ఎడమవైపు పెద్దింట్లో వుండే గోవిందయ్యను చూస్తే చిత్రంగా అనిపించేది అనూరాధకు. ఆయన రోజూ పొద్దుటే లేచి రెండు గంటల పాటు పూజ చేస్తుంటాడు. నోరు తెరిస్తే దైవస్మరణే వస్తుంది. ముందు గదిలో ఆయన దుకాణం పెట్టుకున్నాడు. వెనక వరండాలో కూర్చుని బియ్యంలో, పప్పులలో రాళ్ళు కలుపుతుంటాడు. ఆయన్ని భగవంతుడు (అనే వాడుంటే) ఎంతగా శిక్షించాడంటే సంవత్సరానికో అమ్మాయి చొప్పున ప్రస్తుతం ఆయనకు ఏడుగురు ఆడపిల్లలు వాళ్ళను చూస్తే మాత్రం ఆయన నోటినుంచి బండబూతులే వస్తుంటాయి. రోజూ వాళ్ళింట్లొంచి ఏడుపులూ, పెడబొబ్బలు వినిపిస్తుంటాయి.
ఉద్యోగం చేసుకుంటున్న నర్స్ సరస్వతి కూడా ఏం సుఖపడటం లేదు. భర్తకు ఆమె మీద అనుమానం. ఆమె డబ్బు మాత్రం కావాలతడికి.
వీళ్ళందరినీ చూస్తూ అనుకొనేది. "పెళ్ళి చేసుకుంటే డబ్బులేక పోయినా గుణం వున్నవాడిని చేసుకుంటాను. నేనూ కష్టపడతాను. ఇలా మగవాడి చేతికింద బానిసగా అయితే బ్రతకను" అని.
ఆమెను డాక్టర్ని చేయాలని తండ్రి ఆశయం. చదువుకు యిబ్బంది కలుగుతోందని, సంగీతం కూడా మాన్పించాడు. అనూరాధ సాధారణంగా ఫస్టుక్లాసు మార్కులే తెచ్చుకునేది. కొంచెం కష్టపడితే ర్యాంకు కూడా తెచ్చుకోగలదు. కాని హైస్కూలుకి వచ్చేటప్పటికి ఆమెకు పుస్తకాల పిచ్చి పట్టుకుంది. స్కూలు లైబ్రరీ నుంచి పుస్తకాలు తెచ్చుకుని తెగ చదివేది సాహిత్యం అంటే అమిత మక్కువ.
పదో తరగతి పాసయ్యేవరకు ఆమెకు చెప్పుకోదగ్గ స్నేహితులు లేరు. ఇంటర్ లో చేరిన మొదటిరోజు జరిగిన సంఘటనతో ఆమెకు మొదటి సారిగా స్నేహంలోని మాధుర్యం తెలిసివచ్చింది. ఆ ముగ్గురూ ఆమెకు చాలా యిష్టం. కష్టపడి చదివే వైజయంతిని ఆరాధించేది. తనలాగా పుస్తకాల పిచ్చి అని భార్గవిని ఇష్టపడేది. మనసులో మాట దాచుకోకుండా పైకి చెప్పేసే విశాల గుణాన్ని మెచ్చుకునేది. విశాలకూ, భార్గవికీ ఎప్పుడూ పడేదికాదు. అయినా స్నేహితులే ఆ వయసులో స్నేహితురాండ్ర మధ్య రాజకీయాలు, చిన్న చిన్న తగాదాలు కూడా గమ్మత్తుగా వుండేవి.
స్నేహబృందంలో మిగతా ముగ్గురూ ఎన్ని రకాలుగా వాదించుకుంటున్నా అనూరాధ శ్రోతలా మిగిలిపోయేది. వాళ్ళ మాటలనుబట్టి వాళ్ళ మనస్తత్వాలను వూహించుకుంటుండేది. పైకి చెప్పే మాటలనుబట్టి వాళ్ళ గురించి అంచనా వేసుకోవడం ఆమెలో బలహీనత వాళ్ళ మాటల్ని పూర్తిగా నమ్మడం ఆమె అమాయకత్వం.
"విశాల తగని కుళ్ళుబోతు. దానికి దూరంగా వుండు" అనేది భార్గవి.
"కాదు ఫ్రాంక్ గా మాట్లాడుతుంది. అందుకే మాట కరుగ్గా అనిపిస్తుంది. పాపం మనసులో ఏదీ దాచుకోలేదు" అని సమర్ధించేది అనూరాధ.
"సర్లే నీవో అమాయక పక్షివి" అని తిట్టుకునేది భార్గవి. ఒక రోజు రాధ తోటకి మిగతా ముగ్గురూ వచ్చారు. ఆమె అంత పెద్ద ఇంట్లో వుంటుందని ఎప్పుడూ ఎవరూ వూహించలేదు. మిగతా స్నేహితురాళ్ళు ఆమె అదృష్టాన్ని పొగుడుతూ వుంటే విశాల మాత్రం మొహం చిట్లించింది.
"మా ఊళ్ళో మా తాతగారి తోటలో దీనికి రెట్టింపు చెట్లున్నాయి. అందులో సగం మొక్కల పేర్లుకూడా మనం వినలేదు" అంది. నిజమే ననుకుంది రాధ. ఆ తోట ఇంకెంత బావుంటుందో? అనుకుంది.
"అన్నీ వట్టి కోతలు. నువ్వంత పెద్ద తోటలో వుంటున్నావని మెచ్చుకోలేక అలా అంది. వాళ్ళ తాతగారి విషయం నాకు తెలియదా? అసలా ఊళ్ళోనే ఇంత పెద్ద తోట లేదసలు" అంది భార్గవి.
"అబద్దం చెప్పాల్సిన అవసరం ఏముంది? నిజమేనేమో" అంది అనూరాధ అంత అమాయకత్వం ఆమెది.
"నీ మొహం ఇలా నమ్ముతావు గాబట్టి నీ దగ్గర బాగా కోస్తుంది. నీకు తెలీదు విశాల సంగతి" అంది భార్గవి స్థిరంగా విశాలకూ, భార్గవికి కాస్త దూరపు బంధుత్వం వుంది.
ఇంటర్ పూర్తవగానే వైజయంతి ఢిల్లీ, భార్గవి గుంటూరు వెళ్ళిపోయారు. విశాల కాలేజీ మారటంతో ఒంటరిదైపోయింది. ఎప్పుడయినా విశాలను కలవడానికి ప్రయత్నం చేసినా ఆమె ఇంట్రస్టు చూపించేది కాదు. ఒకే ఊళ్ళో వున్నా విశాల పెళ్ళి విషయం రాధకు తెలియదు. మరో స్నేహితురాలి ద్వారా ఆ సంగతి తెలిసి రాధకు బాధగా అనిపించింది. 'స్నేహాన్ని అంత త్వరగా మర్చిపోగలవాళ్ళుంటారా?' అంటూ తన బాధ భార్గవికి ఉత్తరంలో వ్రాసింది.
"విశాల సంగతి నీకు సరిగా తెలియదని నేనెప్పుడో చెప్పాను. దానంత అవకాశవాదిని నేనెక్కడా చూడలేదు. బాగా చదువుకుంటాననీ, పెళ్ళే చేసుకోననీ అనేది. చాలా ఫ్రాంక్ గా మాట్లాడతానని చెప్పుకున్నా దానిలో లౌక్యం ఎక్కువగా కనిపిస్తుంది. దాని విషయం మర్చిపోయి మంచి స్నేహితురాళ్ళను సంపాదించుకో" అని జవాబిచ్చింది భార్గవి.
కాని రాధకు మరొకరితో స్నేహం చేయాలనిపించలేదు. విశాలను కలవడానికి ప్రయత్నంచేయలేదు. స్నేహం కలవడానికి సంవత్సరాలు పట్టొచ్చు-విడిపోవడానికి అరనిమిషం చాలు.
బి.యస్.సి. ఫైనల్లో కొచ్చింది రాధ. సెకండియర్ అయిపోయాక సెలవుల్లో ఆమె జీవితం ఒక పెద్ద మలుపు తిరిగిపోయింది.
ఆమె తిరుగులేని ప్రేమలో పడిపోయింది.
2
సెలవులవడంతో అత్తలందరూ పిల్లలతో సహా వచ్చేశారు. ఇంటినిండా పెళ్లింటిలా హడావుడి. ఎంత వదిలించుకుందామన్నా పిల్లలు ఆమెను విడవడంలేదు. వాళ్ళ అమ్మలంతా రోజుకో సినిమాకి వెళ్ళిపోతున్నారు. అనపూర్నమ్మకి వంటింట్లోంచి బయటకు రావడానికే తీరికలేదు. ఆమెను చూస్తోంటే జాలివేసింది. వీళ్ళకి చాకిరీ చేయడంతోనే జీవితం గడిచిపోతుందామెకు. అయినా ఆమెకో గుర్తింపులేదు.
పిల్లలందరినీ ఒక గదిలో పెట్టి బయట గొళ్ళెం పెట్టి తోటలోకి వెళ్ళిపోయింది. ఎన్నో రోజుల తర్వాత కనిపించిన నేస్తాన్ని ఆహ్వానిస్తున్నట్లు మొక్కలన్నీ తలలూగించాయి. అన్నింటిని స్పృశించి పలకరిస్తూ తన కిష్టమయిన గుబురు మామిడిచెట్టు కిందకు చేరింది. ఆవైపుగా భూతాలు తిరుగుతాయని ముందుగానే పిల్లల్ని భయపెట్టేసింది. నిర్భయంగా చెట్టెక్కికొమ్మమీద కూర్చుంది. అలసిపోయిన హ్రుయం విశ్రాంతి తీసుకుంటుంటే వారంరోజులుగా మూగబోయిన గళం ఎగిరి పాటలా పైకి వచ్చింది.
"ఏటి కెరటం అంచుపై
దూకేటి సెందరవంకా!
ఏటిపై నెలవంకలా
గెంతేటి పిల్లజింకరా"
కృష్ణశాస్త్రి శైలిలో లాలిత్యానికి తన స్వరంలో మాధుర్యాన్ని అద్ది పాడుతోంది. 'పాత ఎక్కడ్నుంచి వస్తుందా?' అని వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తిని గమనించలేదు. పాట పూర్తవగానే చప్పట్లు శబ్దం వినిపించి కిందకు చూసింది.
సినిమాలు చూసి, పుస్తకలు చదివి తనకు కావలసిన వ్యక్తి ఎలా వుంటాడో అని అప్పుడప్పుడు వూహించుకున్నమాట నిజమే. తన హీరో అందంగా ఆరడుగుల ఎత్తుతో దృఢంగా రాజకుమారుడిలా వుండాలని కోరుకోలేదామె. మామూలుగానే వున్నా తానంటే ప్రేమగా, ప్రతి విషయంలోనూ తనను అర్ధం చేసుకుంటూ, తనతో సహకరిస్తూ వుండాలనుకుంది. డబ్బు లేకపోయినా ఓ చిన్న పొదరింట్లో ఇద్దరూ సుఖంగా సంతోషంగా వుండాలని కోరుకునేది.
కానీ చెట్టుకింద నిలబడి నవ్వుతున్న వ్యక్తి దాదాపు ఆరడుగుల ఎత్తున్నాడు. ఎర్రగా, నల్లటి వంకీల జుట్టుతో సినిమా హీరోలాగే వున్నాడు. "చివురించిన మావుల కింద శీతలచ్చాయలలోని యౌవనవసంత శుభోదయమయినట్లుగా" నవ్వుతున్నాడు.
అనూరాధ గుండెలు వేగంగా కొట్టుకున్నాయి. ఏదో అలజడి మెల్లగా క్రిందకు దిగింది. పరాయివాళ్ళ ఎదుట ముఖ్యంగా మగవాళ్ళ దగ్గర పాట పాడటానికి ఇష్టపడేది కాదెప్పుడూ. ఈ రోజు ఒక పరాయి వ్యక్తి అందునా అంత అందమయిన వ్యక్తి తన పాత వినడమే కాకుండా తన ప్రశంశను తెలియజేస్తున్నాడు. కొంటె చూపులతో స్పృశిస్తున్నాడు అనుకోగానే ఆమెకు సిగ్గు ముంచుకొచ్చింది.
"మీ పాట బావుంది. మీ తోట బావుంది. మీ నోట కృష్ణశాస్త్రిగారి ఆకులో ఆకునై వినాలనిపిస్తుంది" అన్నాడతను తొందర తొందరగా.
"థాంక్స్" రాధకు నోటమాట పెగలడమే కష్టంగా వుంది. అతనెవరో ఆమెకు తెలియదు. ఎప్పుడూ చూసిన వ్యక్తికాదు. అన్నయ్యల స్నేహితుడై వుండవచ్చు, లేకపోతే బయటివాళ్ళు ఇలా తోటలోకి వచ్చే అవకాశం లేదు.
"మీరెవరు? ఎవరికోసం వచ్చారు?" ధైర్యంచేసి అడిగేసింది. ఆ ప్రశ్నలో అతని గురించి తెలుసుకోవాలన్న ఉత్సాహమే కన్పించిందతడికి.
"నా పేరు మోహన్. ఇక్కడికెలా వచ్చానని ఆశ్చర్యపడుతున్నట్లున్నారు. వెంకటేష్ స్నేహితుడిని వాళ్ళింటికి వెళ్తే బయటకు వెళ్ళాడని, కాసేపట్లో వస్తాడనీ అన్నారు. కాలక్షేపానికి ఇలా వచ్చాను" అన్నాడు. వెంకటేష్ తోటమాలి పెద్దకొడుకు.