ఈ మాటలు కుమార్ కి మండుతున్న మనసుమీద పన్నీటిజల్లు కురిపించినట్లయింది.
"మీ కెలా తెలుసు?"
"ఆడదానిని గనుక తెలుసు!" సుందరమ్మ ముఖం నిండా మబ్బులు. ఆ మబ్బులు అలా కనబడినపుడు సుందరమ్మతో మాట్లాడలేడు కుమార్. ఆ అంతరంగంలో లోపల ఎంతగా దంహిచుకుతోందో, ఊహించటానికి కూడా అతడికి మనస్కరించదు.
ఆ సమయంలో వచ్చింది సరళ. ఆమె కుమార్ క్లినిక్ కి వచ్చి చాలా రోజులయింది. సరళ ముఖం చాలా దిగులుగా, సమస్తమూ పోగొట్టుకున్న వ్యక్తి ముఖంలాగ ఉంది. జీవకళ అన్నది వెతికి చూసినా కనిపించటంలేదు.
"సరళా! అన్నాడు కుమార్, ఆందోళనా అనునయమూ కలిపి.
"అలా ఉన్నావేం? ఏం జరిగింది?"
అక్కడే ఉన్న సుందరమ్మ వంచిన తల ఎత్తలేక పోతోంది. ఏదో అపరాధం చేసినదానిలా సరళ ముఖం చూడలేక పోతోంది.
"డాక్టర్! ఈ రోజు నేను మీ కోసం రాలేదు. మీ మందులవల్ల తగ్గేజబ్బు కాదిది."
సరళ కంఠంలో నిరాశా నిస్పృహలు దైన్యంలో కలిసి వినిపిస్తున్నాయి. ఆ కంఠం వింటోంటే, సుందరమ్మకు మనసులో చెయ్యిపెట్టి కలచినట్లయింది. దిగ్గున తలెత్తి "ఆ దుర్మార్గుడు నిన్నింకా బాదిస్తున్నాడా అమ్మా!" అంది...
"అవును వదినా! ప్రతి రోజూ కౌరవ నరకం నా కళ్ళ ముందు కనిపిస్తుంది."
"ఆ ఛండాలుడు నిన్ను హింసించి నాకు డబ్బు తెస్తున్నాడని, నా గడపలో కాలుపెట్టోద్దని కుక్కను తరిమినట్లు తరిమి కొట్టాను. ఇంకా నిన్ను హింస పెడుతున్నాడా?"
"అవును వదినా! అది హింసే! కానీ నువ్వనుకొంటున్న హింసకాదు. అతడు నన్ను కొట్టడం లేదు. కానీ..."
""కానీ....." సుందరమ్మ ఆరాటంగా చూసింది. ఆ చూపులలో సరళ పట్ల ప్రేమ పొంగి పొర్లుతోంది. సరళ కూచున్నది లేచి వచ్చి సుందరమ్మ వడిలో తల పెట్టుకుని ఏడుస్తూ వదినా! నీకేం చెప్పను? ఎలా చెప్పను?" అంది.
"ఫరవాలేదమ్మా చెప్పు! వాడిని ఏ విధంగా శిక్షించాలో నేను ఆలోచిస్తాను. వాడిని గిరగిర తిప్పి నీ కాళ్ళ ముందు పడేస్తాను."
"వద్దు వదినా అదే వద్దు! నాకిప్పుడింత ఘోరనరకం అందుకే!"
సుందరమ్మ కేమీ అర్ధంకాలేదు. అయోమయంగా "ఏమిటమ్మా!" అంది.
"వదినా ఏమీ అనుకోకు!....ఆ వెధవ నువ్వన్నట్లు కుక్క వెధవ. నువ్వు తరిమి కొడితే, నన్ను ప్రేమించటానికి తయారయ్యాడు. ఆ ప్రేమ, ఆ కుళ్ళు ప్రేమ, నేను భరించలేను వదినా! భరించలేను. నాకు డబ్బక్కర్లేదు నాన్నని పీడించి ఆ డబ్బేదో పట్టుకుపోనియ్యి వదినా, అతడి ప్రేమ నువ్వే భరించు. అతడి దెబ్బలు నేను సంతోషంగా తినగలను. నా కోసం ఈ త్యాగం చెయ్యవా వదినా!"
నిర్ఘాంతపోయింది సుందరమ్మ. అమాయకురాలైన ఈ ఆడపిల్లలో వెలిగే అమృతప్రేమ ఆమెనుఒక్కసారిగా అధఃపాతాళాలకు తోసివేసింది. ఇంతకుముందే తను కుమార్ తో "నేను ఆడదాన్ని గనుక...." అంది. ఎంత అబద్ధం. ఆ మాటలు? స్త్రీత్వంలోని మాధుర్యం-ఇప్పుడు తన కళ్ళముందు వెలుగుతోన్న దివ్యప్రేమ మాధుర్యం- ఏనాడైనా, తన దరిదాపుల్లోకైనా వచ్చిందా? ఎందుకు తన స్త్రీజన్మ? తను చేసింది, చేస్తున్నది, చెయ్యబోయేది త్యాగమంటోంది ఈ అమాయకురాలు. కాదు! కాదు! సృష్ట్వాదినుండీ, విశ్వాన్నే సమ్మోహపరుస్తోన్న స్త్రీ అంతరంగ సౌందర్యం!"వాట్ ఎట్రాజిడీ! సరళ ఎంత దురదృష్టవంతురాలు!" అన్నాడు, దయనీయమైన ఆ దృశ్యాన్ని చూడలేని అమాయక స్నేహశీలి కుమార్.
"కాదు. సరళ ఎంతో అదృష్టవంతురాలు!" అంది సుందరమ్మ.
కన్నీరు తుడుచుకుంటూ శోకమూర్తిలా ఉన్న సరళనీ, కంట తడి అన్నది కేక జీవంలేని శిలావిగ్రహంలా ఉన్న సుందరమ్మనీ, మర్చి చూసి, ఒక్క నిట్టూర్పు విడిచాడు కుమార్.
* * *
చేతిలో ఒక చిన్న పాత ట్రంకుపెట్టె పట్టుకుని గుమ్మంలో నిలబడ్డాడు సుబ్రహ్మణ్యశాస్త్రి. పేంటూ షర్టూ వేసుకుని, నుదట వీభూతిరేఖలుకూడా చక్కగా దిద్దుకొన్నాడు. వీధి గదిలో కూచుని, అరుపు తెచ్చుకొన్న పాత పత్రిక తిరగేస్తున్న ఝాన్సీ అక్క నాగమాంబ దిగ్గున లేచి, ఇంట్లోకి తల్లిదగ్గరికి పరుగెత్తి "అమ్మా! ఆయన వచ్చారే!" అంది. వంట చేస్తున్న ఝాన్సీ తల్లి అచ్చమాంబ చెయ్యి కడుక్కుని, ఆ చెయ్యిపమిటకొంగుకి తుడుచుకుంటూ, "ఏమిటి అల్లుడుగారు వచ్చారా? రండి! రండి!" అని మర్యాదలతో లోపలి తీసికెళ్ళి కుర్చీలో కూచోబెట్టి "స్నానం చేస్తారా?" అంది.
"ముందు కాస్త కాఫీ ఇయ్యండి!" అన్నాడు, అతడు ధాటీగా ఆజ్ఞాపిస్తున్నాడు.
"అలాగే! అలాగే!" అంటూ హడావుడిగా లోపలికి తడబడుతూ పరుగులాంటి నడకతో వెళ్ళింది ఆవిడ. ఈ హడావుడికి ఝాన్సీ బయటికి వచ్చింది. కుర్చీలో కూచున్న వ్యక్తిని చూసి ముందు తెల్లబోయింది. ఆ తర్వాత అసహ్యం పొంగుకొచ్చింది. ఈ వ్యక్తి కేవలం మొగవాడిననే అహంకారంతో భార్యను పుట్టింటికి తోలేసి ఐదువేలు తెస్తేగాని కాపురానికి రావద్దన్నాడు. ఛీ కొట్టి బయటికి తరమవలసిన ఈ వ్యక్తిని తల్లి ఇంట్లో కూచోబెట్టి సకల మర్యాదలూ చేస్తుంది. అక్క కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ బేలగాచూస్తుంది. ఈ మొగుడిముందు అందంగా కనబడటానికి ఎదురుగాఉన్న అద్దం చూసుకుంటూ చిందరవందరగా ఉన్న జుట్టు సర్దు కుంటోంది. ఈ కుహన సంస్కారం నుండి ఈ జాతికి విముక్తి లేదా? సుబ్రహ్మణ్యశాస్త్రి ఝాన్సీని చూసి అదొకరకంగా నవ్వి 'ఝాన్సీ! డాక్టర్వయిపోయావటగా! అంతేగాక పెద్ద గ్రంధ సాంగురాలవయిపోయాట కదా!" అన్నాడు.
ఆ నవ్వుచూస్తే ఎప్పుడూ అసహ్యమే ఝాన్సీకి. అదేం నవ్వోకాని, ఎప్పుడూ ఎదుటి వాళ్ళను వెక్కిరించినట్లే ఉంటుంది. ఎదుటివాళ్ళ మనసులలో ఏ మారుమూల ఏం ఉందో, కెలికి కెలికి చూద్దామని ఆరాటపడుతున్నట్లుగా ఉంటాయి" అతని చూపులు....
మనసులో పోంగుతోన్న అసహ్యాన్ని బలవంతాన మింగుతూ తీక్షణంగా "అంటే?" అంది.
ఈ శాస్త్రిలో మరో లక్షణం కూడా వుంది. మెత్తగా ఉన్నంతసేపూ దూకుడుగా మాట్లాడే మనిషి తిక్షణంగా ఎదురు తిరిగితే చప్పబడిపోతాడు. అదేదో పశులక్షణం అనిపిస్తుంది ఝాన్సీకి.
శాస్త్రి నీళ్ళు నములుతున్నట్లుగా వెకిలినవ్వుతోనే, "ఏమో మరి! మీ అక్కయ్య వ్రాసింది. ఇందులో మాయామర్మాలు మీకే తెలియాలి?" అన్నాడు.
నిర్ఘాంతపోయింది ఝాన్సీ. అక్క! తన ఇంట్లో తన పోషణలో ఉంటున్న అక్క, అవకాశం దొరికినప్పుడల్లా తన చెవులు చిల్లులు పడేలా మొగుడిమీద నేరాలు చెప్పే అక్క, తనమీద మొగుడికి రాసిందా? అక్కవైపు తిరిగి కళ్ళలోంచి నిప్పులు కురిపిస్తూ "ఏం రాసావక్కా?" అంది. నాగమాంబ వణికిపోయింది.
"అప్పుడు....నువ్వా తక్కువ కులం వాళ్ళతో ఉంటోంటే, అమ్మ ఏడుస్తోంటే చూడలేక ఆయనకు రాసాను నాకష్టం సుఖం ఆయనకు కాక మరెవరికి చెప్పుకొంటాను?"
శాస్త్రి భార్య మాటలకు సంతోషిస్తున్నట్టు "అలా బుద్ధి చెప్పు" అన్నాడు. ఆ ఆదర్శసతీవతుల మధ్య వుండలేక, చెప్పు తీసుకొని కొట్టినట్లు సమాధానం చెప్పలేక అక్కడినుంచి వచ్చేసింది ఝాన్సీ.
ఆస్పత్రికి వచ్చిన ఝాన్సీ మస్తిష్కం మరిగిపోసాగింది. "మీరంతా నా ఇంట్లోంచి పొండి!" అని ఎందుకు అనలేక పోతోంది? ఇది తనలో బలహీనతా? లేక ఔన్నత్యమా?
సమాజాన్ని ఎదిరించటం అంటే ఏమిటో? తల్లి. అక్క, తమ్ముడు సమజానికి కేంద్రం అంటుంది. అర్ధం పర్ధంలేని ఆచారాలు, మనిషిని మరబొమ్మని చేసే సాంప్రదాయాలూ, సొంత వ్యక్తిత్వాన్ని ఏ మాత్రం తల ఎత్త నీయకుండా, వ్యవస్థ అనే యంత్రంలో ఒక శీలగా మార్చి ఉంచాలని ప్రయత్నించేదే కుటుంబమా? కానీ, కుటుంబమంటే, అక్కా, బావా మాత్రమే కారు. వృద్ధిలోకి రావలసిన తమ్ముడూ, చెల్లీ కూడా ఉన్నారు. ఒకసారి హార్ట్ అటాక్ వచ్చి, జీవితమంతా కుటుంబ కోసం శ్రమపడి అనారోగ్యంతో బలహీనంగా ఉన్న తల్లికూడా ఉంది వీళ్ళని వదిలి తన సుఖం తను చూసుకోవటం న్యాయమా? సమర్ధనీయమా?