Previous Page Next Page 
వెలుగుబాట పేజి 28


    "నే నిక్కడుంటానని నీకెలా తెలుసు?"
    "తెలీదు. ఉంటే బాగుండునని ఆశపడ్డాను, ఆశ ఫలించింది. అప్పుడప్పుడు ఆశలు ఫలిస్తుంటాయి."
    నవ్వాడు కుమార్. ఆ నవ్వుముందు ఝాన్సీ గుండెల్లో గూడుకట్టుకున్న గుబుంలతా ఎగిరిపోయినట్లవుతుంది. ఆమె  పెదవులు కూడా చిరునవ్వుతో విచ్చుకున్నాయి.  వడిలిపోయిన ముఖంలో ఆ నవ్వు మబ్బుల్లో మెరుపులాగ వుంది.
    "వెళ్ళి ముఖం కడుక్కునిరా! బాగా ఒడిలినట్లున్నావు" పసిపిల్లని బుజ్జాగిస్తున్నట్లు అన్నాడు. ఆమె  బాత్ రూం లోకి వెళ్ళి ముఖం కడుక్కుని హేండ్ బేగ్ లో ఉన్న పౌడర్ అద్దుకుని బొట్టు పెట్టుకుని వచ్చింది.
    "ఝాన్సీ నిన్నోక్కటి కోరుకోనా?"
    ఝాన్సీకి భయమూ, సంతోషమూ ఒక్కసారే కలిగాయి.
    "ఏమిటది!"
    "నాకెప్పుడూ ఇలాగే నవ్వుతూ కనిపించు."
    నీఝ్సా ఒక్కసారి కిల కిల నవ్వేసింది. ఆ నవ్వుకు  ముగ్ధుడై చూశాడు.
    కాంపౌండర్ కారియర్ తీసుకొచ్చాడు.
    "నువ్వు తిన్నావా?" అని అడిగాడు కుమార్.
    "అయితే రా!" అని మొహమాటపడుతున్న అతడిని కూడా బలవంతపెట్టి ఆహ్వానించాడు భోజనానికి.
    కాంపౌండర్ ని సహితం తమతో సమంగా చూస్తూ సహపంక్తికి ఆహ్వానించగలిగిన అతడి విశాల హృదయాన్ని మెచ్చుకున్నా, అతడూ తనూ మాత్రమే కలిసి భోజనం చేసే అవకాశం పోయినందుకు కొంచెం బాధపడింది ఝాన్సీ. ఇలాంటివన్నీ అతడు ఆలోచించడా?
    భోజనం చేస్తున్నంతసేపూ తన పేషెంట్స్ గురించీ, వాళ్ళ మూఢనమ్మకాల గురించీ, కొందరి విచిత్ర మనస్తత్వాల గురించీ జోక్స్ కట్ చేస్తూ నవ్విస్తూనే ఉన్నాడు కుమార్. నవ్వుల మధ్య భోజనం ముగిసింది.
    మేరీని గురించి కుమార్ ని అడిగెయ్యాలని ఉంది ఝాన్సీకి. ఎలా అడగాలి? "మీ  అమ్మగారు  చెప్పిన మాట నిజమా?" అంటే ఛ! ఏం బాగుండదు అక్కడికి ఆవిడ అబద్ధం చెప్పినట్లూ, తను నిజం తేల్చుకుంటున్నట్లూ......
 చేసింది చాలక "పోనీ, నువ్వు  మేరీని పెళ్ళి చేసుకుంటున్నావా?" అంటే  సంజాయిషీ అడుగుతున్నట్లు ఉంటుందా? తను ఈర్ష్య పడుతున్నానని అనుకుంటాడా? కాని, ఎలా అయినా అడగాలి! ఈ మధనం ఇంక భరించలేదు.
    "మేరీ గురించి నీ అభిప్రాయ మేమిటి?"
    "ఓ! షి ఈజ్ వండర్ ఫుల్! చాలా టేలెంటెడ్! తన సజకారం లేకపోతే, ఇలా గ్రామాలవెంట తిరుగుతూ వైద్యం చెయ్యగలిగేవాడినే కాను. నాకు కుడిభుజంలా ఉంది."
    ఝాన్సీ గభాలునలేచి "ఇంక వెళ్తాను" అంది.
    కుమార్ కొంచెము ఆశ్చర్యంగా "ఏం? అర్జంట్ పనేదైనా ఉందా? సరే, పోదాంపద!" అన్నాడు తనూలేస్తూ.
    "నువ్వు నాతో రావద్దు, నేను వెళ్తాను" అంది ఝాన్సీ  సీరియస్ గా. తెల్లబోయి దెబ్బతిన్న పిట్టలా చూశాడు. ఆ చూపులకు విలవిల లాడిపోయింది ఝాన్సీ మనసు. అతడెప్పుడు అంతే! తన మనసుకి బాధ కలిగినప్పుడు అలా అమాయకంగా చూస్తాడేకాని, నిలబెట్టి ప్రశ్నించడు. ప్రతీకారం తీర్చుకావాలనీ అనుకోడు. ఇంత మేధావిలో ఈ అమాయకత్వమేమిటో?- అదిగో! అప్పుడే తన మనసు మెత్తబడుతోంది! మేరీని పెళ్ళి చేసుకోబోయే వాడితో తానింకా స్నేహం పెంచుకోవాలని ఆశపడటమేమిటి, వెర్రి కాకపోతే....
    వెనుతిరిగి చూడకుండా ముందుకు నడిచిపోయినా, ఆవేదన నిండిన కుమార్ అమాయకపు చూపులు ఆమె మనసును గుచ్చటం మానలేదు.
    
    
                                                   *    *    *


    సుందరమ్మకి, మాధవరావుకీ రోజూ సంఘర్షణ జరుగుతోనే ఉంది. సుందరమ్మ మాధవరావుని పొమ్మంటుంది. అతడు పోకుండా కుక్కలాగా సుందరమ్మ ఇంటికి వస్తూనే ఉన్నాడు.
    "నీక్కావలసినంత డబ్బిస్తాను అడుగు. అంతేకాని' పొమ్మంటావేమిటి?" అన్నాడు, ఏడుపు ముఖం వేసుకుని. మాధవరావు ముఖం చూస్తే కంపరం కలిగింది సుందరమ్మకి. ఒక్కసారి కళకళ లాడే తమ్ముడి ముఖం మనసులో మెదిలింది. పురువు పేరుతో ఎలాంటి అల్లుణ్ని తెచ్చుకున్నాడు బోసుబాబు! ఆ అల్లుడు ఎంత బ్రహ్మాండంగా నిలుపుతున్నాడు పరువు? ఈ సమాజం తీరు తెన్నులు ఎంత తల పగలగొట్టుకున్నా అర్ధంకావు. నిజంగా తమకేం కావాలని ఆలోచించేవారు అతి కొద్దిమంది. మిగిలినవారంతా పరంపరగా వచ్చే అలవాట్లను గుడ్డిగా అనుసరిస్తూ, తమకే అర్ధంకాని, మిధ్యా విలువలకోసం పాకులాడేవారే!
    ఆ రోజు సరళ "వదినా!" అని పిలిచినప్పటినుంచీ' తనకు తగిలిన దెబ్బలకు బాధపడతానికి మారుగా, మనసులో సంతృప్తి చెందుతున్నానని చెప్పినప్పటినుంచీ, సుందరమ్మలో తీవ్ర పశ్చాత్తాపం తలెత్తింది. అప్పటినుంచి మాధవరావుని దూరంగా ఉంచటానికి విశ్వప్రయత్నం చేస్తోంది. అతడు వదలటంలేదు.
    "ఇదిగో? డబ్బు! తీసుకో....." అంటూ ముందుకు వచ్చాడు నోట్లకట్టలతో మాధవరావు.
    "ఛీ! నువ్వూ వద్దు, నీ డబ్బూ వద్దు. అవతలికి పోతావ, పోవా?" అని చీదరించుకొంది సుందరమ్మ. మాధవరావుకి వల్లమాలినకోపం వచ్చింది.
    "బజారు ముండవి! నీకూ ఇంత పొగరా?" అన్నాడు. సుందరమ్మ మనసులో అగ్ని జ్వాలలు రేగాయి. ఈ పశువు, ఈ పురుగు, తనకోసం కాదు, తన శరీరంకోసం వచ్చి, ఆ పాశవిక సౌఖ్యం కోసం ఒక అమాయకురాలిని చావాబాదుతూ తనను "బజారుముండ!" అంటున్నాడు.
    "మనవ రూపంలో ఉన్న కీటకమా! నేను బజారు ముండను కాను, బజారులో ఉన్నదాన్ని. నువ్వు నీ యిష్టం వచ్చిన ఖరీదుకి కొనగలవు కాని, నేను ఖరీదుకి దొరికే వస్తువును" కాను. నేను కావాలనుకున్నప్పుడు నీ దగ్గర  డబ్బు వసూలుచేసి, నీకు వశమవుతాను అక్కర్లేదనుకొంటే, నువ్వు లక్షలు గుమ్మరించినా, నిన్నూ నీ డబ్బుని గడ్డిపరికలా అవతలికి విసిరెయ్యగలను. మర్యాదగా  అవతలికిపో! లేకపోతే. నౌకరుని పిలిపించి అవతలికీడ్పిస్తాను."
    అపరశక్తిలా ఉన్న ఆ మూర్తిని చూసి వణికిపోయాడు మాధవరావు అయినా అతనిలోని క్షుద్రత్వం వెంటనే అతడిని కదలనియ్యలేదు.
    'అవును! ఆ దక్తార్ ని మరిగి...." మాధవరావు నోట్లో మాటలు నోట్లోనే ఉన్నాయి. అతడి చెంపలు పేలిపోయాయి. కళ్ళు బైర్లుకమ్మాయి అతడికి ఒక ఆడది అంత గట్టిగా కొట్టగలడని కదలనియ్యలేదు.
    "ఛ! కుక్కా! అవతలికిఫో! ఇంకా కాస్సేపు నా ముందు ఉన్నావంటే, నిన్ను గొంతు పిసికి చంపుతాను" కండ్రించి ఉమ్మింది సుందరమ్మ హడలిపోయాడు అతడు. ఆ ఉన్మాద స్వరూపం  చూస్తోంటే, సుందరమ్మ అన్నంత పనీ చెయ్యగలదనిపించింది. అక్కడినుండి పారిపోయాడు. ఆ తరువాత మళ్ళీ వచ్చి సుందరమ్మను వేధించలేదు "పీడా పోయింది" అనుకుంది సుందరమ్మ.
    చూస్తూ ఉండగా కుమార్ క్లినిక్ చాలా అభివృద్ధి చెందింది. తను సంపాదించిన డబ్బుతో ఆధునిక పరికరాలు చాలా కొన్నాడు కుమార్. అందుచేత అతని దగ్గరకు వచ్చే రోగుల సంఖ్య కూడా బాగా పెరిగింది.
    ఊళ్లో కుమార్ పలుకుబడి పెరిగింది. ఒక మోతుబరిరైతుని బ్రతిమాలి, తండ్రి పరిస్థితి చెప్పి, అతడి పొలంలో రెండెకరాలు తనదేఅని నమ్మకం కలిగిస్తూ ఆ వాతావరణంలో ఉంచి తండ్రికి వైద్యం చేస్తున్నాడు కుమార్. అతడి పరిస్థితి చాలా వరకు మెరుగు పడుతోంది. ముఖ్యంగా త్రాగటంలేదు. శాంతమ్మ ముఖం కళకళలాడుతోంది.
    ప్రతి రోజూ ఏదో ఒక సమయంలో సుందరమ్మతో అన్ని విషయాలూ మాట్లాడుతుంటాడు కుమార్. కుమార్ తన ఇంట్లో భోజనం చేసినరోజు పండుగే సుందరమ్మకి. కృష్ణయ్యకు గోరుముద్దలు తినిపించిన యశోదలా అయిపోతుంది. అప్పుడప్పుడు ఝాన్సీ  ప్రస్తావన వస్తుంది. ఆ రోజు ఝాన్సీ తన నలా విదిలించి వెళ్ళిపోవటం తలుచుకున్నప్పుడల్లా బాధగానే ఉంటుంది కుమార్ కి. ఆ తరువాత ఎన్నోసార్లు ఝాన్సీని చూడాలని అనిపించినా, ఆస్పత్రికి వెళ్ళలేక పోయాడు.
    "ఝాన్సీకి నా మీద ఎందుకో కోపం వచ్చింది" అన్నాడు ఒకనాడు. సుందరమ్మకి తప్ప తన విషయాలు మరెవరికి చెప్పుకోలేక సుందరమ్మ నవ్వింది.
    "నవ్వుతావెందుకు?"
    "లేకపోతే, ఝాన్సీకి నీ మీద కోపం ఏమిటి? నిన్ను చూడకుండా ఒక్కరోజైన బ్రతకగలదా ఆ అమాయకురాలు!"

 Previous Page Next Page