"నీవు నాకిచ్చిందే నేనూ నీకు ఇవ్వగలను..."
"అంటే-?"
"అయాంసారీ-నాయుడూ-" అన్నాడు చౌదరి.
"పోయిన ప్రాణాలు నేను తేలేనుకదా-మరింకేమైనా అడుగు...." అన్నాడు నాయుడు.
"పోనీ-ఒకపని చేయగలవా? నేను-నా అంజ్చారులు అందరూ ఉండగా-నువ్వు నా దగ్గరకువచ్చి గతంలో నువ్వు చేసిన ద్రోహానికి నా కాళ్ళు పట్టుకుని క్షమార్పణ వేడుకోవాలి. అంగీకారమేనా?"
నాయుడి చేతులు ఆవేశంతో ఫోన్ ను గట్టిగా పట్టుకున్నాయి. "యూ....చౌధరీ..." అనుకున్నాడతడు.
"అంగీకారమేనా?" చౌదరి రెట్టించాడు.
నాయుడు మాట్లాడలేదు.
"చూడు-మూడంకెలు లెక్కపెడతాను.....ఒకటి.....రెండు...."
నాయుడు చటుక్కున -"నేను నీ దగ్గరకు వస్తాను-" అన్నాడు.
"చెప్పినట్లు చేస్తావా?" అన్నాడు చౌదరి.
"చేస్తాను...."
"సరే-అయితే ఫోన్ పెట్టేసి నీకోసం ఎదురు చూస్తూంటాను..."
అవతల క్లిక్ మనగానే నాయుడు కూడా ఫోన్ పెట్టేశాడు.
"చౌదరి ఏమంటున్నాడు బాస్!" అన్నాడు సోము.
"నన్ను రమ్మంటున్నాడు. నేను వెడుతున్నాను...." అన్నాడు నాయుడు.
సోము ఆశ్చర్యంగా నాయుడివంక చూశాడు. నాయుడి కళ్ళలో కొత్తరకం క్రూరత్వం అతడికి కనిపించింది.
"బాస్-ప్రమాదం...." అని అతడేదో అనబోతూండగా నాయుడు ఆపి-"నా కారు నువ్వే డ్రైవ్ చేయాలి-" అన్నాడు.
తరువాత నాయుడు లోపలకు వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చాడు. సోము, అతడు కలసి చౌదరి ఇంటికి వెళ్ళారు. ఇంటిముందు ఒక మనిషి సగౌరవంగా నాయుడిని లోపలకు తీసుకుని వెళ్ళాడు.
ఒక పెద్దహాల్లో చౌదరి సపరివారంగా కొలువుతీరి ఉన్నాడు. నాయుడిని చూస్తూనే- "వెల్ కం నాయుడూ-కమాన్?" అన్నాడు. నాయుడు ముందడుగు వేసేలోగా ఒక వ్యక్తి అతడిని పరీక్షించాడు. నాయుడివద్ద ఆయుధాలేమిలేవు. పరీక్ష అయినాక నాయుడు చౌదరిని సమీపించాడు. చౌదరి అతడికి ఓ కుర్చీ చూపించి- "నీ కర స్పర్శకోసం నా పాదాలు తపిస్తున్నాయి. ఫోటోగ్రాఫర్ ఎదురు చూస్తున్నాడు. నేను కాళ్ళకు జోళ్ళుకూడా వేసుకోలేదు-" అన్నాడు.
"నువ్వు పెద్ధవాడివి. పెద్దవాళ్ళ పాదాలు పట్టుకొనడం మన సంప్రదాయం-" అన్నాడు నాయుడు పొంగివస్తున్న కోపాన్ని అణచుకుంటూ.
"అది నిజమే-కానీ నా కంటే నువ్వు ఎప్పటికీ చిన్నవాడివేనన్న విషయం ఎల్లవేళలా నీకు గుర్తుండకపోవచ్చును. అందుకని ఈ సన్నివేశాన్ని ఓ నెగెటివ్ లో భద్రపరిచే ఏర్పాటుకూడా చేశాను-" అన్నాడా చౌదరి.
"నీ పార్ట్నర్ గోపీ ఏడీ?" అన్నాడు నాయుడు.
"బిజీగా ఉన్నాడు-" అన్నాడు చౌదరి.
"చౌదరీ-నీపాదాలు పట్టుకోడానికి ఎప్పుడైనా సిద్దమే నేను. కానీ ఇందరిముందూకాదు. ఫోటోగ్రాఫర్ నికూడా నేను అనుమతించను-" అన్నాడు నాయుడు.
"ఇక్కడ షరతులు నీవికాదు-నావి. నిన్ను పాదా క్రాంతున్ని చేసుకొనడం నా జీవితాశయం. అది నెరవేరడం అందరూ చూడాలి. వార్తగా రావాలి....."
చౌదరి ఇంకా ఏదో అనబోతూండగా నాయుడు చటుక్కున-"చౌదరీ-కాస్త ఆపు-నీ ప్రాణాలిప్పుడు నా గుప్పిట్లో ఉన్నాయి-" అన్నాడు.
చౌదరి చిరాగ్గా-"ఏమిటి నీ ధైర్యం?" అన్నాడు.
"నా చేతికి ఉన్న ఉంగరంచూడు. దీనికి ఒక చిన్న మీట ఉన్నది. అది నొక్కగానే చిన్న ముల్లొకటి నీ శరీరాన్ని తాకగలదు. అది సయనైడ్ ముల్లు...." అన్నాడు.
"మొత్తంమీద రహస్యంగా ఆయుధం తెచ్చుకొచ్చావన్న మాట-" అన్నాడు చౌదరి తెల్లబోతూ.
"ఈ నాయుడిని తక్కువ అంచనావేస్తే అది నీ తెలివితక్కువ తనం. ఇప్పుడు నువ్వు నాతో బయల్దేరిరావలసి ఉంటుంది. నా సరుకు నాకు అప్పచెప్పబడితే నిన్ను నేను నీ మనుషులకు తిరిగి అప్పగించగలను. లేదా వెంటనే చస్తావు-" అన్నాడు నాయుడు.
'అడవిలో అడుగుపెట్టి మృగరాజును శాసిస్తున్నావు-" అని నవ్వాడు చౌదరి.
"మృగరాజు బోనులో చిక్కాడు. ఇంక సర్కస్ ఆడించాలి-" అన్నాడు నాయుడు వెటకారంగా.
"ఒరేయ్ నాయుడూ!" అన్నాడు చౌదరి నెమ్మదిగా- "నన్ను చంపినవాడి గతేమిటో తెలుసా? వాడికి కళ్ళుపొడిచి, కాళ్ళువిరిచి రోడ్డు మీద వదిలేయమని హుకుం ఉన్నది. చేతులు బాగానే ఉంటాయి. ఎందుకో తెలుసా? నా మనుషులు వాడి చేతులకు ఒకే ఒక గుండున్న పిస్టల్ ఇస్తారు. అప్పుడు వాడు ఆ పిస్టల్ తో తన్నుతానే పేల్చుకుని చచ్చిపోతాడు-"
"నా సంగతి తర్వాత! ముందు నీ సంగతి ఆలోచించు"-అన్నాడు నాయుడు.
"నేను ఎవరికోసం బ్రతకాలిరా-నువ్వు నావాళ్ళనందర్నీ పొట్టన పెట్టుకున్నావు. నాకింకా బ్రతకాలనిలేదు. నేనుపోయినా సమర్ధుడైన నాయకుడు నావాళ్ళకున్నాడు. ఇప్పుడు నువ్వు నన్ను చంపావంటే ఇక్కన్నించి ప్రాణాలతో బయటపడలేవు. నాయకుడి నొక్కడిని బెదిరించి నా అనుచరుల మధ్యనుంచి బయటపడగలననుకుంటే అది చాలా చాలా పాత ట్రిక్కు- ..... నేను నాప్రాణాలను లక్ష్యపెట్టను-"
నాయుడికి చౌదరి మొండితనం అర్ధమైపోయింది. తనిప్పుడు చౌదరిని చంపి ప్రయోజనమేముంది? ఏం సాధిస్తాడు? హాల్లో ఆయుధధారులైన వారు చాలామంది ఉన్నారు. వారి బారినుండి తను తప్పించుకోలేడు. కథ తాననుకున్నట్లు నడవలేదు.
"మిస్టర్ చౌధరీ! నీ ధైర్యానికి నిన్నభినందిస్తున్నాను. రెండుకోట్లు పోయినా బాధపడను కానీ రెండు కాళ్ళు పట్టుకోవడం నేను భరించలేను. నిన్ను తప్పక తీసుకుని పోగలననుకుని వచ్చాను. నా అంచనా తప్పయింది. ఇప్పుడిక్కడినుంచి నేనెలాగూ తప్పించుకోలేను. అందుకే నిన్ను చంపి నేనూ చస్తాను-" అన్నాడు నాయుడు.