Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 27

  

          ఒకరోజు భోజనం చేస్తూండగా అతడికో అనుమానం వచ్చింది. అంతకుముందు అతడికోసం అయిదారు గరిటెల అన్నం వుండేది. ఇప్పుడు మరో గుప్పెడు పక్కన వుంటోంది. అయినా అదికాదు అతడి కొచ్చిన అనుమానం.
   
    ప్రతిరోజూ అంతే ఎలా మిగిలి వుంటుందా అని!
   
    ఒకరోజు ఒకరు ఎక్కువ తినవచ్చు ఒకరు తక్కువ తినవచ్చు ప్రతిరోజూ తనకోసం 'అంతే' అన్నం ఎలా మిగిలి వుంటుంది?
   
    అదే అడిగాడు.
   
    ఆమె నవ్వింది.
   
    "ముందు నీ కోసం కాస్త తీసి వుంచి, మిగతాది నేను తింటున్నాను బాబూ" అంది. అతడి అనుమానం తీరలేదు. "ఒకరోజు కూరలు బావుండి అంతా కాస్త కాస్త ఎక్కువ తింటే....." అన్నాడు అమాయకంగా.
   
    ఆమెనుంచి జవాబు రాకపోయేసరికి తలెత్తి చూసేడు. ఆమె మొహంలో నవ్వులేదు. జవాబు అర్ధమైంది. అతడి కంటిని సన్నటి నీటి పొర కమ్మేసింది. చేతిలో ముద్ద అలానే వుంచుకుని "ఎప్పటికైనా నీ ఋణం తీర్చుకుంటాను పిన్నీ. నువ్వు దయతో విసిరిన ఈ మెతుకులకు బదులుగా నేను పెద్దవాన్నయ్యాక బంగారు అతుకులు అద్దలేనేమోగానీ నిశ్చయంగా నువ్వు కాలు కదపకుండా అన్నీ అమరుస్తాను." అనుకున్నాడు.
   
    కానీ అలా జరగలేదు.
   
    ఆ రాత్రే ఆమె వెళ్ళిపోయింది.
   
    వెళ్ళిపోవటం ఒక్క సోమయాజికే తెలుసు.
   
    ఆ రాత్రి ఎందుకో అతడికి అకస్మాత్తుగా మెలకువ వచ్చింది. బైట అలికిడి వినిపించింది. తలుపు తీసి వుంది. అతడు అనుమానంగా బైటకి వెళ్ళాడు.
   
    చిన్న చేతి సంచితో - తలనిండా ముసుగు కప్పుకొని ఆమె బైటకి వెళ్తూంది. వీధిలో రాఘవరావు నిలబడి వున్నాడు. అతడు రెన్నెల్ల క్రితం వరకూ అదే సందులో వుండేవాడు. నెమ్మదస్తుడు తాలూకా కచేరిలో పని చేస్తున్నాడు. రెన్నెల్ల క్రితం అక్కడినుంచి బదిలీ అయింది.
   
    గుమ్మానికి ఆనుకుని నిలబడ్డాడు సోమయాజి. అతడేమీ మాట్లాడలేదు. కదల్లేదు. అతడి కిదంతా ఏదో కలలాగా వుంది. కనులని నమ్మలేక పోతున్నాడు. అన్నపూర్ణమ్మలాటి పిన్ని 'లేచిపోవటం.....'
   
    వెనుక చప్పుడు వినిపించి ఆమె తల తిప్పి చూసింది. వెనుకనున్న సోమయాజిని చూసి ఆమె బెదర్లేదు. భయంతో వణకలేదు. చేతిసంచి పక్కన రాఘవరావుకి అందించి వెనుతిరిగింది. ఆమె బాధ్యత అప్పుడే తనది అయిపోయినట్టూ అతడు దాన్ని పట్టుకుని నిలబడ్డాడు. ఆమె నెమ్మదిగా సోమయాజి దగ్గరకు వచ్చింది. మౌనం సేనాధిపతిగా నిశ్శబ్దం రాజ్యమేలింది. దాన్ని చేదిస్తూ ఆమె అన్నది. "వెళ్తున్నాను బాబూ" అని.
   
    అతడు సమాధానం చెప్పలేదు. అతడికేదో కసిగా, ఎవరిమీదో ఉక్రోషంగా వుంది.
   
    "నామీద నీకు చాలా కోపంగా వుందికదూ. అసహ్యంగా కూడా వుండి వుండవచ్చు. అవునా!"
   
    దానికి కూడా అతను మాట్లాడలేదు. ఆమె దగ్గిరగా వచ్చి అతడి చుబుకం పట్టుకుని మొహం పైకెత్తి, "నా వైపునుంచి ఆలోచించు నాయనా" అంది.
   
    "సమాజమూ, కట్టుబాట్లూ లాంటి పెద్దమాటలు వాడను. నాకున్న ఆలోచనా పరిధిలో నేను ఆలోచించిన దేమిటంటే - ఎంతకాలం ఇలా వంటలు చేసుకుంటూ బ్రతకను? ఎంతకాలం పనిమనిషిగా పనిచెయ్యను? చిన్న సందు కనపడితేనే పంజరం నుంచి చిలుక ఎగిరిపోవటానికి ప్రయత్నిస్తుందే! అంతకన్నా నా స్థితి ఏ విధంగా గొప్పది? అతడు మంచివాడు. నన్ను మోసం చెయ్యడు. చేసేడే అనుకో, ణ అజీవిఒతం కుక్కలు చింపిన విస్తరి అవుతుంది. కానీ నా వంట్లో జవసత్వాలు పోయిన రోజు ఇక్కడా అదే అవుతుంది! ఇంతకన్నా అదే మంచిదికదా."
   
    పర్వతపు అడుగున మంచు కరిగితే పైన శిఖరం కదిలినట్టూ అతడి మనసు కదుల్తూంది. ఆ అట్టడుగు పొరల్లోంచి తాతయ్య స్మృతి బైటపడింది. ఒక సంక్రాంతి రోజు, తన మాస్టారుకి దేవుడన్నా పండగలన్నా నమ్మకం లేదని తను అన్నప్పుడు ఆయన అన్న మాటలు గుర్తొచ్చినయ్! '....మనిషి తనమీద తాను నమ్మకం పెంచుకుని దేవుణ్ణి కాదంటే తప్పు లేదు బాబూ, కానీ హేతువు లేకుండా పిడివాదంతో వాదించే మనిషి మాత్రం మూర్ఖుడు.'
   
    ఒక్కసారి అతడి ఆలోచన ఆ తర్కంలోకి వెళ్ళేసరికి, ఆమె తనకి అన్నం పెట్టిన పిన్నిలాగానే కనబడింది. 'లేచిపోవటం' అన్న పదానికి ప్రత్యామ్నాయంగా 'మరో గూడు కట్టుకోవటం' అన్న పదం వచ్చింది.
   
    తేటపడిన మొహంతో "వెళ్ళిరా పిన్నీ" అన్నాడు నిర్మలంగా.
   
    ఆమె విస్మయంగా అతడి మొహంలోకి చూసింది.
   
    "నా.....నాకూ పే....పెద్ద పెద్ద మాటలురావు పిన్నీ. నాకు తెలిసిన ప్రపంచమల్లా తాతయ్య ఒక్కడే. ఇప్పుడే తా.....తా...తాతయ్య వుంటే ఏమి చేసేవాడు. అదే, అలాగే ఆలోచిస్తాను నేనెప్పుడూ! వేదవేదాంగాలూ చదివిన పండితుడాయన. షడ్విధ వేదాంతవాది! మతాల్ని పుక్కిట పట్టిన వాడు. ఆయన ఏమిచేసి వుండేవాడు? ఈ ఇం.....ఇంటిలోనే పెళ్లిచేసి వుండేవాడు. అంతేకానీ సాంప్రదాయమూ, నుదుటి గీతా అని గోలచేసి వుండేవాడు కాదు. ఆయన దగ్గర్నుంచి అంతా నేర్చుకోలేదు పిన్నీ నేను! 'అ ఆ' లు మాత్రం నేర్పి, ఏదో పనున్నట్టూ వెళ్ళిపోయాడాయన. నేను నేర్చుకున్న కొద్దిలో నాకు అర్ధమైనదేమిటంటే విద్యకంటే జ్ఞానం గొప్పది. సాంప్రదాయం మంచిదే కానీ హేతువుకన్నా గొప్పది కాదు..... వెళ్ళిరా పిన్నీ....."
   
    ఆమె కదిలిపోయింది. పెద్దవాడయి వుంటే కాళ్ళకి నమస్కరించేదే, కన్నీళ్ళతో, తేలిక మనసుతో ఆమె వెనుదిరిగింది.
   
    అతడలాగే నిలబడి వున్నాడు.
   
    వాళ్ళు చీకటిలో కలిసిపోయారు.
   
                         *    *    *    *   
   

    అతడన్న మాటలు నిజమే! లత పూర్తిగా అల్లుకోకముందే చెట్టు కొట్టేసినట్టు అతడికి పూర్తిగా వ్యక్తిత్వం రాకముందే తాతయ్య వెళ్ళిపోయాడు. కానీ వర్తమాన ప్రపంచంలో మిగతావారితో పోటీచేయటానికి ఆ 'అ ఆ' లు చాలు. ఇప్పటి వారందరూ కేవలం మిడిమిడి చదువుల్తో కృత్రిమంగా ప్రకాశిస్తున్నారు. అతడితో సరిరారు.
   
    కానీ ప్రస్తుతం అతడు మసిపట్టిన నిప్పులా వున్నాడు. రోజులు గడుస్తున్న కొద్దీ ఆ మసి మరింత ఎక్కువ అవుతూందేకాని తగ్గటంలేదు. అతడి వయసు అలాటిది. పదహారేళ్ళ వయసు స్త్రీకి చెడ్డదంటారు. కానీ పురుషుడికి అంతకన్నా చెడ్డది. ఆ వయసులోనే వ్యక్తిత్వం ఒక రూపు దాల్చుకోవటం ప్రారంభమవుతుంది. కాలిన ఇనుము ఏ పోతలో పోస్తే ఆ రూపు దాల్చినట్టు, వ్యక్తిత్వం ఒక ఆకారం పొందటానికి ఆతృతపడుతూ వుంటుంది. వ్యసనం పాములా పక్కనే పొంచివుంటుంది. మిగతావారి కన్నా తను తక్కువ అన్న న్యూనతాభావాన్ని కుర్రవాడు పోగొట్టుకోవడానికీ వ్యసనాన్ని ఆహ్వానిస్తాడు. అది అలవాటు రూపంలో నంగనాచిలా వచ్చి తర్వాత అసలు రూపం చూపిస్తుంది.
   
    దమయంతి వెళ్ళిపోయిన రాత్రి-మామూలుగానే తెల్లవారింది. చిన్నక్కకాస్త ఆలస్యంగా లేస్తుంది. లేచిన అయిదు నిమిషాలకి ఆమెకి ఏదో అనుమానం వచ్చింది. భర్తని లేపింది. ఇద్దరూ వెతికారు. అంతలో రెండు మూడు చీరెలు కూడా లేని సంగతి వెల్లడయింది. దాంతో అనుమానం దృఢమైంది.
   
    పెద్దక్కరాగాలు పెట్టింది. ముసలాయన కాలు కాలిన పిల్లిలా ఈ ఇంటిలోంచి ఆ ఇంటిలోకి, అట్నుంచి ఇటూ తిరిగాడు. రంగారావు అన్న గారు కత్తి పుచ్చుకుని చంపేస్తానని బయల్దేరాడు.
   
    వెతకటం మొదలు పెట్టారు. కానీ ఎక్కడని వెతుకుతారు? ఎవరికీ రాఘవరావు మీద అనుమానం రాలేదు. అతను రెన్నెల్ల క్రితమే వెళ్ళిపోయినవాడు. గంటలో ఈ వార్త వీధంతా పాకింది.
   
    ఆ తర్వాత దమయంతి కథ రకరకాల నోళ్ళలో రకరకాలుగా రంగుకు దిద్దుకుంది. మెరక వీధిలో చూశామని ఒకరంటే, కాదు ఇసుక వీధిలో చూశామని మరొకరన్నారు. సమాజపు కట్టుబాట్లని దాటిన స్త్రీ భవిష్యత్తు ఎలా వుండాలని తాము మనసులో కోరుకుంటున్నారో - అన్ని రకాలుగా ఆమె హీనస్థితిని వూహించి సంతృప్తిపడ్డారు.

    ఇంత జరుగుతున్నా సోమయాజి నోరు విప్పకుండా ఒక ప్రేక్షకుడిలా చూస్తూ వుండిపోయాడు. ఆమెకేమీ జరగదని అతడికి నమ్మకముంది. ఆమె అందించిన చేతి సంచిని రాఘవరావు ఎంత అపురూపంగా పట్టుకున్నాడో అతడు బాగా చూశాడు.
   
                      *    *    *    *
   

    దమయంతి వెళ్లిపోయిన ప్రభావం ఆ ఇంటిమీద చాలా కనపడింది. పని ఒత్తిడి అంతా చిన్నక్క మీద పడింది. అందులో సగం సోమయాజి మీదికి జారింది. ఒక రకంగా చెప్పాలంటే తనే మీద వేసుకున్నాడు. దాంతో చదవటానికి అసలు సమయముండేది కాదు. అప్పటి వరకూ అతడు ఇంకా పుస్తకాలు కొనలేదు. పెద్ద పరీక్షలు దగ్గిర పడుతున్నాయి.
   
    దమయంతి వెళ్ళిపోయిన తర్వాత వైదేహి కూడా వీళ్ళ గదిలోనే పడుకునేది. అంతకుముందు రాజా, సోమయాజి బైట వసారాకున్న గదిలో పడుకుంటే, వైదేహి, దమయంతి పక్కగదిలో పడుకునేవారు. ఆమె లేక పోయేసరికి వైదేహి తనకి భయమంటూ అన్న గది వసారాలో పక్క వేసుకుంది. సోమయాజి లోపలి గదిలో చదువుకుని, పడుకోవటానికి వసారాలోకి వచ్చేవాడు. వేసవికాలం అప్పుడే ప్రతాపం చూపిస్తూంది.

 Previous Page Next Page