"ఆర్ భీమారావ్ , మెంబర్ ఆఫ్ పార్లమెంట్" అన్న అక్షరాలు కూడా భయంకరంగా కనపడుతున్నాయ్.
ఆ అక్షరాల్లోనుంచి ఓ బట్టతల వ్యక్తీ తనమీదకు తుపాకీ గురి చూస్తున్న చిత్రం అతని కళ్ళ ముందు కొచ్చింది.
సరిగ్గా అదే సమయంలో లోపల్నుంచి ఇల్లదిరేలా కేకలు వినిపించినాయ్.
"ఏమిట్రా! ఇడ్లి లోకి కొబ్బరి పచ్చడి చేయమంటే శనగపచ్చడి చేస్తావా! ఎంత ధైర్యం నీకు! ఇడియట్! ఆ శనగపచ్చడి నీకెలా తినిపిస్తానో తెలుసా? ఇలా - ఇలా- ఇలా-"
ఆ డైలాగ్ తో పాటు ఏదో పిండి పదార్ధం "తప్" మన్న శబ్దం తో ఎక్కడో పడుతున్నట్లు కూడా తెలుస్తోంది.
"బాబోయ్! పొరపాటయింది సారూ! రచ్చించండి" అన్న కేక.
దీప్ చంద్ గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయ్. వణుకు ఎక్కువయిపోయింది.
క్రమీపీ లోపల శభ్దాలు ఆగిపొయినాయి.
మరి కాసేపటి తర్వాత అమ్మాయి పరుగుతో, ఆనందంగా బయటి కొచ్చింది. "దీప్! లోపలకురా! ఇదే మంచి టైమ్! డాడీ మంచి మూడ్ లో ఉన్నారు...." అంటూ డ్రాయింగ్ రూమ్ లో ఎక్కడా దీప్ చంద్ కనిపించకపోయేసరికి నిర్ఘాంతపోయి నిలబడిపోయింది.
మొదటిసారిగా ఆమెకు తీవ్రమయిన నిరాశ కలిగింది. దాని వెనుకే కోపం, బాధా- అన్నీ మిళితమయిన భావన మొఖంలో ప్రవేశించింది. అక్కడే నీరసంగా సోఫాలో కూలబడి పోయింది 'ఇడియట్' అనుకుంది కసిగా!
*****
సికింద్రాబాద్ స్టేషన్ లో దిగాడు భవానీశంకర్. టైమ్ పొద్దున్న ఆరున్నరవుతోందప్పుడు. వేడివేడి "టీ" తాగుతే బావుంటుందానిపించింది. రైల్వే రిఫ్రెష్ మెంట్స్ కెళ్ళాడు. కానీ అక్కడ అప్పుడే ఓ ప్రయాణికుడు తాగిన టీ" అంతా వాష్ బేసిన్ లో వాంతి చేసుకోవడం చూశాక ఆ ప్రయత్నం విరమించుకుని బయటికొచ్చి నిలబడ్డాడు.
ఎదురుగా ఉన్న బస్ట్ స్టాప్, చెత్తా చెదారంతో పూర్తిగా కప్పబడి పోయి ఉన్న రోడ్లూ- ఆరున్నరకే కిటకిటలాడిపోతున్న అల్పా హోటలూ- అవన్నీ చూసేసరికి పాతరోజులు గుర్తుకొచ్చేసినాయ్.
యస్! నిజంగా గోల్డెన్ డేస్ అవి.
తనతో పాటు సెయింట్ మేరీస్ లో చదివిన జయకర్ గాడు , నిసార్ గాడు చిరంజీవి గాడూ, జోసఫ్ , రాదే శ్యామ్ -- వీళ్ళంతా ఎక్కడున్నారో - ఏం చేస్తున్నారో -
రాబిన్ హుడ్, రాజు వీళ్ళిద్దరే తనతో పాటు వైజాగ్ యూనివర్శిటీ కొచ్చేశారు. సూట్ కేస్ మోసుకుంటూ అల్పా హోటల్ చేరుకున్నాడు భవానీ శంకర్.
"టీ" తాగి నెంబర్ - వన్ బస్ ఎక్కాడు.
నలభై నిమిషాల సేపు దేశమంతా వన్ వే ట్రాఫిక్ లో తిరిగి చివరకు నారాయణగూడా చేరుకుంది.
అక్కడ దిగి తన జేబులో ఉన్న కాగితం తీసి, దాని మీదున్న ఇంటి నెంబరు వెతుకుతూ బయల్దేరాడు.
నూటపర్నాలుగు బై నాలుగు నెంబరు గల ఇంటి ప్రక్కనే తోమ్మిదోందల పదహారు బై ఒకటి నెంబరు ఇల్లు కనిపించే నగరం అవటం వల్ల చాలా సేపు పట్టిందతనికి- ఆ అడ్రస్ కనుక్కోడానికి.
"మాస్టారూ!" తలుపు బయటే నిలబడి పిలిచేడు.
పుట్టుకతోనే స్కూలు యూనిఫారంతో పుట్టినట్లున్న ఓ చిన్న పిల్ల చెంగున లోపల్నుంచి ఎగురుతూ బయటికొచ్చింది.
భవానీశంకర్ ఆ పాపను చూసి చిరునవ్వు నవ్వాడు.
"హాయ్! వాటీజ్ యువర్ నేమ్ బేబీ?"
"అపర్ణ అప్పర్ కేజీ! నీ పేరేంటి?"
"భవానీశంకర్ లోయర్ కే.జీ?"
ఆ పిల్ల ఆశ్చర్యంగా చూసింది.
ఈలోగా లోపల్నుంచి ఓ లావుపాటావిడ వచ్చేసింది.
"నమస్కారమండీ! మీ పేరు పార్వతమ్మగారే కదండీ! ఇదిగో - సీతారామయ్యగారు మీకీ ఉత్తరం ఇమ్మన్నారండీ.!"
"ఎవరూ! "వైజాగ్ కాలింగ్" సీతారామయ్యా!"
"అవునండీ!"
ఆవిడ ఉత్తరమంతా గడగడ చదివేసింది. ఆమె ముఖంలో ఎక్కడ లేని విచారం అల్లుకుపోయింది.
"అయ్యో పాపం ! "వైజాగ్ కాలింగ్" మూసేశారన్న మాట!" అంది దిగులుగా. చాలా తరచుగా తన ఫోటోలు ప్రచురించే పేపరు అదొక్కటే మరి!
"అవునండి పాపం'!"
"ఎందుకని పాపం!"
"ఏమోనండి పాపం! బహుశా ఎవరూ కొనక అనుకుంటానండీ!"
"అయ్యో నాకీ విషయం చెప్తే యాభయ్ కాపీలు మావారి ఫాక్టరీ తరపున కొనిపించేదానిని కదా!"
'అయినా లాభం ఉండడనుకుంటానండీ పాపం!"
"ఇంతకూ నీ పేరేమిటన్నావ్!"
"భవానీశంకర్ అండీ! గోల్డ్ మెడలిస్ట్ భవానీశంకర్!"
"అదేమిటి? గోల్డ్ మెడలిస్ట్ అనే యింటి పేరుంటుందని నాకింత వరకూ తెలీదు...."
"అబ్బే అది ఇంటి పేరు కాదండీ! గోల్డు మెడల్ యునివర్సి టి వాళ్ళు ఇచ్చారన్నమాటండీ నాకు!"
"అలాగా! ఎందుకు పాపం?"
"అదేనండీ! జర్నలిజంలో నేను తెగ చదివి ఫస్ట్ న పాసయ్యాను కదండీ పాపం! అందుకని గోల్డు మెడల్ యిచ్చారండీ!"
"అయితే నువ్వు జర్నలిస్ట్ వన్న మాట పాపం!"
"అవునండీ! "వైజాగ్ కాలింగ్" లో మీ ఫోటో కింద "భారతదేశంలో బీదలకు వెలుగు! పార్వతీదేవి వల్ల కలుగు!" అని కాప్షన్ రాసిందేవరనుకున్నారు? నేనేనండీ!"
"ఏమిటి? అది రాసింది నువ్వా? మా నాయనే! ఇదిగో - సావిత్రీ - ఓ సావిత్రీ! నేస్కేఫ్ కాఫీ తీసుకురా పాపం! కూర్చో నాయనా.కూర్చో !' మరింత ఆప్యాయంగా అందావిడ.
భవానీశంకర్ ఆనందంగా కూర్చున్నాడు.
"నీ ఉద్యోగానికే భయం లేదులే! ఎక్కడో చోట తప్పక ఇప్పిస్తాను! ఒకవేళ ఎక్కడా దొరక్కపోతే రేడియో స్టేషన్లో చేరిపో."
భవానీ శంకర్ ఉలిక్కిపడ్డాడు.
"రేడియో స్టేషన్లోనా? ఎక్కడా దొరక్కపోతే రేడియో స్టేషన్లో ఇచ్చేస్తారండీ?"
"అవును మరి! రేడియో స్టేషన్లు పెట్టిందెందుకు మరి? మనక్కావలసిన వాళ్ళకు ఎంప్లాయిమెంట్ ఎక్సెంజిలు, ఇంటర్యులు లాంటివి లేకుద్నా ఉద్యోగాల్లో వేసుకోడానికేగా.....నేను బోలెడు మందికి టెంపరరీ ఉద్యోగాలేయించాను అందులో పాపం! అంతగ్గాకపొతే నువ్వూ ముందు అందులోనే చేద్దువుగానిలే! ఆ తరువాత కావాలంటే మంచి ఉద్యోగం చూచుకోవచ్చు...."
"అబ్బే కాకుండా పోనీనండీ! అవనీ కుండానే వచ్చేస్తాను..."
"సరే ! వెళ్ళిరా పాపం!"
"అలాగేనండీ-" అని అక్కడే నిలబడ్డాడతను.
"ఇంకా నిలబడ్డావేం?" ఆశ్చర్యంగా అడిగింది పార్వతమ్మగారు.
"నాకోసం, సావిత్రిని నేస్కేఫ్ కాఫీ తెమ్మన్నారు కదండీ -"
"ఓ! సారీ, మర్చేపోయాను ! సావిత్రీ! ఒక కప్పు నేస్కేఫ్ నిజంగానే తీసుకురా'
! పాపం!"
*****
భవానీశంకర్ రోడ్డు మీద నడుస్తూ "జయంబు నిశ్చయంబురా, భయమ్ములేదురా జంకుబొంగు లేక ముందుకు సాగిపొమ్మురా" అన్న పాట విజి,విజిలేస్తున్నాడు.
అతనికిప్పుడు చాలా హుషారుగా ఉంది.
వైజాగ్ నుంచి రాజధానికి వలస రావటం చాలా మంచిదయింది. సీతారామయ్య లెటర్ నెంబర్ వన్ రేడియో స్టేషన్లో చిన్నసైజు ఉద్యోగం ఇప్పించింది.
లెటర్ నెంబర్ టూ - హిమాయత్ నగర్ లో రూమ్ ఏర్పాటు చేసింది. ఈ శుభ సమయంలో తన హైదరాబాద్ వలస గురించి విజ్జీకి ఉత్తరం రాయటమే తన ప్రస్తుత నడకకు కారణం!
ఎందుకంటె తను హైద్రాబాద్ లో సెటిలయితే ఆనందించేది ఆమె ఒక్కర్తే.
పోస్టాఫీస్ చేరుకొని ఇన్ లాండ్ కవర్ తీసుకుని ఉత్తరం రాయటం ప్రారంభించాడతను.
"హలో డియర్!"
నీకో అద్భుతమైన శుభవార్త! మా "వైజాగ్ కాలింగ్" (ది మోస్ట్ ప్రిస్టేజియస్ ఈవినింగ్ న్యూస్ పేపర్ ఆఫ్ వైజాగ్) మూతబడిపోయింది. అంచేత నేను పొట్ట చేత్తో పట్టుకుని హైద్రాబాద్కు వలస వచ్చేశాను. (నీ కోరిక నెంబర్ వన్ తీర్చేశాను! గుర్తుంచుకో) ఇక్కడ ప్రస్తుతం రేడియో స్టేషన్ లో క్యాజువల్ గా వర్క్ చేస్తున్నాను. త్వరలో నీకోరిక నెంబర్ - టూ ప్రకారం దీప్ చంద్ ని కలుసుకుని సరెండర్ అయిపోతాను - వార్తలు ఇంతటితో సమాప్తం!
యువర్స్ లవింగ్ బర్డ్ -"
ఉత్తరం పోస్ట్ చేశాక మళ్ళీ "రావోయి చందమామ' - మా వింత గాధ వినుమా?" పాట పాడుకుంటూ రేడియో స్టేషన్ చేరుకున్నాడు. ఆ రోజుకి సరిగ్గా పదిహేను రోజులయింది. రేడియో స్టేషన్ లో చేరి.
ప్రోడ్యుసర్లు, అసిస్టెంట్లు, అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టరూ - అందరూ బయటే నిలబడి ఉన్నారెందుకో!"
తనను చూడగానే "వస్తున్నాడు- వస్తున్నాడు" అని గట్టిగానే అనుకోవటం వినిపించింది భవానీశంకర్ కి!