్గు లేకుండానా? నా మొహం అంతా చెమట పట్టింది. కాళ్ళు వణుకుతున్నాయి. అయినా అలాటి పుస్తకాలు జయంతి చూస్తుందా? ఆ విషయం రజనీకి తెలుసా? మళ్ళీ ఇంకొకసారి ఆ పుస్తకాలు చూడాలనిపించింది. కష్టంమీద ఆపుకున్నాను.
   
    ఇవన్నీ  డైరీలో వ్రాస్తున్నా కదా రేపొద్దున్న నాన్నగారుగానీ, అమ్మగానీ చూస్తే-
   
    ఉహూఁ - నా కిదంతా ఏమీ బావోలేదు.
   
    పుస్తకం ఆవిడ పరుపుక్రింద పెట్టేశాను.
   
    రాత్రి కలలో (తరువాత అక్షరాలు కనపడకుండా కొట్టివేయబడివున్నాయి).
   
                                   *    *    *
   
    కిరణ్మయి పేజీ తిప్పింది.
   
    ఈ రోజు ఆగస్టు పదిహేను. ఇంట్లో వుంటే ఎంత సందడి. తాతయ్య ఫ్రీడమ్ ఫైటర్ కదా. ఇదే మనకు పెద్దపండగ అంటాడు తను. ఇంట్లో అందరూ ఎంత సంబరంగా పండగ చేసుకుంటున్నారో ఈ రోజు. నేను కూడా స్నానంచేసి కొత్తబట్టలు కట్టుకున్నాను. జయంతి వాళ్ళకు ఒకటే నవ్వు. హాస్టల్లో కనిపించిన వాళ్ళందరికీ చెప్పి మరీ నవ్వుతున్నారు. నేనేం తప్పు చేశానని? ఎప్పుడో ఏడువేల సంవత్సరాల క్రితం సత్యభామ నరకాసురుడిని చంపిందని ఇప్పటికీ పండగ చేసుకుంటున్నాం దాదాపు తొంభయ్యేళ్ళు యుద్ధంసాగి మనకు స్వాతంత్ర్యం వచ్చిన రోజుని పండగ అనే అనుకోం. నాకు చాలా బాధగా వుంది. వీటన్నిటికంటే ఎక్కువగా ఈ రోజు చెల్లి పాడిన 'ఆగస్టు పదిహేను అరుదెంచి' పాట క్యాసెట్ వింటుంటే దుఃఖం ముంచుకొచ్చింది. ఎన్ని జెండాలు తయారు చేసేవాళ్ళం. పిల్లలకు ఆతల, పాటల పోటీలు పెట్టుకునేవాళ్ళం. ఆ రోజులిక మళ్ళీ రావా? కాలేజీ ఎంత బావుందో హాస్టల్ జీవితం అంత అధ్వాన్నంగా వుంది. నాకొకటి అర్ధంకాదు. గదిలో మూడు మంచాలున్నాయి. అయినా రజని, జయంతి ఒకే మంచం మీద పడుకుంటారెందుకు? రాత్రి చాలాసేపు కబుర్లు చెప్పుకుంటారు కూడా....
   
                                 *    *    *
   
    రెండు రోజులుగా  జ్వరం.
   
    నేనిక ఈ హాస్టల్లో వుండలేను. ప్రతిక్షణం ఇంట్లోవాళ్ళు గుర్తొస్తున్నారు. నాకలా జ్వరం వస్తే ఎవరో ఒకరు పక్కనే వుండి కబుర్లు చెప్పేవారు. ఏం కావాలన్నా అప్పటికప్పుడు తెచ్చిపెట్టేవారు. ఇక్కడేమో నన్ను పలికించే వాళ్ళేలేరు. ఈ రోజు రేఖ రూమ్ కి వస్తే జయంతి తిట్టి పంపేసింది. ఎందుకు వీళ్ళకి నామీద ఇంత కక్ష? నేనేం తప్పు చేశానని? నాకు అమ్మ కావాలి. నా వాళ్ళందర్నీ చూడాలి. నాకేడుపు వస్తోంది. నాన్నగారూ, నన్నెందుకీ నరకంలో వదిలేసి వెళ్ళారు?
   
                                 *    *    *
   
    (తరువాత నాలుగు రోజులు ఖాళీగా వుంది డైరీ)
   
                                  *    *    *
   
    చాలారోజుల తర్వాత ఈ రోజున నిజంగా నవ్వాను. సంతోషంగా నవ్వాను. ఎంత బావుందీరోజు, పొద్దుటే డైనింగ్ హాలు కెళ్ళాను. ఎప్పటిలా మాకు బ్రెడ్, ఇడ్లీతో నీళ్ళ సాంబారు ఇచ్చాడు. జయంతి వాళ్ళు బ్రెడ్, ఆమ్లెట్....కారప్పొడి, కొబ్బరిపచ్చడిలతో ఇడ్లీ తింటున్నారు. మమ్మల్ని చూసి బేరర్ కి ఏదో చెప్పింది. బేరర్ నవ్వుతున్నాడు. నాకు ఉక్రోషంతో ఏడుపొచ్చింది. అంతలో వెనుకనుంచి "వెంకట్రావ్, ఇలారా" అని అధికారయుతంగా ఒక కంఠం వినిపించింది.
   
    వెయిటర్ కుర్రాడు భయపడుతూ అటువెళ్ళాడు. నా వెనుక రమణి కూర్చుని వుంది. "ఆ అమమయికి కూడా ఆమ్లెట్ వేసిపెట్టు" అంది నన్ను చూపిస్తూ ఆమె ఏం చెపుతుందో నాకు అర్ధంకాలేదు. ఇంతలో రమణి నా దగ్గరికి వచ్చింది. "నీ పేరు లక్ష్మి కదూ" అంది. తలూపాను. ఈ లోపులో వెంకట్రావ్ ఆమ్లెట్ తెచ్చి పెట్టాడు. నా ముందున్న గిన్నె అతడి ముందుకు తోస్తూ "ఏమిటిది సాంబారా? మంచినీళ్ళా" అని గద్దించింది. వాడేదో నసిగాడు. "వెళ్ళి చట్నీ, మంచి సాంబార్ తీసుకురా" అని అరిచింది. వాదు భయభక్తులతో వెళ్ళిపోయాడు.
   
    నేను ఓరగా రజని, జయంతులవైపు చూశాను. వాళ్ళ మొహాలు కాలిన పెనాల్లా మాడిపోయి వున్నాయి.
   
    రమణి నా దగ్గరే కూర్చుని వివరాలు అడుగుతుంది. నాకేమో ఎవరెస్ట్ శిఖరం ఎక్కినంత సంతోషంగా వుంది. జయంతి, రజని ఏదో పని వున్నట్లు అక్కడనుంచి లేచి వెళ్ళిపోయారు.
   
    "ఈ రోజు నుంచీ నువ్వు నా మనిషివి" అంది రమణి- నాకు భలే సంతోషం వేసింది.
   
    ఒక రోజులోనే నాకు రమణి మంచి ఫ్రెండ్ అయింది.
   
                                  *    *    *
   
    రమణి నాతో మాట్లాడటం మొదలుపెట్టాక రూమ్మేట్స్ నా గురించి జోకులు వెయ్యటం మానేశారు. పైగా నేనుంటే గదిలోంచి ఏదో పని వున్నట్లు వెళ్ళిపోతున్నారు. మెస్ లో కూడా వెంకట్రావ్ మంచి భోజనం పెడుతున్నాడు.
   
    ఈ రోజు రమణి నాతో కలిసి గదికి వచ్చింది. అప్పటికి రజని, జయంతి ఒకే మంచంమీద పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. రమణి లోపలి వచ్చేసరికి లేచి కూర్చున్నారు.

 Previous Page Next Page