రాజా తొందరగా పడుకునేవాడు. సోమయాజి మాత్రం పల్లె అలవాటు పోలేదు. పదకొండు దాటితేగాని నిద్రపట్టేది కాదు. రాజా నిద్రపోయాక అతని పుస్తకాలు తీసుకుని, మిగతావారికి నిద్రాభంగం కలిగించకుండా లోపల దీపం పెట్టుకుని చదివేవాడు. పదకొండు కొట్టాక వచ్చి వీళ్ళ గదిలో పడుకునేవాడు.
ఇలా రెండు రోజులు గడిచాయి.
ఆ రోజు కూడా అతడు మామూలుగానే లోపల చదువుకుని ఈ గదిలోకి వచ్చాడు. పక్కవేసుకుని పడుకోబోతూ ఆగాడు.
ఆ ఇంటిలో అందరూ నేలమీదే పడుకుంటారు. రంగారావూ, చిన్నక్కపిల్లల్తో లోపల. ఈ గదిలో వీళ్ళు.
మధ్యలో రాజా, అటువైపు వైదేహి వున్నారు. వసారా చూరు చివర్నుంచి వెన్నెల వైదేహి మీద పడుతూంది. ఆమె కాస్త పక్కకి తిరిగి పడుకుని వుండడంతో భుజం పక్కకి దిగి, మెడక్రింద రేఖ నిలువుగా కనపడుతోంది. అందులోనూ ఆమె కొంచెం పుష్టిగా వుంటుంది. చెంపలూ, బుగ్గలూ ఆరోగ్యంతో బలంగా వుంటాయి.
సోమయాజి తలదిండు మధ్యకి మడిచి ఎత్తుగా పెట్టుకుని పడుకున్నాడు. రాజా మీదనుంచి అతనికి ఆమె కనిపిస్తూంది.
అంతలో ఆమె నిద్రలో కదిలి వెల్లకిలా తిరిగింది. పైట మరికాస్త పక్కకి తొలగింది. మేడలో వంటిపేట గొలుసు ఆమె తీసే శ్వాసవల్ల పైకి క్రిందకీ కదులుతూంది. అతను కన్నార్పకుండా చూస్తున్నాడు.
చూస్తూనే వున్నాడు.
అంతలో, మందు దట్టంగా కూరి వత్తి వెలిగిస్తే పేలినట్టు అతని శరీరం కంపించింది. ఒక్కసారిగా ఎన్నో ఏళ్ళు పెద్దవాడినయ్యానన్న భావన కలిగింది. దిండులో మొహం దాచుకున్నాడు. వళ్ళంతా చెమట పట్టింది. యుద్ధం చేసే సత్యభామ వర్ణన గుర్తొచ్చింది. దాంతో తాతయ్య గుర్తొచ్చాడు.
తాతయ్య గుర్తు రాగానే పవిత్రత గుర్తొచ్చింది. నియమం గుర్తొచ్చింది. సిగ్గుపడ్డాడు. దుఃఖం వచ్చింది. వరద తగ్గిన గోదావరి అయ్యాడు.
కానీ ఎంతసేపు?
ఒక్క రాత్రి మాత్రమే.
మరుసటిరోజు మళ్ళీ మామూలే.
ఇలా నాలుగు రోజులు గడిచాక ఒక రాత్రి వైదేహి అతన్ని పట్టుకుంది. ఆమె కెందుకో మెలకువ వచ్చి అతడిని చూసి చప్పున తిరిగి కనులు మూసుకుంది. అతడు అది చూడలేదు. ఆమె మాత్రం తన అన్న వెనుకనుంచి చూస్తున్న సోమయాజిని గమనించింది.
తనలో తానేనవ్వుకుంది. కాస్త గర్వం కూడా కలిగింది. అతడిని ఏడిపించాలన్న బుద్ది పుట్టింది. కవ్వించాలన్న కోర్కెకూడా.....! నిద్రలోనే వళ్ళు విరుచుకుంటూ, ఎడమకాలి మోకాలి దగ్గర కుడి బొటనవేలుతో సుతారంగా గోక్కుంటూ పక్కకి తిరిగింది. దాంతో కడుపు దగ్గర వంపు మరింత ప్రస్ఫుటమయింది.
ఆమె పక్కింటి చంద్రాన్ని గాఢంగా ప్రేమిస్తున్న మాట నిజం. అది అలౌకిక ప్రేమ. దాన్నెవరూ విడదీయలేరు. కానీ అతన్ని ప్రతిరోజూ కలుసుకోవటం కుదరదు కదా! అందుకని కేవలం సరదా! ప్రేమ కానప్పుడు తప్పులేదు కదా!
స్త్రీ ఆత్మవంచన చేసుకోవటం ప్రారంభిస్తే తన తరఫునుంచి చాలా బలంగా వాదనని నిర్మించుకుంటుంది. అవసరంవస్తే రాళ్ళని మగవాడి మీదికి వెంటనే తోసెయ్యటానికి వీలుగా కోట కట్టుకుంటుంది.
సోమయాజికి మాత్రం నిద్రలేని రాత్రులు ఎక్కువయ్యాయి.
ఇది ఇలా వుండగా ఒకరోజు ఒక సంఘటన జరిగింది.
ప్రతీ తరగతిలోనూ రెండు వర్గాలుంటాయి. ఇద్దరు నాయకులు వుంటారు. కుర్రవాళ్ళు వీరి చుట్టూ చేరి భక్తిభావంతో కొలుస్తూ వుంటారు. ఒక వర్గానికి రమేష్ నాయకుడు. ఫుట్ బాల్ జట్టుకి కూడా అతడే నాయకుడు కాబట్టీ, గతంలో ఒకటో రెండో దౌర్జన్యాలు చేశాడు కాబట్టీ చాలా మంది విద్యార్ధులు అతని చుట్టూ చేరుతూ వుంటారు.
రెండో జట్టుకి నాయకుడు ప్రభాకర్. ఇతడూ ఎత్తుగా, బలంగానే వుంటాడు. ఈ ఇద్దరికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఆ సంవత్సరమే ఆ తరగతి ప్రతినిధిగా రమేష్ తో పోటీచేసి అతడు ఓడిపోయాడు.
అమాయకంగా వున్నా బలంగా కనపడుతున్న సోమయాజిని తన వైపు తిప్పుకోవటానికి ప్రభాకర్ ప్రయత్నించాడు.
ఒకరోజు సాయంత్రం బడి వదిలాక సోమయాజిని ఆటస్థలం దగ్గర పట్టుకున్నాడు. అప్పటికే సోమయాజి తనూ ఆడతానని అడిగితే, వీల్లేదు పొమ్మన్నాడు రమేష్.
"నా.....నాకూ కాస్త ఆట వచ్చండీ."
"ఇదేం పల్లెలో చేపలు పట్టటం కాదు. ఫుట్ బాల్" అన్నాడు రమేష్, చుట్టూ వున్నవాళ్ళు నవ్వారు.
మిగతా ఏదైనా అయితే సోమయాజి ఊరుకునేవాడే కానీ తన ప్రాణప్రదమైన ఆట, తనకి ప్రావీణ్యం వున్న ఆట. "ఒక్కసారి చూడండి. బాగాలేకపోతే నేనే వె.....వెళ్ళిపోతాను" అన్నాడు.
"వ్వె.....వ్వె.....వెళ్ళిపోతావా" అన్నాడెవడో.
మళ్ళీ అందరూ నవ్వారు.
"ఒరేయ్ నత్తీ - ఇట్రా" రమేష్ పిలిచాడు.
సోమయాజి దగ్గరగా వెళ్ళాడు.
"వెన్నెలలో వన్నెలు చిందే అన్నుల మిన్నును కన్న నా కన్నులే కనులు......ఏదీ అను? మొదటిసారే సరిగ్గా అనగలిగితే నిన్ను చేర్చుకుంటాను."
సోమయాజికి కళ్ళనీళ్ళు తిరిగాయి. ఇంతకన్నా ఘోరమైన అవమానం అతడెప్పుడూ పొందలేదు. రోషం వచ్చింది. ఇంత చిన్న వాక్యం ఆనలేనా అన్న తొందరలో అనబోయాడు. "వెన్నెలలో వన్నె.....న్నె.... న్నె...." గొల్లున నవ్వుల మధ్య అతడి మాట కలిసిపోయింది.
నత్తివాడికి "న" పలకదు.
తల వంచుకుని, అక్కడనుంచి వచ్చేసి, దూరంగా కూర్చుని ఆడే వాళ్ళని చూడసాగాడు. మనసు దిగులుతో నిండింది.
సరీగ్గా అదే సమయానికి స్నేహితుల్తో అక్కడికి వచ్చాడు ప్రభాకర్. ఏం జరిగిందని అడిగాడు. ఈ మధ్యకాలంలో ఎవరూ సోమయాజితో ఆ మాత్రం ఆప్యాయంగా మాట్లాడలేదు. అతడు చెప్పాడు. ప్రభాకర్ ఆ మాటలకి రెచ్చిపోయి-
'ఈ ఆటేం వాడి బాబుగాడి సొమ్మా? నిన్ను చేర్పించే బాధ్యత నాది" అన్నాడు. సోమయాజి కృతజ్ఞతా పూర్వకంగా అతడివైపు చూశాడు.
"ఇంకా ఇక్కడెందుకు? రేప్రొద్దున్న చూసుకుందాంలే. రేపు క్లాస్ కి రాగానే డ్రిల్ మాష్టారు దగ్గరకు వెళదాం."
సోమయాజి లేచి వాళ్ళతో నడవసాగాడు. ఇన్నాళ్ళకి నలుగురి మధ్యా కలిసి నడుస్తూంటే మనసంతా అదోలాంటి తృప్తి నిండింది. తను ఒంటరి కాదన్న భావనతో అతడు పొంగిపోయాడు.
వాళ్ళు ఆరుగురూ, అతడితో కలిసి ఏడుగురు, ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళారు. ఆ వయసులో అలాటి ప్రతీ గుంపులోనూ ఒకరుంటారు. కాస్తడబ్బున్న తండ్రి, విడిగా ఒక గదివున్న ఇల్లు వుంటుంది. అక్కడ చేరతారు స్నేహితులు. ఆదివారం అయితే ప్రొద్దున్నుంచీ సాయంత్రం వరకూ అదే కూడలి. ఎన్నో కబుర్లు. అర్ధం లేనివి. క్రొత్తగా ఏదయినా చిత్రం విడుదలయితే మధ్యాహ్నమే దానికి వురుకులూ పరుగులూ ఇలాటి గది లేకపోతే నాలుగు దారుల కూడలిలో ఒక మూల సైకిళ్ళు వేసుకొని నిలబడి దారినపోయే అమ్మాయిలను చూస్తూ కబుర్లు చెప్పుకోవటం మొదట్లో సోమయాజికి ఇదంతా చిత్రంగా వుండేది. ఇప్పుడు అతడూ ఒకడయ్యాడు.
గదిలోకి రాగానే ప్రభాకర్ సిగరెట్ తీసి ప్రదీప్ కి యిచ్చాడు. సోమయాజి గుండెలు వడివడిగా కొట్టుకున్నాయి. అతడెప్పుడూ కాల్చలేదు. కానీ ఇప్పుడు కాదంటే బావోదేమో చిన్నవాడని చెప్పి నవ్వుతారేమో.
అతడా భావాలతో కొట్టుమిట్టులాడుతూ ప్రదీప్ వైపు చూశాడు. అయితే ప్రదీప్ అతడికి దాన్ని అందించే ప్రయత్నం చేయకుండా వేళ్ళమధ్య దాన్ని నులుముతూ లోపల్నుంచి పొగాకు బయటకి తీయసాగాడు.
తరువాత మరో పొట్లం విప్పి అందులో వున్న గడ్డిలాటి దాన్ని ఆ కాగితపు గొట్టంలో కూరాడు. అయిదు నిమిషాల్లో మరో కొత్త సిగరెట్ తయారయింది. సోమయాజి కళ్ళు విస్పారితం చేసుకుని చూస్తూన్నాడు. దాన్ని వెలిగించి, ఒకరి తర్వాత ఒకరు పీల్చసాగారు. అతడి వంతు వచ్చింది. కాదంటే ఎవరేమనుకుంటారో అన్న బెదురు ఒకవైపు, వాళ్ళనుంచి వెలివేస్తారేమో అన్న భయం మరోవైపు.
చివరికి అతడి వంతు వచ్చింది. తటపటాయించాడు.
అతడి ఇబ్బంది గ్రహించి "ఎప్పుడూ తాగలేదా?" అని అడిగాడు ప్రభాకర్.
లేదన్నట్టూ తల అడ్డంగా వూపాడు సోమయాజి.
"మామూలుది?"
"లేదు"
ప్రక్కకుర్రవాళ్ళు ముసిముసిగా నవ్వారు. సోమయాజి తల కొట్టేసినట్టయింది. బాల్యానికీ, యవ్వనానికీ మధ్య అడ్డుగోడని కూల్చటానికి వ్యసనం ఆయుధంలా కనపడుతూంది. చిన్నప్పట్నుంచీ రక్తంలో జీర్ణించుకుపోయిన సంస్కారం. తాతయ్య నీరుపోసి పెంచినది దాన్ని అందుకోటానికి తటపటాయింపజేస్తూంది.
అతడి ఇబ్బంది గ్రహించినట్టూ ప్రభాకర్ "పోన్లేరా" అన్నాడు.
సోమయాజి తేలిగ్గా ఊపిరి పీల్చుకున్నాడు.
ఆ తరువాత రెండు రోజులకి అతడు రమేష్ ఫుట్ బాల్ జట్టులో చేర్చుకోబడ్డాడు.