Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 34

 

                                   12
    బట్టల మూటలు పోగొట్టుకున్న నలుగురి లోనూ రమణయ్య గారొకరు. అయన కాంట్రాక్టులు చేస్తూ చాలా డబ్బు ఆర్జించాడు. ఆయన దగ్గర బ్లాకు మనీ వుందనీ, అక్రమ పద్దతుల్లో ధన సంపాదన చేస్తున్నాడనీ పోలీస్ డిపార్టుమెంటు కు చూచాయగా తెలిసింది. మితిమీరిన ఆయన ఆదాయం పోలీసుశాఖకు అనుమానాన్ని కలుగజేయగా ఆయన్ను రెడ్ హండెడ్ గా పట్టుకోడానికి ఒక సిఐడి అయన ఇంట పనివాడుగా చేరాడు. ఆ సిఐడి అంతకు ముందు నించీ రమణయ్య గారింట్లో పనిచేస్తున్న పనివాడు లక్ష్మయ్యతో స్నేహం పట్టి రమణయ్య ను గురించిన వివరాలు సేకరించసాగాడు.
    చాకలికి బట్టలు వేసిన రోజు రాత్రి హటాత్తుగా రమణయ్య సిఐడీని పిలిచి అవసరమైన కొన్ని కాగితాలు పొరబాటున చాకలికి వేసిన చొక్కా జేబులో వుండిపోయాయనీ, మర్నాడుదయమే చాకలి ఇంటికి వెళ్ళి ఆ కాగితాలు వెతికి తీసుకురావలసిందనీ చెప్పాడు. మర్నాడుదయం దాకా ఎందుకు అప్పుడే వెడతానని సిఐడీ అంటే వద్దని అయన వారించాడు. "నేనా కాగితాల కోసం అంత కంగారు పడుతున్నట్లు ఎవరూ గ్రహించకూడదు" అని తనలో తనే అస్పష్టంగా గొణుక్కుని "తెల్లారి లేవగానే లక్ష్మయ్యను కూడా తీసుకెళ్ళు. వాడికి చాకలి ఇల్లు తెలుసు. పెద్దాపురం సిల్కు లాల్చీ కుడి పక్క జేబులో వుంటాయని, దొరకగానే ఎవరితోనూ చెప్పకుండా అవి నా దగ్గరకు జగ్రత్తగా తీసుకురావాలి. చాలా ముఖ్యమైన కాగితాలవి. దొరికితే నీకు చిన్న బహుమానం కూడా ఇస్తాను" అన్నాడు రమణయ్య.
    లక్ష్మయ్య తనతో కలిసినా ఫరవాలేదనుకొన్నాడు సిఐడీ. అతనా రాత్రే లక్ష్మయ్యకు చెప్పాడు. "తెల్లారేక మనం చాకలి ఇంటికి వెళ్ళి పెద్దాపురం సిల్కు లాల్చీ జేబులో ఉన్న ముఖ్యమైన కాగితాలు తెవాలిట. అవి అయ్యగారికి చాలా ముఖ్యమైనవి. కానీ ఆ కాగితాలు దొరికేక ఆ సంగతి నువ్వు అయ్యగారికి చెప్పకుండా ఉంటె నూర్రూపాయలిస్తాను" సంతోషంతో తల ఊపాడు లక్ష్మయ్య.
    అయితే వారిద్దరి ఆశలూ ఫలించలేదు. తెల్లారి లేచేసరికి ఆ మూటలు దొంగిలించబడ్డాయి. సిఐడీ కి నిరుత్సాహమూ, లక్ష్మయ్యకు దిగులూ ఒక్కసారిగా కలిగాయి. విషయం విన్న రమణయ్య "ఏం చేస్తాం ఆ కాగితాలు నాకు దక్కే యోగం లేదు అన్నాడు." అయన ముఖంలో అట్టే విచారం కనబడలేదు.

                            *    *    *    *
    
    తన ఇంట్లో తనమీద ఒక సిఐడీ నిఘా ఉన్న సంగతి రమణయ్య కు తెలుసు. లక్ష్మయ్య ఆయనకు విశ్వాసపాత్రుడైన నౌకరు. కొత్త వాడెవరు ఇంట్లో చేరినా అతను అమాయకంగా నటించి రమణయ్య గుట్టు బయట పెడుతున్నట్లు కనిపించి అవతలి వ్యక్తీ గురించి వీలైనంత ఎక్కువగా తెలుసుకొంటాడు. సిఐడీ తననేప్పుడూ ఎక్కువగా ఎలాంటి ప్రశ్నలడిగినదీ అతను రమణయ్యకు సమాచారం అందజేస్తూనే వున్నాడు. అందువల్ల రమణయ్య తన జాగ్రత్తలో తను ఉంటూ వచ్చాడు. కాగితాలు పోయాయని గ్రహించినప్పుడాయనకు చాకలికి వేశానా, సిఐడీ కాజేశాడా అని చిన్న అనుమానం రాగా ఉపాయం పన్ని సందేహాన్ని నివృత్తి కావించుకొన్నాడు. తర్వాత ఆ రాత్రి రమణయ్య మనుషులు చాకలి ఇంట్లో మూటలు ఎత్తుకెళ్ళి ఊరికవతల ఉన్న వంతెన కింద అవన్నీ వెతికి మొత్తం మీద కాగితాలు సంపాదించారు. పెద్దాపురం సిల్కు చిక్కా అన్నది రమణయ్య కల్పించిన అబద్దం . ఆ మనుషులకు రమణయ్యతోనే కాని అయన బట్టలతో పరిచయం లేదు. అందువల్ల వాళ్ళు మొత్తం బట్టలన్నీ చకచకా గాలించవలసి వచ్చింది. ఫలితంగా వాళ్లకు చాలా జేబుల్లో కాగితాలు దొరికాయి. ఒక లేత నీలం రంగు కాటన్ పాంటు జేబులో వాళ్ళకు పాలితీన్ ట్యూబ్ కూడా దొరికింది.
    చిల్లర డబ్బు, రూపాయి నోట్లు, చిత్తూ కాగితాలు, పెన్నులు , కణికి పుల్లలు వగైరా అనేక వస్తువులు దొరికిన మీదట - చాకలికి బట్టలు వేసేటప్పుడు అజాగ్రత్తగా ఉండేవాళ్ళు ఉళ్ళో చాలామంది వున్నట్లు ఆ మనుష్యులు కర్ధమైంది.
    వాళ్ళకు ఇంగ్లీషు రాదు. తమకు దొరికిన పోలతీన్ ట్యూబ్ వాళ్ళనాకర్శించింది. దాని మీద ఇంగ్లీషులో ఏదో రాసి వుంది. వారిలో ఒకడు మూత విప్పి చూసాడు. లోపల ఏదో తెల్లని పదార్ధం. "ఏం మందో ఏమో' అనుకుంటూ వాడు మళ్ళీ దానికి మూత పెట్టి దూరంగా విసిరేశాడు. తర్వాత వాళ్ళు అక్కణ్ణించి వెళ్ళిపోయారు.
    రోజూ సాయంత్రం ఆ వంతెన దగ్గరకు కొంతమంది పిల్లలు అడుకుందుకు వస్తారు. వాళ్ళ దాగుడు మూతల ఆటలలో ఒకోసారి వంతెన క్రింద దాక్కోవటం కూడా కద్దు. అలా దాక్కొన్న ఇద్దరిలో ఒకడికి ఆ ట్యూబు దొరికింది. ఇద్ద్దరూ కూడా అక్కడున్న బట్టలను చూశారు. ఆవిధంగా అక్కడ బట్టలు పడి వున్న విషయం మందరకూ తెలిసింది. ట్యూబు దొరికిన కుర్రాడు మాత్రం దాన్ని తన జేబులోనికి పోనిచ్చి ఎవరికీ చెప్పలేదు.
    ఆ కుర్రాడికీ పదిహేనేళ్ళు ఉంటాయి. ఆ ట్యూబు లో వున్నది పంచదారని అతను అభిప్రాయపడ్డాడు. కానీ పంచదారనలా ట్యూబులో వేసుకునే అవసరమేవరికి ఎందుకు కలుగుతుందో అతనికి అర్ధం కాలేదు. ఏమైనా బాల్య చాపల్యం వల్ల అతనికి అందులోని పంచదార తినాలనిపించింది. అయితే మాములుగా కాదు. హోటల్ కు వెళ్ళి కాఫీ ఆర్డరిచ్చి నలుగురూ చూస్తుండగా స్టయిల్ గా ఈ ట్యూబ్ లోని పంచదారను కాఫీలో వేసుకోవాలి. అతని జేబులో రూపాయికి పైగా చిల్లరుంది.
    కుర్రాడు హుషారుగా హోటల్ కెళ్ళి పంచదార తక్కువ కాఫీ ఒకటి చెయ్యమని సర్వర్ కి ఆర్డరిచ్చాడు. సర్వర్ కాఫీ తెచ్చాక కుర్రాడు స్టయిల్ గా తన జేబులోని ట్యూబు ని తీసాడు. మూత తీసి చేత్తో పట్టుకుని ఒకసారి కాఫీ రుచి చూసాడు. అతని ముఖంలో కోపం తాండవించింది. కాఫీ చాలా తియ్యగా వుంది. ఇంక అందులో పంచదార వేసుకొనేందుకు వీలుపడదు. తనవంకే కుతూహలంగా చూస్తున్న సర్వర్ వంక అతను కోపంగా చూసి "పంచదార తక్కువంటే ఎక్కువెందుకు వేశావ్?" అన్నాడు. సర్వర్ గుడ్లురుముతూ చూడగానే మాట్లాడకుండా తాగేశాడు.
    కాఫీ తాగి అసంతృప్తిగా బయటకు వచ్చాడు కుర్రాడు. ఆ ట్యూబు లోని పంచదారను ఎలాగైనా వాడాలని అతనికి మనసుగా వుంది. అదీ ఒంటరిగా కాదు.
    ఆరాత్రి ఇంట్లో ఆ కుర్రాడి అక్క కొడుకు ఏడాది పుల్లవాడు పాలకోసం ఏడ్వసాగాడు. ఇంట్లో పంచదార లేదు. పాలలో పంచదార లేకపోతె ఆ పిల్లాడు తాగడు. అర్జంటుగా దుకాణానికి వెళ్ళి పంచదార తీసుకురమ్మని చెప్పింది అక్క. అతనికి బద్దకంగా ఉంది. "పొద్దున్నే వెళ్ళి తెస్తాలేవే - అందాకా నా  దగ్గర కొద్దిగా పంచదారుంది , తీసుకో" అంటూ ఆ కుర్రాడు బట్టల స్టాండు దగ్గరకు వెళ్ళి తను ఇందాక విడిచిన నిక్కరు జేబులోంచి ఆ ట్యూబు తీసి పట్టు కెళ్ళి తనక్కకు ఇచ్చాడు. ఆమె గబగబా ఆ ట్యూబు మూత తీసింది. లోపలున్న పంచాదర లాంటి పదార్ధం చూసింది. కుర్రాడి ఎడుపామెకు స్థిమితం లేకుండా చేస్తోంది." "వేన్నీళ్ళ ఫ్లాస్కు , పాలడబ్బా తీసుకురా తమ్ముడూ" అందామె.
    కుర్రాడు త్వరగా అవి తెచ్చాడు. ఆమె త్వరత్వరగా పాలు కలిపింది. పంచదార పాలలో కలపబోతుండగా ఆమెకో అనుమానం వచ్చి ఆగింది. "తమ్ముడూ ఇది నీకేక్కడిదిరా? ఇది వరకేప్పుడూ నీదగ్గర చూసిన గుర్తు లేదు."
    తనకది ఎక్కడ దొరికింది చెప్పాడు.
    "ఒరేయ్ , నువ్వెలాగూ పంచదార తేక తప్పదు. ఇందులో వున్న ఈ కాస్త తోనూ రాత్రి గడవదు. అటువంటప్పుడు మట్టిలో దొరికిన ఇందులోని పంచదార చంటి పిల్లాడి కివ్వడం నాకిష్టం లేదు" అంది కుర్రాడి అక్క. అంటూనే ఆమె ఆ ట్యూబు కు మళ్ళీ మూత బిగించేసి తమ్ముడుకో అయిదు రూపాయలు నోటిచ్చి "కేజీ పంచదార కాక నువ్వో  పిప్పర మెంట్ ప్యాకెట్ కొనుక్కో" అంది.
    కుర్రాడు నోటుతో పాటు ట్యూబు కూడా అందుకొని నిక్కరు జేబులోకి తోసేసాడు. బట్టల స్టాండు మీద వున్న చొక్కా వేసుకుని వీధిలోకి పరుగెత్తాడు.
    అయితే కుర్రాడు వేసుకొన్న నిక్కరు ఇంట్లో తోడుక్కోనేది . రాత్రే కదా అని అతనింక దాన్ని మార్చలేదు. దాని జేబుకో చిన్న కన్నముంది. ఉత్సాహంలో వున్న కుర్రాణ్ణి మోసగించి, ఆ ట్యూబు అతని జేబులోంచి జారి రోడ్డు మీద పడిపోయింది. ఆ విషయన్నతను వెంటనే గమనించలేదు. పంచదార తో పాటు కొన్న పిప్పరమెంట్ ప్యాకెట్ జేబులో వేసుకుందా మానుకున్నాడతనా విషయాన్ని గుర్తించాడు. కానీ ఎంత వెతికినా దారిలో ఎక్కడా అది కనబడలేదు.

                             *    *    *    *

    సైకిల్ తొక్కుతున్న ఆ ఆసామినీ రోడ్డు మీద పడి వున్న సయనైడ్ ట్యూబు ఆకర్షించింది. అతను అప్రయత్నంగా సైకిలు ఆపి దాన్ని తీసి చూశాడు. ట్యూబు మీద షుగర్ అని ఇంగ్లీషులో రాసి వుంది. ట్యూబు లో తెల్లని పదార్ధముంది. అతనా ట్యూబుకు మళ్ళీ మూత పెట్టి నిరుత్సాహంగా సైకిల్ లో ముందున్న బుట్టలో పడేశాడు. తర్వాత అతను సైకిలు తోక్కొంటూ ఒకషాపుకి వెళ్ళాడు.
    షాపులో కూర్చున్న భద్రం లేచి సైకిల్ అందుకొన్నాడు. తర్వాత నోట్ బుక్ చూసి "మూడున్నర గంటల యింది మీరు సైకిల్ తీసుకొని" అన్నాడు. ఆసామీ భద్రానికి మూల్యం చెల్లించి వెళ్ళిపోయాడు. ఈలోగా సైకిలు ముందున్న బుట్టలోని సయనైడ్ ట్యూబు భద్రాన్ని ఆకర్షించింది. "ఏమండోయ్ - మీరేదో మరిచిపోయారు ఇందులో" అంటూ ఆసామీని పిలిచాడు. ఆసామీ వెనక్కు తిరగలేదు. "తెలుసు లేవయ్యా పంచదార వున్న గొట్టం. ఏదో అనుకోని రోడ్డు మీద కానబడితే తీశాను. అది నువ్వే ఉంచుకో !" అంటూ వెళ్ళిపోయాడు.
    భద్రం కుతూహలంగా ఆ ట్యూబుని చూశాడు. దాని మీద లేబుల్ ని, అందులో వున్న పదార్దాన్నీ పరిశీలించాక కొంచెం అందులో పదార్ధాన్ని తినాలని అతనికి అనిపించింది. తినబోయే వాడే ఆగిపోయాడు. "ఛా - ఇలా కాదు . నేనూ, రంగమ్మ కలిసి సరదాగా తినాలి. అప్పుడే మజాగా వుంటుంది" అనుకున్నాడు. ఆ ట్యూబును గురించి రంగమ్మ దగ్గర చిన్న తమాషా ఏదైనా చేయాలని కూడా అతనికి అనిపించింది.

 Previous Page Next Page