అధ్యాయం -6
ఈరోజు జనవరి పదిహేను. నా పుట్టిన్రోజు. పదిహేనేళ్ళు నిండాయి. ఇంతవరకు డైరీ రాయాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఈ మధ్య సత్యవతీ టీచర్ ఏదో సందర్భంలో డైరీ గురించి ప్రస్తావించింది.
"డైరీ వ్రాయడం చాలా మంచి అలవాటు. ఇప్పుడే కాదు కొన్నేళ్ళ తర్వాత జీవితపు గతపుటల్ని తిరగేస్తుంటే కలిగే ఆనందం అంతా యింతా కాదు. డైరీ అంతరాత్మకు ప్రతిబింబం కావాలి. మనలో జరుగుతున్న మార్పుల్ని మనసులో నిక్షిప్తం చేసుకునేకంటే కాగితంమీద పెట్టడం మంచి పద్దతి ఆత్మ పరిశీలనకూ, ఎదుగుదలకూ అది ఉపయోగపడుతుంది. ఈ రోజుకీ, రేపటికీ మనలో వస్తున్న మార్పుకి చెరిగిపోని సాక్ష్యం డైరీ" అంది టీచర్.
"అందరూ మనసులో భావాల్ని నిర్మొహమాటంగా డైరీలో రాయగలరా టీచర్. ఇంట్లోవాళ్ళు చదువుతారు. వెక్కిరిస్తారు" అంది శ్యామల.
"మనం చెప్పే మాటలు వినొచ్చుగాని పొరపాటున కూడా ఎవరూ కూడా డైరీ చదవకూడదు. ఆహ్ది సంస్కారం కాదు. ఈ విషయం ఇంట్లో కూడా అందరూ తెలుసుకోవాలి. మనసుకి ప్రతిబింబం డైరీ పర్మిషన్ లేకుండా దాన్ని తెలుసుకోవాలనుకోవడం తప్పు" అంది టీచర్.
మా ఇంట్లోవాళ్ళు సంస్కారహీనులు కాదు. అది నా అదృష్టం కాకపోతే వాళ్ళనించి దాచే విషయాలు కూడా నాకేమీ లేవు.
ఈ రోజు ఉదయం ఎవరో కొట్టి లేపుతుంటే మెలకువ వచ్చింది. కళ్ళు తెరిస్తే ఎదురుగా జిమ్మీ. దానిమెడలో 'హాపీ బర్త్ డే టు యు' అని బోర్డ్ వేలాడుతోంది. షేక్ హ్యాండ్ యివ్వమని చెయ్యి అందిస్తోంది. ఎంత సంతోషంగా అనిపించిందనీ! భరత్ కి ఇలాంటి అయిడియాలు వస్తుంటాయి. వాడికోసం వెతికేలోపులో మంచం కిందనుంచి లేచి మీదపడ్డాడు. "హాపీ బర్త్ డే రూపక్కా" అంటూ.
ఉత్సాహంగా లేచి వాష్ బేసిన్ దగ్గిరకు నడిచాను. పక్కనే స్టూల్ మీద నాకు యిష్టమైన ఎర్ర గులాబీలు గుత్తిగా పెట్టారెవరో, పక్కనే నా బ్రష్ మీద పేస్టువేసి రెడీగా వుంది. ఇది మా 'సౌందర్య' పనే. బ్రష్ తీసుకుని నోట్లో పెట్టుకోబోతూ ఆగిపోయాను. అద్దంమీద పేస్టుతో 'హాపీ బర్త్ డే టు యూ' అని వ్రాసుంది. తడిగుడ్డతో గబగబా తుడిచేశాను. నాన్నగారు చూస్తే దాన్ని కోప్పడతారు. నా పుట్టిన్రోజు రోజున అది తిట్లుతిన్నా అందరికీ బాధే ఆయనలాతిట్టే మనిషి కూడా కాదుగాని వేస్ట్ చేసిందని బాధపడతారేమో.
"అక్కా, అక్కా ఒకసారి వాకిట్లోకొచ్చి చూడు" భరత్ వచ్చి చెప్పాడు. బ్రష్ నోటిలో పెట్టుకునే వెళ్ళాను. అక్కరంగురంగుల రంగవల్లి దిద్దింది. ముగ్గుచుట్టూ 'హాపీ బర్త్ డే టు డియర్ సిస్టర్' అని అందంగా రాస్తోంది. అది అక్షరాల్లా అనిపించడం లేదు. పూలమాలలా కనిపిస్తోంది. 'థాంక్స్ అక్కా!' అన్నాను. చిన్నగా నవ్వింది. అక్క నవ్వితే ఎంత బావుంటుందో, వసంతం విరిసినట్లే వుంది. దాని పేరే వసంతలక్ష్మి.
అందరూ ఎంత అందంగా శుభాకాంక్షలందజేశారు! ఈ యింటిలో నేను మనసులో దాచుకునే విషయాలే ముంటాయి? అమ్మ నూనెరాసి తలంటుపోసింది. కొత్తబట్టలు కట్టుకుని కాళ్ళకు నమస్కరించాను.
"పదిహేనేళ్ళ దానివయ్యావు. అంటే పెద్దరికం వస్తుందన్నమాట. ఏ పనైనా ఆలోచించి చెయ్యాలిక" అంది. కాఫీకప్పు యిచ్చింది. నాన్నగారికి స్వయంగా తీసుకెళ్ళియిచ్చాను. కాళ్ళకు దణ్ణం పెడుతుంటే ఆయనయితే ఏమీ అనలేదు. కాని తలమీద వేసిన చెయ్యి ఆశీర్వదిస్తున్నట్లుగా వుంది. ఆయనెక్కువ మాట్లాడరు కాని ఆ ఆప్యాయత, ఆత్మీయత ప్రతిక్షణం మాకు తెలుస్తుంటాయి.
"ఎప్పుడూ కొత్తబట్టలు కుట్టించడం, అమ్మ స్వీట్లు చేయడం జరుగుతోంది. ఇప్పుడు పదిహేనేళ్ళొచ్చాయి. ఈ చిన్న బహుమతి తీసుకోమ్మా" అంటూ ప్యాకెట్ అందించారు.
పైన రంగు కాగితం తీశాను. అందమైన లెదర్ బౌండ్ డైరీ, మరో పుస్తకం వున్నాయి. నిన్నటిరోజు టీచర్ చెప్పిన విషయాలన్నీ అలవాటు ప్రకారం రాత్రి భోజనాల దగ్గర వాగేశాను. అది గుర్తు పెట్టుకుని ఇచ్చారనుకుంటాను.
"నీ పుట్టిన్రోజుకంటే మంచిరోజేముంటుంది? ఈ రోజే డైరీ రాయడం మొదలుపెట్టు. ఆ పుస్తకం కూడా చాలా మంచి పుస్తకం" అంటూ డైరీతోపాటూ మరో పుస్తకం కూడా ఇచ్చారు. "దీని పేరు డైరీ ఆఫ్ ఏన్ ఫ్రాంక్. రెండవ ప్రపంచ యుద్ద కాలంలో నాజీ సైనికుల బారి పడకుండా ఒక రహస్య గృహంలో గడిపిన యూదు కుటుంబం అది. నీ వయసు గూడాలేని ఆ అమ్మాయి మూడేళ్ళపాటు తను గడిపిన ఆ రహస్య జీవితాన్నీ, తనలో జరుగుతున్న మార్పుల్ని ఎంత బాగా వ్రాసిందో ఆ డైరీలో! అది ప్రపంచ ప్రఖ్యాత పుస్తకంగా మారింది. నీ వయసు అమ్మాయిలంతా చదవాల్సిన పుస్తకం" అన్నారు నాన్న.
ఊరినుంచి నానమ్మా, తాతయ్యా వచ్చారు. పిన్ని నా కోసం సున్నుండలు స్పెషల్ గా పంపించి బాబాయి బట్టలు పంపారు. వాళ్ళు అంతదూరం నుంచి వస్తారని అనుకోలేదు. నా పుట్టినరోజు ఇందరు గుర్తుపెట్టుకున్నారంటే ఎంతో గర్వంగానూ సంతోషంగానూ వుంది. చాలామంది ఇళ్ళలో ఇలా జరగదనుకుంటాను.
I am Happy.
* * *
మొదటిరోజు రాసిన డైరీ చదవమంటే నాన్నగారు చదవలేదు. "వద్దులేమ్మా బాగా వ్రాయి" అన్నారు. రోజూ రాయడానికేముంటాయి. సౌందర్య, భరత్ చేసిన కొంటె పనులు, జిమ్మీచేత ఆడించిన ఆటలే విశేషాలు. అక్క వేసిన కొత్త ముగ్గు, అమ్మ చేసిన కొత్త వంటకం గురించి రోజూ రాయాల్సిందే, ఆ విషయం చెప్తే నాన్నగారు నవ్వారు. "ఏంటమ్మా, నీ గురించి నువ్వు రాసుకోవడానికేమీలేదా?" అన్నారు. నా గురించి నేను వ్రాసుకునే విశేషాలు రోజూ ఏముంటాయి?
'పదిహేనేళ్ళపాటు డైరీ వ్రాయలేదుగా ఆ విశేషాలన్నీ నీకు గుర్తున్నట్లుగా వ్రాసుకోవచ్చుగా' అన్నారు నిజమే రేపే మొదలుపెట్టాలి.
* * *
నేను జనవరి పదిహేనున పుట్టాను. అంటే సరిగ్గా కనుము పండగరోజన్న మాట. నాలుగు రోజుల ముందుగానే అమ్మ హాస్పిటల్లో చేరిందట. పాపం నలుగురోజులు నెప్పులు పడిందట. దానికంటే ముఖ్యంగా పండగరోజున ఇంట్లో లేకపోయానే అని బాధపడిపోయిందట. అప్పుడు బాబాయి, పిన్ని, నానమ్మ, తాతయ్య అందరం మా ఊళ్ళోనే వుండేవాళ్ళం కాబట్టి ఎవరికే ఇబ్బంది కలగలేదు. నాన్నగారు ఉద్యోగరీత్యా బదిలీ అయ్యేవరకు అందరు ఉమ్మడి కుటుంబంలోనే వున్నారు. పిన్నీ, బాబాయి మాతో ఎంతో ఆత్మీయంగా వుంటారో అమ్మా, పిన్ని స్వంత అక్కాచెల్లెళ్ళ కంటే అభిమానంగా వుంటారు. మా కుటుంబాన్ని చూస్తే వూళ్ళో అందరికి ముచ్చటే. అత్తయ్య లిద్దరు వూర్నుంచి వచ్చారంటే మాకు పండగే.
నాకు బాగా గుర్తు, అమ్మా, నాన్న నేనూ నెలల పాప చెల్లాయిని తీసుకుని తాతయ్యగారింటికి వెళ్ళాం.
మా ఆవూరు వెళ్ళాలంటే గూడుబండిలో వెళ్ళాలి. ఒంటెద్దుబండి!
చినప్పుడు ప్రతి వేసివిలోనూ ఇది నాకు అనుభవమే. నాకంటే నాక్కాదనుకో! మా అమ్మలో చూశాను. ఊరు దగ్గిరవుతున్నకొద్దీ, ఇల్లు దగ్గిరవుతున్నకొద్దీ మా అమ్మ - వస్తున్న నవ్వుల్ని దాచుకోలేక ఏం సతమతమయ్యేదో! ఇక మేం మా నాన్నతో చేరి అమ్మ ఎలా నవ్వుకుంటుందో - వాళ్ళ అమ్మదగ్గరి కెళ్తుందని...." అని నేనంటే "అవునవును.....నిజమే" అని నాన్న వంతపాడేవారు.
పాపాయిని చంకనేసుకుని గూడుబండిలోంచి పిటమీదకు దిగుతూన్న తమ వూరి ఆడపడుచుని చూడటానికి వీధి వీధంతా గుమ్మాల్ని కళ్ళు చేసుకునేది. ముందు దిష్టి తీసి తరువాత లోపలికి రానిచ్చేది అమ్మమ్మ! పుట్టింటి గడపలోకి అడుగుపెట్టిన అమ్మకళ్ళు వింత ఆనందంతో మెరిసేవి. పాపాయిని అమ్మమ్మ చేతికి అందించి నెమ్మదిగా పెరట్లోకి చేరేది. చెట్లన్నిటినీ పేరు పేరునా పలకరించేది. పదహారేళ్ళ సావాసం కదా!
పెరట్లో గన్నేరు చెట్టుపక్క నూతిలోంచి నీళ్ళు తోడుకుని కాళ్ళు కడుక్కుంటూంటే, పైనుంచి గన్నేరాకులు 'వచ్చావా సీతమ్మా' అన్నట్టు పూల బాసలాడేవి అనుకుంటా...
......అక్క ఉగాదిరోజు పుట్టింది. దాని పేరు వసంతలక్ష్మి అని పెట్టారు.
నాన్నగారికి నన్ను బాగా చదివించాలని కోరిక. 'దీనికి బలం లేదుగాని తెలివితేటలు అమోఘం' అంటారు. స్కూల్లో వేసినప్పుడు మిగతా పిల్లల్లా నేను ఏడవలేదట. సరాసరి టీచర్ దగ్గరికి వెళ్ళి కబుర్లు చెప్పానట. నాన్నగారు ఇప్పటికీ చెప్పి నవ్వుతారు. నాకు ఆటల్లో పాల్గొనే శక్తి లేదు. డ్రాయింగ్ బాగా వేస్తున్నానని బాబాయి సెలవుల్లో బొమ్మలు వేయడం నేర్పించాడు. అదే బాగా ఇంప్రూ చేసుకోవాలి. మొదట వేసిన బొమ్మ 'అమ్మ' అమ్మ దాచుకుంది దాన్ని! అమ్మకు నేనిచ్చిన కానుక అదొక్కటే, తమ్ముడికి క్రికెట్ అంటే ప్రాణం.
"నాన్నగారు మా అందరికీ ఒక్కో ఫైలు తయారు చేశారు. బర్త్ సర్టిఫికెట్ల నించి మా రిపోర్టులు వగైరాలన్నీ వుంటాయందులో ఏ జ్వరానికి ఏ మందు బాగా పనిచేసింది కూడా రాసిపెడతారు. అది చూస్తుంటే మాకు ఒక చరిత్ర వున్నట్లని పిస్తుంది. అప్పుడప్పుడూ సరదాగా తెరచి కంపేర్ చేసుకుంటుంటాం. నా దాంట్లో స్కూలు సర్టిఫికెట్లతో పాటు మెడికల్ రిపోర్టులు ఎక్కువగా కనిపిస్తాయి. అక్క ఫైలే పాపం బాగా చిక్కిపోయి వుంటుంది.
నేను మూడో క్లాసు చదువుతున్నప్పుడనుకుంటాను జబ్బు చేసింది. చికెన్ ఫాక్స్ అప్పుడు అమ్మతోపాటు నాన్నగారు కూడా రాత్రంతా మేలుకొని కూర్చునేవారు. పగలంత ఆఫీసులో పనిచేసి వచ్చినా రాత్రి అసలు పడుకునేవరు కాదు, ఒకసారి నాకు బాగా గుర్తుంది. అర్ధరాత్రప్పుడు మెలకువ వచ్చింది. బాగా దాహంగా వుంది. నాన్నగారు నన్నే చూస్తున్నారు కాబోలు 'ఏంటమ్మా' అన్నారు. 'నిద్రపోలేదా నాన్న' అన్నాను. 'నీకిలా వుంటే నాకు నిద్రెలా పడుతుందమ్మా' అన్నారు. ఆయన కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. అది ఎప్పటికీ మర్చిపోలేని దృశ్యం. అలాంటి తండ్రికి నేను బిడ్డగా పుట్టడం నా అదృష్టం, చేసుకున్న పుణ్యం అనిపిస్తాయి.
పదిహేనేళ్ళ గత జీవితాన్ని పరిశీలించుకుంటే నన్ను బాగా కదిలించిన విషయం ఒకటుంది. ఇన్నేళ్ళలో నన్నే కాదు మా పిల్లల్లో ఎవరినీ అమ్మగాని, నాన్నగారుగాని కొట్టిన సంఘటన అసలు లేదు. ఇది సంభవమేనా? ఆలోచిస్తే అది యదార్ధం అందరి పిల్లల్లా మేము అల్లరిచేసి తల్లిదంద్రుల్ని విసిగించలేదా? విసిగించే వుంటాం. అయినా ఎన్నడూ ఒక్క దెబ్బకూడా వెయ్యలేదు. ప్రేమ తప్ప మా మీద విసుగు చూపించలేదు. మావల్ల తప్పు జరిగినా కూర్చోపెట్టి సామరస్యంగా వివరించేవారు. మంచిగా చెప్పేవారు. వాళ్ళలో మంచితనమే బహుశా మమ్మల్ని ఏ తప్పూ చేయనివ్వలేదేమో. మేము తప్పుచేయడం అంటే అది వాళ్ళను శిక్షించటమేనన్న ఆలోచన కలుగుతుంది.
* * *
మొదటి డైరీ పూర్తి చేసేటప్పటికి కిరణ్మయి అపురూపలక్ష్మి కుటుంబంలో ఒక మెంబరయిపోయినట్లుగా ఫీలయింది. లక్ష్మి నిజంగా అపురూపంగా పెరిగింది. వాళ్ళు లక్షాధికార్లు కాదు. అయినా పిల్లల్లో ఎలాంటి అసంతృప్తి లేదు. డబ్బుమీదా, నగలమీదా వ్యామోహం లేదు. అసలలాంటి విషయాలకే ఆమె ప్రాముఖ్యత నివ్వలేదు. అక్కాచెల్లెళ్ళ మధ్య అసూయ అనేది లేదు. ఒకరికోసం మరొకరు ఏదో చేయాలని, వాళ్ళని సంతోషపెట్టాలనే ప్రయత్నమే కనిపిస్తుంది. ఆ డైరీలో ప్రతి సంఘటనా కుటుంబంలో, వాళ్ళ సంతోషంతో ముడిపడిందే. పిల్లలంతా కలసి, తల్లిదంద్రుల్ని, పిన్నీ బాబాయిని, అత్తయ్యలనీ, తాతయ్యా, నానమ్మలని ఎన్ని రకాలుగా ప్రేమించింది, వాళ్ళు ప్రేమను ఎన్ని రకాలుగా వ్యక్తం చేసింది వివరంగా రాసుకుంది.