Previous Page Next Page 
గోరువెచ్చని సూరీడు పేజి 3

    "ఈ వేలెట్ మీదే అనుకుంటాను"    
    విస్మయంగా అందుకుంది "అఫ్ కోర్స్"    
    "మీరీ వూరికి కొత్తో లేక వయసులో వుండడంలో కలల్లోకి జారి అజాగ్రత్తగా వున్నారో నాకు తెలీదు కాని ఇక ముందైనా కేర్ ఫుల్ గా వుండండి."   
    నిర్మొహమాటంగా అతడు మాట్లాడగలిగినందుకు అభినందించింది కాని కలలూ జాగ్రత్తలూ అంటూ అతడు చనువు తీసుకోవడాన్ని అంగీకరించలేకపోయింది. "యూ సీ మిస్టర్"   
    "కోపం తెచ్చుకోకండి మేడమ్" ఇందాక దొంగ వెంట కేకలు వేస్తూ పరిగెత్తిన వ్యక్తి ఇప్పుడు అతడి తరపున వత్తాసుగా అన్నాడు. "థూర్జటిగారి తీరే అంత- దొంగలకి పక్కలో బల్లెంలా వుండడంతో బాటు అజాగ్రత్తగా వ్యవహరించే వ్యక్తుల మీద కూడా ఇలా విరుచుకుపడుతుంటాడు."    
    కదలబోయిన థూర్జటిని చూస్తూ అంది "ఎక్స్ క్యూజ్ మీ.....మరోలా అనుకోకపోతే" వెయ్యి రూపాయలు అందించబోయింది.    
    థూర్జటి నేత్రాలలో రవ్వంత ఆవేశం కనిపించింది. "అంటే నేను చేసిన చిన్న సహాయానికి ఇలా ఖరీదు కట్టాలనుకుంటున్నారా."    
    "సారీ.... ఈ వేలెట్లో ఇరవై వేలు సేఫ్ గా వెనక్కి తెచ్చారు కాబట్టి చిన్న రివార్డ్." ఆమె నొచ్చుకుంటున్నట్టుగా అంది.    
    వెళ్ళిపోతున్నాడు థూర్జటి.    
    "మేడమ్" ఇంకా సమీపంలోనే నిలబడ్డ యిందాకటి వ్యక్తి అన్నాడు. "థూర్జటి గారు ఓ అనాధ నిరుద్యోగి మాత్రమే కావచ్చు. ఆపదలో వున్న వాళ్ళపై సానుభూతి చూపించడం ఆయన బలహీనత కావచ్చు అంత మాత్రం చేత డబ్బుకాయన లొంగిపోతాడని ఎలా అనుకున్నారు? అంతకన్నా ఆయన పసి పిల్లల కోసం నడిపే శరణాలయానికి డొనేషన్ అని ఇచ్చి వుంటే బాగుండేది."   
    ఆ వ్యక్తి ఇంకా మాట్లాడుతూనే వున్నాడు. కారులో కూర్చున్న కృషి వేగంగా ముందుకు పోనిచ్చి నడుస్తున్న థూర్జటి పక్కన ఆపింది. అతడు అబ్బురంగా చూస్తుండగానే అయిదు వేల రూపాయల బోట్లకట్టని అతడికి అందించింది. "యిది మీ కష్టానికి నేను కడుతున్న ఖరీదు కాదు. మీరు ప్రేమగా పెంచే పసిపిల్లలకి డొనేషన్"    
    డబ్బు తీసుకున్న ఆ యువకుడు ఆశ్చర్యంగా చూస్తుండగానే కారుని ముందుకు పోనిచ్చింది.    
    ఆ సంఘటనని సైతం కృషి మరిచిపోయేదే.    
    కాని కొన్ని పరిచయాలు మరికొన్ని విచిత్రమైన సన్నివేశాలకి కారణమౌతుంటాయి.   
    మరుసటి రోజు సాయంకాలం బంజారా రెస్టారెంట్ కి వెళ్ళిన కృషి అనుకోకుండా చూసింది నిన్నటి థూర్జటిని.    
    అతడ్ని మాత్రమే కాదు. అతడితో బాటు నిన్న అతడి ఔన్నత్యం గురించి మాట్లాడిన వ్యక్తిని, తన చేతిలోని వేలెట్ లాక్కుపోయిన దొంగని కూడా.    
    ముగ్గురూ ఓ టేబుల్ ముందు కూర్చుని ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు.    
    బహుశా తనను ఫూల్ చేసిన శుభ సందర్భంలో పార్టీ చేసుకుంటున్నారేమో.    
    ఆ సంఘటన్ని మామూలుగా తీసుకునే మూడ్ లో లేదామె. డబ్బు పోయినందుకు కాదు. ఈ దేశంలో యువత ఎంత నిర్వీర్యమైపోయింది అర్ధమైనట్టు ఆవేశంగా కౌంటర్ దగ్గరికి నడిచి పోలీసులకి ఫోన్ చేసింది.    
    అంతే-    
    పది నిముషాల్లో జీపులో వచ్చారు పోలీసులు.    
    ఇదేమీ గమనించని ఆ మిత్రత్రయం ఇంకా ఉత్సాహంగా మాట్లాడుకుంటున్నారు ఇంకా టేబుల్ ముందే కూర్చుని.    
    యస్సయ్ కి ఎదురు వెళ్ళిన కృషి తన కుటుంబ వివరాలు చెప్పకుండా తనను తాను పరిచయం చేసుకుంది.   
    టేబుల్ దగ్గర కూర్చున్న థూర్జటిని, మిగతా ఇద్దర్నీ చూపిస్తూ నిన్న సాయంకాలం తనతో జరిపిన "ఫౌల్ ప్లే" గురించి వివరించింది.  
    ఉన్నింటి యువతి పైగా చాలా అందమైన అమ్మాయి తన సహాయాన్ని అర్ధించడంతో ఉత్సాహపడిన యస్సయ్ వెంకటరావ్ "అరెస్ట్ హిమ్" అన్నాడు తన వెంటవున్న పోలీసుల్తో.    
    అప్పుడు చూశాడు థూర్జటి కృషిని. జరగబోయేదేమిటో గ్రహించిన ముగ్గురిలో ఇద్దరు పరుగు లంకించుకోగా థూర్జటి మాత్రం మొహంపై నవ్వు పులుముకుంటూ ముందుకొచ్చాడు. అంత పర్సనాలిటీ వుండి పారిపోవటం పరువు తక్కువన్నట్టుగా.   
    "హలో" పలకరించాడు కృషిని చూస్తూ. "పోలీసులతో వచ్చావేమిటి" అన్నాడు చాలా పరిచయమున్నట్టుగా.    
    "ఎందుకొచ్చిందీ స్టేషన్ లో డిసైడవుతుంది నడు" కృషిని మరింత ఇంప్రెస్ చెయ్యాలనుకున్న యస్సయ్ ఇంచుమించు నెడుతూ థూర్జటిని జీపు దగ్గరికి నడిపించాడు.   
    థూర్జటి నిర్లక్ష్యంగానే కాదు నిర్భీతిగా ప్రవర్తించడం కృషికి విస్మయంగా వుంది.    
    జీపు ఎక్కుతూ అన్నాడు కృషిని చూస్తూ "ఓకే త్వరలో కలుస్తాను."   
    అతడలా అన్నందుకు కాదు గాని జీపులోంచి థూర్జటి సీరియస్ గా తనను ఆపాదమస్తిష్కం గమనించడాన్ని ఈజీగా తీసుకోలేకపోయింది.   
    తను అనవసరమైన రొంపిలో అడుగు పెట్టిందా.    
    థూర్జటి చూపే ఇంకా ఆమెను వెంటాడుతూ ఆందోళన కల్గిస్తూంది.    
                                                           *    *    *    *    
    అర్దరాత్రి దాటిందన్న విషయం సైతం మరిచి చాలా ఏకాగ్రతగా చదువుతుంది కృషి.   
    బయట కుండపోతగా కురుస్తున్న వర్షం.... వున్నట్టుండి మొదలైన ఈదురుగాలి. అయినా ఆమె పట్టించుకోలేదు. 'ప్రోడిగల్ డాటర్' నవల్లోని ప్రతి కథా ఆమెకు విచిత్రమైన స్ఫూర్తిని అందిస్తుంటే తెల్లవారేలోగా పూర్తి చెయ్యాలనుకుంది.
    మరో పావుగంట గడిచిందో లేదో యుద్దభేరిలా పిడుగులు పడుతున్న చప్పుడు. అంతకు మించి చీకటిని విద్యుత్ ఖడ్గాల్లా చీల్చుతున్న మెరుపులు.... ఏకాగ్రత భగ్నమైపోయింది. ఏ దావానలపు ఉష్ణోగ్రతా వలయాలో ప్రపంచాన్ని చుట్టుముడుతున్నట్టు ప్రకృతి భీతావహంగా మారిపోయింది.    
    నవలని ఓ మూల నుంచి న కృషి గదిలో వుండలేనట్టుగా బయటకు నడిచింది.    
    కుడి ప్రక్కనున్న బెడ్ రూంలో గ్రాండ్ పా లేడు.    
    బయట నిశీధి సముద్రం ఉప్పెనలా విరుచుకుపడుతున్నంత ఆందోళాన్ని కలిగిస్తోంది.    
    నైటీ దిగువున వూరువుల్ని తాకుతున్న యోక్ స్కర్ట్ బరువుగా అనిపిస్తూంటే కారిడార్ లో నుంచి దిగువ హాల్ దాకా వచ్చింది.    
    నౌకర్లంతా నిద్రలోకి జారినట్టున్నారు. వుడ్ ఫ్లోరింగ్ పైనున్న కార్పెట్ మాత్రమే కాదు, ఇటాలియన్ ఆర్కిటెక్టు ప్రత్యేకంగా డిజైన్ చేసిన మాన్సార్డ్ రూఫ్ కూడా సన్నగా కంపిస్తున్న అనుభూతి.    
    ఆ రోజెందుకో మరింత ఒంటరితనంగా వుంది.   
    రోబ్స్ లో వున్న ఏంటిక్స్ గోడలకున్న ఖరీధైన తైలవర్ణ చిత్రాల్ని చూస్తుంటే ఇది తన సామ్రాజ్యం అనిపించడంలేదు. తనకోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన బంగారు పంజరంలా కనిపించింది.    
    ఆమె ఆలోచనల నుంచి ఇంకా తేరుకోలేదు.    
    భళ్ళుమన్న చప్పుడు వినిపించింది.    
    అర్ధమైపోయింది ఆ శబ్దం ఎక్కడనుంచో.    
    ఒక్క ఉదుటున స్టెయిర్ కేస్ పైనుంచి బెడ్ రూంలోకి పరుగుతీసింది.    
    ఫ్రెంచి విండో పగిలి వుంది.    
    సెంట్రల్లీ ఎయిర్ కండీషన్డ్ గది కాబట్టి కిటికీ రెక్కలు మూసే వుంటాయి. గాలికి కొట్టుకొనే అవకాశం లేనప్పుడు ఎలా పగిలిందది.    
    వెల్ వెట్ కార్పెట్ పై ముత్యాల్లా మెరుస్తున్న గాజు ముక్కలు.    
    ఇప్పుడు ఈదురుగాలి గదిలోకి ప్రభంజనంలా దూసుకొస్తూ ఆమె నైటీని వానతో తడిపేస్తూంది.    
    "గాడ్"   
    కృషి వేగంగా పక్కకి జరగబోతూ అప్పుడు చూసింది.    
    "నువ్వు" తడబడిపోయింది థూర్జటిని చూస్తూ. "హౌ డేర్ యూ ఆర్... ఎలా లోపలికి వచ్చావ్"    
    కెవ్వుమనబోతూ ఆగిపోయింది.
    నౌకరు నిద్రలేవడం ఇలాంటి వాటిని చూడటం ఆమెకిష్టం లేదు.

 Previous Page Next Page