Previous Page Next Page 
సిగ్గేస్తోంది! పేజి 37

 

    ధరణి భయంతో వణికిపోయింది.
   
    తన కూతురు కూ....డా....!
   
    తన కూ....తు...రు కూడా!!!
   
    "మీకొక గుడ్ న్యూస్..." ఇన్ స్పెక్టర్ కంఠం వినపడటంతో ఆలోచన్ల నుంచి తెప్పరిల్లి అతడివైపు చూసింది. విక్రమ్ ఫోన్ పెట్టేస్తూ "మీ అమ్మాయి దొరికింది" అన్నాడు.
   
    "ఎక్కడ?" దంపతులిద్దరూ ఒకేసారి ప్రశ్నించారు.
   
    "శ్మశానం దగ్గిర ఏడుస్తూంటే ఆ ఏరియా కానిస్టేబుల్ తీసుకెళ్ళాడట! పోలీస్ స్టేషన్ లో వున్నది!!!"
   
    ఒక్క ఉదుటున లేస్తూ- "ఏ పోలీస్ స్టేషన్? మేము వెళ్తాం" అన్నాడు శ్రీధర్.
   
    "అవసరం లేదు. మా కానిస్టేబుల్ ని మీ ఇంటికి తీసుకొచ్చి డైరెక్టుగా దింపమని చెప్పేశాను "విక్రమ్ కూడా లేస్తూ అన్నాడు.
   
    అప్పటివరకూ మనసులో వున్న టెన్షన్ అంతా ఒక్కసారిగా ఎవరో చేత్తో తీసేసినట్టు అయింది ధరణికి! కూతురు దొరికిందనగానే మనసు రిలాక్స్ అయింది.
   
    భర్త వెనుక కూర్చుని, అతని నడుము పట్టుకుంది. చల్లగాలికి ఆమె ముంగురులు కదుల్తున్నాయి. శ్రీధర్ స్కూటర్ ని వేగంగా నడుపుతూ వుండటంతో కాస్త చలి అనిపించింది. వెనుక నుంచి అప్రయత్నంగా భర్తకి దగ్గిరగా జరిగింది.
   
    అప్పుడు వెలిగింది ఆమె మెదడులో ఒక ఫ్లాష్!!
   
    ప్రియ మరణానికి కారణం!!!
   
    గంగ్లాగే ప్రియ చిన్నపిల్ల. అయితే గంగకన్నా బొద్దుగా, వయసుకన్నా ఎక్కువ ఎదిగినదాన్లా ఆరోగ్యంగా వుంటుంది. అంత అమాయకమైన దాన్లా కనపడదు.
   
    ప్రియని కూడా వాళ్ళు అలాగే 'టెంప్ట్ చేసి వుంటారు. ఒకచిన్న కుర్రవాడితో రో....మా....న్స్ లోకి దింపి, ఫిల్మ్ షూట్ చేసి వుంటారు.
   
    అది అక్కడితో ఆగితే ప్రియ ఆత్మహత్య చేసుకుని వుండి వుండదు. తన ఇష్టప్రకారమే జరిగింది కాబట్టి పెద్దగా పట్టించుకోకుండా దాన్ని కాలక్రమేణా మర్చిపోవటమో, అదే దార్లో ముందుకి సాగటమో జరిగి వుండేది. ఆ అమ్మాయి విషయంలో అలా జరగలేదంటే, దానికి ఒకటే కారణం తోస్తోంది.
   
    విర్వాహకుల్లో ఒకరు ఆ అమ్మాయిని బ్లాక్ మెయిల్ చేసి వుండాలి!
   
    ఒకసారి తప్పుచేసిన అమ్మాయిని లోబర్చుకోవటం సులభం! పుస్తకంలో బొమ్మలు చూసి ఆవేశం చెంది, చేరువలో వున్న కుర్రవాడితో, తెలిసీ తెలియని రీతిలో రొమాన్స్ చేయటం వేరు. ఒక బ్లాక్ మెయిలర్ చేతిలో శారీరకంగా లొంగిపోవటం వేరు.
   
    ఆ షాక్ భరించలేకే ప్రియ ఆత్మహత్య చేసుకుని వుంటుంది.
   
    అది రేప్ కాదు!
   
    ఎమోషనల్ బ్లాక్ మెయిల్ ఆధారంగా జరిగిన మానసిక చిత్రహింస!!
   
    అందుకే ఆ అమ్మాయి వెంటనే మరణించకుండా, ఆస్పత్రిలో జ్వరంతో, భయంతో వణికి వణికి మరణించింది.
   
    .....
   
    స్కూటర్ ఇంటిముందు ఆగటంతో ఆలోచన్లనుంచి తెప్పరిల్లింది ధరణి.
   
    కానిస్టేబుల్ ఇంకా పూజని 'శ్మశానం' నుంచి తీసుకురాలేదు.
   
                                          6
   
    "వాచ్ మెన్ ని పిలువు..." యోగి కంఠం కామ్ గా వినిపించింది. మదన్ కి ఎప్పుడూ అదే ఆశ్చర్యంగా వుంటుంది. సంవత్సరాల తరబడి మెడిటేషన్ చేసినవాడిలా యోగి నిరంతరం 'అభావం'తో వుంటాడు. పెదాలమీద చిరునవ్వు వున్నట్టే వుంటుంది. కానీ కళ్ళు మాత్రం ఆ భావాల్ని పలికించవు. అతడి మనసులో ఏముందో అవతలి వారికి అసలు అర్ధంకాదు.
   
    అయిదు నిముషాల తరువాత వాచ్ మెన్ వచ్చాడు. యోగి సూటిగా అతడివైపు చూశాడు. "నిన్ను ఎందుకు పెట్టుకున్నాము?"
   
    వాచ్ మెన్ కి అర్ధంకాలేదా ప్రశ్న. అయోమయంగా చూసాడు.
   
    "మామూలు వాచ్ మెన్ కి వెయ్యిరూపాయలు నెలజీతం అయితే నీకు అయిదు వేలు... ఎందుకు?"
   
    అతడు సమాధానం చెప్పలేదు.
   
    కానీ జవాబు తెలుసు. ఆ మాటకొస్తే 'ఇలాంటి' వ్యవహారాల్లో అందరికన్నా ఎక్కువ తెలిసేది వాచ్ మెన్ లకే. "స...రు....కు' జాగ్రత్తగా బయటికి వెళ్ళాలన్నా లోపలి రావాలన్నా వాళ్ళే 'చెక్' చేయాలి. వాళ్ళకి తెలియకుండా ఏదీ జరగదు.

    దాదాపు పాతిక సంవత్సరాల క్రితం యోగి (అప్పుడతని అసలు పేరేమిటో అతడికే గుర్తులేదు) కర్నూలు ప్రాంతంలో దొంగనోట్లు ప్రింట్ చేసేవాడు. అతడికి ఏడుకొండలు బాస్. సాలగ్రామం అనే ప్రముఖ రాజకీయ - 'కమ్' -పారిశ్రామికవేత్త సహాయ సహకారాలు వారికి వుండేవి. కొంతవరకూ ఎదగటానికి మాత్రమే తెలివైనవాడు, చట్టవిరుద్దమైన పనుల్ని ఎన్నుకుంటాడు. పునాది గట్టి పడగానే, సమాజంలో గౌరవప్రదమైన సభ్యుడిగా ముద్ర వేసుకోవటానికి ఇష్టపడతాడు.

    ఈ ముగ్గురి విషయంలో కూడా అదే జరిగింది. ఏడుకొండలు సినిమా నిర్మాత అయ్యాడు. యోగి స్కూలు స్థాపించాడు. అయితే మాఫియా ముఠాలకీ వీరికి ఇంకా సంబంధాలున్నాయని తెలిసినవాళ్ళు చాలా తక్కువమంది.
   
    అందులో ఆ వాచ్ మెన్ ఒకడు. ఆ చనువుతో అతడు ఒకమాట తూలాడు.
   
    "నీ కింత జీతం ఇస్తున్నది ఎందుకు...? చెప్పు" రెట్టించి అడిగిన యోగి ప్రశ్నకి సమాధానంగా, "...మీ రహస్యాలు బయటికి చెప్పకుండా వుంటున్నందుకు" అని సన్నగా నవ్వాడు. అదే అతడు చేసిన తప్పు.
   
    యోగి భ్రుకుటి ముడిపడింది. అదయినా అరక్షణం సేపే! వెంటనే సర్దుకుని "-అరగంట క్రితం ఒకామె మన కాంపౌండ్ లోకి ప్రవేశించింది. జరుగుతున్నదంతా చూసి వెళ్ళింది. దీనికి నీ సంజాయిషీ ఏమిటి?" అని అడిగాడు హిందీలో.
   
    "-లోపలికొచ్చిందా?"
   
    "అవును."
   
    వాచ్ మెన్ ఒక క్షణం ఆలోచించి, "అవును, ఒకావిడ వచ్చింది. నేను లోపలి పంపించలేదు. అట్నుంచి అటే వెళ్ళిపోయిందే" అన్నాడు.
   
    "లేదు. వెనుకవైపు నుంచి లోపలికి ప్రవేశించింది."
   
    "దానికి నేనేం చెయ్యను?" పెడసరంగా సమాధానం వచ్చింది. ఆ వాచ్ మెన్ పదేళ్ళనుంచీ అక్కడ పనిచేస్తున్నాడు. తన కళ్ళముందే ఏడుకొండలు పెద్ద నిర్మాతగా మారటం, యోగికి సంఘంలో పలుకుబడి పెరగటం చూస్తున్నాడు. తను మాత్రం (జీతం పెరిగింది. అది వేరే సంగతి) అలాగే వుండిపోయాడు. ఆ దుగ్ధ మనసులో వుండిపోయింది.
   
    "సరే. నువ్వెళ్ళి మదన్ ని పిలువు" యోగి అన్నాడు. వాచ్ మెన్ వెళ్ళిపోయాడు. అయిదు నిమిషాల తరువాత మదన్ వచ్చాడు.
   
    బయట చీకట్లు దట్టమవుతున్నాయి.
   
    యోగి పచార్లు చేస్తూ చెప్పాడు. "మదన్! చాలామంది అనుకుంటారు- తాము చాలా నీతివంతులమనీ, అందుకే మధ్య తరగతి మనుష్యుల్లా వుండిపోయామనీ..."
   
    మదన్ కి అతడేం చెప్తున్నాడో అర్ధంకాలేదు. యోగి కొనసాగించాడు. ".....నిజానికి, మంచిపని చేసి డబ్బు సంపాదించటానికన్నా, అక్రమంగా ధనార్జన చేయటమే కష్టం. అందుకే ఈ ప్రపంచంలో కొంతమంది మాత్రమే రాజకీయ నాయకులూ, చీకటి వ్యాపారులూ రాజ్యమేలగల్గుతున్నారు. మిగతా వారందరూ వారిని ఒకవైపు తిడుతూ, మరొకవైపు వారికి పట్టం కడుతున్నారు. ఒక మామూలు వ్యక్తి, గొప్పరాజకీయ నాయకుడు కావాలన్నా, మాఫియా మనిషి కావాలన్నా మొదట్లో చాలా కష్టపడాలి. సంభాషించటం, ఇతరుల్ని ఆకట్టుకోవటం, ఎవరితో వుంటే ఎంత లాభిస్తుందో కరెక్టుగా అంచనా వేయగలగటం, ఎదురుదెబ్బ తగిలినా, ఫై 'రాంకు' పెద్దలు తన సేవల్ని గుర్తించక పోయినా- ఓర్పుతో వుండగల్గటం రాజకీయ నాయకుడు ఆపుదామనుకున్న వ్యక్తికి వుండవలసిన లక్షణాలు...." ఆగి, చెప్పాడు.
   
    "అలాగే మాఫియాలో పైకి వద్దామానుకున్న వ్యక్తికి కావల్సిన లక్షణాలు ఏమిటో తెలుసా మదన్? ఒక మనిషిని చంపాలా-భయపెట్టి వదిలెయ్యాలా అన్న నిర్ణయాన్ని కరెక్టుగా తీసుకోగల్గటం, చంపదల్చుకుంటే ఏ మాత్రం భయమూ తడబాటూ లేకుండా చంపగల్గటం- ఇవీ ముఖ్యమైనవి! ఇంతకన్నా ముఖ్యమైనది మరొకటి వుంది. మాఫియా రాజ్యంలో ఆకర్షణలు ఎక్కువ. అందమైన అమ్మాయిలూ, లక్షల డబ్బుతో సూట్ కేసులూ, ఖరీదైన స్కాచ్ విస్కీలు చేతులు మారుతూ వుంటాయి. మాఫియాలో కొత్తగా చేరిన వ్యక్తి, ఈ ప్రలోభాలన్నీ చూసి ఆకర్షితుడై ఎవరికీ తెలియదులె అనుకుంటూ కాస్త గుక్క నోట్లో వేసుకున్నా, పెద్ద కట్టలోంచి ఒక నోటు కొట్టేసినా, అక్కడితో అతనిపని ఆఖరు...." అంటూ సన్నగా నవ్వేడు ఎందుకో తెలియకుండానే మదన్ వళ్ళు జలదరించింది.
   
    "నేనిదంతా ఎందుకు చెప్తున్నానో తెలుసా?"
   
    మదన్ తెలీదన్నట్టు తల అడ్డంగా వూపాడు.
   
    "నేను మాట్లాడుతోన్నది ప్రియ అనే అమ్మాయి గురించి"
   
    మదన్ ఉలిక్కిపడి చూశాడు. యోగి లేచి, పచార్లుచేస్తూ అన్నాడు. "-చిన్న పిల్లల్తో ఫిలిం చిత్రీకరణ అన్న ఆలోచన నాకు రాగానే, ఇది డబ్బుల పంట అని నాకు తెలుసు. అంతేకాదు, ఒకసారి డబ్బు వర్షంలా కురిసిన తరువాత ఆగిపోతుందని కూడా తెలుసు. జనం ఎక్కువకాలం ఇది చూడరు. అభిరుచులు మారతాయి. ప్రస్తుతం అలాగే జరిగింది. అయినా నాకేం పెద్ద బాధగా లేదు. మిగతా వ్యాపారాలు బాగా సాగుతున్నాయ్. ముఖ్యంగా మన వారాంతపు హాలిడే రెసిడెన్షియల్ స్కూలు."

 Previous Page Next Page