"ఎప్పుడూ ఒకే అమ్మాయితో తిరిగేది."
కిరణ్మయి గుండె వేగంగా కొట్టుకోసాగింది. "ఎవరా అమ్మాయి?"
"అనూరాధ అని."
"ఎక్కడుంటుంది? ఏ రూమ్ లో?" చప్పున అడిగింది.
"ప్రస్తుతం లేదు. లక్ష్మి చావుతో బాగా అప్ సెట్ అయినట్టుంది. వాళ్ళ వూరు వెళ్ళిపోయింది? ఎప్పుడొస్తుంది...."
ఒక్కసారిగా కిరణ్మయిని నిస్సత్తువ ఆవరించింది.
ఇంతలో బయట్నుంచి బిగ్గరగా ఎవరివో కేకలు వినిపించడంతో ముగ్గురూ బయట కొచ్చారు.
వార్డెన్ గోడమీద, గేటు ప్రక్కన అక్షరాలు చూపించి గట్టిగా అరుస్తోంది.
ఆవిడ మాటలు ఎవరూ పట్టించుకోవడం లేదు. కొందరు మొహాలు అటు ప్రక్కకి తిప్పి నవ్వుకుంటున్నారు. కిరణ్మయి గేటు ప్రక్కన ఏం వ్రాసుందా అని చూసింది. ఎవరో ఆకతాయి పిల్ల సుద్ద ముక్కతో న్ద్మ్గా వ్రాసింది.
No Public Farewell Kissing Here Please.
కిరణ్మయి ఇందుమతితో, "ఈ వార్డెన్ చాలా స్ట్రిక్ట్ లా వున్నట్టుందే-" అంది.
"ఉహు ఇదంతా ఓ గంట ఫార్సు పైనుంచి బాగా చివాట్లు పడుంటాయి. వచ్చి గొడవ చేస్తుంది. వీళ్ళు ఎవరూ ఆవిడను కేర్ చెయ్యరు. అరిచి, అరిచి వెళ్ళి పై అధికారులకు కంప్లయింట్ చేస్తుంది. ఎప్పుడైనా ఓసారి చీఫ్ వార్డెన్ వచ్చి మీటింగ్ పెడతాడు. డిసిప్లేన్డ్ గా వుండాలంటాడు. రెండురోజులు స్ట్రిక్ట్ గా వుంటారు. తర్వాత మళ్ళీ ఇదే తంతు."
"అంటే వార్డెన్ ఇక్కడే వుండాల్సిన అవసరం లేదా?"
"వుండాలి, కాని ఆవిడ వుండలేదు. భర్తా, పిల్లలూ సంసారం వదలి ఇక్కడెందుకుంటుంది? అది అలుసుగా తీసుకుని మా వాళ్ళు వెళ్ళి చీఫ్ దగ్గర కంప్లయింట్ చేస్తారు. ఆయన మళ్ళా ఆవిడ మీద అరుస్తాడు. ఇదో వలయం అంతే."
"గేటు బయట మైదానంలో పొదలు తీయించేస్తే బావుండేది. అప్పుడయినా అర్దరాత్రి వరకు అల కూర్చోవడం తగ్గుతుంది." అంది కిరణ్మయి.
"నేను హాస్టల్ కి వచ్చిన కొత్తలో అదే జరిగింది. అప్పట్లో వచ్చిన వార్డెన్ చాలా స్ట్రిక్ట్. పొదల వెనుక జరుగుతున్న వేషాలు చూడలేక మైదానం అంతా క్లీన్ చేయించింది. అప్పుడేమయిందో తెలుసా? అబ్బాయిలు స్కూటర్లు ఎక్కి రావడం, వాటి నిక్కడ పార్క్ చేసి అమ్మాయిలు వాటి మీదో, వాటిని అడ్డుగా పెట్టుకుని కూర్చోనో కబుర్లు చెప్పుకోవడం మొదలు పెట్టారు. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారో ననో, అసభ్యంగా వుంటుందనో ఆలోచన వచ్చేది కాదెవరికీ. దాంతో రోడ్డుమీద వెళ్ళే అల్లరి మూకలు, మెన్స్ హాస్టల్ అబ్బాయిలు వచ్చి కామెంట్స్ చేయడం, ఈలలు వేయడం సాగించారు. లేడీస్ హాస్టల్ అంటే చుల్క్న్ అభిప్రాయం అందర్లోనూ కలగడం మొదలయ్యింది. బస్సు కండక్టర్లు కూడా ఈ హాస్టల్ టికెట్ అడిగితే అదోలా చూసి నవ్వేవాళ్ళు తల్లితండ్రులెవరైనా పిల్లల్ని చూడడానికి వచ్చి ఈ వాతావరణం చూసి భయపడిపోయేవారు. ఓసారి మా నాన్నగారు వచ్చి నన్ను ఇంటికి తీసుకు వెళ్ళిపోతానని ఒకటే గొడవ-"
కిరణ్మయికి బాధగా అనిపించింది. ఈ ఇంటర్ అమ్మాయిలు.... వీళ్ళ వయసెంతని? పదిహేనూ.... పదిహేడూ మధ్య....సరిఅయిన పద్దతిలో పెడితే చదువుకీ ఆటలకీ పరిమితమయ్యే వయసు, వార్డెన్ పట్టించుకొని ఈ కేర్ ఫ్రీ వాతావరణంలో వీళ్ళిలా మారుతున్నారంటే వారి తప్పేంవుంది?
"ఈ అమ్మాయిల ప్రవర్తన ఎలా వుంటుంది?" అడిగింది కిరణ్మయి.
"వీళ్ళ మాటలు వింటుంటే చాల గమ్మత్తుగా అనిపిస్తుంది అక్కా! 'నన్ను ప్రాణం కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడట' అని గొప్ప చెప్పుకుంటారీ అమ్మాయిలు, ఒకమ్మాయికి 'మంచి' బోయ్ ఫ్రెండ్ వుండటం ఒక గొప్ప క్వాలిఫికేషన్ గా వుంటుంది. తాము చాలా సంతోషంగా వున్నట్టు ప్రవర్తిస్తారు. అప్పుడే కొత్తగా హాస్టల్ లో చేరిన అమ్మాయిలు మరింత ఈర్ష్యపడేలా ఫోజుకొడతారు. కొంతకాలానికి అబ్బాయిలకి ఈ అమ్మాయంటే బోరుకొడుతుంది. రాకపోకలు తగ్గిస్తారు. అమ్మాయిలు కొంతకాలం బాధపడి, ఆ తరువాత చదువు పూర్తి చేసుకుని వెళ్ళిపోతారు. మరికొంతమంది రాటుదేలిపోతారు. వెరైటీ స్నేహాలు చేస్తారు. ఎంత మెటీరియలిస్టిక్ గా తయారవుతరంటే రైల్వే టిక్కెట్ లాటి చిన్న చిన్న పనులు కూడా చేయించు కోవచ్చని, స్కూటరున్న బోయ్ ఫ్రెండ్స్ ని ఎన్నుకుంటారు" అంది నీలూ.
కిరణ్మయి ఆ అమ్మాయి వైపు ఆశ్చర్యంగా చూసింది. పైకి ఎంతో అమాయకంగా కనబడే ఈ అమ్మాయిలో ఇంత 'గమనింపు' వుందా? అని విస్తుబోయింది.
ఈ లోపులో ఇందుమతి అడిగింది - "దీనంతటి మీదా నీ అభిప్రాయం ఏమిటక్కా" అని.
కిరణ్మయి అంది -
"పెళ్ళికోసం, అమాయకత్వం ప్రతిపాదిగ్గా అమ్మాయిలు ప్రేమిస్తారు. స్నేహం కోసం వెరైటీ ప్రతిపాదిగ్గా అబ్బాయిలు ప్రేమిస్తారు. మొట్టమొదటి స్నేహం చేసేటప్పుడు ఏ అమ్మాయి అయినా చాలా నిజాయితీగా, గుండె లోతుల్లోంది ప్రేమిస్తుంది. ఎంతటి త్యాగానికైనా సిద్దపడుతుంది. కొంచెం లౌక్యం తెలిసిన మగాడైతే ప్రేమ పేరుతో దీన్ని క్యాష్ చేసుకుంటాడు. అందరూ ఇలా వుంటారని కాదు నేను చెపుతున్నది" అని ఆగి, మళ్ళీ చెప్పటం ప్రారంభించింది. "ఇదంతా ఆడాలిసెంట్ ఇమ్మెచ్యూరిటీ దేనిమీదా అవగాహన లేకపోవటం, ప్రేమించడం, ప్రేమించబడడం ఒక గొప్ప విషయంగా భావించండి!! ఎవరికోసమో ఎదురుచూడడం, వాళ్ళు రాగానే స్వర్గలోకపు అంచుని అందుకున్నంత ఆనందం, రాకపోతే సర్వస్వం కోల్పోయినంత దిగులు - ఇవన్నీ సీరియస్ లవ్ ఎఫైర్స్ కావు. నా వుద్దేశ్యంలో వీరు వ్యక్తుల్ని ప్రేమించడం లేదు. ప్రేమిస్తున్నానన్న భావనని ప్రేమిస్తున్నారు."
"కానీ వాళ్ళు సీరియస్ గానే తీసుకుంటారు. ఒక్కమాట బోయ్ ఫ్రెండ్ రాకపోతే భోజనం చెయ్యరు నిద్రపోరు. కొందరయితే ఏడుస్తారు కూడా."
"తాము సంతోషంగా జీవించటానికి ఒక ఆధారం ఈ ప్రేమ. ఉదయం లేచింది మొదలు ప్రేమికుడినో, ప్రేమికురాలినో చూడాలన్న ఆతృత, కలుసుకోవాలన్న ఆరాటం. ఎదురుచూపుల్లోని ఆనందం - సాయంత్రం అయ్యేసరికి కలుసుకోవడం, రోజంతా ఎలా గడిపిందీ చెప్పుకోవటం - ఈ రెండు మూడు గంటలు స్వీట్ నథింగ్స్ తో మధురంగా గడిపేయటం, విడిపోయేటప్పుడు మళ్ళీ బాధ. ఈ ప్రపంచమంతా తమకు ఎదురుతిరిగి తమని విడదీస్తున్నట్లు ఫీలింగు. మళ్ళీ ఉదయం కోసం ఎదురుచూపు. ఇలా రోజులు క్షణాల్లా గడిచిపోతాయి. నా అనుమానం నిజమయితే ఇలాంటి ప్రేమికులు అప్పుడప్పుడు కావాలని దెబ్బలాడుకోవడాలు, వాళ్ళను కలపడానికి స్నేహితుల ప్రయత్నాలు, ఆ తర్వాత ఆనందభాష్పాలు, వాటితోపాటు పార్టీలు సెలబ్రేషన్స్ జరుగుతుంటాయి."
"అది మాత్రం నిజం. ఇక్కడ అమ్మాయిలు, అక్కడ బాయస్ హాస్టల్లో అబ్బాయిలు ఈ ప్రేమికులకి భలే సపోర్టు చేస్తారు. లవ్వర్ రాగానే రూమ్మేట్సు గదిలోంచి బయటకు వెళ్ళిపోవడం లాంటివి చేస్తారు. ఫోన్ విషయంలో కూడా అంతే. గంటల తరబడి మాట్లాడుతున్నా ఎవరూ హేళన చేయరు."
"వీళ్ళ ప్రేమ సిన్సియర్, సీరియస్ కాదు కాబట్టి ఒకరు విడిపోయినా సాధ్యమయినంత త్వరలో మరొకరితో స్నేహం చేస్తారు. ఈ అనుభవంలోని "థ్రిల్" వాళ్ళకు ఎప్పుడూ కావాలి. అది లేకపోతే జీవించడం వ్యర్ధం అనుకునే స్థితికి వస్తారు. మనుష్యులు కంటిన్యూ కాకపోయినా ప్రేమ కంటిన్యూ కావాలి వీళ్ళకి."
కిరణ్మయి వాళ్ళతో ఇవన్నీ చెపుతూందేకానీ, లోలోన ఆలోచిస్తూ వుంది.
అంత చిన్న వయసులో తను ఎవర్నీ ఎందుకు ప్రేమించలేదు? క్రిస్టియన్స్ రన్ చేసిన హాస్టల్ లో వుండటం వల్లనా? క్రమశిక్షణ మారు పేరైన కాలేజ్ లో చదవటం వల్లనా?
అందుకే తనకిలాంటి అనుభూతులు లేవా?
పద్దెనిమిదేళ్ళ వయసులో అనుభవించవలసిన 'లేత ప్రేమ'ని అనుభవించ లేకపోవటం వల్లనే ఇలా -'అందని ద్రాక్ష పులుపు' సైకాలజి పెంపొందించుకున్నదా? హాస్టల్ లో ఈ అమ్మాయిలు అనుభవిస్తూన్న ఆనందంపట్ల తాను ఈర్ష్య పడుతుందా?
లేదు.
వాళ్ళది ప్రేమ కాదు......ఇన్ ఫాక్చుయేషన్.... ఆకర్షణ.
ఎలా చెప్పగలవు కిరణ్మయీ?
నీకు పదిమందితో కలిసే అవకాశం వుండి, అందులో ప్రత్యేకంగా ఒక్కరే నచ్చితే అది ప్రేమ!
ఆ సమయంలో నువ్వు పూర్తి స్పృహలో వుంటే అది ప్రేమ! మరోలా చెప్పాలంటే నువ్వు అవతలి మనిషిని కలుసుకున్న మొదటి పదిసార్ల వరకూ (కనీసం) ప్రేమలో పడకుండా వుంటే అది ప్రేమ!
అలా కలుసుకున్న పదిసార్లలో ఆ మనిషి పది సుగుణాలకన్నా ఒక బలహీనత నువ్వు చెప్పగలిగితే, అలా చెప్పికూడా ఆ మనిషిని ఇష్టపడగలిగితే అది ప్రేమ!
అన్నిటికన్నా ముఖ్యంగా --
సాయంకాలం నీడలా పెరిగేది ప్రేమ!!!
అల కాకుండా -
- ఒక వ్యక్తి నీ మీద ఇంటరెస్ట్ చూపించగానే నీకు మత్తుకలిగితే అది ఆకర్షణ.