Previous Page Next Page 
మంచు పర్వతం పేజి 28

   

     ఎదురుగా వరండాలోనే కూర్చున్నాడు ఆమె చిన్నాన్న కొడుకు. అతను కూడా డిగ్రీ పరీక్షలే వ్రాస్తున్నాడు.
   
    "ఎలా వ్రాశావన్నయ్యా? నేనయితే బాగా రాశాను. ఫస్టుక్లాస్ ష్యూర్" అంది సంతోషంగా.
   
    అతడి ముఖంలో నవ్వు-కాని అది వికృతమైన నవ్వు.
   
    "పెద్దమ్మ పిలుస్తోంది. లోపలకు వెళ్ళు. ఫస్టుక్లాసే యిస్తుందిట" అన్నాడతను సీరియస్ గా.
   
    జరగకూడనిదేదో జరిగిందని ఊహించింది. కాని ఏం జరిగిందో అర్ధంకాలేదు.
   
    రాధను చూడగానే చేతిలో పని వదిలేసి ఆమెను గదిలోకి లాక్కెళ్ళింది అన్నపూర్ణమ్మ.
   
    "ఎక్కడినుంచి వస్తున్నావ్?" తల్లి స్వరంలో అంత తీవ్రత ఎప్పుడూ చూడలేదు.
   
    "ఫ్రెండింటినుంచి" నిబ్బరంగానే సమాధానం చెప్పింది.
   
    "ఎవడా ఫ్రెండు? ఎన్నాళ్ళనుంచీ సాగుతోందీ నాటకం?" రాధ చెంప అదిరిపోయింది. తల్లి చేతిలో దెబ్బతినడం అది రెండోసారి. చేతులునొప్పిపుట్టేలా కొట్టి తర్వాత ఏడుస్తూ కూర్చున్నదావిడ. రాధ మాత్రం ఏమీ జరగనట్లు ధైర్యంగా కూర్చుంది.
   
    తల్లిదండ్రులకు ఈ విషయం ఎప్పటికయినా తెలియకపోదనీ, జవాబు చెప్పాల్సి వస్తుందని సిద్దపడి వుందామె. తల్లి కాస్త అనునయంగా అడిగితే వివరించి చెప్పేదే. కాని ఆవిడ ముందుగానే చెయ్యిచేసుకోవడం రాధ అహాన్ని దెబ్బతీసింది. తన ఇంట్లో వుండి తనమీదే డిటెక్టివ్ పనిచేసే తల్లికి లేనిపోనివి కల్పించి చెప్పిన చిన్నాన్న కొడుకుమీద అసహ్యం పుట్టింది. తల్లి లేనిపోనివి కల్పించి చెప్పిన చిన్నాన్న కొడుకుమీద అసహ్యం పుట్టింది. తల్లి సాధారణ స్త్రీ! కాని కనీసం తండ్రి తనను బుజ్జగించి అడుగుతాడనీ, మోహన్ విషయం ఆయనయితే బాగా అర్ధం చేసుకోగలడనీ ఆమె నమ్మకం కాని విషయం తెలియగానే పట్టాభిరామయ్య కోపంతో ఎగిరెగిరి పడ్డాడు. అనరాని మాటలు అన్నాడు. ఆమె చెప్పేదేదీ వినిపించుకోలేదు. రెండురోజులు ఆమెను గదిలోంచి బయటకు రానీయలేదు.
   
    ఆ నాలుగురోజులూ చిన్నాన్న కూతురు రాజీమాత్రం మాట్లాడింది.
   
    "అక్కా, మోహన్ కేదైనా చెప్పమంటావా?" అడిగింది.
   
    రాధకి ఆశ్చర్యమేసింది. ఇదంతా ఎవరికీ తెలీదనుకుంది. కానీ అందరికీ తెలిసిపోయింది.
   
    "మోహన్ గది తెలుసా?"
   
    "వెనుక వీధిలోనే కదూ, సరిగ్గా తెలీదు. వెతికి పట్టుకుంటాను. నన్ను గుర్తుపట్టగలడు కదా" అంది రాజీ. అది ఇంటర్ చదువుతోంది.
   
    "చెప్పు జరిగినదంతా! నాన్న రెండు మూడు రోజుల్లో రాజీకి వస్తాడనుకుంటున్నాను. ఎవరూ ఒప్పుకోకపోయినా వచ్చేస్తానని చెప్పు?"
   
    రాజీ వెళ్ళిపోయింది.
   
    నాలుగో రోజుకి కాస్త చల్లబడ్డాడు పట్టాభిరామయ్య రాధకు హితబోధ చేశాడు. మోహన్ గురించి అన్నీ తెలుసుకున్నాననీ, అతడి గుణం మంచిది కాదనీ, అతడితో ఆమె సుఖపడలేదనీ వచ్చి చెప్పాడు. తండ్రి అలా దిగి వస్తాడనీ, తనతో అనునయంగా మాట్లాడతాడనీ తెలుసు నామెకు.
   
    "ఎన్నాళ్ళనుంచి తెలుసమ్మా నీకతడు?" అడిగారాయన.
   
    "దాదాపు సంవత్సరం నుంచి"
   
    "ఈ సంవత్సరంలో ఎన్నిసార్లు కలిశావు అతడిని?"
   
    "ఓ ఇరవైసార్లు" అంది ఎమ్దుకయినా మంచిదని.
   
    "జీవితం అంతా కలసి వున్నా ఒక మనిషిని గూర్చి పూర్తిగా తెలుసుకోవడం కష్టం. అతడి గురించి మీ అన్నయ్యల ద్వారా కాదు అతడి స్నేహితులనుంచే వివరాలు కనుక్కొన్నాను నేను. అతడికి వేరే అమ్మాయిలతో కూడా పరిచయం వుందని తెలిసింది. వాళ్ళమ్మ కూడా చాలా గయ్యాళిదని విన్నాను. ఆ ఇంటిలో నువ్వు సుఖపడలేవు. అతడు నీ మీద ప్రేమ నటిస్తున్నది నీ డబ్బు గురించి. నీకేదో చాలా ఆస్తి వస్తుందనే భ్రమలో వున్నాడు".
   
    రాధ నవ్వుకుంది. ప్రేమించినవాళ్ళకు తప్ప ప్రేమపట్ల ఇంకెవరికీ నమ్మకం వుండదు.
   
    "నాన్నా! నాకెంత ఆస్తి వుందో అతనెప్పుడూ నన్నడగలేదు. అసలా విషయం నాకు తెలియదు. అయినా మాకు మీ ఆస్తులు అక్కరలేదు. నేనూ ఉద్యోగం చేస్తాను. మా బ్రతుకులు మేము సంతోషంగా మలచుకోగలం. ఆ నమ్మకం నాకుంది".
   
    "అంత తొందరపడకు, నేను చెప్పినట్లు చెయ్యి మరో ఏడాది పాటు అతడిని గమనించు. అతడిలోని అసలు గుణాలను తెలుసుకో అనవసరంగా జీవితాన్ని పాడుచేసుకోకు. ప్రేమ అన్నం పెట్టదు. నీ వయసు నిన్ను ఆలోచించేలా చేయడంలేదు, తర్వాత బాధపడతావు".
   
    "నేను మరీ అంత చిన్నపిల్లనూ, అమాయకురాలినీ కాను నాన్నా! మోహన్ మీద నాకు పూర్తి నమ్మకం వుంది. పెళ్ళంటూ చేసుకుంటే అతడినే చేసుకుంటాను. ఇప్పుడు కాకపోయినా కొన్నేళ్ళ తర్వాతయినా, డబ్బుకి కాక మనసుకి ప్రాధాన్యత ఇవ్వాలని నేను నీనుంచే నేర్చుకున్నాను. ఇప్పుడు డబ్బుని మించింది మరేదీ లేదన్నట్టుగా మాట్లాడుతున్నది నువ్వే".
   
    "నేను ప్రాధాన్యత ఇవ్వమన్నది మనసుకి కాదు 'గుణానికి'. వాడికి డబ్బు లేదనికాదు నా అభ్యంతరం, అలాంటి తిరుగుబోతుతో కాపురం చెయ్యడం కష్టం. నిన్ను నువ్వు చంపుకుని బ్రతకాలి".
   
    "నాన్నా! మీకు ఇష్టం లేదంటే ఆ విషయం సూటిగా చెప్పండి. అంతే కాని తెలిసీ తెలియకుండా చెప్పుడు మాటలు విని అతని మీద అభాండాలు వేయకండి" అంది కోపంగా పట్టాభిరామయ్యకూ కోపం కట్టలు తెంచుకుంది.
   
    "అంటే ఏమిటి నీ ఉద్దేశ్యం? నేనంత దుర్మార్గున్నా? నువ్వు తెలివిలేకుండా ప్రేమించేశానంటే వాడి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేస్తాననుకున్నావా? చూస్తూ చూస్తూ నీ జీవితాన్ని నా చేతులారా నాశనం చేయను. నీకు వాడే కావాలనుకుంటే పోయి చేసుకో".
   
    "అలాగే నాన్నా! నేను ముందే చెప్పాను. నాకు మీ ఆస్తి ఏమీ అవసరం లేదని, ఇలాగే కట్టుబట్టలతో వెళ్ళిపోతాను. నా నిర్ణయం సరయినదేననీ, నేను సంతోషంగా వుండగలననీ నాకు గట్టి నమ్మకం. అది గుర్తించినప్పుడు నువ్వే నన్ను తిరిగి ఆహ్వానిస్తావు".
   
    ఆ పూటే ఇంట్లోంచి బయటపడింది అనూరాధ. అన్నపూర్ణమ్మ రకరకాలుగా నచ్చజెప్పింది. వినకపోతే ఏడ్చింది. తండ్రీ కూతుళ్లిద్దరూ మొండిగానే నిలబడ్డారు. "అదే ఆఖరిసారి ఆ ఇంటిలో" అని రాధకి తెలుసు.
   
    కట్టుబట్టలతో వచ్చిన రాధను మనస్పూర్తిగా ఆహ్వానించాడు మోహన్. ఆ మర్నాడే గుళ్ళో పెళ్ళి చేసుకోవడానికి ఏర్పాట్లు చేసేశాడు. నలుగురైదుగురి స్నేహితుల సమక్షంలో వాళ్ళ పెళ్ళి జరిగిపోయింది. డబ్బు అప్పుచేసి ఆమెకు కావలసినవన్నీ కొనుక్కొచ్చాడు.
   
    శారీరకంగా కలవడం మొదటిసారి కాదు వాళ్ళకు. కానీ తమ భవిష్యత్తుని గురించి మాట్లాడుకునేందుకూ, ఒక పధకాన్ని తయారుచేసుకునేందుకూ అదే మొదటిరోజుగా భావించుకుంది. ఆఖరి ప్రాక్టికల్ అయిపోయిన రోజు మానసిక సమాగమానికి మొదటిరాత్రిగా నిర్ణయించుకుంది.
   
    "ముందుగా మీ ఊరు వెళ్ళి అందర్నీ చూసివద్దాం. నాకేమిటో గిల్టీగా వుంది. వాళ్ళకెవరికీ చెప్పకుండా మనం పెళ్ళి చేసుకున్నందుకు అత్తగారు ఎంత బాధపడతారో రాగానే ఎక్కడయినా ఉద్యోగం సంపాదించుకుంటాను" అంది రాధ.
   
    "ఇప్పుడు మనం అర్జెంటుగా ఎక్కడికీ వెళ్ళాల్సిన అవసరంలేదు. అమ్మ తప్పక అర్ధంచేసుకుంటుంది. ముందు నీ ప్రాక్టికల్స్ అయిపోనీ-" అన్నాడు.
   
    "అత్తగారు ఏమయినా అనుకుంటారా మోహన్?" దిగులుగా అడిగింది రాధ.
   
    "ఏమీ అనుకోదు. అమ్మకు నేనంటే ప్రాణం. నేను చెపితే అర్ధం చేసుకుంటుంది. ముందుగా నేనొకసారి వెళ్ళి మాట్లాడి వస్తాను తర్వాత ఇద్దరం కలిసి వెళ్ళొచ్చు".
   
    ప్రోగ్రాం అంతా ఫిక్స్ చేసుకున్నారు ఆ రోజే.
   
    అనుకున్నట్లుగా ప్రాక్టికల్స్ అన్నీ బాగా చేసింది అనూరాధ. పెళ్ళి విషయం రెట్టించి అడిగే స్నేహితురాళ్ళెవరూ లేరామెకు. మోహన్ ఊరు వెళ్ళాడు. ఆమె చివరి పరీక్ష రోజుకి తిరిగి వచ్చేస్తానన్నాడు. అతడు వచ్చేసరికి ఇంటిలో వుండి ఆహ్వానించాలన్న కోరికతో ఇంటికి ఉరుకులు పరుగులమీద వచ్చింది. అతడు ముందుగానే వచ్చేసినట్టున్నాడు. తలుపు తాళం తీసుంది. బహుశా అతడు కూడా తనలాగే ఆలోచించి పాన్పు సిద్దం చేస్తున్నాడేమోనన్న ఆలోచన వచ్చింది. చప్పుడు చెయ్యకుండా చిరునవ్వుతో తలుపు దగ్గరకు చేరింది. చెయ్యి వేయబోయి ఆగిపోయింది. లోపలినుంచి మాటలు వినిపిస్తున్నాయి. అందులో ఒకటి స్త్రీ స్వరం.
   
    అత్తగారు వచ్చేసిందేమిటి? సందేహంగా తలుపు సందులోంచి చూసింది.
   
    "పెళ్ళయ్యాక నన్ను మర్చిపోయావా మోహన్?" ఓ అమ్మాయి.
   
    "నిన్ను మర్చిపోవటమా? ఇంపాజిబుల్ మీ ఊరు వెళ్ళాక నువ్వే నన్ను మర్చిపోవాలి పోతే-" అంటున్నాడు మోహన్.
   
    "ఇప్పుడు బంధుత్వం కూడా కలిసిందిగా ఇక మర్చిపోవటం ప్రశ్నే లేదులే" ఆమె నవ్వు...

 Previous Page Next Page