Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 35

 

                         *    *    *    *

    చాకలి ఇంటి దగ్గర నుంచి తిరిగి వస్తున్న రామారావుకి రోడ్డు మీద దేనికోసమో వెతుకుతున్న కుర్రాడు కనిపించాడు. అతను సైకిలు ఆపి - "ఏమిటి తమ్ముడూ, వెతుకుతున్నావ్ ?' అన్నాడు.
    కుర్రాడు చెప్పిన వివరాలు విన్నమీదట తన సయనైడ్ ట్యూబు ఆ కుర్రాడి చేతిలో పడి తప్పుకోందని అతనికి అర్ధమైంది. అతనూ వెతకనారంభించాడు. అవతల అక్క కొడుకు ఏడుస్తూంటాడని కుర్రాడు వెళ్ళిపోయాడు.
    ఎలాగో అలా ఆ త్యూబుని వెతికి పట్టుకోవాలని రామారావు రోడ్డంతా శ్రద్దగా గాలిస్తున్న సమయంలో ఒక ఆసామీ అతన్ని పలకరించాడు. "ఏమిటి సార్ ఏదో వెతుకుతున్నట్లున్నారు?"
    "అవునండీ " అంటూ రామారావు వివరాలు చెప్పాడు. ఆసామీ ఆశ్చర్యపోతూ , "అదంత ,ముఖ్యమైన వస్తువా?" దాన్ని సైకిల్ షాపులో వదిలేసి వచ్చాను" అన్నాడు.
    రామారావు ఆత్రుతగా అతన్ని ఆ సైకిల్ షాపు ఎక్కడుందో  కనుక్కొని ఆ షాపు కేసి తన సైకిల్ తిప్పేడు.
    రామారావు చేరుకునేసరికి భద్రం షాపు మూసేసి ఉంది.
    అతనిలో కంగారు అధికమైంది. చుట్టుప్రక్కల వాకబు చేయగా ఆ షాపు అదేననీ, ఎవరో ఒక ఆడపిల్ల తెచ్చిన కబురు విని కంగారుగా షాపు మూసేసి అతను వెళ్ళి పోయాడనీ అతనికి తెలిసింది. భద్రం ఇల్లెక్కడో ఎవ్వరూ సరిగ్గా చెప్పలేక పోయారు. మరయితే ఆ ఇంటి చిరునామా ఎలా తెల్సుకోవటం!
    మృత్యుదేవత భద్రం ఇంట్లో అడుగు పెట్టింది. అది ఏ క్షణంలో ఎవరిని కబళిస్తుందో తెలియదు. అతను అసంతృప్తిగా ఆ ప్రాంతాల తిరగసాగాడు. చుట్టుప్రక్కల వారందర్నీ మరోసారి అడిగి చూశాడు. ఇక అది పనికాదని భద్రం ఇంటికి ఎతువైపుకి వెళ్ళేడో కనుక్కుని అటు వైపుగా సైకిలు తొక్కుకు వేళ్ళాడతను.
    కానీ భద్రం ఇల్లంటే ఎవరు చెబుతారు? భద్రమేలా ఉంటాడో కూడా తనకు తేలియదు. ఎటొచ్చీ తను ఒకే ఒక ఆశ పెట్టుకున్నాడు. ఆ దారమ్మట వెళ్ళే ఒకటి రెండు వీధులు తిరిగి ఎవరింట్లో నుంచి ఏడుపులు వినిపించక పొతే కొంత ఆత్మతృప్తి పొందవచ్చునని అతని ఆశ.
    అయితే అతను తిరిగిన రెండు వీధుల్లోనూ ఒక వీధిలో ఇంట్లోంచి ఏడ్పులు వినిపించనే వినిపించాయి. రామారావు చాలా వర్రీ అయిపోయాడు. వెళ్ళి విచారించగా ఆ ఇంట్లో ఒక మనిషి చనిపోయాడని తెలిసింది. కలవరపాటుతో అతనింకా ప్రశ్నలడిగాడు. విసుక్కుంటూనే ఆ ఇంటి వాళ్ళు సమాధానాలిచ్చాడు. చనిపోయిన మనిషి ఆరోజు తెల్లవారకట్లె పోయాడు. దహన సంస్కారాలు కూడా అయిపోయాయి. అప్పుడే ఎవరో కొత్త బంధువు పరామర్శకు రావడంతో వాళ్ళ ఏడుపులు మళ్ళీ ఎక్కువయ్యాయి.
    రామారావు కొంచెం తేలిగ్గా ఊపిరి పీల్చుకుని అక్కణ్ణించి బయటపడ్డాడు. ఒక గంట సేపు అతనలా శ్రమ పడ్డాక ఇక లాభం లేదనిపించి ఇంటికి పోవాలనుకున్నాడు. వెళ్ళేముందు మరొక్కసారి భద్రం షాపును చూసి పోదామని అతననుకున్నాడు. అలా అనుకోవడం మంచిదే అయింది. ఆ షాపు తెరిచి ఉంది!
    ఆశ్చర్యపోతూ ఆ షాపులో అడుగు పెడుతూ , "భద్రం మీరేనండీ!" అన్నాడు.
    "కాదు. అయినా పరవాలేదు. సైకిల్ నాకిచ్చి వెళ్ళవచ్చు" అన్నాడా వ్యక్తీ.
    ఆ వ్యక్తీ భద్రం కాదు. తన మేనమామ ఒంట్లో సరిగ్గా లేకపోవడం వల్ల అతను ఇంటి దగ్గరే వుండిపోయాడు. ఇతను వాళ్ళింట్లో పని కుర్రాడు. అద్దె కిచ్చిన సైకిళ్ళు ఇంకా రెండో మూడో రావలసి వుండడం వల్ల అతను ఈ కుర్రాణ్ణి పంపించాడు. రామారావు వాణ్ణి భద్రం ఇంటి అడ్రసు అడిగి మళ్ళీ తన వాహన మేక్కాడు. సైకిల్ శరవేగంతో భద్రం ఇల్లు చేరుకునే సరికి ఆ ఇంట్లోంచి ఏడుపులూ, పెడబొబ్బలూ వినిపించాయి.

                                                           13
    గంగరాజుకి ఈరోజు ఉదయం గుండెల్లో విపరీతమైన పోటు వచ్చింది. డాక్టరు వచ్చి మందులిచ్చి వెళ్ళాడు. వెళ్ళే ముందాయన భద్రాన్ని హెచ్చరించాడు.
    డాక్టరు వెళ్ళిన ఓ గంటకు గంగరాజు మళ్ళీ మామూలు మనిషయ్యాడు. అయన భద్రాన్ని దగ్గరగా పిలిచి "నాకేం ఫరవాలేదురా , నువ్వెళ్ళి షాపు తెరు" అన్నాడు. భద్రం మొదట్లో అక్కడే వుంటానని అన్నా గంగరాజు ఒప్పుకోక పోవడంతో చివరకు వెళ్ళిపోయాడు.
    మధ్యాహ్నం డాక్టరు వచ్చినప్పుడాయన "డాక్టర్ నేను తప్పక మరింత కాలం బ్రతుకుతాను కదూ ?" అన్నాడు.
    డాక్టర్ నవ్వి "మీరు ఉద్రేకాన్నణచుకుంటే ఎంత కాలమైన బ్రతుకుతారు !" అన్నాడు.
    "నా ఆరోగ్యం ఉద్రేకాల నణచుకోవడం లో లేదు డాక్టర్! మీ వైద్యం మీదనే ఆధారపడి వుంది."
    డాక్టర్ తడబడి 'అంటే?" అన్నాడు.
    "మీ మందు వల్ల నా ఆరోగ్యం రోజు రోజుకీ మెరుగవుతోంది. నాలో అంతకంతకూ ఆత్మ విశ్వాసం పెరుగుతోంది. నేను తప్పక మరింతకాలం బ్రతికి తీరుతాననే నమ్మకం కలుగుతోంది. నా అదృష్టం కొద్దీ మీరు దొరికారు. మీ వైద్యమున్నంతకాలం మృత్యుదేవత నన్ను సమీపించలేదు. ఈ ధైర్యం కలిగింది నాకు. అందుకే ...."
    "అందుకే....?" అడిగాడు డాక్టర్ కుతూహలంగా.
    "రేపు మా లాయరు గారు వస్తారు. నేను మార్చి రాయబోయే వీలునామాలో మీరు సాక్షి సంతకం చేయాలి. డాక్టరుగా మీ సాక్షి సంతకం నా ఆరోగ్య పరిస్థితికి కూడా చక్కని సరిఫికేట్టు అవుతుంది." గంగరాజు ఉత్సాహంగా తను వీలునామా ఇదివరలో ఎలా రాసినదీ, దాన్ని ఎలా మార్చబోతున్నదీ చెబితే డాక్టరు మౌనంగా విన్నాడు.
    
                            *    *    *    *

    ఆరోజు రాత్రి గంగరాజు మళ్ళీ గుండె నొప్పి వచ్చింది. ఇంట్లో వున్న పని కుర్రాణ్ణి డాక్టరు కోసం పంపించి తను భద్రం కోసం పరుగెత్తింది రంగమ్మ. ఆమె భద్రాన్ని తీసుకు వచ్చేసరికి డాక్టర్ ఇంకా రాలేదు కానీ గంగరాజుకి కాస్త నొప్పి తగ్గింది. అయన గబగబా ఒక వుత్తరం రాసి సంతకం చేసి భద్రాని కిచ్చాడు. "ఇది రేపు ఉదయం మన లాయరు గారికిచ్చి ఆయన్ను వెంటబెట్టుకు రావాలి!"
    మరో అయిదు నిమిషాలకు డాక్టరు వచ్చాడు.
    "డాక్టర్ , వచ్చారా .....వెయ్యేనుగుల బలం వచ్చింది నా కిప్పుడు " అన్నాడు గంగరాజు.
    తర్వాత అయన "భద్రం , షాపుకి పని కుర్రాణ్ణి పంపించి నువ్విక్కడే ఉండిపో" అన్నాడు. ఉదయం షాపుకి వెళ్ళమని బలవంతం పెట్టిన మావయ్య అలాగంటుంటే భద్రానికించుమించు ఏడుపొచ్చింది. అతను గంగరాజు చెప్పినట్లే చేశాడు. డాక్టర్ ఒక టాబ్లెట్ ఇచ్చాడు.
    పదిహేను నిమిషాలు భారంగా గడిచాయి. ఈలోగా డాక్టరు భద్రాన్ని అవతలకు పిలిచి "ఈరాత్రి గడిస్తే గండం తప్పినట్లే పరిస్థితి చాలా ప్రమాదకరంగా వుంది" అన్నాడు. భద్రాని కేడుపువచ్చేసింది."డాక్టర్ ఎలాగో అలా మీరు మా మావయ్యని రక్షించాలి" అన్నాడు.
    "నా చేతుల్లో వున్నది నేను చేస్తాను" అన్నాడు డాక్టర్.
    మరో అయిదు నిమిషాలు గడిచేక "భద్రం , రంగమ్మ , డాక్టర్ , సుభద్ర అందరూ రండి. నాకేదోలా వుంది" అంటూ గంగరాజు గావు కేకపెట్టాడు.
    అందరూ ఆయన్ను సమీపించారు. డాక్టరు కలవరపాటుతో ఆయన్నో సారి స్టేతస్కోప్ తో పరీక్షించాడు. నాడి చూశాడు. తొందరగా జేబులోంచి ఒక సీసా తీసి 'ఇందులోని మందును అర్జంటుగా పంచదార తో కలిపి ఇవ్వాలి. సుగుణా!" అన్నాడు.
    'సాయంత్రం నుంచి చెబుదామనుకోవడం, మరిచిపోవడం జరుగుతోంది. పంచదార లేదింట్లో, ఇప్పుడు బజారు కెళ్ళి రావాలి " అంది సుభద్రమ్మ.
    భద్రం హటాత్తుగా జేబును తడుముకున్నాడు. "ఇదుగో నా దగ్గర ఉంది." అంటూ తన జేబులోని ఫోలితీన్ ట్యూబ్ తీశాడు.
    "సుగుణా మందు జాగ్రత్తగా ఇవ్వాలి" అన్నాడు డాక్టర్.
    సుగుణ పెద్ద చెంచా ఒకటి తీసుకొచ్చింది. అందులో డాక్టర్ ఇచ్చిన మందు కొద్దిగా వేసింది. ఆమె వేస్తున్న డోసుని చూస్తున్న డాక్టర్ "అది చాలు!" అన్నాడు. భద్రం తన దగ్గరున్న ట్యూబు మూత తీసి సుగునకు ఇచ్చాడు. ఆమె అందులోని పదార్ధాన్ని కొద్దిగా చెంచాలో వేసి చేత్తో కలపబోయింది.

 Previous Page Next Page