"సాధారణంగా తమలో తాము సర్దుకుంటారు గెస్ట్ వస్తే రూమ్మేటు పక్క వాళ్ళ గదిలో సర్దుకుంటుంది. కాని మా ఇద్దరికీ వేరే వాళ్ళ గదుల్లో పడుకోవడం ఇష్టం వుండదు. పరుపు కావాలని వెళ్ళి అడగడం కూడా మాకిష్టం వుండదు. పిచ్చి వాగుడంతా వాగుతారు. ఇలా రెండు మంచాలు కలిపితే ముగ్గురం ఈ జాగా సర్దుకోవచ్చు" అంది నీలూ.
వాళ్ళిద్దరూ చదువులో పడగానే కిరణ్మయి పుస్తకం పట్టుకుని మంచంమీద వొరిగింది . ధ్యాస మాత్రం మరెక్కడో వుంది.
హాస్టల్ జీవితంలో ఒకరోజు గడిచింది. కొంత సమాచారం దొరికింది. కాస్త శ్రమపడితే చాలా విషయాలు తెలిసేలా వున్నాయి. త్వరగా పని పూర్తిచేసుకొని వెళ్ళిపోవాలని ఆతృతగా వుంది. కాని ఆమెకు వెంకటరత్నం మాటలు గుర్తొచ్చాయి. 'తొందరపాటు వల్ల ఇరుకులో పడతారు. మరీ ఉత్సాహం చూపిస్తూ హాస్టల్ విషయాల్లో తలదూర్చకండి. ఇలాంటి విషయాల్లో నిదానం చాలా అవసరం. సరయిన ఫలితాలనీ యిస్తుంది. మీరెవరో, ఎందుకొచ్చారో ననే ఆసక్తి అందరిలో తగ్గిపోయాక అప్పుడు విషయసేకరణ మొదలుపెట్టాలి' అన్నారు. నిజమే తను తొందరపడితే అపురూపలక్ష్మి హత్యకు సంబంధించి తను వచ్చానని తెలిస్తే ఈ అమ్మాయిలు కూడా తనతో సహకరించరు.
రాయన్న బాంబేలోనే వున్నాడు. టీమ్ సెలక్షన్ అయ్యేవరకు క్కడే వుంటాడు. పూర్తిగా ప్రాక్టీసులో మునిగిపోయాడని చెప్పాడు స్నేహితుడు. అదే తనకు కావలసింది. ఆలోచనల్లోంచే నిద్రలోకి జారిపోయింది కిరణ్మయి. కొత్త ప్రదేశమయినా చాలారోజుల తర్వాత బాగా నిద్రపట్టించామెకు.
* * *
విజయకుమార్ బాగానే ఆగాడు. కాని అతడి ఆటకి మ్యాచ్ లో గుర్తింపురాలేదు. రాయన్న విజయం మానసికంగా అతడిమీద దెబ్బ తీసింది కూడా.
క్రికెట్ కంట్రోల్ బోర్డ్ సమావేశంలో రాఘవరెడ్డి చివరిసారిగా విజయకుమార్ సెలక్షన్ కి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. తన ప్రయత్నం ఫలిస్తుందన్న నమ్మకం అతడికి లేదు. కని భవిష్యత్తులో రాయన్న హంతకుడిగా నిరూపించబడితే తన ఈ ప్రయత్నాన్ని ముందు ముందు క్రికెట్ కంట్రోలు బోర్డులో పలుకుబడిగా ఉపయోగించుకోవచ్చునని అతడి ఆలోచన! తన అభిప్రాయం ముందుగానే పేపర్ వాళ్ళకు తెలియచేస్తే తన మీద మంచి రిపోర్టు తయారు చేయించుకోవచ్చు. రాఘవరెడ్డి లాంటి వాళ్ళు వర్తమానంతో పాటు భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు......
* * *
కిరణ్మయికి త్వరగా మెలకువ వచ్చింది. వినీల, ఇందుమతి ఇంకా లేవలేదు. ఆరవుతున్నా చలికాలం కాబట్టి పూర్తిగా తెల్లవారలేదు. కిరణ్మయి చప్పుడు చేయకుండా లేచి తలుపు దగ్గరగా వేసి బయటకు నడిచింది.
కొన్ని గదులు ముందు ఎండిపోయిన అంట్లు, ఉల్లిపాయ తొక్కలు కూరల అవశేషాలు పడున్నాయి. ఎక్కడా ఎవరూ లేచినట్లు లేదు. ఆమె బాత్రూంకెళ్ళి ముఖం కడుక్కుని వచ్చి గదిలోంచి ట్రాన్సిస్టర్ తీఉస్కుని వెనక తోటలోకి నడిచింది.
శుభ్రం చేసే దిక్కులేక తోట అస్తవ్యస్తంగా వుంది. కాస్త అదుపులో పెడితే మెత్తటి తివాచీలా పెరగాల్సిన గడ్డి ఎగుడు దిగుడుగా పెరిగి కాళ్ళ కడ్డం పడుతోంది. మొక్కలకు సరయిన సంరక్షణ లేక దీనంగా చూస్తున్నట్లనిపించింది. అప్పుడప్పుడు ఆకాశం మీదనుంచి ఒక్కో వర్షపు చినుకు పడుతోంది.
ఎలావున్నా ఆ పచ్చదనంలోని అందం, గడ్డిపూవులోని జీవం మనిషి మనసుని ఆహ్లాదపరిచే వస్తువులే శనివారం కాబోలు ట్రాన్సిష్టరులోంచి మంద్రస్వరంలో సుబ్బలక్ష్మి సుప్రభాతం వినిపిస్తోంది.
కిరణ్మయి ప్రకృతిలో, గానంలో మునిగిపోయి తన ఆలోచనలను కూడా మర్చిపోయింది. ఏడు గంటలకు హాస్టల్లో, కొద్ది కొద్దిగా కలకలం మొదలయింది. అంతలో వార్తలు ప్రారంభం అయ్యాయి.
వార్తల్లో ముఖ్యాంశాలు.... అస్సాంలో బోడో సమస్య, ఏడుగురి మృతి. కాశ్మీరులో టెర్రరిస్టుళ చేతిలో పదిమంది మృతి ఒరిస్సాలో బస్సు ప్రమాదంలో నలుగురి మరణం తెల్లవారగానే అన్నీ దుర్వార్తలే. కిరణ్మయి విసుగ్గా ట్రాన్సిస్టరు కట్టేయపోయింది, 'త్వరలో పాకిస్తాన్ జట్టుతో ఆడబోయే టెస్ట్ సిరీస్ కి భారత్ టీమ్ జాబితా వెలువడింది' అన్న వార్తతో వాల్యూం పెంచింది. ముఖ్యాంశాలు అయాక మామూలు వార్తలు ప్రసారం అయ్యాయి. ఆమె టెన్షన్ కి పరీక్ష పెట్టినట్టు ఎనిమిది నిముషాల పాటు దేశ విదేశాల్లోని మారణహోమాల గురించి విని భరించిన తర్వాత వచ్చిందా వార్త.
"పాకిస్తాన్ జట్టుతో ఆడబోయే భారత క్రికెట్ టీమ్ జట్టు ఎంపిక పూర్తయింది. ఆటగాళ్ల పేర్లు....."
కిరణ్మయి ఊపిరి బిగపట్టింది. ఒక వర్షపు చినుకు ఆమె తలమీద పాపిడ మధ్యగా పడింది.
"కెప్టెన్ అజారుద్దీన్, వైస్ కెప్టెన్ రవిశాస్త్రి, వెంగ్ సర్కర్, టెండూల్కర్, మండ్రేకర్, ఆంద్రప్రదేశ్ కి చెందిన రాయన్న వికెట్ కీపర్...." ఆమె ఒక్కఉదుటున లేచి లోపలి పరుగెత్తింది. పాపిట మధ్య నుంచి జారిన వర్షపు చినుకు కనుల మధ్యగా పెదవిమీద పడి-అది రాయన్న ముద్దు పెట్టుకున్నట్లుగా అనిపించింది.
* * *
కిరణ్మయికి తన ఆనంధాన్ని ఎవరితోనైనా పంచుకోవాలనుకుంది. కాని అంతలోనే తనను తాను సంబాళించుకుంది. దుఃఖమయినా, సంతోషమయినా కంట్రోలు చేసుకోలేకపోవడం ఇమ్మెచ్యూరిటీకి చిహ్నం కదా. ఆమె గదిలోకి వచ్చేసరికి నీలూ, ఇందు కాలేజీకి వెళ్ళడానికి తయారవుతున్నారు. ఒకటే హడావుడి, ఆలస్యం అయితే బాత్రూం ఖాళీగా దొరకదట.
"ఈ రోజు ఎక్కడికయినా వెళతారా?" అడిగింది ఇందు.
"లేదు, హాస్టల్లోనే వుంటాను. మీరెప్పుడు వస్తారు?" అడిగింది కిరణ్మయి.
"క్లాసులనిబట్టి వస్తాం. అయితే మీరు పది తర్వాత స్నానానికి వెళ్ళండి. ఇప్పుడయితే క్యూలో నిలబడాల్సి వస్తుంది."
"అలాగే."
"సాయంత్రం అలా బయటకు వెళ్ళొచ్చు. అన్నట్లు మీరుక్లబ్ రూంకి వెళ్ళొచ్చు. పుస్తకాలు, టి.వి. ఉంటాయి. కాస్త టైంపాస్" అంది నీలూ.
కిరణ్మయికి అది మంచి అయిడియా అనిపించింది అక్కడయితే ఎవరితోనయినా పరిచయం చేసుకునే అవకాశం వుంది. అతి సీరియస్ గా టి.వి. చూస్తోంది. 'మనీ మాటర్స్' షేర్స్ గురించి వివరాలందిస్తున్నాడు శశికుమార్.
ఆ అమ్మాయి తనవైపు అనుమానంగా చూడటం గమనించింది కిరణ్మయి.
"నా పేరు కిరణ్మయి పద్దెనిమిదో నంబర్ గదిలో ఇందుమతి నా కజిన్. మీ పేరు?" అడిగింది కలుపుగోలుగా.
"రేఖ" అంది పొడిగా ఆమె.
టి.వి.లో వార్తలు మొదలయ్యాయి. రేఖ సీరియెస్ నెస్ చూసి కిరణ్మయి సంభాషణ మరి పెంచలేదు. న్యూస్ వింటూనే ఆమెను పరిశీలనగా చూసింది. ఆ అమ్మాయి కళ్ళు టి.వి.మీద కేంద్రీకరించబడ్డాయి. కాని మనసు ఎక్కడో వుంది. ఏదో బాధలో ఉందామె. ఏకాంతం కోసం ఇక్కడకు వచ్చి కూర్చున్నట్లుంది.
ఇరవై ఏళ్ళయినా నిండని ఈ అమ్మాయిలో ఏమిటీ నిరాసక్తత? మనసు చదువు మీద కేంద్రీకరించి, చదువుతోపాటు ఆటపాటలతో నవ్వుతూ, తుళ్ళుతూ స్వేచ్చగా రోజులు క్షణాల్లో గడిపేయగలిగేస్థితిలో వుండి కూడా, ఏదో పోగొట్టుకున్నట్లు, జీవితం మీద విరక్తి పుట్టినట్లు ఎందుకీ ఉదాసీనత? కుటుంబం పరిస్థితులా, లేక వాళ్ళను వదలి దూరంగా వుంటున్నందుకు దిగులా? ఏ మాత్రం అదుపులేని ఈ హాస్టల్లో వుంటూ కూడా అలాంటి ఉదాసీనత ఫీలింగు కలగడమంటే ఆమెకు తన కుటుంబంతో గట్టి సంబంధ బాంధవ్యాలుండి వుండాలి! అపురూపలక్ష్మి లాగా......ఈ అమ్మాయి అపురూపలక్ష్మి స్నేహితురాలయి వుండదు గదా. ఒకే రకమైన అభిప్రాయాలున్న వాళ్ళు స్నేహితులవుతారంటే ఈమె తప్పక లక్ష్మి నేస్తమే అయుండాలి. కిరణ్మయి ఏదో అనబోయేంతలో క్రికెట్ టీమ్ గురించి చెప్పడం మొదలుపెట్టింది న్యూస్ రీడర్.
రాయన్న పేరు చెపుతూ ఫోటో చూపుతుండగా ఉత్సాహంగా ఆమె వైపు చూసింది కిరణ్మయి. రేఖ పిడికిళ్ళు బిగుసుకున్నాయి. కోపంతో ముఖం ఎర్రబడింది. "మర్డరర్, రాస్కెల్' అని తిట్టుకుంటోంది. కిరణ్మయి ఉత్సాహమంతా చప్పబడి పోయింది.
ఈ హాస్టల్లో అందరి అభిప్రాయం అదే అయితే తన పరిశోధన విజయవంతమవుతుందా?
ఆ సాయంత్రం కాలేజీ నుంచి నీలూ వచ్చాక, కిరణ్మయి రేఖ ప్రసక్తి తీసుకొచ్చింది. "ఆ అమ్మాయి అపురూపలక్ష్మి మంచి స్నేహితురాలా?"
"గాఢమైన స్నేహంకాదు, లక్ష్మి చనిపోయిన రోజు హంతకుడిని చూసిందీ పిల్లే. పోలీసులూ, హాస్టల్ అధికారులూ పదే పదే ప్రశ్నించేటప్పటికి బెదిరిపోయింది. ఆ మర్నాడే వాళ్ళ నాన్నగారొచ్చి, పోలీసుకేసులో ఇరుక్కున్నందుకు బాగా కేక లేసారుట."
"మరి అపురూపలక్ష్మి స్నేహితురాళ్ళు ఎవరు?"