Previous Page Next Page 
వెలుగుబాట పేజి 33


    " అక్కా నీకేం భయంలేదు. ఇంటికెళ్ళు, అది మన ఇల్లు అతనిఇల్లు కాదు" అంది.
    ఈసురోమంటూ బయటకు నడిచింది నాగమాంబ' ఝాన్సీ కుమార్ లిద్దరూ మిగిలారు. కాంతివంతమయిన ఆ కళ్ళు ధీరత్వాన్ని వ్యక్తం చేసే నిండయిన విగ్రహం, అర్ధ్రమయిన చిరునవ్వులో లోకంలో కల్మషాలకు దూరంగా మెరిసే అమాయకత - కుమార్ ఓకే అదేవతా మూర్తిలాగా తోచాడు. ఉన్నట్లుండి అతడి మోకాళ్ళకు రెండు చేతులూ పెనవేసి మోకరించి, అతడి మోకాళ్ళలో తలవాల్చుకుని వెక్కి వెక్కి ఏడ్చేసింది.
    "ఝాన్సీ! ఏమిటిది? ఎందుకు? లే లే! మీ అమ్మగారు  బ్రతుకుతారు. నేను బ్రతికిస్తాను, డోంట్ వర్రీ!" ఆమె  ముఖాన్ని తన కాళ్ళమధ్యనుంచి పై కెత్తడానికి ప్రయత్నించాడు. అతడు అనునస్తున్న కొద్దీ ఆమెలో దుఃఖం ఉధృతంగా పొంగింది.
    "ఝాన్సీ....! ఝాన్సీ....." అని నిస్సహాయంగా ఆమెను ఓదార్చటానికి ప్రయత్నించాడు కుమార్. ఎంతకూ లేవలేక పోయేసరికి ఆమె భుజాలు పట్టుకుని, బలవంతంగా లేవదీశాడు. తూలి అతని గుండెలమీద వాలిపోయింది. ఆమె కన్నీళ్ళు అతని గుండెలకు వెచ్చగా తగిలాయి. ఊరడిస్తున్నట్లు ఆమె చుట్టూ చేతులువేశాడు. ఎవరూ ఛేదించలేని ఏదో భద్రమైన కోటలో ఉన్న అనుభూతి కలిగింది ఆమెకి.
    "నా త్యాగమంతా వ్యర్ధమయిపోయింది కుమార్!" అంది, బాధతో బొంగురుపోయిన గొంతుకతో, ఆ మాటలు అర్ధంకాక "ఆల్ రైట్! ఆల్ రైట్!" అని భుజం తట్టాడు. అప్పటికి తెప్పరిల్లి అతని చేతులు విడిపించుకొని, తల్లి అకస్మాత్తుగా ఇలా పడిపోవతానికి వెనుక ఉన్న కధంతా వివరించింది.


                                                     *    *    *


    నాగమాంబను చూసి సుబ్రహ్మణ్యంశాస్త్రి తల కిందకు దించుకున్నాడు. భార్యకు అతడు భయపడటం ఆ మాత్రంగానైనా తన సంకోచాన్ని ప్రకటించడం అదే  మొదటిసారి. అతడి ముఖం చూడటానికి అసహ్యం వేసింది నాగమాంబకి. నాగమాంబ జీవితంలో భర్తను అసహ్యించుకోవటమూ అదే మొదటిసారి. అతడితో మాట్లాడకుండా వంటింట్లోకి నడిచింది. శాస్త్రి ఆవిడ వెనకాలే వచ్చాడు. అతడిని గమనించనట్లే కుంపటి అంటించుకోసాగింది. వంటింటి గడపమీద కూచుని' సంభాషణ ప్రారంభించాడు.
    "వాళ్ళు వెళ్ళిపోయారు"
    "..............."
    "ఆ నూకాలమ్మ నోరు చెడ్డది. మనని పదిమందిలో బయట పడేసి కాని, ఊరుకోదు."
    గిర్రున భర్తవైపు తిరిగి ఎర్రబడ్డ కళ్ళతో అతడిని చూస్తూ "మననా" అంది.
    ఆ చూపులకు జంకి "నన్నంటే, నిన్ను అన్నట్లుకాదూ? నా పరువుపోతే నీ పరువుపోదూ!" అన్నాడు.
    "నా పరువు ఏనాడో పోయింది. 'మొగుడొదిలేసినది' అని ముఖం ఎదటా, ముఖం చాతునా, అందరూ ఈసడిస్తూనే ఉన్నారు."
    "అంతే కాదే వెర్రిమొహమా! ఆ దొంగముండ నా ఉద్యోగం ఊడపీకించేస్తానంటోంది. అంతపనీ చేస్తుంది."
    "ఫరవాలేదు లెండి. ఈ వెర్రి మొహాన్నీ, వెర్రి మొహం కొడుకునీ మా చెల్లి పోషిస్తుంది."
    ఈ సమాధానాలకు నివ్వెర పోతున్నాడు శాస్త్రి. మాట్లాడుతున్నది తన పెళ్ళామేనా! అన్నట్లు చూశాడు. దేనికైనా ఒక 'మితి' ఉంటుందనీ, తన భార్య విషయములో ఇపుడా హద్దు దాటిపోయిందనీ, ఇప్పటికి గుర్తించలేకపోతున్నాడు. అందుకే దగ్గరచేరి, మోకాళ్ళమీద కూచుని, "అదికాదే ముష్టిముండ! డబ్బు కక్కుర్తికి గొడవచేస్తూంది. ఒక పదివేలు దాని ముఖాన్న కొడితే, దాని దారిన అది పోతుంది" అన్నాడు.
    ఈ ప్రేమ ప్రకటనకు నాగమాంబ ఏ మాత్రం కరిగిపోలేదు సరికదా, సూటిగా అతని మొహంలోకి చూస్తూ "పదివేలు దాని ముఖాన్న కొట్టాక, ఐదువేలు మీ ముఖాన్న కొట్టాలా? నన్ను ఏలుకోవటానికి?" అంది.
    శాస్త్రిలో సహనం చచ్చిపోయి, కల్లుత్రాగిన కోతిలా గంతులేస్తూ "ఏమిటే, నీకంతా తమాషాగా వుంది. చెబితే అర్ధం చేసుకోవేం? ఆ దొంగముండ నన్ను జైలులోకి తోస్తుంది. అప్పుడు అనుభవిద్దువుగాని" అన్నాడు కసిగా.
    "ఏమిటనుభవిస్తాను? దేముడి దయవల్ల మన సమాజం ఈ నాటికి పతివ్రతలు కూడా  మొగుళ్ళతో జైళ్ళకి వెళ్ళాలని ఆచారం పెట్టలేదు."
    నిర్ఘాంతపోయాడు శాస్త్రి. అతడికిక నోటమాటరాలేదు. తన ఎదురుగా  ఉన్న వ్యక్తి తానెరిగిన తన భార్యకాదు. పిల్లిలాంటిది కూడా తలుపులన్నీ మూసి కొడితే, ఎదురు తిరుగుతుందట! ఈ మరబొమ్మ కూడా మనిషై ఎదురు తిరుగుతోంది.
    ఏం పట్టనట్లు, ఏదీ జరగనట్లు వంట ముగించింది. "భోజనానికి వస్తారా?" అని అడిగింది శాస్త్రిని. అతడు ఎప్పటిలా అలిగి మూతిముడుచుకుని ధాంధూంలాడుతూ "నువ్వేమింగు నేను తినను" అన్నాడు. పొద్దుటినుంచీ ఆకలితో నకనకలాడుతున్నా, నాగమాంబ ఎప్పటిలా  అతణ్ని కన్నీళ్ళతో ప్రాధేయపడలేదు. "చెల్లెలికీ, నాకూ అన్నం తీసుకుని నేను ఆస్పత్రికి వెళ్తున్నాను" అని కేరియర్ సర్దుకుని వెళ్ళిపోయింది. చేసేదిలేక, ఆకలికి తట్టుకోలేక , భార్యను నోటి కొచ్చినట్లు తిట్టుకుంటూ వండిన అన్నంలో మిగిలింది తినేసి పడుకున్నాడు.
    కేరియర్ తీసుకుని, ఆస్పత్రికి వచ్చి తల్లి ఉన్న  యమర్జన్సీ గదిలోకి అడుగు పెట్టబోయిన నాగమాంబ గుమ్మంలోనే ఆగిపోయింది. కుమార్ కుర్చీలో కూచుని ఉన్నాడు. ఝాన్సీ కిందకూచుని తల అతడి వళ్ళో పెట్టుకొని నిద్రపోతోంది.
    తను కదిలితే, ఝాన్సీ ఎక్కడ నిద్రలేస్తుందో నన్నట్లు కదలకుండా, అతి జాగ్రత్తగా పసిపాపను పడుకోబెట్టుకున్నట్లుగా పడుకోబెట్టుకున్నాడు.
    నాగమాంబను చూసి నోటిమాట వేలుంచి "హుష్!" అన్నాడు మాట్లాడవద్దన్నట్లు ఆ దృశ్యం చూసి ముగ్దురాలయిపోయింది నాగమాంబ ఎంత అందమయిన జంట! ఏమి ప్రేమభిమానాలు! ఇదా జీవితమంటే? జీవితంలో ఇలాంటి ఆనందం ఉంటుందని ఏనాడూ తన ఊహకి కూడా అందలేదు. చెల్లెలి జీవితం కూడా తన జీవితంలాగే అయిపోవాలా? ఇంత ఆనందాన్ని, ఇంత మాధుర్యాన్ని ఆచారాల పేరుతో ఎందుకు దూరంచేసుకోవాలి? తన ఆలోచనలకి తనే భయపడింది.
    అచ్చమాంబకు చైతన్యము వచ్చింది. బాధగా మూలిగింది. ఆ శబ్దానికి ఉలికిపడి లేచి, "అమ్మా!" అంది ఝాన్సీ.
    "ఫరవాలేదు, ఫరవాలేదు ప్రమాదం దాటింది. ఆవిడ కోలుకుంటున్నారు" అన్నాడు కుమార్.
    తను అతడి పడుకున్నట్లు అప్పుడు గమనించింది ఝాన్సీ. సిగ్గుపడిపోయి లేస్తూ-
    "ఐయామ్ సారీ!" అంది.
    "ఎందుకూ? నీతప్పేంలేదు. కూచుని కునికిపాట్లు పడుతున్నావు. ఇంత ఆందోళనలో కొంత నిద్ర నీకు కూడా అవసరం, అందుకని నేనే....."
    "ఝాన్సీ!" అంటూ అప్పుడు లోపలికి వచ్చింది నాగమాంబ. ఝాన్సీ మరింత సిగ్గుపడిపోయి సర్దుకుని, "పాపం! ఇంత రాత్రివేళ వంటచేశావా?" అంది.
    "నేను చెయ్యగలిగింది అదొక్కటేకదా?"
    ఆ సమాధానానికి ఆశ్చర్యపోయింది ఝాన్సీ  ఇంతకు ముందు అక్క ఎప్పుడూ అలా మాట్లాడలేదు!
    "కుమార్! ఇంతవరకూ నువ్వూ భోజనం చెయ్యలేదు కదూ?"
    పన్నెండు చూపిస్తూన్న గడియారం వంక చూసుకుంటు అడిగింది.
    "ఏదీ?.....ఇక్కడ...."
    "రా! తిందాం" అక్కా! నువ్వు తిన్నావుకదూ?
    "లేదే! మీ బావ నా మీద అలిగి అన్నం తిననన్నారు. ఒక్కదాన్నీ తినలేక ఇక్కడికే తెచ్చేసాను."

 Previous Page Next Page