Previous Page Next Page 
వెలుగుబాట పేజి 34

 

    "బావ నీ మీద అలిగాడా? ఎందుకూ?"
    "ఎందుకోలే, గోల! ముందు అన్నంతిను."
    "నేనూ, కుమార్ ఇక్కడ తింటాము, నువ్వు అవతల హాల్లో తింటావా?"
    "ఎందుకే, హాల్లో తినటం? నా చెల్లెలితో కలిసి తింటే, నా బతుకు మైలపడుతుందా? ఇంతవరకూ సాధించిన పవిత్రత చాల్లే! ముగ్గురం కలిసే తిందాం"
    ఆ రాత్రివేళ జబ్బుతో పడుకున్న అచ్చమాంబ మంచం ప్రక్కన ఆ ముగ్గురూ కలిసి భోజనం చేశారు. ఆ  తరువాత ఝాన్సీ  ఎంత బలవంతంపెట్టినా  కుమార్ ఇంటికి వెళ్ళికుండా, అక్కడే ఒక వాలుకుర్చీలో పడుకున్నాడు.


    
                                                       *    *    *


    నూకాలమ్మ కూతురి పేరు రాధ. ఝాన్సీ కుమార్ లు ఆ అమ్మాయిని తమ ఆస్పత్రికి పిలిపించారు వివరంగా మాట్లాడి సమస్య పరిష్కరించటానికి రాధతో నూకాలమ్మ కూడా వచ్చింది కుమార్ సౌమ్యంగా "నూకాలమ్మ కూడా వచ్చింది. కుమార్ సౌమ్యంగా "నూకాలమ్మా! నువు కొంచెం సేపు బయటవుండు అసలు రాధ మాన్సులో ఏముందో తెలుసుకోనీ!" అన్నాడు. మరొకరెవరైనా ఆ మాట అని ఉంటే, నూకాలమ్మ  వెంటనే విరుచుకుపడేదే! కాని, కుమార్ మంచితనం ఈ ఒక్కరోజులోనే తెలుసుకుంది. ముఖ్యంగా  శ్రామికవర్గమంతా. ఒక వ్యక్తి మంచివాడని మెచ్చుకుంటే, అతడు తప్పకుండా మంచివాడని అనుభవం మీద తెలుసుకుంది. అందుకే వంగి నమస్కారం చేసి "మీ దయబాబూ! దాని బతుకు బుగ్గయిపోకుండా ఒడ్డున పడేయండి" అని కన్నీళ్ళతో బయటకు వెళ్ళిపోయింది. అక్కడున్న కుర్చీలో కూచోమన్నాడు రాధని కుమార్. సంకోచంగా చూసింది. చీర కట్టిందన్నమాటే, ముఖం పసి తనపు లేదనంతో పాలుగారుతోంది. చీటికీమాటికీ ముఖం ఎర్రగా అయిపోతోంది. చూపులు క్రిందకు నేలమీద  వాలిపోతున్నాయి. వంచిన తల ఎత్తలేకుండా ఉంది.
    "కూచో అమ్మా!" అన్నాడు దయగా. ఆ స్వరాన్ని తలెత్తిచూసింది. అధికారంలో ఉన్న డాక్టర్ అన్నట్లుగా లేదు. ఒక అన్నో, తమ్ముడో అభిమానమంతా రంగరించి అన్నట్లుగా ఉంది. ముడుచుకుపోతూ కూచుంది. ఆ తరువాత మాట్లాడవలసిన భారం నీదేనన్నట్లు ఝాన్సీవైపు చూశాడు కుమార్ ఆమె మనసు ఆ పసిపిల్లని చూస్తే జాలితో ద్రవించి పోతుంది. తన అక్క కాపురం నాశనం చేసిన కులత అనే భావం కలగటంలేదు.
    "అమ్మా! రాధా!"
    రాధ బెదురుగా చూసింది.
    "నా దగ్గర భయపడకు. నీ మనసులో మాట చెప్పు. ఆ సుబ్రహ్మణ్యాన్ని ప్రేమించావా?"
    "ప్రేమా!"
    "నాకు ప్రేమంటే ఏం తెలుసు?" అన్నట్లుగా ఉన్నాయి, ఆ పిల్ల చూపులు.
    "మరి....మరి...."
    ఆ పిల్ల ముఖం సిగ్గుతో కందిపోయింది.
    "నా కిష్టంలేదు. నా కేమాత్రం ఇష్టంలేకుండానే అలా చేశాడు. పెనుగులాడే శక్తికూడా లేకపోయింది. తీరా అంతా  అయిపోయాక ఏడుపోచ్చింది. అమ్మకు చెప్పేశాను. మరెవరికి చెప్పుకోను? చెప్పకపోయినా బాగుండేదనిపిస్తోంది. అమ్మకీ, మరెవరికీ చెప్పకుండా , మళ్ళీ అతని ఇంటికి వెళ్ళకుండా  ఉంటే బాగుండేది. అమ్మ నానా గొడవ చేసింది. అతనితో పెళ్ళి జరిపించింది. నా పెళ్ళి.....అది.....ఇలా కావాలని నేనెప్పుడూ కోరుకోలేదు. పుస్తకాల్లో చదివి, పెళ్ళంటే, ఎంతో అందమైన కలలు కన్నాను. కానీ, అమ్మ పెళ్ళి చేసేసింది. నేను చేసుకోనని ఏడ్చినా కొట్టి చేసింది. ఇక అప్పటినుంచి, ఆ జీవితం అబ్బా-ఛీ! ఎంత రోత! మనుష్యులింత ఛండాలంగా ఎలా బ్రతుకుతారో అనిపించేది. రాత్రి అవుతుందంటే భయం వేసేది. ఎక్కడికైనా పారిపోవాలనిపించేది. ఎక్కడికి పారిపోను? నా క్కున్నది అమ్మ  ఒక్కర్తే. అమ్మదగ్గరికిపోతే, నన్ను చావాదన్ని ఈ యమదూత దగ్గరికే పంపుతుంది ఇంతలో.....ఇంతలో నేను దూత కాబోతున్నానని తెలిసింది.... డాక్టర్! తల్లి కావటం  ఇంత అసహ్యంగా జరుగుతుందా? స్త్రీకి మాతృత్వం వరమంటారు. మాతృ దేవత అంటారు. ఇదా మాతృత్వమంటే.....అప్పుడే  ఇతడు పారిపోయాడు. నేను నిజం చెబుతున్నాను. అప్పుడు నేను "హమ్మయ్య" అనుకున్నాను. అయిదారు నెలల నరకం తరువాత హాయిగా నిద్రపోయాను.కానీ, అమ్మఊరుకుంటుందా? అతడి అడ్రసు కనుక్కుని ఇక్కడికి లాక్కొచ్చింది. ఇలా నలుగురిలో ఈ గొడవ నా కెంత ప్రాణసంకటంగా వుందో తెలుసునా? చెబితే, అమ్మ అర్ధం చేసుకోదు. ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపిస్తుంది. కాని, అదేం విచిత్రమో, ఇప్పటికీ నా కలలు నన్ను వదలలేదు, బ్రతుకుమీద ఆశ చావలేదు."
    ఝాన్సీ ముఖంలోకి చూస్తూ అమాయకంగా  తన మనసులో వున్నదంతా చెప్పేసింది. ఝాన్సీ కుమార్ లు ఒకరి ముఖం ఒకరు చూసుకున్నారు. "ఇదేనా  మాతృత్వం అంటే?" అన్న రాధ అమాయకమైన ప్రశ్నే ఇద్దరి మనసులలోను మెదులుతోంది. సమాజం స్త్రీ పురుషు లిద్దరికీ సమానమైన నీతి నియమాలు విధించినప్పటికి పురుషుడు స్త్రీ మీద అతి తేలిగ్గా అధివత్యం సంపాదించడానికి కీలకమిదే."
    నువ్వు తల్లివి కాబోతున్నావన్న విషయానికి అంత ప్రాధాన్యం ఇయ్యలేదు. అది కేవలం సృష్టిక్రమం. పూర్తిగా యాంత్రికం- నీ మనసు ఏది కోరుతోందో, అది చెప్పు" అతి మామూలుగా అన్నాడు కుమార్.
    ఝాన్సీ విస్తుపోయి చూసింది. అతని మాటల ధోరణి ఎంతగా అలవాతయినా, సమాజమంతా దేనిని అతి క్లిష్టసమస్యగా భావిస్తుందో, దానిని అతి తేలిగ్గా మాట్లాడటం ఎప్పటికప్పుడే వింత ఆమెకి.
    "కుమార్, మరి శిశువు....."
    'రాధకి కావాలంటే, పెంచుకొంటుంది. లేకపోతే, ఎవరికి పెంపకం కావాలంటే వాళ్ళకియ్యచ్చు. లేకపోతే నేనే పెంచుతాను."
    "కానీ  మరి పెళ్ళి?"

 Previous Page Next Page