Previous Page Next Page 
వసుంధర కధలు-8 పేజి 33

 

    రామారావు నోట మాట రాలేదు.
    "నువ్వు బ్రతకాలి బావా, నాకోసం బ్రతకాలి. ఆదర్శ దంపతులుగా మనం జీవితం గడపాలి. బ్రతకడానికి ఉద్యోగమొక్కటే మార్గమా, ఇన్నేళ్ళ నీ చదువు మరే బ్రతుకు తెరువూ చూపించలేదా? బాగా ఆలోచించు బావా...."
    రామారావుకు మొదట ఆశ్చర్యం కలిగింది. సుందరి తన్ను ప్రేమిస్తోందనీ, అందులోనూ మరీ ఇంతగా అభిమానిస్తోందనీ ఇంతవరకూ అతనికి తెలియదు. సుందరి మాటలు అతనికి వెయ్యి ఏనుగుల బలాన్నిచ్చాయి. అతను చటుక్కున సుందరి చేయి పట్టుకుని, "నేను చావను సుందరీ! నీ మాటలు నాకు జ్ఞానోదయం కలిగించాయి. రేపట్నించీ నేను కొత్త రకం జీవితం ప్రారంభిస్తాను " అన్నాడు.

                                    10
    "సుగుణా!"
    "ఆ!"
    "రంగమ్మ ఏమంటోంది?"
    "సారీ డాక్టర్! ఆమె చాలా అమాయకురాలు. ఆమెకు ప్రేమ గురించి అర్ధమయ్యేలా చెప్పడం నావల్ల కావడం లేదు. పెళ్ళి ప్రసక్తి తెలిస్తేనే సిగ్గు పడుతుంది. ప్రేమ ప్రసక్తి తెస్తే విసుక్కుంటుంది. మీ ప్రసక్తి ఎప్పుడూ తెచ్చినా ఆమెకు మందులూ, ఇంజక్షన్లూ తప్ప గుర్తు రావు. మిమ్మల్నామే ఒక పురుషుడిగా గుర్తించలేదు. కేవలం ఒక డాక్టరుగా మాత్రమే మీరామె దృష్టిలో ఉన్నారు."
    "ఆ అసంగతి నాకూ తెలుసు. అందుకే కదా నిన్నా ఇంట్లో ప్రవేశ పెట్టింది! ఎలాగైనా నువ్వు రంగమ్మని నా పట్ల ఆకర్షితురాల్ని చేయాలి!"
    "ప్రయత్నిస్తున్నాను డాక్టర్! కానీ విజయం సాధించగలననుకుందుకుధైర్యం చాలడం లేదు."
    "తలచుకుంటే నువ్వు తప్పక విజయం సాధించ గలవు సుగుణా! నువ్వక్కడ పాదం పెట్టెక గంగరాజు గారికి నా మీద నమ్మకం రెట్టింపయింది. అయన నీ పట్ల ఆకర్షితుడైనట్లు కూడా కనబడుతున్నాడు. నిన్న పెళ్ళి ప్రసక్తి తీసుకొచ్చాడు. సుగుణా, తొందరపడి ఆయనే నేమైనా అడిగినా నువ్వంగీకరించకు. రంగమ్మతో నా పెళ్ళయితే నీకు నేనే స్వయంగా మంచి సంబంధం చూసి పెళ్ళి చేస్తాను. గంగారాజు ఆరోగ్యం మంచిది కాదు. ఆయనెంత కాలం బ్రతుకుతాడో డాక్టర్ని నాకే తెలియదు."
    
                           *    *    *    *

    'సుగుణా ఒక్కసారిలా దగ్గరకు రా" గంగరాజు పిలిచాడు.
    సుగుణ వెళ్ళింది.
    "నేను ఆగలేను సుగుణా. ఒక్కసారి నువ్వు నన్ను కనికరించాలి!"
    సుగుణ ఉలిక్కిపడింది. "పెళ్ళి కావలసిన కూతురుంది మీకు. ఆమె పెళ్ళి విషయంలో మీరేవిధంగా అనుకుంటున్నారో నా విషయంలోనూ అంతే " అంది. గంగారాజు మాట్లాడలేదు. "మీకు డబ్బుంది. నాకు లేదు. అంత మాత్రాన నన్నింతలా తక్కువ అంచనా వేస్తారనుకోలేదు" ఈసారి ఆమె కంఠంలో తడి ఉంది.
    గంగరాజు గంబీరంగా అయిపోయాడు. "నాది పొరపాటే. ముందు కూతురి పెళ్ళి చేసేకనే మన పెళ్ళి. రంగమ్మ భద్రం ల పెళ్ళయ్యే వరకూ నిన్ను తాకనైనా తాకను."
    "భద్రమా.....రంగమ్మ లాంటి అందమైన అమ్మాయికి ఇంకా మంచి సంబంధం చూడవచ్చు గదా."
    "నిజమే కానీ, వాళ్ళిద్దరూ ఒకే రకం మనుషులు."
    "మీరేమీ అనుకోనంటే ఒకమాట. మీకు వైద్యం చేసే డాక్టరు గారిని గురించి మీరెప్పుడైనా అలోచించేరా?"
    'ఆలోచించకేం, చాలాసార్లు ఆలోచించాను. ఆయన నా పాలిటి భగవంతుడు ."
    'ఆయన్ని మీ అమ్మాయి పాలిటి భగవంతుణ్ణి చేస్తే."
    'అంటే...." అని ఆగిపోయాడు గంగరాజు. సుగుణ ఉద్దేశ్యమాయన కర్ధమైంది. 'డాక్టర్ మా రంగమ్మను పెళ్ళి చేసుకుంటాడా?" అన్నాడు.
    "ఏమో ఎవరికి తెలుసు? మీరెప్పుడైనా అడిగి చూశారా?"
    'చూడు సుగుణా! మా రంగిని డాక్టరు నిజంగా పెళ్ళి చేసుకుంటానంటే అది డబ్బు కోసమే ననుకోవాలి. ధన బంధం కన్న మమతల బంధం శాశ్వతమైనది. ఈరోజున నువ్వీ మాట అన్నావు గనుక ఆలోచిస్తాను. రంగమ్మను పెళ్ళి చేసుకోవడం కోసం నా సలహా మీద భద్రం వ్యాపారం మొదలెట్టబోతున్నాడు. బహుశా నాలుగైదు రోజుల్లో ఒక సైకిలు షాపు తెరుస్తాడు. పెట్టుబడి నేనే ననుకో."
    సుగుణ ఏమీ మాట్ల్దాలేదు.

                                  11
    ఒక వారం రోజుల పాటు రామారావు చాలా బిజీగా ఉన్నాడు. అతను కొంతమంది స్నేహితులతో కలిసి చిన్న ఎత్తున ట్యుటోరియల్ కాలేజీ స్థాపించదల్చాడు. ఆ ఆలోచన ఒక రూపాంకి రావడానికీ వారం రోజులూ శ్రమ పడవలసి వచ్చింది. స్నేహితులు ఉత్సాహమూ చూపించారు. చదువు కునే విద్యార్ధులు దొరికారు వాళ్ళకి.    
    వారం రోజుల శ్రమ అనంతరం రామారావు కొంచెం రిలాక్సయ్యాడు. ఎవరి మీదా ఉద్యోగం కోసం ఆధారపడనవసరం లేకుండా తనిప్పుడు సంపాదనపరుడు కాబోతున్నాడు.
    రామారావులో ఆత్మవిశ్వాసం కనబడుతోంది. "ఎలాగో అలా స్వతంత్ర్యంగా డబ్బు సంపాదించుకుంటాను కానీ ఎవరి కిందా ఉద్యోగం చేయను" అనుకున్నాడతను. అప్పుడే అతనికి హటాత్తుగా గుర్తుకొచ్చింది. ఉద్యోగం దొరక్క నిరాశపడి ఆత్మహత్య చేసుకోవాలని తననుకున్న సంగతి.
    ఉలిక్కిపడి లేచాడు రామారావు. తన పాంటు జేబులో 'మృత్యుదేవత' వుండాలి. ఆత్మహత్యా ప్రయత్నం విరమించిన తర్వాత అతన్నోకరకమైన ఆవేశం ఆవహించింది. ఆ ఆవేశంలో అతను సయనైడ్ విషయం మరిచిపోయాడు. మర్నాడు బట్టలు మార్చేశాడు. ఇప్పుడా పాంటు బహుశా మాసిన బట్టలు వేసే పెట్టెలో ఉండి వుంటుంది. రామారావు ఇంచుమించు పరుగెత్తాడు. మాసినబట్టల పెట్టె తలుపు తెరిచాడు. ఖాళీ పెట్టె అతన్ని వెక్కిరించింది.
    'అమ్మా! ' అతడు కంగారుగా అరిచాడు. ఆవిడ పలికే లోగానే తనే తల్లి దగ్గరకు వెళ్ళాడు. బట్టలన్నీ అంతకు ముందురోజే చాకలికి వేసినట్లు తల్లి చెప్పింది.
    రామారావు వీధిలోకి పరుగెత్తాడు. అతను సైకిల్ మీద చాకలి ఇల్లు చేరేసరికి అక్కడ పెద్ద గొడవగా ఉంది. చాకలి భార్య పెద్దపెట్టున శోకాలు పెడుతోంది. చాకలి కూడా ఇంచుమించు ఏడుపు కంఠంతో ఏదో మాట్లాడుతున్నాడు.
    రామారావుకు భయమేసింది. సయనైడ్ ట్యూబ్ మీద షుగర్ అని వ్రాసి ఉంది. పంచదార అనుకుని ఎవరైనా తిన్నారేమో! నిజంగా ఎవరైనా చనిపోయివుంటే ఆ హత్యకు తనే బాధ్యుడవుతాడు. అతని భయాన్ని రెట్టింపు చేస్తూ "మాయదారి మందు. ఎంతపని చేసిందిరో దేవుడా" అని చాకలి భార్య మళ్ళీ ఏడ్వసాగింది.
    రామారావు ఆపాదమస్తకం వణికిపోయాడు. అతనికి కాళ్ళూ చేతులూ ఆడడం లేదు. తమాయించుకుంటూ చాకలిని సమీపించి, "ఏం జరిగింది?" అనడిగేడు.
    రామారావును చూడగానే చాకలి "బాబూ మీరేవచ్చారా?" మీ బట్టల మూట ....' అని ఆగాడు. తన బట్టల మూట ప్రసక్తి రాగానే రామారావు భయం రెట్టింపయింది. "చెప్పు త్వరగా ఏం జరిగిందో?" అన్నాడతను కంగారుగా.
    "ఎలా చెప్పేది బాబూ , ఎన్నడూ జరగని ఘోరం జరిగిపోయింది. ఎప్పుడూ జాగ్రత్తగా ఉండేవాణ్ణి. రాత్రి నేను ఒంట్లో కుదురుగా లేక కాస్త నల్లమందు వేసుకున్నాను. ఒళ్లు తెలీలేదు. తెల్లరి లేచేసరికి."
    "ఊ లేచేసరికి...?"
    "నాలుగు బట్టల మూటలు పోయాయి బాబూ, వాటిల్లో మీది కూడా వుంది."
    తాత్కాలికంగా రామారావు కుపశాంతి కలిగింది. ఆ క్షణంలో బట్టలు పోయాయాన్న బాధ ఇనుమంతైనా అతనికి కలగలేదు. సరే అని అక్కణ్ణించి బయల్దేరాడు రామారావు . అతనికి మానసింకా స్తిమితపడలేదు. ఎవడో దొంగ బట్టలు కొట్టేశాడు. ఆ కొట్టేసిన బట్టల్లో దాగుని వున్న మృత్యుదేవత ఏ క్షణాన ఎవరిని కౌగలించుకుంటుందో , ఎవరికి కెరుక!

                          *    *    *    *

    ఆరోజు రాత్రి ఏడు గంటలకు చాకలి ఒక మూటను మోసుకుని రామారావు ఇంటికి వచ్చాడు.
    చాకలికి బట్టలన్నీ దొరికాయి. ఊరి చివర వంతెన క్రింద అన్నీ చెల్లాచెదురుగా పడి వున్నాయట అవి. సమాచారం అందిన తక్షణం చాకలి పరిగెత్తుకు వెళ్ళాడు. నాలుగు మూటల బట్టలూ శుభ్రంగా కలిసిపోయాయి. జేబులున్న ప్రతి బట్టను ఎవరో గాలించిన సూచనలున్నాయట. యేవో కాగితాల కోసం ఎవరో అలా గాలించి ఉండాలని పోలీసులు అభిప్రాయపడుతున్నారుట. ఏది ఏమైనా చాకలికి బట్టలు దొరికాయి. తనకు గుర్తున్నంతవరకూ ఆ బట్టలను విడదీసి నాలుగు మూటలుగా కట్టి తలోకర్నీ తలో ఇంటికి పంపించి తను రామారావింటికి వచ్చాడు. పద్దు చూసి బట్టలన్నీ సరిగ్గా ఉన్నదీ లేనిదీ చెప్పాలి.
    చాకలి వచ్చేటప్పటికి రామారావు ఇంట్లోనే ఉన్నాడు. అతను తక్షణం మూట విప్పించి మృత్యుదేవత ఉన్న పాంటు కోసం వెతికాడు. ఆ పాంటు కనబడలేదు. "లేత నీలం రంగు కాటన్ పాంటు కనబడదెం?" అన్నాడతను ఆత్రుతగా.
    చాకలి అలోచించి , "అరె, అది మీదా, సుబ్రహ్మణ్యం గారింటికి పంపించాను" అన్నాడు . రామారావు సుబ్రహ్మణ్యం గారి చిరునామా అడిగి తెలుసుకుని సైకిల్ మీద వెళ్ళాడు. అతనక్కడికి చేరుకోనేసరికి చాకలి తాలూకు మనిషి పద్దు చూపించేసుకుని బట్టలు తీసుకుని వెళ్ళిపోయాడని తెలిసింది. లేత నీలం రంగు పాంటు మాది కాదని అయన త్రిప్పి కొట్టాడట.
    రామారావు శరవేగంతో తన సైకిలు చాకలి ఇంటికి పోనిచ్చాడు. అక్కడ మూట విప్పించి చూశాడు. అతనికి తను ఎదురు చూస్తున్న పాంటు కనిపించింది. ఎంతో ఆత్రుతగా అతను జేబులు తడిమాడు. కానీ అవీ ఖాళీగా వున్నాయి ! రామారావు ఉస్సురని నిట్టూర్చి "ఈ పాంటు నాది, మా మూటలోకి మార్చు ." అని చెప్పి నిరుత్సాహంగా అక్కణ్ణించి కదిలాడు. అంతులేని అసంతృప్తి అతన్ని ఆవహించింది. ఇంతకీ ఏమయిందా సయనైడ్ ట్యూబ్ / ఎక్కడుందా మృత్యుదేవత!

 Previous Page Next Page