Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 32

   

     "మధ్యలో వచ్చింది మధ్యలో పోవటం సులభమేనే ఒక ఇంగ్లీషు కథ వుంది తెలీదూ" అంటూ పేరు చెప్పింది.
   
    "మాకేం తెలుసమ్మా! మేము నీలాగా చదువుకున్నామా పాడా" అంది చిన్నక్క.
   
    తన ఓటమిని కూడా ఎదుటివ్యక్తి తప్పుగా మార్చగలిగే నేర్పుని భగవంతుడు ఆమెకి పుట్టుకతోనే యిచ్చినట్టున్నాడు.
   
    మందాకిని నవ్వుతూనే "వాక్కువెండి అయితే, మౌనం బంగారం" అన్న కథ అది. ఇద్దరు స్నేహితులుంటారు. ఒకరు గొప్ప వక్త. మరొకరికి నత్తి. ఆ నత్తివాడు ఎలాగయినా మాట్లాడాలనుకుంటాడు. చివరికి ఒక సముద్రం ముందు నిలబడి, నోట్లో గులకరాళ్ళని పెట్టుకుని ప్రయత్నం చేస్తాడు. ఎన్నో రోజుల కఠోరదీక్షతో అతడికి నత్తిపోతుంది. కానీ దానితోపాటే ఒక సత్యం కూడా అర్ధమవుతుంది. 'మాట'కి విలువన్నది లేదని....నత్తిపోయాక కూడా నోట్లోంచి రాళ్ళని తీయడు. నిండు గోదావరిలా గంభీరతని సంతరించుకుంటాడు" అంది.
   
    సోమయాజిలో ఏదో ఫెడేలున కదిలింది. ఆమె గోదావరిని ఉపమనంగా వాడటం అపురూపం అనిపించింది. అదే క్షణాన అతడికో దృశ్యం కనబడింది. ఏడు గుర్రాలు పూన్చిన రథాన్నెక్కి తాతయ్య మేఘాల మధ్య చెర్నకోలా చెళ్ళుమనిపిస్తూ వేగంగా ఇటే సాగివస్తున్నాడు. మేఘాలు చెల్లా చెదురవుతున్నాయి. ఏ వాయువులైతే పర్వతాల్నీ మేఘాల్నీ కదిలిస్తాయో, ఏ వాయువులైతే ఝంఝా మారుతాలై సముద్రాన్ని అల్లకల్లోలం చేస్తాయో అట్టి గాలులు కూడా ఆగి, తమకంటే వేగంగా ముందు కదుల్తూన్న తాతయ్యని చూస్తున్నాయి. "ప్రయత్నించరా నత్తిపోతుంది" అని తాతయ్య అంటున్నాడు. ఆకారం ఆయనది స్వరం ఆమెది.
   
    ఆ రాత్రి అతడికి నిద్రపట్టలేదు.
   
    ఆ రాత్రి ఆమె కూడా నిద్రపోలేదు. అయితే ఆమె వ్యధలు వేరు. అరగంట క్రితమే ఆమె భర్త వచ్చాడు. మౌనంగా లేచి తలుపు తీసింది. అతడు ఆప్యాయంగా "ఇంకా నిద్రపోలేదా?" అని అడిగాడు. ఆలాస్యంగా వచ్చిన ప్రతి రాత్రీ తలుపు తీయగానే నవ్వుతో అడిగే మొదటి ప్రశ్నే అది. ఆమె డానికి జవాబు చెప్పదు. ప్రక్కకి తొలగి, అతడు చొక్కా విప్పుతూంటే "భోజనం చేస్తారా" అని అడుగుతుంది. "అరె బయటే చేసి వచ్చానే. అయినా నీకెన్నిసార్లు చెప్పాను మందాకినీ, నాకోసం ఎదురు చూడవద్దని" అని మందలించి పెరట్లోకి వెళ్తాడు. ఆమె నిర్లిప్తంగా వంటింట్లోకి వెళ్ళి కంచాలు తీసేసి వస్తుంది. ఆపాటికే అతడు మొహం కడుక్కుని వచ్చి పడుకుని వుంటాడు. ఆమె కూడా మెనూ వాలుస్తుంది. మొహానైతే నీళ్ళతో కడగగలిగాడు గానీ, అతడితోపాటే వచ్చి గదిలో వ్యాపించిన స్తబ్దతని ఎలా పారద్రోలగలడు?
   
    అతడు చాలా మంచివాడు. తనని పల్లెత్తు మాట అనడు. నొప్పించడు. కానీ అతడి లోకం అతడిది. అవతలివారూ ఒక మనిషేననీ, వారికీ కొన్ని కోర్కెలుంటాయనీ గుర్తించడు. ఆదివారం వస్తే చాలా ప్రొద్దున్నే వెళ్ళిపోతాడు. డబ్బు వచ్చిన రోజు రారాజే! నవ్వుతూ వస్తాడు. భార్య కోసం పళ్ళు తెస్తాడు. పోయినరోజు చికాకు తెచ్చుకోడు. కోపం ప్రదర్శించడు. దిగులుగా వుంటాడు. సానుభూతితో గమనించటం తప్ప ఆమె ఏమీ చెయ్యదు - చెయ్యలేదు.
   
    ఆమెకి సంబంధించినంతవరకూ అతడి చిరునవ్వుకీ, ఆ దిగులుకీ మధ్య తేడా లేదు.
   
    వేల వేల సైనికులు ఏళ్ల తరబడి కట్టిన కోటనైనా బ్రద్దలుకొట్టటానికి మర ఫిరంగులున్నాయి కానీ, భార్యాభర్తల మనసుల మధ్య సన్నటి పొరలు ఒకసారి ఏర్పడితే వాటిని చీల్చటానికి ఏ శక్తి వుంది. ఆ శూన్యతనీ ఏ సున్నమూ ఇసుకా పూడ్చగలదు?
   
    వాళ్ళు పైకి మామూలుగానే వుంటారు. మిగతా అందరికంటే కాస్తోకూస్తో అన్యోన్యంగా వుంటారు కూడా. కానీ ఈ మనసుల మధ్య దూరమే రోజు రోజుకీ ఎక్కువవుతూంది. నువ్వు నన్ను అర్ధం చేసుకోలేదనేది ఆమె ఇదంతా మొదట్లో ఎవర్ని ఎవరు అర్ధం చేసుకోవాలా అన్న సందిగ్ధంలో చాల ఏళ్ళు గడిచి పోయినయ్. అదృష్టవశాత్తూ పిల్లా పాపా లేరు. ఇప్పుడీక ఆ ఘర్షణ లేదు. అంతా నిర్లిప్తంగా జరిగిపోతూ వుంటుంది. తినటం, పడుకోవటం, లేవటం, శారీరక వాంఛలు తీర్చుకోవటం.....
   
    .... అతడికి పరాయి స్త్రీ వాంఛ లేదు. బజారు స్త్రీల జోలికి అసలు పోడు. పెళ్ళయిన చాలాకాలం వరకూ మాత్రం 'నువ్వింకా చాలా నేర్చుకోవాలి మందాకినీ' అనేవాడు. పెళ్ళయిన కొత్తలో ఆమె నిజంగానే భయపడేది. నెల రోజుల వరకు అయితే అసలు తను పరిపూర్ణమైన స్త్రీనేనా? లేక ఏదయినా లోపం వుందా అన్న అనుమానం కలుగుతూ వుండేది. కొంతకాలానికి అది సర్దుకుంది (ఇప్పుడది తల్చుకుంటేనే నవ్వొస్తుంది) మొగవాడికి మరింకా ఏం కావాలో ఆమెకి తెలియలేదు. తరువాత ఆ సమస్య మూలబడింది. పక్క యాంత్రికమైంది.
   
    ప్రతి విషయంలోనూ 'యాంత్రికతే' ఆమెని బాధపెడుతూంది. ఉన్నట్టుండి ఏమీ లేకపోవటం. అంతా శూన్యం. అన్నీ వుండి ఏమీ లేకపోవటం. ఏదో వెలితి.

    ఈ జీవితం ఎందుకు ఇంత నిర్వీర్యమైపోయిందో ఆమెకి అర్ధం కావటంలేదు.
   
    ఆమె తండ్రి పురోహితుడు. ఆధునిక భావాల్తో కూతుర్ని చదివించాడు. చదువంటే ఒక బడిలో చదివింది మాత్రమే కాదు. ఆ యుగంలో అప్పటి స్త్రీలకన్నా ఎన్నో చదివింది. అదే వచ్చింది చిక్కు.
   
    ఇది మళ్ళా మరొక యుగసంధి. అప్పటివరకూ స్త్రీ అజ్ఞానంవల్ల ప్రతిదాన్నీ 'తన ఖర్మ' అనుకుని సంతృప్తిపడేది. పోతే ఇప్పుడిప్పుడే స్త్రీ కూడా చదవటం ప్రారంభించింది. ఆమె ప్రపంచాన్ని తెలుసుకోవటం ప్రారంభించగానే పురుషుడు తన అసంతృప్తిని రకరకాలుగా ప్రకటించటం ప్రారంభించాడు. స్త్రీ తన దుస్థితిని చదువువల్ల గుర్తించ గలిగింది. ఆలోచించటం నేర్చుకుంది. అదే యుగసంధి. ఆ యుగసంధికి ఆమె మొదటితరం ప్రతినిధి అవటం ఆమె దురదృష్టం అజ్ఞానం ఇచ్చిన సంతృప్తి, మనిషికి జ్ఞానం ఇవ్వదు.
   
    తమకన్నా ముందు తరం స్త్రీలే అదృష్టవంతులని ఆమె చాలాసార్లు అనుకునేది. వారికి ఈ సంఘర్షణ లేదు. తలవంచుకుని పల్లకీలో కూర్చొని వెళ్ళిపోయేవారు. పల్లెనుంచి వచ్చి సోమయాజి పట్నంలో ఇమడలేక పోయినట్టే - ఈ తరంనుంచి వెళ్ళి ఆ తరంలో ఇమడలేకపోతోంది ఆమె.
   
    అన్నట్టు ఆమెకి పాడటం వచ్చు. ఆమె నిస్సారమైన జీవితంలో అది కొంతవరకూ తోడ్పడింది. తరువాత దాన్ని వదిలిపెట్టింది. సాయం సంధ్యలో ఆమె పాడుతూంటే ఆమె తండ్రి వసారాలో పడక కుర్చీలో కూర్చుని, కళ్ళమీద చేతులు అడ్డంగా పెట్టుకుని వినేవాడు. జయదేవుని అష్టపది నుంచి అన్నమాచార్యుల వారి కీర్తనల వరకూ ఆమె పాడేది.
   
    ఇప్పుడు కూడా ఆమె పాడుతూంది. కానీ ఆ పాట వంటింటి గోడల మధ్యా, గిన్నెల చప్పుళ్ళ మధ్య నిక్షిప్తమైపోతూంది.
   
    ఆమె కిప్పుడు ఒకటే కోరిక. ఒక బిడ్డని కనాలని.
   
    ఆ బిడ్డని తీర్చిదిద్దాలి. మొగవాడంటే ఎలా వుండాలో ఈ లోకానికి చెప్పాలి. ఆ కుర్రవాడు సకల విద్యా పారంగతుడు అవనీ కాకపోనీ, ఆజానుబాహువు అవనీ కాకపోనీ - మగవాడవ్వాలి!! ఒక తల్లికి కొడుగ్గా, ఒక స్త్రీకి భర్తగా, ఒక కొడుక్కి తండ్రిగా సంపూర్ణత్వాన్ని సంతరించుకోవాలి. ఇవే ఆలోచన్లతో ఆమెకెప్పుడూ తన వూహల్లో ఒక రూపం కదలాడేది.
   
    అప్పుడప్పుడు తన కోర్కెని తలుచుకుంటే ఆమెకి నవ్వుకూడా వచ్చేది. మళ్ళీ అంతలోనే ఆ కోర్కె తిరిగి బలీయమయ్యేది.
   
    ఆ రాత్రి ఆమె ఇలాంటి ఆలోచనలతోనే తల తిప్పి భర్తవైపు చూసింది. హరికెన్ లాంతరు వెలుతుర్లో అతడి మొహం మీద వెలుగు మసగ్గా పడుతోంది. వెళ్ళి అతడిని లేపుదామన్న కోరిక కలిగింది. లేపి అన్నీ మాట్లాడాలనిపించింది. 'మనం ఎందుకు ఇలా సత్రంలో బాటసారుల్లా బ్రతుకుతున్నాం? మనకేమయింది? ఎందుకింత నిస్సారం? కొంచెంసేపు మాట్లాడుకుందాం...' అని అడగాలనిపించింది. అతడు అతడేం చేస్తాడో తెలుసా? ముందు కళ్ళు నులుముకుంటాడు. తరువాత ఇది కలా నిజమా అన్నట్టు తనవైపు ఆశ్చర్యంగా చూస్తాడు. 'నీకేమైనా మతిపోయిందా పడుకో' అంటాడు. పైగా భయపడుతుందేమోనని దగ్గిరకి తీసుకుని మరీ పడుకుంటాడు.
   
    ఆమెకి నవ్వొచ్చింది. నవ్వుతూనే పక్కకి వత్తిగిల్లబోయి ఆగింది. ఆమె చెవుల్లో ఏదో ధ్వని వినపడింది. మరింత శ్రద్దగా విన్నది. ఈసారి ప్రస్ఫుటంగా వినవచ్చింది.
   
    "యో అక్షిణే... క్రియా... ముతద్యాం...
    విధుంద.... యువనాగ్౦....
    .....సహ్యఃసమాన"
   
    గాలితోపాటే అలలు అలలుగా లేచి వస్తూంది స్వరం. ఆమె చప్పున లేచి కూత్చుంది. పైన దుప్పటి తీసి క్రింద కాలు పెట్టింది.
   
    ఆమె భర్త నిద్రలో అటు వత్తిగిల్లాడు. వస్తున్న స్వరం ఆగలేదు.
   
    "అహర్నహిం పర్వతే శిశ్రియాణం త్వషాస్మై వజ్రం   
    స్వయం తతక్ష వాశ్రా ఇపదేనవః...."

    ఎవరు ఋగ్వేదం చదువుతున్నారు.
   
    వేదోచ్చాటనతో ఇంద్రున్ని స్తుతిస్తున్నారు.
   
    ఆ స్వరం ప్రస్ఫుటంగా వుంది.  హిమాలయాల్లోంచి దిగుతూన్నప్పుడు అలక్ నందాదేవి చేసే సవ్వడిలా వుంది. గంగాఝరీ ప్రవహంలా వుంది.
   
    ఆమె చప్పున తలుపు తీసుకుని పెరట్లో అడుగు పెట్టబోయి అక్కడే ఆగిపోయింది.
   
    ఆ కుర్రవాడు అటువైపు తిరిగి వున్నాడు. చంద్రుణ్ణి చూస్తూ వున్నాడు. తనలో తానే, తనని తానే పరీక్షించుకుంటున్నట్టు వేదం వల్లిస్తున్నాడు. మేఘము, వర్షము, భూమి, నక్షత్రము, గాలి, ఆకాశము, నది, నిర్నీధీ అన్నీ కంపించేలా గొంతు రవళిస్తున్నాడు.

 Previous Page Next Page