Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 36

  

    గంగ మాట్లాడలేదు. అచ్యుత్ ఆమె దగ్గిరగా వెళ్ళి పుస్తకం తెరిచి కవ్వించాడు. "ఇదుగో చూడు ఇందులోవి ఎంత బావున్నావో."
   
    "నేను చూడను...."

    "అయితే నువ్వు సర్దు మిగతా పుస్తకాలు! నేను కాస్సేపు చూసి వస్తాను...." అంటూ పక్క దగ్గరికి వెళ్ళి కూర్చొని పుస్తకం తిరగెయ్యసాగాడు అచ్యుత్.
   
    పంతంగా స్టూల్ ఎక్కి పుస్తకాలు సర్దసాగింది గంగ. కానీ ఒక్క నిముషంలోనే విసుగు చెందినట్టు "....నేను హాస్టల్ కి వెళ్ళిపోతాను. నన్ను దింపెయ్యి...." అంది. ఆ మాటలో - హాస్టల్ కి వెళ్ళిపోవాలన్న కోరిక కన్నా అతడు దూరంగా కూర్చుని పని చెయ్యటం లేదన్న ఫీలింగు ఎక్కువ వుంది.
   
    "దా.... ఓ రెండు నిముషాలు బొమ్మలు చూద్దాం. నేను వచ్చి సర్దుతాను."
   
    గంగ, అంత ఇష్టంలేనట్లు- తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చినట్టు స్టూల్ దిగి అతడి పక్కకు వెళ్ళి కూర్చుంది.
   
    అరనిముషం తరువాత ఆమె కూడా బొమ్మలు చూడసాగింది.
   
                                   *    *    *
   
    పురుషుడు అడుగుతాడు. స్త్రీ కాదంటుంది. పురుషుడు అలుగుతాడు. స్త్రీ బింకంగా వుంటుంది. పురుషుడు ప్రాధేయపడతాడు. స్త్రీ బింకం నటిస్తూనే కరుగుతుంది.
   
    ఈ స్త్రీ పురుష సహజ స్వభావాలు, వారికి చిన్నతనం నుంచే వస్తాయని ఎవరైనా చెప్తే ధరణి నమ్మేది కాదేమో అయినా ప్రస్తుతం ఆమె ఆలోచిస్తున్నది అదికాదు.
   
    గంగ వెళ్ళి అచ్యుత్ పక్కన కూర్చోగానే పైకప్పులో చిన్న కదలికని ఆమె గమనించింది. లెన్స్ మీద పడిన సన్నటి మెరుపు అది.
   
    పుస్తకం చూస్తున్న అచ్యుత్ గంగవైపుకి నెమ్మదిగా కాస్త జరిగాడు. ఆమె దూరంగా వెళ్ళే ప్రయత్నం ఏమీ చెయ్యలేదు. ఒక హారర్ పిక్చర్ చూస్తున్నట్టు ఇద్దరూ భయంగా ఒకర్నొకరు దాదాపు హత్తుకుని బొమ్మలు చూస్తున్నారు. ఒకవైపు కొత్తదనం! మరొకవైపు ఉద్వేగం!! లేతమొక్కలు తొందరగా కాయలు కాయాలని ఎరువు ఎక్కువ వేసినట్టే, వయసుకు మించిన అనుభవం వారిని ఏం చెయ్యాలో తోచనట్టు కలవరపెడుతోంది.
   
    "ముద్దు పెట్టుకోనా....."
   
    "వద్దు. నాకు భయం-"
   
    "ఒక్కటి...."
   
    "మాస్టారు వస్తారు-" గంగ అంటోంది.
   
    ధరణి దృష్టికి ఇప్పుడు పైకప్పుమీద మెరుస్తోన్న వెలుగేమిటో స్పష్టంగా తెలిసింది. మరో కోణంలోంచి కూడా అలాగే మెరుస్తోంది! మొత్తం నాలుగు కోణాలు!!
   
    కెమేరా లెన్సులు!!!
   
    నాలుగు కోణాల్లోంచి మంచంవైపు ఫోకస్ కాబడి వున్నాయి!!!
   
    "మాస్టారు రారు, లోపల గడియవేసుకోమన్నారుగా నేను నిన్ను దింపేసి వచ్చి పడుకున్నాననుకుంటారు. అయిదు నిమిషాలు బొమ్మలు చూసి వెళ్ళిపోదాం. నేను దింపుతాగా!"
   
    గంగ సమాధానం చెప్పలేదు. అచ్యుత్ ఆ పాపా వైపుకి వంగాడు.
   
    ధరణికి భరించలేనంత దుఃఖం కలిగింది. అమృతం కురిసిన రాత్రిలో తిలక్ ఏ ప్రేవు ఎక్కడ కదిలి '...చిన్నమ్మా' అంటూ విలపించాడో తెలీదు కానీ, ధరణి మాత్రం తల్లులందరి తరపునా ఏడ్చింది. ఆ దుఃఖం కళ్ళలోంచి రాలేదు. వెక్కిళ్ళుగా రూపాంతరం చెందలేదు. నదీ గర్భంలో సుడిగుండంలా మనసులోనే సుడులు తిరిగింది.
   
    ......ఆమెకిప్పుడుమొత్తం అర్ధమైంది.
   
    మదన్ వారిద్దరికీ ఏకాంతం కల్పించాడు!
   
    అంతేకాదు.
   
    'అక్కడ' ఏకాంతం వున్నట్టు ఆ కుర్రాడికి అన్యాపదేశంగా చెప్పాడు.
   
    పైగా- గంగని వదిలిపెట్టే బాధ్యత ఆ కుర్రాడికే అప్పజెప్పాడు.
   
    ఆ విధంగా... ఎవరూ పట్టించుకోరన్న ధైర్యం ఆ ఇద్దరికీ యిచ్చాడు.
   
    అలా ఏకాంతమూ, ధైర్యమూ కల్పించాక, పుస్తకాల ద్వారా వారిని రెచ్చగొట్టాడు.
   
    అభం శుభం తెలియని పిల్లల్లో అప్పుడప్పుడే వికసిస్తున్న అస్పష్టమైన కోరిక తాలూకు రేకుల్ని బలవంతంగా విప్పాడు. వాటిని కెమేరాలో బంధిస్తున్నాడు.
   
    ......
   
    ఇద్దరు పురుషులు ఒక స్త్రీ, నలుగురు స్త్రీలు ఒక పురుషుడు, పాములు పశువులు.....
   
    నీలిమనసు రంగు చిత్రాల నాదరించే ప్రేక్షకుల మనస్తత్వం ఈ రకమైన నిర్మాతలకి బాగా తెలుసు. సాడిజం, సినిసిజం, లైంగిక వైపరీత్యం, అసంభవ హెలూసినేషన్స్ ప్రాతిపదికగా రకరకాల క్యాసెట్స్ వచ్చాయి. ఇప్పుడిది మరొక వెరైటీ పిల్లల్లో చిన్న వయసులో ప్రారంభమైన కోరిక ఏ విధంగా బహిర్గతమవుతోందో వాళ్ళు రికార్డు చేస్తున్నారు.
   
    .....బహుశ అందుకే ఈ స్కూలు పెట్టారు!!!

    ఈ ఆలోచన రాగానే ధరణి వణికిపోయింది.
   
    మిగతా రెసిడెంట్ స్కూల్స్ లా కాకుండా, వారానికి ఒక రోజు ఇంటికి తీసుకొచ్చి పిల్లల్ని వదిలిపెడతామని వారు చెప్తే, ఈ కొత్త విధానానికి తమలాటి ఉద్యోగినులంతా ఎంతో సంతోషించారు. ఆఫీసు నుంచి రాగానే ఇంట్లో పిల్లల గొడవ వుండదనీ, అలా అన్చెప్పి నెలల తరబడి దూరంగా వుంచే అవసరం వుండదనీ-అనుకున్నారు. త్వరలోనే రాష్ట్రమంతా ఈ రకమైన సెమీ రెసిడెన్షియల్ స్కూల్స్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని అనుకున్నారు. ఒక మంచి ఆలోచనని ఈ విధంగా వీరు దుర్వినియోగపరిచారు.
   
    'సెమీ-రెసిడెన్షియల్' అన్నది లాభసాటి ఆలోచనో, చిన్నపిల్లల మీద ఫిల్మ్ అన్నది లాభసాటి ఆలోచనో-ఆలోచించే స్థితిలో లేదు ధరణి. అప్పటికే ఆమె కాళ్ళు వణుకుతున్నాయి. అరచేతులు చెమటలు పట్టాయి.
   
    లోపలి దృశ్యాన్ని చూసే ఆసక్తి కూడా పోయింది. ఆమెకు కలిగినదుఃఖం సమాజంపట్ల దుఃఖం డబ్బు కోసం దేశాన్ని పాడుచేసే రాజకీయ నాయకులూ, అమాయకుల్ని చంపే మాఫియా లీడర్లు- ప్రజలకి కొత్తకాదు. కానీ మరిన్ని వినూత్నమైన ఆలోచన్లతో, వికృత ధోరణులతో, మరిన్ని కొత్త కొత్త మురికి కాలువలు వచ్చి స్వచ్చమైన జనజీవన స్రవంతిని కలుషితం చేస్తున్నాయనే దుఃఖం అది!
   
    ఆమె, కిటికీ నుంచి క్రిందికి దిగి, నెమ్మదిగా చీకట్లో కలిసి పోయింది. శబ్దం చేయకుండా కాంపౌండ్ వాల్ దాటి బయటకొచ్చింది. తనని ఒక వ్యక్తి గమనిస్తున్నాడని ఆమెకు తెలీదు.
   
                                           5
   
    ధరణి ఇంటికి వచ్చేసరికి శ్రీధర్ ఒక్కడే వున్నాడు. అతడి కళ్ళు బాగా ఉబ్బిఉన్నాయి. "....ఎక్కడికి వెళ్ళావ్ ఎవరికీ చెప్పకుండా" అని అరిచాడు. అతడికి అంత కోపం రావటం ఎన్నడూ చూడలేదు.
   
    ఆమె ఆ ప్రశ్నకి సమాధానం చెప్పకుండా, "పిల్లలు వచ్చారా?" అని అడిగింది.
   
    "లేదు అందుకేగా ఏడుపు" అన్నాడు విసురుగా.
   
    ఆమె గతుక్కుమంది. అప్పటివరకూ రకరకాల ఆలోచనల్తో అసలు దిగులు మనసు వెనక్కి వెళ్ళింది. అతడి మాటల్తో అది ఉప్పెనలా బయటకొచ్చింది, పిల్లలు క....న....బ...డ....టం లేదు.
   
    ఆమె శరీరం భయంతో కంపించింది. "...ఏవండీ....ఏం చేద్దాం?" అంది బెదురు నిండిన కళ్ళతో.
   
    "ఏం చేద్దామన్నా-నువ్వూ మాయమయ్యావుగా ఒకవైపు నేను టెన్షన్ తో చస్తుంటే నువ్వెక్కడికి వెళ్ళావ్?" అతడి కంఠంలో కోపం, కసి, ఉక్రోషం నిండివున్నాయి. తను చూసిన దృశ్యం గురించి చెప్పలేదామె. అది సందర్భంకాదు.
   
    "పదండి. ఇన్ స్పెక్టర్ గారి దగ్గరికి వెళ్దాం" అంది. స్కూటర్ వెనుక ప్రయాణిస్తున్నంతసేపూ ఆమె ఆలోచన్లు ఆ సంఘటన చుట్టూనే  పరిభ్రమిస్తున్నాయి.
   
    ప్రియ మరణానికీ, గంగ -అచ్యుత్ ల మధ్య జరిగిన సంఘటనకి ఏదైనా సంబంధం వుందా- అన్నదే ఆమె ఆలోచన.
   
    పోలీస్ స్టేషన్ చేరుకాగానే ఆమెకి తిరిగి దిగులు ప్రారంభం అయింది. కూతురి గురించిన వార్త ఏం వినాల్సి వస్తుందో అని ఆమె భయం.
   
    ఇన్ స్పెక్టర్ విక్రమ్ ఆ దంపతుల్ని సాదరంగా ఆహ్వానించాడు. కూతురు అదృశ్యం గురించి శ్రీధర్ వివరంగా చెప్తూంటే ఇన్ స్పెక్టర్ మొహంలో భావాలు మారిపోసాగాయి.
   
    "మైగాడ్...." అంటూ కంట్రోల్ రూమ్ కి వార్త పంపాడు. ధరణి అన్యమనస్కంగా కూర్చుంది. టెన్షన్ మరీ ఎక్కువైతే అది మెదడుని ఆలోచించనివ్వకుండా చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఆ స్థితిలోనే వుంది.
   
    ఒకే దృశ్యం ఆమె కళ్ళముందు సజీవంగా కదుల్తోంది. తన కూతురు కొన్ని రోజుల క్రితం ఆడుకుంటూ, ఒక ఆడబొమ్మపై మరో బొమ్మని పడుకోబెట్టటం.....దాని కన్నా ముఖ్యంగా ...ఆ చేష్టని తాము గమనించామని తెలిసినప్పుడు కూడా, భయమూ, సిగ్గులాటివి కాకుండా 'అమాయకంగా' సమాధానం చెప్పటం....అంతా గుర్తొస్తోంది.
   
    అంతలోనే ఇంకో దృశ్యం.... తన కూతురికి జ్వరం వచ్చినప్పుడు డాక్టర్ స్టెత్ తో పరీక్షచేయబోతే  హిస్టీరిక్ గా '....నన్ను అడగొద్దు.... చూపించమని అడగొద్దు' అని అరవటం గుర్తొచ్చింది.

 Previous Page Next Page