Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 30

   

       దారిన పోయేవారు కూడా చోద్యాన్ని చూస్తూ నిలబడ్డారే తప్ప అంతమంది కుర్రవాళ్ళని చూసి, అదేమిటని అడగలేదు, కొట్టినచోట కొట్టకుండా రమేష్ అతడిని చితకబాదుతున్నాడు. సోమయాజి బట్టలు రంగు మారాయి. మోచేతులు డోక్కుపోయాయి. ఆఖరి దెబ్బగా పిడికిలి బిగించి డొక్కల్లో కొట్టాడు. పాత కడుపునొప్పి ఉప్పెనలా ఉధృతంగా వచ్చింది. ముందుకు తూలి కాలువలో పడ్డాడు. నల్లటి బురద మొహాన్ని కప్పేసింది. అలా ఎంతసేపు వున్నాడో అతనికే తెలీదు. క్షణం యుగంలా గడిచింది.
   
    రమేష్ స్నేహితుల్తో కలసి వెళ్ళిపోయాడు.
   
    దూరంగా వీధి చివర జరుగుతున్న గొడవకి చిన్నక్క ఎందుకో తొంగిచూసి, తమ్మున్ని గుర్తించి కెవ్వున కేకేసింది. బావగారు బయటికి పరిగెత్తుకు వచ్చేసరికే అంతా అయిపోయింది. ఒకవేళ అలా అవకపోయినా ఆయన అంతా అయ్యేవరకూ ఆగేవాడు అంతకన్నా ఏమీ చేసేవాడు కాడు.
   
    మొహంనిండా నల్లటి బురదతో, చిరిగిన బట్టలతో అతడు తల వంచుకుని ఆయన రెక్కపట్టుకోగా, తూలుతూ నడుచుకుంటూ ఇంటివైపు వెళ్ళటాన్ని ఆ వీధిలో ప్రతీ గడపా చూసింది. కుతూహలమూ, చిరు నవ్వూ ప్రతీ మొహంలోనూ తొంగిచూసింది. ఈ అవమానం తనకే జరిగినట్టు రాజా, దాన్ని కప్పిపుచ్చుకోవటానికి రమేష్ కీ తనకీ వున్న స్నేహం గురించి చెపుతూ, సోమయాజి ఏదో ఘోరమైన తప్పు చేసే వుంటాడనీ, లేకపోతే రమేష్ లాంటివాడు ఈ విధంగా తీవ్రమైన చర్య తీసుకోడనీ అక్కడివారికి తనకు సాధ్యమైనంత పరిధిలో సత్యానికి అసత్యాన్ని జోడిస్తూ వివరిస్తున్నాడు.
   
    లోపలికి రాగానే సోమయాజిని చిన్నక్క స్నానాల గదిలోకి తీసుకెళ్ళింది. శాపనార్ధాలు పెడుతూ స్నానం చేయించింది. అశక్తుడైనట్లు సోమయాజి ఏ పనీ చేయలేకపోతున్నాడు. చిన్న పిల్లలిద్దరూ భయం భయంగా చూస్తున్నారు.
   
    అతడికి తనమీద తనకే జాలి వేసింది. రేపు అందరిముందూ ఎలా తలెత్తుకు తిరగటం అని కాదు అతడు ఆలోచిస్తున్నది! ఎటువంటి వాడిని ఎలా అయిపోయానా అని.....ఈ సోమయాజేనా ఒకప్పుడు వాక్కాస్ఫాలిత సజ్య  కార్మికుడు? ఇతడేనా ప్రేంఖత్కటాక్షాంచలద్యుతిజాలుడు? ఇతడేనా గోదావరిని పదిబారల్లో ఈదినవాడు?
   
    ......స్నానం పూర్తయింది.
   
    ఇల్లంతా నిశ్శబ్దంగా వుంది.
   
    ఆ నిశ్శబ్దాన్ని అతడు భరించలేకపోతున్నాడు. రహస్యంగా ఏ మూలనుంచో ఎవరో తొంగిచూసి నవ్వుతున్న గుసగుస ధ్వని! ఇక అక్కడ వుండలేకపోయాడు.
   
    బయటికి నడిచాడు.
   
    అదృష్టవశాత్తు బైట బాగా చీకటిపడింది. అతడి నెవరూ గుర్తించలేదు. నడిచి నడిచి అతడు ప్రదీపు ఇల్లు చేరుకున్నాడు.
   
    ప్రభాకర్ మిత్రబృందం అక్కడే వున్నారు. రమేష్ ఓడిపోయిన సంగతి వారికి ఆనందాన్నె కలుగచేసింది. సోమయాజిని అతడు కొట్టిన సంగతి వారికి తెలీదు. అతడు చెప్పలేదు కూడా! వెళ్ళి వాళ్ళమధ్య మౌనంగా కూర్చున్నాడు. అతడి ప్రపంచం అతడిది. వాళ్ళేదో విడుదల కాబోయే చిత్రం గురించి మాట్లాడుకుంటున్నారు. అతడికి కావల్సిందీ అదే. తననెవరూ ప్రత్యేకంగా గుర్తించక పోవటం!.....అవమానం పొందిన మనిషికి తన గురించి ఎవరూ మాట్లాడక పోవటంకన్నా కావల్సిన విషయం ఇంకొకటి లేదు.
   
    అదే జరుగుతూంది అక్కడ.
   
    అంతలో అతడి వంతు వచ్చింది. పక్కవాడు సిగరెట్ దమ్ముతీసి అతడికి అందించాడు. సంశయించకుండా అతడు దాన్ని తీసుకుని బలంగా పీల్చాడు. గంజాయిపొగ లోపలికి ప్రవేశించి మెదడు పొరల్లో స్తబ్దతని ఒక్కసారిగా విడగొట్టింది. ఏదో తెలియని హుషారొచ్చింది.
   
    అతడు అలా కాల్చటాన్ని మొదటిసారి గమనించినవాడు ప్రభాకర్. "అరే, అటు చూడండ్రా" అన్నాడు. అందరూ ఒక్కసారిగా తలతిప్పి సోమయాజి వైపు చూశారు. అతడు నవ్వాడు. అప్పటికే అతడికి స్వర్గారోహణ చేసిన భావం కలుగుతుంది. అందరూ అతడిని అభినందించారు. అసలు కొత్తేలేకుండా ఏ మాత్రం దగ్గకుండా తాగ గలుగుతున్నందుకు పొగిడారు.
   
    ఆ సమయంలో అతడికి కావల్సింది ఆ పొగడ్తే. ఈ విజయం అతడిని అందలం ఎక్కిస్తోంది కృత్రిమ విజయం - నిజమైన విజయానికన్నా తొందరగా వస్తుంది. కోట కట్టటానికైతే సంవత్సరాల తరబడి కష్టపడాలి. పడగొట్టటానికి చిన్న యుద్ధం చాలు. కృత్రిమ గెలుపు అలాటిది.
   
    అతడు గెలిచాడు.
   
    రెండు గంటల  తరువాత అతడు తూలుకుంటూ ఇంటికి బయల్దేరాడు. మెదడంతా స్థబ్దంగా వుంది.

    ముందు తలుపు తీసేవుంది. తోసుకుని లోపలికి ప్రవేశించాడు. చిన్నక్క లోపలుంది. పిల్లలు పెరట్లో వున్నారు.
   
    అతడు మధ్య లోగిలిలోకి వచ్చాడు. పైకప్పు  లేకపోవటంతో పైన ఆకాశం కనబడుతూంది. మూడువైపులా మూడు భాగాలు. ఎప్పుడూ మూసి వుండే నాలుగో భాగం ఈసారి తెరిచి వుంది.
   
    లోపల సామాన్లు సర్దుకుంటున్న ఆమె, అలికిడికి తలతిప్పి చూసింది. ఆమెకి పాతికేళ్ళుంటాయి. వాలుజడ భుజంమీదనుంచి ముందుకు పడుతూంది. జుట్టుకి దుమ్ము అంటి వుంది.
   
    అతడు శిలాప్రతిమై అలానే నిలబడి వున్నాడు. క్షణంపాటూ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. గంజాయి మత్తులో ఒకటి రెండుగా కనపడటం సహజమే కానీ తన ఎదురుగా వున్న మూర్తి వేయి మూర్తులై భాసిస్తూంది.
   
    అతడలా నిలబడి వుండటం చూసి, అతడు ఏదో పనిమీద వచ్చిన వాడై వుంటాడని, సర్దటం మధ్యలో ఆపి గుమ్మం దగ్గిరకొచ్చి "ఎవరు కావాలి?" అని ఆమె అడిగింది. బిగించి కట్టిన వీణ తీగెమీద చిటికెన వేలి నఖ పంచమమైన సవ్వడి. అతడు మాట్లాడలేదు.
   
    ఇంతలో లోపల్నుంచి చిన్నక్కవస్తూ, రాయిలా నిలబడివున్న తమ్ముణ్ణి చూసి అంది "అలా నిలబడిపోయావేమిట్రా, వీళ్ళే మనింట్లో దిగింది. ఆయనేదో ఆఫీసులో పనిచేస్తారు. ఈమె పేరు - అదేమిటండీ! ఎన్నిసార్లు అనుకున్నా నోట్లో ఆడుతుంది కానీ గుర్తుకురాదు - భలే కొత్త పేరు - ఏమిటది?"
   
    "మందాకిని" అంటూ ఆమె మరింత వెలుగులోకి వచ్చింది.
   
    అతడు వినటంలేదు. చూరు సందుల్లోంచి చంద్రకిరణం ఆమె మీద ఎర్రగా పడుతూంది. గరుత్మంతుని రెక్కలు ఎరుపు. సూర్యుడు క్రుంగుతూంటే సముద్రం ఎరుపు. అతడికి వసుచరిత్ర గుర్తొచ్చింది.
   
    తెర కొద్ది కొద్దిగా క్రిందికి దిగుతుందట. ముందు నాయక నొసలి పైభాగాన కట్టిన మౌక్తిక పట్టా కనపడుతుందట. తరువాత కనులు కనబడతాయట. ఆ పిమ్మట ముఖమంతా కనబడుతుందట. తెలుగు-సంస్కృత సాహిత్యాల్లో యింత గొప్ప చంద్రోదయ వర్ణన నభూతో నభవిష్యతి అంటారు. ఆమె చీకటినుంచి వెలుగులోకి వస్తూంటే అతడికి అదే గుర్తొచ్చింది.
   
    ఆమె అతడిని చూసి పలకరింపుగా నవ్వింది.
   
    అతడు నవ్వు కూడా మరిచి చూస్తున్నాడు. ఆమె అందాన్ని కాదు. కళ్ళని....
   
    వాటిలో అత్యద్భుతమైన అందంకన్నా అతీతమైన ఆర్ద్రత వుంది. కరుణ వుంది. అవి దయని వర్షిస్తున్నాయి.

    ఆఁ..... గుర్తొచ్చింది.
   
    ఇవే కళ్ళు తాతయ్యకి వుండేవి. అవీ యిలాగే ఆప్యాయతని వర్షించేవి.
   
    ఆ ఆలోచన రాగానే అతడు ముగ్ధుడై ఆమెవైపు మరింత ఉత్సుకంగా చూశాడు.
   
    ఆమెనుంచి తనలోకి ఏదో ప్రవహిస్తున్న అనుభూతి..... తాతయ్య నుంచి తనకేదో అందుతున్న సంకేతం.
   
    అట్టడుగు అగాధాల్లో వున్నవాడిని పైకి లాగటానికి స్వర్గం నుంచి వచ్చిన శక్తి మెట్లు మెట్లుగా మారి ముందు నిలబడింది.
   
    ఆ రాత్రి అతడు దిండులో తలదాచుకుని పడుకున్నాడు తల్లి వడిలో పిల్లాడు తల దాచుకున్నట్టూ! మనసు చుట్టూ ఒక అందమైన భావం ముగ్ధమైన భావం ముగ్ధమైన పరిమళంలా ఆవరించుకుని వుంది.
   
    రెండడుగుల దూరంలో వున్న వైదేహి ఎంత కదిలి సవ్వడిచేసినా, అతడు తన వూహల్లోనే వుండి కదల్లేదు.
   
    కామం కన్నా ప్రేమ గొప్పదంటారు విజ్ఞులు.
   
    ప్రేమకి పరాకాష్ట కామం అంటారు అనుభవజ్ఞులు.
   
    ఉక్కిరిబిక్కిరి అయ్యేటంత విశ్వజనీయమైన ప్రేమలో అతడు కొట్టుకుపోతున్నాడు. అతడెక్కడ తేలతాడో కాలమే నిర్ణయించాలి.
   
    అది -
   
    ప్రేమా! కామమా ? అన్నిటినీమించిన వేదాంతమా ?
   
                       *    *    *    *
   
    కాళ్ళు పైకి తన్నిపెట్టి రివాల్వింగ్ చెయిర్ లో కూర్చొని తాపీగా పత్రిక తిరగేస్తున్న సర్క్యులేషన్ మానేజర్ చివర్లో 'సమాప్తం' అన్న పదం చూసి ఎగిరి పడ్డాడు. అప్పుడే వచ్చింది అతడి చేతిలోకి కొత్తసంచిక.
   
    ఇంటర్ కమ్ నొక్కి అడ్వర్ టైజ్ మేనేజరుతో 'హల్లో' అని చెవులు అదిరిపోయేలా అరిచాడు.
   
    "ఏమిటి? ఏమైంది?"
   
    "డామిట్! ఈ అడ్వర్ టైజ్ మెంట్ చూశారా."

 Previous Page Next Page