రాధకు అక్కడ్నించి వెళ్ళిపోవాలని వుంది. వెళ్ళకూడదనీ వుంది. అతడు చూపుల బంధంతో తనను ఆపుతున్నట్లుగా ఫీలింగ్, కానీ ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి?
"మీ తోట చాలా బావుందండీ మీరీ బంగ్లాలో వుంటారనుకుంటాను, చాలా అదృష్టవంతులు మీరు ఎంచక్కాకవితలు చదువుకుంటూ, పాటలు పాడుకుంటూ రోజులు క్షణాల్లా గడిపేయవచ్చు".
"మీకు సాహిత్యం అంటే అభిమానమా?"
"ప్రాణం కాని మీలా పాడుకోలేననుకోండి. చదువుకోవడానికే టైమ్ దొరకదు. నా దురదృష్టానికి బాధపడడం తప్ప ఏం చెయ్యలేను".
కాసేపు మాట్లాడి అతడు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి అనూరాధకి నిద్రపట్టలేదు. కళ్ళు మూసినా తెరిచినా అతడి రూపే. మొదటి చూపులోనే ప్రేమ కలగడం అంటే ఇదేనా? అతడి గురించి ఏమీ తెలియదు. అతనయినా ఏమీ అడగలేదు, చెప్పలేదు. ఏమీ తెలియని అతడిని తను నిజంగా ప్రేమిస్తోందా? అదసలు ప్రేమేనా లేక కేవలం ఆకర్షణా? అతడు తన గురించి ఏమీ అడగలేదు. తన అందాన్నీ, చదువునీ పొగడలేదు. మాట్లాడిన కాస్సేపు తోట గురించే అడిగాడు. తన అభిరుచులన్నీ తెలిసినట్లుగా మాట్లాడాడు. అందుకే అతడిపట్ల ఆకర్షితురాలయింది. అయిదు నిమిషాల పరిచయంతోటే అంతగా ఆలోచించటం అవివేకం అనుకుంది. కాని వలపుబాణం తగలడానికి అరసెకండు చాలునన్న విషయం తెలియలేదామెకు.
రాత్రిళ్ళు నిద్రపడితే అతడి రూపమే కలలో కూడా ఉదయం లేచి తోటలోకి వెళితే అతడి జ్ఞాపకాలే, 'కలనయినా నీ తలపే, కలవరమందైనా నీ వలపే' అన్న పాత గుర్తొస్తోందీ పదేపదే. పారిజాతాలన్నీ ఏరి, 'రాధా మోహన్' అని దిద్దుకుంది వాటితో పేర్లు కూడా చక్కగా కుదిరాయనిపించింది.
తన అవివేకత ఆమెకు అర్ధం అవుతూనే వుంది. కాని సెంటిమెంటుకి రీజినింగ్ వుండనట్లే అనుభూతికి రూపం వుండదు. రాధ మనసు ఆమె కంట్రోల్లో లేదిప్పుడు (ఆమె ప్రవర్తన పాఠకులకు పిచ్చిగా అనిపిస్తే క్షమించాలి.)
చాలా రోజులవరకూ మోహన్ ఆమెకు మళ్ళీ కనిపించలేదు సెలవులయి పోయాయి. కాలేజీకి వెళ్ళడంతో రొటీన్ లో పడిపోయింది. అతడి గురించి మర్చిపోవాలని అనుకుంటున్న సమయంలో మళ్ళీ కనిపించాడు. ఈసారి బస్టాండులో... ఎదురుగా ఆగిన కార్లో కూర్చున్న అతడిని చూడగానే ఆమె గుండె లయ తప్పింది.
"రండి డ్రాప్ చేస్తాను" డోరు తెరచి అన్నాడు.
"ఫరవాలేదు. బస్సొచ్చేస్తుంది" అంది. అది సిగ్గో, అన్నాళ్ళూ కనిపించనందుకు కోపమో ఆమెకే తెలియదు.
"అంత సందేహం దేనికి? ఆటే వెళుతున్నాను రండి" అర్ధింపుగా అన్నాడు ఎక్కి కూర్చుంది రాధ.
"ఉమెన్స్ కాలేజీలోనేనా చదివేది?" డ్రైవ్ చేస్తూ అడిగాడు.
"మీకెలా తెలుసు?"
"మనసుంటే మార్గముంటుంది అంటారు. మీరు నాకు చాలా సార్లు జ్ఞాపకం వచ్చారు. అన్నీ తెలుసుకోవలసి వచ్చింది".
ఆమె హృదయం ఝల్లుమంది. తనలాగే అతడూ తన గురించి అంతగా ఆలోచిస్తున్నాడన్నమాట. అది అదృష్టం కదా? చూస్తే అతి సాధారణ వ్యక్తిలా అనిపిస్తున్నాడు. కారెలా మెయిన్ టెన్ చేస్తున్నాడో?
"ఈ కారు నాదికాదు, నిజం చెప్పాలంటే నేను చాలా బీదవాణ్ణి- మామూలు మనిషిని" అన్నాడతను ఆమె మనసులోని మాట గ్రహించినట్లుగా.
"అంటే?"
"అంటే నేను కారు మెకానిక్ ని ఎస్సెస్సెల్సీ వరకే చదువుకో గలిగాను, బాధ్యతలు నన్ను పై చదువులకి వెళ్ళనివ్వలేదు. సిగ్గు పడాల్సిందేముంది? నాకు చేతనయిన విద్యయిది. కొన్నాళ్ళు మరో వర్క్ షాపులో ట్రయినింగు చేసి తర్వాత స్వంతంగా పెట్టుకున్నాను మరో భాగస్తుడిని కలుపుకుని".
అతడి మాటల్లో నిజాయితీ కనిపించింది. కాలేజీ చేరేవరకు అతడు తన గురించి చెపుతూనే వున్నాడు.
అతడికి తండ్రిలేడు ఆయన అకస్మాత్తుగా పోవడంతో ఇద్దరు తమ్ముళ్ళు, ఇద్దరు చెల్లెళ్ళ బాధ్యత ఒక్కసారిగా మీదపడింది. చదువు మానేసి సంపాదనలో పడాల్సిన అవసరం వచ్చింది. ఇంటర్ కూడా పూర్తి కాని చదువుకి ఏ ఉద్యోగం దొరుకుతుంది? అందుకే అయిదేళ్ళపాటు పనినేర్చుకున్నాడు. ఇప్పుడు దాచుకోవడానికి మిగలకపోయినా తన కుటుంబానికి ఏ లోటూ లేకుండా జరిగిపోతుంది.
రాధకు ఆశ్చర్యం అనిపించింది. చదివింది ఎస్సెస్సెల్సీయే ఐనా కృష్ణశాస్త్రినీ, కీట్సునీ గుర్తు పెట్టుకుని ఆరాధించడం! అదే అడిగేసింది.
"సాహిత్యం నా అభిమాన సబ్జెక్టు పై చదువులు అంటూ చదవగలిగితే లిటరేచర్ తీసుకోవాలనుకునేవాణ్ని ఇప్పుడేమో పదహారు గంటలు కష్టపడ్డాక అరగంటసేపు ఏదన్నా చదువుకోవాలన్నా కుదరడంలేదు".
"మరి ప్రైవేటుగా చదవలేకపోయారా?"
"అదీ వీలుకాదు. నావి ఫిక్స్ డ్ టైమింగ్స్ కాదు. అమ్మా వాళ్ళంతా గుడివాడ దగ్గిర ఓ పల్లెటూర్లో వుంటారు. అందుకే వంట అదీ నేనే చేసుకోవాల్సి వస్తుంది. ఆపైన ఏమీ చదవలేకపోయాను".
అతడి విషయం వింటుంటే ఆమెకు తండ్రి గుర్తుకొచ్చాడు. ఆయన యితడిని తప్పకుండా యిష్టపడతాడు అనుకుంది.
* * *
మోహన్ వారంరోజుల పాటు కనిపించకపోయేసరికి ఆమెకు పిచ్చెక్కినట్లనిపించింది. చదువుకోవాలనిపించదు. ఏ పనీ చెయ్యబుద్దికాని పరిస్థితి ఏర్పడిపోయింది. డిగ్రీ చదువుతున్నా ఆమెలో మెచ్యూరిటీ రాలేదనడానికి అదే నిదర్శనం. కల్పనకీ, వాస్తవానికీ వున్న తేడా గమనించే స్థితిలో లేదామె. తనకు తెలిసిన అతి చిన్న పరిధినే ప్రపంచమనుకుంది. ఎవరికీ లేని ప్రేమ అనే అనుభవం తను మాత్రమే చవిచూశాననే భ్రమలో ఉంది. బయట ప్రపంచంలో జరుగుతున్న మార్పులు తెలియకుండా ఎదుటి వ్యక్తుల్ని విశ్లేషించి జ్ఞానం లేనప్పుడు మెంటల్ గా మెచ్యూరిటీ రావడం చాలా కష్టం. అన్నీ తనకు తెలుసుననే ఆమె అమాయకత్వం ముఖంలో ప్రతిబింబిస్తూండేది. ఆమెలో కల్మషం లేదు. ఎదుటివారిలో కల్మషం ఆమె కంటికి కనిపించేది కాదు. 'ప్రేమ గుడ్డిది' అని చాలాచోట్ల చదివింది. అందరూ అనుకున్నట్లే అది తన విషయంలో తప్పు అనుకుంది. ఆమెకు తెలిసింది ఒక్కటే. తను మోహన్ ని ప్రేమిస్తోంది. అతి గాఢంగా ప్రేమిస్తోంది. అతడు లేకుండా బ్రతకలేదు. అతడితోటే తన సుఖం. ఈ నిశ్చయానికి వచ్చాక ఇక ఆగలేకపోయింది. అతడు చెప్పిన అడ్రస్ బట్టి వర్క్ షాపు వెతుక్కుంటూ వెళ్ళింది.
ఆమెను సంతోషంగా ఆహ్వానించాడు మోహన్.
"ఎందుకో మీరు వస్తారని అనిపించింది. నాకు తెలియకుండానే పొద్దుటినుంచీ మీ కోసం ఎదురుచూస్తున్నాను" అన్నాడు. తన రాకను అతడే విధంగా అర్ధం చేసుకుంటాడోనని సంశయిస్తున్న రాధకు అతడామాట అనగానే చెప్పలేనంత సంతోషం కలిగింది. తన రాక ముందుగానే పసిగట్టడం జన్మ జన్మల క్రితమే తనమధ్య ఏర్పడిన బంధంగా నిరూపణ అయిపోయిందనుకుంది.
"నేను నిన్ను ప్రేనిస్తున్నాను. నువ్వు లేకుంటే బ్రతకలేను" అన్న డైలాగులు వాళ్ళమధ్య జరగలేదు. కాని ఒకరి మనసు మరొకరికి అర్ధం అయిపోయినట్లుగా, ఒకరినొకరు అంకితం అయిపోయినట్లుగా, కనుపించని బంధం యిద్దరినీ కట్టేసినట్లుగా అనిపించింది. మనసు విప్పి కబుర్లు చెప్పుకున్నారు.
మనసునిండా సంతోషాన్ని నింపుకుని ఇంటికి తిరిగి వచ్చింది. ఎందుకంత ఆలస్యం అయిందంటే ప్రైవేట్ క్లాసుందని అబద్దం చెప్పింది. అది ఆరంభం. వారానికి రెండు రోజులు ప్రైవేట్ క్లాసులు జరిగేవి. మోహన్ ఆమె ఇంటికి దగ్గరలోనే అనుకూలంగా వుండే గది అద్దెకు తీసుకున్నాడు. రాధకో డూప్లికేట్ తాళంచెవి ఇచ్చాడు. ఆ గదికి మారాక వాళ్ళకి ఏకాంతం దొరికింది. పెరట్లో నిలబడితే మోహన్ గది కనపడేది. అతడు గమ్మంలో నిల్చుని సైగచేస్తే వెళ్ళేది.
"నేను చాలా అదృష్టవంతుణ్ణి రాధా! నాలాంటి అతి సాధారణ వ్యక్తిని నువ్వు కోరుకోవడం నేను కలలో కూడా వూహించుకోలేని సత్యం" అన్నాడు ఆమెను దగ్గరకు తీసుకుంటూ.
"నేను మాత్రం అదృష్టవంతురాలిని కాదా? నేనూ సామాన్యమైన అమ్మాయినేగా" అంది రాధ.
"నీకు ఒక ప్రామిస్ చేయగలను రాధా! ఎలాంటి పరిస్థితులలో నయినా నీ మనసు కష్టపెట్టకుండా చూసుకుంటానని".
"అంతకంటే నాకు కావలసిందేముంది మోహన్. నీ కష్టాల్లో నేనూ సమానంగా పాలుపంచుకుంటాను. బీదతనం నన్నెప్పుడూ భయపెట్టలేదు".
మనసు అర్పించుకున్నప్పుడు శరీరం అర్పించుకోవడం తప్పుగా అనిపించలేదామెకు భవిష్యత్తు గురించి తియ్యటి కలల్లో తేలిపోతూ తనను తాను అతడికి అర్పించుకుంది.
ఫైనల్ యియర్ పరీక్షలు దగ్గిరకొచ్చాయి. భవిష్యత్తులో డిగ్రీ అవసరం చాలా వుందనీ క్లాసు తెచ్చుకోవాలనీ పట్టుదలగా చదివింది. కొన్నాళ్ళపాటు మోహన్ కి కూడా దూరంగా వుంది.
పరీక్షలు రాస్తున్నన్ని రోజులూ మోహన్ కాలేజీ దగ్గరకొచ్చి కలసి వెళ్ళేవాడు. ఆ ఉత్సాహంలో పరీక్షలన్నీ బాగా రాసింది. థియరీ చివరి పరీక్ష సంతృప్తికరంగా పూర్తిచేసింది. ప్రాక్టికల్స్ లో ఆమెకెప్పుడూ మంచి మార్కులే వస్తాయి. ఫస్టుక్లాస్ తప్పదని నమ్మకం కలిగేటప్పటికి తన సంతోషాన్ని పంచుకునేందుకు మోహన్ గదికి వెళ్ళింది. అతడూ ఆమె వస్తుందనీ ఎదురు చూస్తున్నాడు టైమెలా గడిచిందో తెలియలేదు. ఇంటికి చేరేటప్పటికి చీకటి పడిపోయింది.