Previous Page Next Page 
భార్యా గుణవతి శత్రు పేజి 36

   

    ఉంగరాలజుట్టు డామినెంట్ లక్షణమనీ, సాఫీజుట్టు రిసెసివ్ లక్షణమనీ అంటారు.    
    ఆంజనేయులుగాడిది కూడా ఉంగరాల జుట్టే!    
    ఈ సిద్దాంతం ప్రతికేసులోనూ కరెక్టు అయితీరాలనిలేకపోయినా, ఉన్న ఆధారాలన్నీ కలబోసి చూస్తే ఏమనిపిస్తోంది?    
    వీడు తండ్రికి పుట్టినవాడు కాడని బాస్టర్డు అనీ, ఆంజనేయులుగాడితో సౌదామినికి వున్న అక్రమ సంబంధంవల్ల పుట్టిన వాడనీ మరోసారి రుజువు కావడంలేదూ?    
    అందుకే సౌదామిని చచ్చిపోవాలి.    
    చచ్చిపోతుంది కూడా?    
    బాబుని ఇంట్లో దింపేసి, ఆసెయ్యకోసం చూశాడు బాలూ.

    అతన్ని వెంటనే ఇంట్లోనుంచి పంపెయ్యకపోతే విషపు మష్ రూమ్స్ కలిసిన ఆహారం థినిఒ అన్యాయంగా చచ్చిపోతాడు.    
    ఆసెయ్యకోసం ఇంట్లో  గదులు వెదకడం మొదలుపెట్టాడు బాలు.    
    చివరికి అతను తమ బెడ్ రూంలో కనిపించాడు.    
    పక్కలు దులిపేస్తున్న ఆసెయ్య బాలూని చూడగానే ఉలిక్కిపడి చేతులు వెనక్కి పెట్టుకున్నాడు.    
    కళ్ళు చిట్లించి చూశాడు బాలు. ఎందుకంత సందేహాస్పదంగా  ప్రవర్తిస్తున్నాడు ఆసెయ్య? వెనక్కి పెట్టుకున్న అతని చేతుల్లో ఏముంది? తను అనుకున్నంత నమ్మకస్తుడు కాడా ఇతను? హస్తలాఘవం కూడా అలవాటు వుందా ఏమిటి?    
    "నీ చేతుల్లో ఏముందో చూపించు ఆసెయ్యా!" అన్నాడు కఠినంగా.    
    ఉలిక్కిపడి సంతోషంగా చేతులు ముందుకు జాపాడు ఆసెయ్య. అతని చేతిలో ఒక ముతక కర్చీఫ్ వుంది.    
    "రుమాలు దొరా? నాదే!" అన్నాడు కంగారుగా.    
    కర్చీఫ్ కొసన ఎంబ్రాయిడరీ చేసివున్న "ఏ" అనే అక్షరం కనబడింది బాలూకి. పెదిమల మీదకి నవ్వొచ్చింది. ఇతను నమ్మకస్తుడే? తనే అన్నిటినీ వక్రదృష్టితో చూస్తున్నాడు.    
    "ఆసెయ్యా?" అన్నాడు అభిమానంగా.    
    "దొరా?"    
    "నువ్వొకపని చేసి పెట్టాలి?"    
    "బాన్చనుదొరా? కాల్మొక్త! ఏం చెయ్యాలో చెప్పు?"    
    "అమ్మగారికి ఆ అడ్డమైన కల్తీ నూనెలూ పడటంలేదు? ఎలర్జీ వస్తోంది. శుద్దమైన నూనె తప్ప ముట్టుకోవద్దని చెప్పాడు డాక్టరు. నువ్వు కల్తీలేని నూనె తెచ్చిపెట్టగలవా? మీ పల్లెల్లో నూనె గానుగల్లో నమ్మకంగా ఇస్తారుగా?"    
    "అదెంతపని దొరా? మా ఊళ్ళో వీరయ్య గానుగలో నూనె స్వచ్చంగా కల్తీలేకుండా వుంటుంది? మా సౌదామినమ్మ మనసులెక్క! తెస్తాను దొరా?" అన్నాడు ఆర్ద్రంగా.    
    కమ్చీతో కొట్టినట్లయి అతని మొహంలోకి చూశాడు బాలు.    
    "సౌదామినమ్మ మనసులాగా స్వచ్చంగా".    
    అసెయ్య మాటలే చెవిలో గింగిర్లెత్తుతున్నాయి బాలూకి స్వచ్చం అన్నమాట దగ్గిర ఆగిపోయి అతడి ఆలోచనలు.    
    స్వచ్చం...!    
    ఆసెయ్య కర్చీఫ్ తనదే అయితే ఎందుకంత కలవరపడి పోయాడు?    
    దానిమీద "ఏ" అనే అక్షరం కూడా ఎంబ్రాయిడరీ చేసి వుందిగా?    
    అసలు పల్లెటూరి మనిషి అయిన ఆసెయ్యకు.... చొక్కా కూడా ఒక్కోసారి వేసుకొని అసెయ్యకు కర్చీఫ్ తో అలవాటు వుంటుందా?    
    వంద వోల్టుల షాక్ తగిలినట్లు అప్పుడు స్ఫురించింది బాలూకి.    
    "ఏ" అంటే ఆసెయ్యే కానక్కరలేదు. ఆంజనేయులు కూడా కావచ్చు!    
    అంటే?    
    ఆ కర్చీఫ్ ఆంజనేయులుదా!            
    సౌదామినీ-    
    నా జీవితం నీ కంకితం చేయటంలో గొప్ప సంతృప్తిని పొందాను. ఎంత అద్భుతంగా మోసం చేశావు నువ్వు.    
    ఒక క్షణం ఎడబాటయినా-    
    నీ దూరం- కేవలం ఆలోచన్లతోనే నేను అధిగమించగల దగ్గరితనం అనుకున్నాను.    
    స్నేహం- దూరమయ్యేవరకూ దాని విలువ తెలీదన్నది గొప్ప సత్యమే కానీ స్నేహం మత్తులో, అది ముగిసేవరకూ పొరపాట్లు బయటపడవన్నది కూడా సత్యమే కదా.    
    పెళ్ళికి ముందు పరిచయాలుండటంలో తప్పుందా లేదా అని తర్కించటంలేదు నేను. కొన్ని పరిచయాలు పరిచయాలతోనే ఆగిపోతాయి. కొన్ని శారీరక సంబంధాల వరకూ వెళతాయి. ఇవన్నీ నన్ను బాధించటం లేదు. ఆంజనేయులులాంటి వాడితో ప్రేమ కలాపాలు సాగించి, నేను కనపడగానే, మూడోనెల గర్భవతివై యుండి, ఆ ప్రేమ ప్రవాహాన్ని అతి సునాయాసంగా నావైపు తిప్పటమే నన్ను బాధిస్తోంది. ఇంత జరిగాక కూడా నాతో అంత ప్రేమని ఎలా నటించగల్గుతున్నావు? నాకు భార్య కావాలి. అద్భుతమైన నటి అవసరంలేదు. అసలిది తలుచుకుంటేనే నాకు కంపరం కలుగుతుంది. నా తెలివితక్కువతనానికీ, మూర్ఖత్వానికీ నువ్వు ఒక తార్కాణంగా నా ఎదురుగా కనిపిస్తూ వుండటానికి వీల్లేదు. నిరంతరం నేను బాధని భరించలేను. అందుకే నిన్ను చంపెయ్యాలనుకుంటున్నాను. క్షమించు. 'ఇదే ఆఖరి విందు'.    
    ఆలోచిస్తూ డ్రింక్ చేస్తున్న బాలు ఉలిక్కిపడ్డాడు.    
    కొంపదీసి సౌదామిని ఇవాళ అసలు భోజనమే చెయ్యకపోతే?    
    తను అన్నం తినకుండా వచ్చేశాడు. తనమీద లేని పతిభక్తిని ప్రదర్శించుకోవడానికి సౌదామిని కూడా భోజనం మానేస్తే-    
    ఇంత ప్లాను వేస్టు!    
    ఈ ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తారో చెప్పలేం!    
    తిమ్మిరెక్కినట్లు వున్న కాళ్ళని స్వాధీనంలోకి తెచ్చుకుంటూ కౌంటర్ దగ్గర వున్న ఫోన్ దగ్గరికి నడిచాడు బాలు.    
    సౌదామిని తన ఫోన్ కోసమే ఎదురు చూస్తున్నట్లు రింగవగానే తక్షణం ఎత్తింది.    
    "నేను" అన్నాడు ముక్తసరిగా.    

    "చెప్పండి" అంది సంతోషంగా.    
    "ఇందాక పని తొందరలో వచ్చేశాను. నడ్కర్నితో కలిసి భోజనం తీసుకుంటున్నాను. నువ్వు చేశావో లేదో అని గుర్తొచ్చింది. అందుకని ఫోన్ చేస్తున్నాను. భోజనం చేశావా?"    
    "లేదు ఇప్పుడు చేస్తాను".    
    తను ఫోన్ చెయ్యడం మంచిదే అయిందనుకున్నాడు బాలు.    
    "ఐ లవ్ యూ సౌదామినీ!" అన్నాడు ప్రయత్న పూర్వకంగా తన గొంతు తనకే చాలా కృత్రిమంగా వినబడింది.    
    "ఐ టూ!" అంది సౌదామిని మనసంతా ఆ మాటల్లో ఇమిడ్చేస్తూ.    
    రిసీవర్ క్రెడిల్ మీద ఉంచేశాడు బాలు.    
    తర్వాత మళ్ళీ విస్కీ తాగడంలో మునిగిపోయాడు.    
    మూడు గంటలు విస్కీ గడిచాక, బిళ్ళు చెల్లించి కారులో ఇంటికి చేరాడు బాలూ. అతను గుండె దడదడలాడుతోంది. హారరూ, సస్పెన్స్ కలిసిన పిక్చరు నిర్మించి, విడుదల చేసి రిజల్టు కోసం ఎదురుచూస్తున్న నిర్మాతలా తన ప్లాను సక్సెస్ అయిందా? ప్లాపా? అని.    
    కారు గేట్లో ప్రవేశించింది.    
    షాక్ తగిలినట్టు అయింది.   
    అక్కడ వరండాలో పడుకుని, కడుపు చేత్తో పట్టుకుని విలవిల్లాడిపోతున్నాడు ఆసెయ్య.    
    అయితే ఆసెయ్య ఊరికెళ్ళ లేదన్నమాట! అతను కూడా విషం తిన్నాడన్నమాట!    
    కడుపు చేత్తో పట్టుకుని గిలగిల్లాడిపోతున్న ఆసెయ్యబాలూని చూడను కూడా  లేదు. అతని కళ్ళు మూసుకునిపోయి వున్నాయి. పళ్ళు గిట్టకరుచుకుపోయి వున్నాయి. ఒక్క అంగలో అతన్ని చేరాడు బాలూ. "ఆసెయ్యా!" అన్నాడు ఆతృతగా.   
    ఆసెయ్య పలకలేదు.    
    "ఆసెయ్యా! ఆసెయ్యా!"    
    మరణవేదన అనుభవిస్తున్నాడు. చివరికేక వేసినట్లు అరిచాడు ఆసెయ్య.    
    "అమ్ మ్ మ్ మ్ మ్మా!"    
    "పొద్దుటి నుండి అలాగే బాధపడుతున్నాడు. ఇందాక డాక్టర్ మధుకి ఫోన్ చేశాను. ఆమె వచ్చి మందూ, ఇంజక్షన్ యిచ్చి, ఇంకో గంటలో తగ్గిపోతుందని చెప్పి వెళ్ళింది-" అంది సౌదామిని గుమ్మంలోకి వచ్చి నిలబడుతూ.    
    బతికి వున్న దెయ్యం అనేది అసలు ఉండదుగానీ, ఉంటే దాన్నిచూస్తే ఎలాంటి దిగ్భ్రమ కలుగుతుందో అలాంటి ఫీలింగ్ కలిగింది బాలూకి.    
    కళ్ళప్పగించి సౌదామినిని చూస్తూ వుండిపోయాడు.    
    విషాన్ని తిని చెట్టంత మొగాడు చుట్టుచుట్టుకుపోయి పడిపోతే ఈమెకు చీమ కుట్టినట్టు కూడా కాలేదా!    
    మరి.. బాబు ఏమయ్యాడు?    
    అతని ప్రశ్నకు సమాధానంగా వచ్చాడు. బాబు వచ్చీరాగానే తల్లి కొంగు అందుకుని మూతి తుడుచుకున్నాడు.    
    "ఛీ వెధవా! నేప్ కిన్ తో తుడుచుకోవాలని ఎన్నిసార్లు చెప్పాను!" అంది సౌదామిని కోప్పడుతూ.    
    "నా బాట్ ఏదీ?" అన్నాడు బాబు ఆమె మాటలు వినిపించుకోకుండా.
     "ఇప్పుడిక ఆటకు పోకు కాసేపు పడుకో..." అంతా మామూలుగానే ఉంది సంభాషణ. అసలు ఏమీ జరగనట్టే దిమ్మెరపోయినట్లు వాళ్ళని చూస్తూ మాటలు వింటున్నాడు బాలు.    
    ఏమయ్యింది?    
    విషం పనిచెయ్యలేదా!    
    లేకపోతే-వీళ్ళకి నిలువెల్లా విషం ఉండటంవల్ల ఆహారంలో కలిసిన కొద్ది విషం వీళ్ళని ఏమీ చెయ్యలేకపోయిందా!    
    అలాంటి రకాలా వీళ్ళు!    
    రాక్షస సంతతా!    
    "మీరు భోజనం చేశారా?" అన్నాడు అనుమానం తీర్చుకోవడం కోసం.    
    "మీరు రామని చెప్పారుగా అందుకని చేసేశాం" అంది సౌదామిని సంజాయిషీ చెబుతున్నట్లు.    
    ఆలోచిస్తూనే గదిలోకి వెళ్ళిపోయాడు.    
    తను నిజంగా సౌదామినిని ప్రేమించివుంటే - ఇలా హత్యచేసేటంత కోపం రాకూడదు.    
    ఉహు కాదు.... తనను మోసం చేసినందుకు ఆమెమీద కోపం! ఆమె తప్పు చేసినందుకు. కాదు అంటే.... ముందే ఈ గర్భం సంగతి చెప్పివుంటే కోపం రాకపోయి వుండునా? అప్పుడు కూడా వచ్చేది. మరి ప్రేమలో ద్వేషానికి చోటు వుండకూడదు కదా! ఒక్కసారి ఆమె తనను మోసం చేసిందని తెలిసేసరికి ఎందుకింత పగ? తను ఎంతో గొప్ప ప్రేమ అనుకున్నది - ఇంత ఓటి పునాదుల మీద నిర్మితమైందా?    
    అతడు తల విదిలించాడు.    
    కపాలం చిట్లుతున్నట్లు, మెదడు చీలుతున్నట్లు దుర్భరమైన ఆవేదన!

 Previous Page Next Page