Previous Page Next Page 
క్లైమాక్స్ పేజి 3

అపుడు చూశాడు హరీన్ ఆ అమ్మాయి వైపు.

భయంతో, ఆయాసంతో రొప్పుతోంది తను.

ఇంతలో -

చెవులు చిల్లులు పడేటట్లు రైలు కూత వినబడింది. చటుక్కున తలతిప్పి చూశాడు హరీన్. బ్రిడ్జికి అవతల వైపునుంచి తుఫాను మెయిల్ లా - దూసుకోస్తోంది ఏక్స్ ప్రెస్ ట్రెయిన్. అప్పటిదాకా అతను ట్రెయిన్ రాకని గమనించలేదు.

వెంటనే ఆ అమ్మాయిని గుర్రం మీదికి లాగేసుకున్నాడు హరీన్ బ్రిడ్జి మీదుగా వెనక్కి వెళ్ళేంత వ్యవధి లేదు. ట్రెయిన్ క్షణక్షణానికీ దగ్గరవుతోంది.

నదిలోకి చూశాడు.

ఇందాక నదిలోపడ్డ రౌడీ లేచి, కుంటిబాతులా తపతప నీళ్ళలో నడుస్తూ, ఒడ్డు చేరుకుంటున్నాడు. కాలు విరిగి వుండాలి వాడికి.

నుదురు చిట్లించాడు హరీన్. ఇక్కడనుంచి ఒడుపుగా దూకితే దెబ్బ తగలదు. దెబ్బతగలకుండా దూకే ఆ ఒడుపు ఏమిటో తనకి తెలుసు. గుర్రంతో , ఈ అమ్మాయితో సహా సురక్షితంగా జంప్ చేయ్యగలడతను.

సాహసం తన ఉపిరి!

అప్పుడు హటాత్తుగా అతని ద్రుష్టి ఒక దృశ్యం మీద నిలిచిపోయింది.

అక్కడికి కొద్ది దూరంలో -

నది పొంగుతూ ముందుకు వస్తోంది. గత రెండు రోజులుగా ఉదృతంగా వర్షాలు పడ్డాయి. అక్కడికి కొద్ది మైళ్ళ దూరంలో - నదీ తీరానికి దగ్గరగా అప్పటికప్పుడు పొంగి, అంతలోనే వరద తగ్గిపోయే లక్షణం వుంది ఆ నదికి.

రెండుగాజాల ఎత్తున వున్న గోడ వేగంగా ముందుకు జరిగి వస్తున్నట్లు ముంచుకు వచ్చేస్తోంది వరద! తీక్షణంగా  చూస్తున్నాడు హరీన్. ఇంత ఎత్తు నుంచి, ఆ వరదలోకి దూకితే, తాము బతకగలరా అసలు!

మళ్ళీ గుండెలు అవిసేలా కూతపెట్టి, బ్రిడ్జి మీదకి ఎక్కింది రైలు. అ వేగానికి దడదడలాడటం మొదలెట్టింది బ్రిడ్జి.

భయంతో కళ్ళు మూసుకుంది హరీన్ చేతుల్లో వున్న ఆ అమ్మాయి.

స్టంట్ మాన్ రతన్ జరగబోయే భీభత్సాన్ని చూడలేక మొహం పక్కకి తిప్పుకున్నాడు. క్షణక్షణానికి దగ్గరయి పోతోంది ట్రెయిన్. ఇంక ఆలోచించలేదు హరీన్. ఆలోచించే వ్యవధి కూడా లేదు. ఆ అమ్మాయిని చేతుల్లో పొదువుకుని, అంత ఎత్తుమీద నుంచీ, ముంచుకొస్తున్న వరదలోకి జంప్ చేయించాడు గుర్రాన్ని.

                                            3

హరీన్ గుర్రం మీద కూర్చుని ఆ అమ్మాయితో సహా వరద ముంచుకొస్తున్న నదిలోకి దూకేయ్యగానే గుండె ఆగిపోయినట్లయింది చూస్తున్న స్టంట్ మాన్ రతన్ కి.

నీళ్ళలో తేలుతున్న హరీన్, అతని గుర్రం , అతను రక్షించిన ఆ అమ్మాయి మూడు చుక్కల్లా అదృశ్యమైపోయారు నీళ్ళలో.

తన గుర్రాన్ని నదిఒడ్డునే కొంత దూరం పరిగెత్తించి, కంగారుగా వాళ్ళ కోసం వెదికాడు రతన్ , కానీ వాళ్ళ జాడ తెలియలేదు.

అతను విచారంగా వెనక్కి తిరిగివచ్చి, ఈ సంగతి చెప్పగానే చిత్రం యూనిట్ మెంబర్స్ అందరిలో అలజడి మొదలయింది. ఎక్కడి పనులు అక్కడ ఆగిపోయాయి. ఎవరికీ కాళ్ళు చేతులు ఆడటంలేదు. హీరోయిన్ మధుమతి వివశురాలాయిపోయి ఏడవడం మొదలెట్టింది.

పోడ్యుసర్, డైరెక్టర్ ఒక కారు ఎక్కి దగ్గరలో వున్న ఒక టౌన్ లోకి వెళ్ళి పోలీసు రిపోర్టు ఇచ్చారు. హుటాహుటిన వచ్చారు పోలీసులు. వస్తు వస్తూ గజఈతగాళ్ళని కొంతమందిని వెంటబెట్టుకొచ్చారు.

కానీ అంత పెద్ద గజఈతగాళ్ళు కూడా వరద ఉదృతం చూసి బెదిరి గట్టునే నిలబడిపోయారు గానీ, నీళ్ళలోకి దూకడానికి ఎవరూ సాహసించలేదు.

                                                          * * *

నదిలో కొట్టుకుబోతున్నాడు హరీన్, అతని చేతుల్లో దాదాపు అపస్మారక స్థితిలో వుంది అతను రక్షించిన ఆ అమ్మాయి.

వాళ్ళకి ముందు కొంచెం దూరంలో గుర్రం కొట్టుకు పోతోంది.

ఉక్కిరిబిక్కిరైపోతోంది హరీన్ కి. ఉపిరి ఆడటం లేదు. కాళ్ళకి వేసుకున్న బూట్లు బరువుగా కిందికి లాగేస్తున్నాయి. అతికష్టం మీద బూట్లని వదిలించుకున్నాడు హరీన్.

చూస్తూ ఉండగానే ప్రవాహ వేగం మరింత ఎక్కువయిందనిపించింది హరీన్ కి.

ప్రయత్నపూర్వకంగా తల సారించి చూసాడు. అప్పుడు హటాత్తుగా స్పురించింది అతనికి - ముందు ఏముందో!

అక్కడికి కొద్దిదూరంలో జలపాతంలా నురగలు కక్కుతూ కిందికి ఉరుకుతోంది నది. ఆ నది ఒక లోయలోకి దూకే చోటు అది.

ఆ స్పాట్ బాగా తెలుసు హరీన్ కి. అక్కడ చాలాసార్లు షూటింగ్ లో పాల్గొన్నాడతను.

నడిలోయలోకి దూకే ప్రదేశంలో అక్కడంతా ఎత్తుగా పెద్ద పెద్ద బండరాళ్ళు వుంటాయి. చూడటానికి నదిలో నిలబడి స్నానం చేస్తున్న ఏనుగుల గుంపులా వుంటాయి ఆ బండరాళ్ళు.

వాటిమీద తనూ, హీరోయిన్ మధుమతీ, కలిసి తడుస్తూ , దొర్లుతూ ఎన్నో డ్యుయేట్లు పాడారు - లెక్కలేనన్ని సినిమాల్లో.

ఇప్పుడు గనక తను ఈ అమ్మాయితో సహా ఆ ద్వీపంలాంటి బండల మీదకి ఎక్కగలిగితే ప్రాణాలు దక్కుతాయి. ఇది తమకి చివరి అవకాశం - నిశ్చయంగా!

కానీ ఎలా ఎక్కడం ఆ ద్వీపం మీదకి? ఉపిరాదానివ్వడం లేదు వరద. ఆలోచించుకునే వ్యవధి కూడా లేదు. కొట్టుకు పోతున్నారు తామిద్దరూ. విసురుగా ఆ రాళ్ళ గుట్టల దగ్గరికి వచ్చేశారు. ఇంకో క్షణంలో వాటిని దాటిపోతారు కూడా!

హరీన్ చేతుల్లోని ఆ అమ్మాయికి అప్పుడే స్పృహ వచ్చినట్లుంది. జరుగుతున్నది గ్రహించి ప్రాణభయంతో వెర్రికేక వేసింది.

అప్పుడు వినబడింది హారీన్ కి, ఆ అమ్మాయి కేకనీ, ఆ నీళ్ళ ఒరవడిచప్పుడిని కూడా మింగేస్తూ గుర్రం సకిలింపు, చాలా పెద్దగా. మరుక్షణంలో అతని చేతికి తగిలింది ఆ గుర్రం తాలూకు కళ్ళెం. తక్షణం దాన్ని బలంగా పట్టేసుకున్నాడు హరీన్. ఆ కళ్ళెం ఇంకా గుర్రానికి తగులుకునేవుంది. రాళ్ళగుట్టలమీద నిలబడి వుంది గుర్రం. నదిలో కొట్టుకుపోతూ వచ్చి అదృష్టవశాత్తు ఆ బండల మీదికి ఎక్కగలిగింది అది.

హరీన్ తన కళ్ళాన్ని అందుకోగానే , అతన్ని కూడా ఆ గుట్టల మీదికి లాగడానికి ప్రయత్నిస్తూ వెనక్కి వెనక్కి నడవడం మొదలెట్టింది.

దాని ఉద్దేశం అర్ధం అయింది హరీన్ కి. ఆ నోరులేని జంతువు తమని రక్షించాలని చూస్తోంది. ఆ ఉహే ఎక్కడలేని శక్తిని, ఇచ్చింది హరీన్ కి. ఒక చేత్తో ఆ అమ్మాయిని బలంగా పట్టుకున్నాడు. రెండో చేత్తో కళ్ళెం చుట్టూ పట్టు మరింత గట్టిగా బిగించాడు.

గుర్రం ఇంకా వెనక్కి నడిచింది.

ఒకవైపు ప్రవాహ వేగం హరీన్ ని, ఆ అమ్మాయిని లోయలోకి లాగేయ్యాలని చూస్తోంది. మరోవైపు గుర్రం తమని గుట్టల మీదికి లాగాలని విశ్వప్రయత్నం చేస్తోంది. రెండువైపుల నుంచి అలా లాగి వెయ్యబడుతూ వుండటం వాళ్ళ తన రెండు చేతులూ ఉడి వచ్చేస్తాయోమోనని అనిపించింది హరీన్ కి. అయిపోతోంది తన పని. ఇంక రెండు మూడు క్షణాలలో........

కానీ- అప్పుడు జరిగింది ఆ అద్బుతం! తన శరీరంలో శక్తి క్షీణించి పోతోంది అనిపించాక, ఆ చివరి క్షణంలో ఆ రాతిబండల మీద పట్టుదొరికింది హరీన్ కాలుకి. వెంటనే లాఘవంగా ఆ గుట్టల మీదికి ఎక్కేశాడు హరీన్. ఆ అమ్మాయిని కూడా పైకి లాగేసుకున్నాడు.

ఆ అమ్మాయి అప్పుడు మొదటిసారిగా గుండెల నిండా గాలి పీల్చుకుని, గుర్రాన్ని ఆప్యాయంగా నిమురుతున్న హరీన్ వైపు కృతజ్ఞత తో చూసింది.

వెంటనే ఆమె కళ్ళు ఆశ్చర్యంతో విప్పారాయి.

"మీరు ......మీరు...........ఓహ్ మీరు హరీన్ కదూ?" అంది సంతోషంగా.

అవునన్నట్లు తలపంకించాడు అతను.

"నేను మిమ్మల్ని చాలాసార్లు టీవిలో చూశాను" అంది ఆ అమ్మాయి ఉద్వేగంతో, "మా బంధువుల ఇంట్లో టీవీ వుంది"

 Previous Page Next Page