Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 29

  

        చాలా గమ్మత్తుగా జరిగింది. ప్రభాకర్ సోమయాజిని తన జట్టులో కలుపుకోవటానికి ప్రయత్నించటాన్ని రమేష్ గమనించాడు. సోమయాజి అటు వెళ్ళడం యిష్టంలేదు. అందుకానీ పన్నెండో ఆటగాడిగా తన జట్టులో చేర్చుకున్నాడు.
   
    అప్పుడు బడిలో తరగతుల మధ్య పోటీలు జరుగుతున్నాయి ప్రతీ సంవత్సరమూ అది ఆనవాయితీ రమేష్ వున్న తరగతి ఎలాగూ గెలవటం ఖాయం.
   
    ఆ రోజే ఆఖరి పోటీ - రమేష్ తరగతి వాళ్ళకీ, ప్రక్క తరగతి వాళ్ళకీ.
   
    గెలిచిన వాళ్ళకి కప్పు యివ్వబడుతుంది. రమేష్ వున్నా జట్టు గెలుస్తుందని అందరికీ తెలుసు. ఇంకో నాల్గయిదు గంటల్లో ఆట ప్రారంభం కాబోతూ వుందనగా ఒక ఆటగాడికి కడుపునొప్పి వచ్చి సోమయాజి ఆటలో చేర్చుకోబడ్డాడు. సోమయాజి సంతోషంతో తబ్బిబ్బయ్యాడు. ఇదంతా తనే సాధించినట్టు ప్రభాకర్ గర్వంగా చూశాడు. సోమయాజి దాన్ని పట్టించుకోలేదు. అతడికి కావల్సింది జట్టులో చేర్చుకోబడటం అంతే.
   
    సాయంత్రం అయిదింటికి పోటీ ప్రారంభమయింది. ఆఖరి పోటీ కాబట్టి చాలామంది చేరారు. ప్రధానోపాధ్యాయుడు కూడా వున్నాడు.
   
    రమేష్ చాలా హుషారుగా వున్నాడు. అంతమంది ముందు తన ప్రావీణ్యత మరోసారి నిరూపించుకునే అవకాశం వచ్చింది. సోమయాజి కూడా ఆనందంగా వున్నాడు గానీ అతడికి బాగా నిద్ర వస్తూంది. క్రితం రోజు రాత్రి అతడు సినిమాకు వెళ్ళాడు.
   
    ..... వైదేహికి సినిమా పిచ్చి ఎక్కువ వుంది. చిన్నక్కతో కలిసి తరచూ చూసేది. దమయంతి వెళ్ళిపోయాక చిన్నక్కకి ఇంట్లో పని ఎక్కువై, ఈ మధ్య ఆమెకి వెళ్ళటం కుదరటంలేదు. వైదేహి తల్లి దగ్గర గారాలు పోయింది. అన్నని బ్రతిమాలింది. అతడూ సినిమాలు బాగా చూస్తాడు. కానీ చెల్లెలితో వెళ్ళటం నామోషి నిర్మొహమాటంగా రాననేశాడు.
   
    ఇక మిగిలింది సోమయాజి. వైదేహి తల్లి ఒక క్షణం ఆలోచించింది. చిన్నవాడేకదా అని సరిపెట్టుకుంది.
   
    మధ్యాహ్నం ఆటకి బయల్దేరారు యిద్దరూ. ఆమె డబ్బులిచ్చింది. అతడు ముందు నడుస్తుంటే ఆమె వెనుక అనుసరించింది. గులాబిరంగు పరికిణీ మీద తెల్ల ఓణీ వేసుకుంది ఆమె. వాళ్ళు కూర్చున్న నాలుగయిదు నిమిషాలకి చిత్రం ప్రారంభమయింది.

    ఆమె పక్కన అంత దగ్గిరగా కూర్చోవటం అతడికి ఇబ్బందిగా వుంది. అలా అని ఆమె ఏమీ చొరవగా ప్రవర్తించలేదు. ఒద్దిగ్గా కుర్చీ అటువైపు కోడుకి ఆనుకుని కూర్చుంది. మధ్యలో ఆమె ఏమైనా మాట్లాడుతుందేమో అనుకున్నాడు. కానీ ఆమె మౌనంగానే వుంది. ఆ మౌనం అతడికి అర్ధంగాకుండా వుంది. కొత్తగా కూడా వుంది. ఇంట్లో బాగానే మాట్లాడేది.
   
    ఆ కొత్తదనం ఒకవైపు అతడిలో కుతూహలాన్ని రేపింది - మరోవైపు ఆమెకి నవ్వు వస్తోంది.
   
    విశ్రాంతి అయి చిత్రం పూర్తి కావొస్తున్న తరుణంలో ఆమె కదిలి, ఇటువైపుకి వచ్చింది. ఆ జరగటంలో క్రిందన ఆమె కాలు అతడికి తగిలింది. ఆమె వెనక్కి తీసుకునే ప్రయత్నం ఏమీ చేయలేదు. ఇద్దరూ చాలాసేపు అలానే వుండిపోయారు. అతడి వేళ్ళ చివర్లకి ఆమె పాదం అల తగుల్తూనే వుంది.
   
    చిత్రం పూర్తయ్యాక రిక్షాలో ఇంటికి బయలుదేరారు. ఒక అమ్మాయిని ఆనుకుని అల కూర్చోవటం అతడికి కొత్త అనుభూతి మోకాలిపై భాగం నుంచి శరీరానికి శరీరం రాపిడి తగుల్తూనే వుంది. రిక్షా కుదుపుల్లో పడినప్పుడు మరీ సిల్కు ఓణీ పూతరేకులా వుంది.
   
    వైదేహికి ఈ దాగుడుమూతలు చాలా బాగున్నాయి. చంద్రం ఇంత ఒద్దికతో ఎప్పుడూ ప్రవర్తించలేదు. తనే చొరవ తీసుకునేవాడు. ఇష్టపడిన ఆడదానికి మొగవాడి పిరికితనం సరదా అయిన తెగింపునిస్తుంది. తనే మొగవాడయి చొరవ తీసుకుని దోబూచులాడుతుంది. ఇంతసేపు చూసింది. అతడికి ధైర్యం లేదని తెలుసుకుంది. చెయ్యి వెనక్కి వేసి, కుదుపుల్ని తట్టుకోవటం కోసం ఇనుప చట్రాన్ని పట్టుకుని స్థిమితంగా కూర్చుంది. అలా కూర్చోవటంలో ఆమె స్థనాగ్రం అతడి భుజానికి తగులుతూంది. నేత చీర మడతపెట్టి నొక్కిన అనుభూతి.
   
    సోమయాజి కుదించుకుపోయాడు. అతడికి ధైర్యం లేదని కాదు. కాలికి పాము చుట్టుకున్నా బెదరని కుర్రవాడు అతడు స్త్రీ పాముకన్నా భయంకరమైనదని కాదు అతడు బెదురుతున్నది. తరతరాల సంస్కారం అతడిని ఆపుతున్నది. ఆమెకి ఆ విషయం తెలియక భయమనుకుంటున్నది. ఏది ఏమైనా ఆ అనుభవం అతడిని ఉద్విగ్నున్ని చేసింది. ఆ రాత్రి అసలు నిద్రపోలేదు అతడు.
   
    అందుకే మరుసటి రోజు ఆటస్థలంలో అతడు తూలుతున్నాడు.
   
    మరొక ఇబ్బంది కూడా వచ్చింది.
   
    అతడు ఎప్పుడూ కుడివైపే ఆడతాడు. కుడికాలితో అతడు బంతిని ఒక ఆయుధంగా మలచగలడు. కానీ అతడిని, అప్పుడు దానికి వ్యతిరేక స్థానంలో నియమించాడు రమేష్, ఆ విషయం చెపుదామనుకున్నాడు గానీ, అసలు తనకొక స్థానం ఇవ్వటమే గొప్ప విషయం. అటువంటిది మళ్ళీ ఇటువంటి కోర్కెలు కోరితే ఏమయినా అంటాడేమో అనుకుని భయపడ్డాడు.
   
    ఆట మొదలయింది. ప్రారంభమైన పదో నిమిషంలో అనుకున్నట్టే రమేష్ గోలుకొట్టాడు. అవతలివారు కూడా అంత తోసివేయదగిన వారేమీ కాదు. అరగంటలో వాళ్ళూ ఒక గోలు చేశారు. ఇరుపక్షాలు పోటీపడి ఆడుతున్నాయి. సోమయాజి శరీరం అంతగా స్వాధీనంలో లేదు. అయినా ఏదో ఆడుతున్నాడు. అదృష్టవశాత్తు బంతి అతడి దగ్గరికి రావటం లేదు. అతడి కనులముందు నిద్ర్ట నటిస్తూ అటూ ఇటూ వత్తిగిలుతున్న ఒక స్త్రీ భంగిమే కనిపిస్తోంది.
   
    ఆట పూర్తి కావొస్తూంది. రెండు జట్లు సమానంగానే వున్నాయి. రమేష్ ఎంత పట్టుదలగా బంతిని అటువైపు తీసుకెళ్ళినా, అక్కడ ప్రత్యర్ధులు తమ శిబిరాన్ని వేయికళ్ళతో కాపు కాస్తున్నారు.
   
    ఆట అయిపోవటానికి ఇంకా అయిదు నిమిషాలు మాత్రమే వుంది. అంతలో బంతి గాలిలో ఇటువైపు దూసుకువచ్చింది. ప్రత్యర్ధి దాన్ని తీసుకువస్తున్నాడు. సోమయాజి తప్ప ఆపటానికి మరెవరూ లేరు. ప్రత్యర్ధి మరింత దగ్గిరగా వచ్చాడు. సోమయాజిలో ఉద్వేగం ఎక్కువయింది. రక్తం వడివడిగా ప్రవహించసాగింది. ఇంతసేపటికి బంతి తన దగ్గరికి  వస్తూంది!
   
    ...... ఇంతలో వెనుకనుంచి తమ జట్టు గోలుకీపరు, దూసుకు వస్తూన్న బంతిని ఆపటంకోసం తన పక్కనుంచి ముందుకు వెళ్ళిపోయాడు. ప్రత్యర్ధి అతడిని కూడా తప్పించి బంతిని కొట్టాడు. బంతి బాణంలా దూసుకు రావటం మాత్రమే సోమయాజికి కనిపించింది. తన బాధ్యత తెలిసింది. వస్తూన్న బంతికి కాలు అడ్డుపెట్టాడు.
   
    అంత ఘోరమైన తప్పు అతడు జీవితంలో ఎప్పుడూ చేసి వుండదేమో! నిజానికి ఆ బంతి గమ్యం తప్పి పక్కకి వెళుతూంది. సోమయాజి కాలు అడ్డుపెట్టటంతో గోలులోకి వెళ్ళిపోయింది.
   
    క్షణంపాటూ జట్టులో సభ్యులందరూ స్థాణువులయిపోయారు. ప్రత్యర్ధులు గాలిలోకి చేతులు విసురుతూ, గెంతుతూ ఒకర్నొకారు కౌగలించుకుంటున్నారు. మరో అయిదు నిమిషాల్లో ఆట పూర్తయింది. అవతలి జట్టు 2 - 1 గోలులతో గెలిచింది.
   
    ఏదో మైకం దిగిపోతున్నట్టు అనిపించింది సోమయాజికి. తన తప్పు అర్దమైంది. అతడు అక్కడ వుండలేకపోయాడు. ఆట పూర్తికాగానే అందరు ఆటగాళ్ళతోపాటూ అటువైపు వెళ్ళకుండా గట్టుఎక్కి జనంలో కలిసిపోయాడు. అతనిని గుర్తుపట్టినవాళ్ళు గేలిచేస్తున్నారు. ముసి ముసి నవ్వులతో రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. వేలెత్తి చూపుతున్నారు.
   
    అతడు తల వంచుకుని ఇంటికి వచ్చేశాడు. ఎవరితోనూ మాట్లాడలేదు. చిన్నక్క పక్కభాగం కడిగిస్తూంది. ఆ భాగంలోకి ఆ రోజే ఎవరో దిగుతారట.
   
    అతడు యింటికి వచ్చిన అయిదు నిముషాలకి బయటనుంచి పిలుపు వినిపించింది. నలుగురు కుర్రవాళ్ళు సైకిళ్ళు వేసుకుని నిలబడి వున్నారు.
   
    "నిన్ను రమేష్ రమ్మంటున్నాడు" అన్నారు.
   
    "ఎక్కడున్నాడు?"
   
    "అదిగో"
   
    వీధి మొదలులో మరో ఆరుగురు నిలబడి వున్నారు ఇటే చూస్తున్నారు. సోమయాజి బిక్కుబిక్కుమంటూ వారితో అటువైపుకి నడిచాడు. రెండు నిమిషాల్లో అక్కడికి చేరుకున్నారు. అంతమంది కుర్రవాళ్ళని అక్కడ ఎప్పుడూ చూడని జనం వింతగా అటు చూసుకుంటూ సాగిపోతున్నారు.
   
    సోమయాజి వెళ్ళి రమేష్ ముందు నిలబడ్డాడు. రమేష్ ఏమీ మాట్లాడలేదు. ఒకే ఒక ప్రశ్న వేశాడు.
   
    "నీ కసలు ఫుట్ బాల్ వచ్చా?"
   
    నిండు నిశ్శబ్దంలో సర్రున బాణం వచ్చినట్టూ అతడి నోటినుంచి ప్రశ్న వచ్చింది. సోమయాజి ఏదో మాట్లాడబోయాడు. శబ్దం వచ్చింది కానీ మాటరాలేదు. గొణిగాడు.
   
    "ఏం... చెప్పవేం?"
   
    "వ్వ ... వ..... వచ్చు."
   
    అంతే! ఫేట్ మని గూబమీద దెబ్బపడింది. అందుకు సంసిద్దుడుగా లేని సోమయాజి రోడ్డు మీదకు వెళ్ళిపడ్డాడు. లేవబోతూంటే కాలువచ్చి తగిలింది. మళ్ళీ పడ్డాడు.
   
    రమేష్ పిచ్చివాడిలా వున్నాడు. ఇంతవరకూ ఓటమి తెలీదు అతడికి. ఆ కసిని సోమయాజి మీద ప్రదర్శిస్తున్నాడు. రోడ్డు ప్రక్కన కాలువపైన సిమెంటు చప్టామీద కూర్చున్న కుర్రవాళ్ళు ఎవరూ లేవలేదు. అందులో రాజా కూడా వున్నాడు.

 Previous Page Next Page