హాస్పిటల్ పని ముగిసింది. కాంపౌండర్ ని హాస్పిటల్లోదించి ఇంటికి బయలుదేరింది. గుడి ఎదురయ్యేసరికి ఆగిపోయింది. తను వెళుతున్నది ఇంటికికాదు- సుందరమ్మ ఇంటికి నవ్వుకొంది. వెనక్కు తిరగాబోయింది. కానీ మనసు ముందుకే లాగింది. కుమార్ క్లినిక్ లో అడుగుపెట్టింది. కుమార్ తనను చూసి సంభ్రమంతో ఆహ్వానించినట్లూ, తను బింకంగా "నేను నీ కోసం రాలేదు, మేరీ కోసం వచ్చాను" అని సమాధానం చెప్పినట్లు ఊహించుకొంటూ -కానీ, క్లినిక్ లో కుమార్ లేడు. మేరీ కూడా లేదు. బాలయ్య ఉన్నాడు. ఇప్పుడు బాలయ్య వెనుకటి బాలయ్యకాదు. పైకి కట్టిన పంచె, సగం చేతుల చొక్కా అవేవీ లేవు. మంచి ఉలెన్ పేంట్, టెర్లిన్ షర్ట్ వేసుకున్నాడు. సుఖం ఉత్సాహంతో కళకళ లాడుతోంది. మాట తీరుకూడా పూర్తిగా మారిపోయింది. మనిషి పుట్టుకతో ఏదీ కాడు. పరిసరాలను బట్టే మారుతుంటాడు.
ఝాన్సీని బాలయ్య గుర్తించి కనుబొమ్మలు చిట్లించి ఎందుకొచ్చావన్నట్టు ముఖం పెట్టాడు. ఆమె వంచిన తల ఎత్తలేకపోయింది. నోటమాటరాలేదు. క్లినిక్ లో అడుగు పెట్టేవరకూ సాగిన ఊహలన్నీ గాలికి ఎగిరిపోయాయి. ఊహలకూ, వాస్తవానికీ లంగరు ఎప్పుడుకుదిరింది గనుక?
బాలయ్య తనే నువ్వెందు కొచ్చావో నాకు తెలుసులే అన్నట్లు "అన్నయ్య లేడు- అన్నయ్య, మేరీ హరిజనవాడలో చాలామందికి జ్వరాలొచ్చాయంటే, చూడటానికి వెళ్ళారు" అన్నాడు. అతడికి ఏమీ సమాధానం చెప్పకుండానే బయటికి వచ్చేసింది. ఏం మాట్లాడాలన్నా గొంతు పొడారిపోయినట్లు అయిపోతుంది. ఏదో తప్పుచేసినట్టు అనుభూతి, ఝాన్సీ ఇంటికి వెళ్ళలేకపోయింది. ఆమె కళ్ళు తిన్నగా హరిజనవాడకి దారితీసాయి. తానేం చేస్తోందో తనకే తెలియని స్థితిలొ ఉంది. ఆమె హరిజనవాడకి చేరుకునేసరికి, కుమార్ మేరీలు సైకిళ్ళమీద ప్రక్క గ్రామానికి కాబోలు బయలు దేరుతున్నారు. కుమార్ ఏదో అంటున్నాడు. మేరీ హాయిగా నవ్వుతోంది. కుమార్ ఏదో అంటున్నాడు. మేరీ హాయిగా నవ్వుతోంది. కుమార్ ఎక్కడుంటే అక్కడ నవ్వులు కురియవలసిందే! మేరీ ముఖంలొ ఉత్సాహం చిందులు వేస్తోంది. దూరం నుంచి ఆ జంటను చూస్తూ బొమ్మలా నిలబడిపోయింది ఝాన్సీ కుమార్ ఆమెను చూశాడు. వెంటనే సైకిల్ ఆమె దగ్గరికి నడిపించి, సైకిల్ దిగి "ఝాన్సీ నువ్వు.... ఇక్కడికి.....!" అన్నాడు, ఆశ్చర్యంగా.....వాక్యం పూర్తి చెయ్యలేకపోతున్నాడు అతడు. ఝాన్సీ మాట్లాడలేదు. అతడి మాటలు తనకు అర్ధం కానిదానిలా అయోమయంగా చూసింది.
"అలా ఉన్నావేం? వంట్లో బాగుండలేదా? రెస్ట్ తీసుకోవలసింది. ఇక్కడి కెందుకొచ్చావ్? ఇక్కడ అందరికీ జ్వరాలే! మొన్న జాతర జరిగిందికదూ! అందరూ కల్తీసారా త్రాగారు. దేవతపేరు చెప్పుకొని, వీళ్ళు చేసే పనులుఇవే? ఏనాటికి సంస్కరించగలం వీళ్ళని? అటు దేవతల్నీ, ఇటు దేయ్యల్నీ వదులుకోని మనుష్యులు వీళ్ళు. జాతరకి చుట్టు ప్రక్కల గ్రామాలవాళ్ళు కూడా వచ్చారు. వాళ్ళూ త్రాగారు. ఆకల్తీసారా దేవత కరుణించి, అందరికీ జ్వరాలొచ్చాయి. పక్క గ్రామానికి వెళ్తున్నాం, నువ్వువస్తావా?" అప్పటికి మీరీ కూడా కుమార్ పక్కకి వచ్చి సైకిల్ దిగింది. సైకిల్ ని ఆనుకొని నిలబడి ఝాన్సీని చూసి కొంచెం వెటకారంగా నవ్వుతూ "మేడమ్ మనతో వస్తారని ఎలా అనుకొంటున్నారు డాక్టర్! ఇంటి దగ్గర వాళ్ళమ్మగారు ఆమె కోసం ఎదురుచూస్తుంటారు. ఆమె తల్లిమాట జవదాటని ఉత్తమ పుత్రిక!" అంది.
కుమార్ తడబడుతూ క్రాఫ్ సర్దుకొంటూ "అవునవును సారీ! నిన్ను రమ్మన్నాను. అఫ్కోర్స్! మీ అమ్మగారికి కష్టం కలిగించకూడదు నువ్వెళ్ళు" అన్నాడు. ఝాన్సీ కదలలేదు. ఆమెనిచూస్తూ కుమార్ కూడా నిలబడిపోయాడు. మేరీ అసహనంగా "డాక్టర్! మనకి ఆలస్యమవుతుంది. ఇంకా రెండు గ్రామాలకి వెళ్ళాలి" అంది. కుమార్ ఉలికిపడినట్లయి "ఓ అవునవును, అయామ్ సారీ ఝాన్సీ! నిన్ను మళ్ళీ కలుస్తాను, నీ ఆరోగ్యం....." కుమార్ అలా మాట్లాడుతూనే ఉంటాడని మేరీ కలుగజేసుకుని "డాక్టర్....." అంది హెచ్చరిస్తున్నట్లు.
"వస్తున్నాను. నన్ను 'డాక్టర్ ' అని పిలవొద్దని ఎన్ని సార్లు చెప్పాను?"
మేరీ నవ్వి "సరే! పిలవను. బావా! తొందరగా బయలుదేరు విశ్రాంతి నీకూ కావాలు!" అంది కుమార్ వెంటనే సైకిల్ ఎక్కి మేరీతో కలిసిముందుకు వెళ్తూ వెనక్కు తిరిగి చెయ్యివూపాడు.
మేరీ కుమార్ ని పిలిచిన 'బావా' అనే పిలుపు ఝాన్సీ మనసులో మార్ర్మోగుతూ, ఆమెని పిచ్చిదాన్ని చేసింది. మేరీ కుమార్ లు దూరమయ్యారు. ఝాన్సీకి ఇంటికి వెళ్ళాలనిపించలేదు. మళ్ళీ ఆస్పత్రికే వచ్చింది. సైకిళ్ళమీద ఒకరి పక్కన ఒకరు నవ్వుకొంటూ వెళుతున్న మేరీ, కుమార్ లే కళ్ళముందు కనిపించసాగారు. కుర్చీలో స్థిమితంగా కూచోలేనట్లు, ముందుకు టేబిల్ మీదకు వాలిపోయింది.
అలా ఎంతకాలం గడిచిందో, తన తల ఆత్మియంగా నిమురుతున్న చల్లని స్పర్శకు తల ఎత్తింది. ఎదురుగా చిరునవ్వుతో కుమార్! ఒక్కసారిగా ఝాన్సీ కళ్ళలోకి జీవం వచ్చేసింది. నోరు విప్పి చెప్పలేని తన ప్రేమ కళ్ళలో కురిపిస్తూ తనను తను అర్పించుకొంటున్నట్లు చూసింది.
"భోజనం చేశావా?" ఎంతో ఆర్ధ్రంగా ఉంది కుమార్ గొంతు.
లేదన్నట్లు తల వూపింది ఝాన్సీ.
"ఇది సిటీ అయితే, హాయిగా హొటల్ కి పోయే వాళ్ళం. పోనీలే! ఉన్నంతలోనే ఆనందాన్ని చూసుకోవాలి! కాంపౌండర్ ! సుందరమ్మగారి ఇంటికెళ్ళి నేను తెమ్మన్నానని కేరియర్ తీసుకురా!"
"నువ్వూ ఇంకా అన్నం తినలేదా!"
"ఏదీ. ఈ పక్క గ్రామంలో కూడా జ్వరపడిన రోగుల్ని చూసి, మేరీ బాలయ్యలని ఇంటికి వెళ్ళమని ఇలా వచ్చేసాను."