"ఏది?"
"ఆనందోబ్రహ్మ ఈ వారంతో పూర్తయింది."
"అవును. కాంట్రాక్టు పూర్తయింది."
"ది హెల్ విత్ ఇట్. వెంటనే మీరు ఎడిటర్ రూంకి రండి క్విక్."
ముగ్గురూ ఎడిటర్ రూమ్ లో సమావేశమయ్యారు.
"నాకు మాట మాత్రం చెప్పకుండా దీన్నెలా ఆపుచేశారు?" అని సర్క్యులేషన్ మానేజర్ అడిగాడు.
"దీన్ని ప్రకటన రూపంలో ఇస్తున్నాడు యాజీ. అతడికి తన ఇష్టం వచ్చినప్పుడు ఆపుచేసే హక్కువుంది" అన్నాడు అడ్వర్ టైజ్ మెంట్ మానేజరు.
టెన్నీస్ ప్రేక్షకుడిల ఇద్దరివైపూ చూస్తున్నాడు ఎడిటర్.
"పూర్తిగా మునిగిపోతాం. యూ నో ది సర్క్యులేషన్?" అంటూ కాగితాలు తీశాడు. "ప్రజలు వెర్రెక్కిపోతున్నారు. వృద్దుల సంగతి అలా వుంచండి. యువతీ యువకులు కూడా విపరీతంగా అభిమానిస్తున్నారు. ఏదో వుంది ఇందులో ఏమిటో నాకు తెలియటం లేదు. అయినా ఇప్పుడు మనం ఇక్కడ మీటయింది ఇందులో ఏముందా అని చర్చించటం కోసం కాదు. దీన్ని ఎలాగైనా కొనసాగించాలి. ఇలాంటి అవకాశం మనకి మళ్ళీ రాదు."
"మనం మానేజింగ్ డైరెక్టర్ తో ఒకసారి మాట్లాడితే మంచిదేమో...." అంటూ ఎడిటర్ అతడి దగ్గిర అపాయింట్ మెంట్ తీసుకున్నాడు ముగ్గురూ ఆ గదిలోకి వెళ్ళారు.
ఎడిటర్ జరిగినదంతా చెప్పాడు.
"ఇప్పుడే సాంస్కృతిక వ్యవహారాల శాఖ నుంచి నాకు ఫోన్ వచ్చింది. పాత ప్రతులు ఒక్కొక్క కాపీ పంపమన్నారు. ఎందుకా అనుకుంటున్నాను. ఇదన్నమాట సంగతి" అన్నాడు ఎమ్.డి.
"ఇంతకాలం మన పత్రిక కేవలం సెక్స్-థ్రిల్ ఓరియెంటెడ్ గా నడిచింది. నిర్మొహమాటంగా చెప్పాలంటే కాస్త వయసు పైబడ్డవాళ్ళు, దీన్ని ఇంట్లో వుంచుకోవటానికే ఇష్టపడేవాళ్ళు కాదు. అటువంటిది ఇప్పుడు దేశంలో వున్నా 'హోమ్ ఫర్ ది ఏజ్డ్' అన్నీ మనకి చందాలు పంపినాయ్. ఇక కుర్రవాళ్ళయితే మన పత్రికని చేత్తో పట్టుకోవటమే కల్చర్ సింబల్ గా భావిస్తున్నారు. అది ఫాషన్ అయిపోయింది. ఇలాంటి అవకాశం మళ్ళీ మనకి రాదు."
ఎమ్.డి. యాజీకి ఫోన్ చేశాడు. అట్నుంచి అతడు రిసీవర్ ఎత్తగానే కంఠంలో చిరునవ్వు తెచ్చుకుంటూ "హలో యాజీ?" అన్నాడు.
"స్పీకింగ్"
"ఏమిటీ మీ ప్రకటన పూర్తయిపోయిందా?"
"ఆఁ అయిపోయింది."
"అదేమిటి యాజీ?"
"అవును మీ పత్రికలో ప్రకటనకి అయ్యే ఖర్చు చాలా ఎక్కువగా వుంది.
"అదేమిటి యాజీ! మనం మనం ఒకటి మీకంతగా కావాలంటే ఫ్రేగా వేద్దాం."
"థాంక్యూ కానీ భరద్వాజ ఇక వ్రాయనంటున్నాడే. అంతా అతడే చూసుకుంటున్నాడు."
ఎమ్.డి. గతుక్కుమన్నాడు. సరియైన చోట దెబ్బ కొట్టాడు యాజీ. అంతకుముందు నవల ప్రచురణ నిమిత్తం తనకి ఫోన్ చేస్తే 'నాకు తెలీదు, అంతా ఎడిటరే చూసుకుంటున్నాడు' అన్న దానికి రిటార్టు.
దిగివచ్చినట్టు "యాజీ! మనం స్నేహితులం మీకు తెలియనిదేముంది? ఆ ప్రకటన ఇంకా కొంతకాలం కొనసాగటం కావాలి డానికి అతడిని వప్పించండి."
"భరద్వాజ ప్రొఫెషనల్ రైటర్! అదీగాక దెబ్బతిని వున్నాడు. మామూలుగా వప్పుకోడేమో!"
"మరేం కావాలి?"
"కనీసం లక్షా యాభై వేలు."
ఎమ్.డి. గ్లాసులో నీళ్ళు గడగడా తాగేశాడు.
"అంతేకాదు ఇంకొకటి కూడా చెయ్యాలి" యాజీ అంతలో అన్నాడు.
"ఏమిటది?"
"ఇంతకాలం ప్రకటనల రూపంలో మీ పత్రిక నా నుంచి వసూలు చేసిన డబ్బు తిరిగి యివ్వటం."
ఎమ్.డి. తటపటాయించి "సరే" అన్నాడు.
7
పక్కమీద పడుకుని, తలక్రింద రెండు చేతులూ పెట్టుకుని పై కప్పుకేసి చూస్తున్నాడు సోమయాజి. ముద్ర శవాసనమైనదే తప్ప నిద్ర దూరమయింది. అపురూపమయిన అనుభూతితో మనసులో ఆలోచన ఆరుద్ర పురుగైంది. దానికి కారణం ఆ రోజు జరిగిన సంఘటన.
అప్పటికే మందాకినీ వాళ్ళు ఆ ఇంట చేరి నాలుగు రోజులు కావొస్తుంది. ఇంతవరకూ అతడెప్పుడూ ఆమె కంఠం వినలేదు. ఆడవాళ్ళు మౌనంలో అంత అందాన్ని సంతరించుకోగలరని అతడు అప్పుడే తెలుసుకున్నాడు. ఆమె భర్త ఎప్పుడో కానీ తొందరగా ఇంటికి రాడు. అతడు వచ్చేసరికి పదకొండు దాటుతూ వుంటుంది. అప్పటివరకూ వారి ఇంటివైపు భాగంలో దీపం వెలుగుతూనే వుంటుంది. ఆమె ఏం చదువుతుందో అతనికైతే తెలీదు. కానీ నీడ భంగిమని బట్టి చదువుతూందని మాత్రం తెలుస్తుంది. అంతలో భర్త వస్తాడు. ఇద్దరి మధ్యా కాస్తంత సంభాషణ జరుగుతుంది. అతడొచ్చే వరకూ ఆమె భోజనం చెయ్యదు. తీరా వచ్చాక, అతడు బైటచేసి వచ్చానంటాడనుకుంటా - ఆమె ఒక్కతే కంచం పెట్టుకుంటుంది. మరి పది నిమిషాల తరువాత ఆ దీపం కూడా ఆరిపోతుంది. సోమయాజి చుట్టూ నిశ్శబ్దంగా చీకటి పరుచుకుంటుంది. వరండాలోకి తొంగిచూసే పిల్ల తిమ్మెర మాత్రం మిగిలి పలకరిస్తుంది.
సోమయాజి సాధారణంగా ముందే లేస్తాడు. కానీ అదేం చిత్రమో .....అతడు లేచేటప్పటికే ఇంటిముందు కళ్ళాపి జల్లి వుంటుంది. ఆకాశ మార్గాన పోతూ పోతూ ఏ అప్సరసో - యిదేమిటి ఈ ముంగిలి యిలా ఖాళీగా వుంది - అని ఆగి పెట్టినట్టు ముగ్గులు తీర్చి వుంటాయి.
మూడు రోజులు అలాగే గడిచాయి.
అతడా రోజున రవ్వంత ముందే లేచాడు. ఆమె ముగ్గు వేస్తూంది.
ఆ దృశ్యం మనోహరమైంది. పాతస్మృతుల అంతరంగ ద్వారాల్ని తెరిచేది. ఆమె అలా వంగి ముగ్గేస్తూ వుంటే అతడికి గోదావరి గుర్తొచ్చింది. అందులో శృంగారం లేదు. పవిత్రత వుంది. చూస్తే సూర్యోదయాన గోదావరినీ, మిట్టమధ్యాహ్నం పిల్లకాలువనీ, సాయంసంధ్యలో సముద్రాన్నే చూడాలి. చిరుతరగల పడివిరిగే ఎరుపు కెరటాల ఉదయపు గోదావరి, పిల్ల కాలువలో అయితే మండుటెండలో ఈతకొట్టే పశువుల కాపర్లూ, ఇక సముద్రతీరాన సాయంత్రమయితే దూరాన భూమీ ఆకాశం కలిసేచోట సముద్ర స్నానానికి దిగే మేఘాలు... పొడుగ్గా పాకే నీడల మధ్య కదిలే చేయీ, చేతివేళ్ళ సందుల్లోంచి జారిపడే ముగ్గూ - తరళ సౌదామనీ కరదీపికా కాంతి వినీల గగనాన మెరిసినట్టు ఆమె వేళ్ళమధ్య నాట్యం ఆడే సూర్య కిరణం -
ఆమె అతడిని చూసి పలకరింపుగా నవ్వింది.
అతడు నవ్వలేదు.
తను గీసిన కాన్వాసు మీద తడి ఆరని గీతల్ని ఒక చిత్రకారుడు అపురూపంగా ఎలా చూసుకుంటాడో అలా చూస్తున్నాడు.
అతడు చిన్నవాడేమీ కాదు. ప్రబంధాలని చదివినవాడు. ఆమెని తదేకంగా చూస్తున్నాడు.
అతడి దృష్టి పథకంలో కాళిదాసు గబగబ పరుగెత్తుకు వచ్చాడు. 'అయ్యో- నా శకుంతల తన కలువ కన్నులని ఈమె కిచ్చేసిందే' అని వాపోయాడు. ముక్కు తిమ్మన తల గోక్కుంటూ, పారిజాతాపహరణంలో తను వర్ణించిన సత్యభామ ఠీవి అంతా పైట బిగించి ముగ్గేస్తూన్న ఈ ముద్దుల గుమ్మకెలా వచ్చిందా అని ఆలోచనలో పడ్డాడు. శ్రీనాథుడు సరేసరి. 'దమయంతి కొక్కదానికే వుండవలసిన పొంకం ఈమెకెలా యిచ్చావు' అని బ్రహ్మనే నిలదీశాడు. పాపం మర్యాదస్తుడు అల్లసాని పెద్దనొక్కడే, పెద్దవాడు కదా మరో వరూధినిలే అని సరిపెట్టుకున్నాడు. కుమార సంభవకర్తా, ప్రభావతీ ప్రద్యుమ్న కవీ నోటమాట రాక నిలబడ్డారు.
అన్నీ కలగలుపైన ఆలోచన్లతో సోమయాజి శిలాప్రతిమే అయ్యాడు.
అంతలో ముగ్గు గిన్నె పట్టుకుని ఆమె దగ్గరగా వచ్చింది. "ఏం? ఈ రోజు అంత తొందరగా లేచావేం?" అని పలకరింపుగా అడిగింది. ఉలిక్కిపడ్డాడు. మాట తడబడింది. "ఏమ్... ఏమ్.... ఏమీలేదు" అన్నాడు.
అని, అతడు తల వంచుకుని లోపలికి వెళ్ళిపోయాడు. ఆ రోజు పాఠాలు కూడా సరిగ్గా తలకెక్కలేదు. ప్రొద్దున్న లేచి చేద నూతిలో వదిలేశాడు. క్లాసులో లెక్క తప్పు చేశాడు.
ఆ మధ్యాహ్నం అతడు వచ్చేటప్పటికి నడి లోగిలిలో బియ్యం ఏరుతున్నారు ఆమే, చిన్నక్కా, ఆమే అతడిని తలెత్తి చూసింది. మళ్ళీ అదే చిరునవ్వు అన్నపూర్ణలా.
"మీ తమ్ముడు ఎక్కువ మాట్లాడడా?"
"వాడా! వాడి మొహం వాడికి నత్తి."
లోపల బల్లమీద పుస్తకాలు పెడుతూ వుంటే జారిన కన్నీటిచుక్క పుస్తకం అంచుపైన ఆర్ద్రంగా తడిపింది.
అంతలో ఆమె అనటం వినిపించింది. "చిన్నప్పటినుంచీ వుందా?" అని.
"లేదమ్మా! మొదట్లో బాగానే వుండేవాడు. ఈ మధ్యే వచ్చింది."