అలా మేడమీద నిలబడి ఊరంతా చూడటం శకుంతలకు చాలా ఇష్టం. రాజవల్లి వద్దని వారించబోయింది కానీ, శకుంతల వినలేదు. చివరకు శామిని వెంట ఎప్పుడుఉండమని హెచ్చరించింది. మేడమీదనుంచి ఊరే కాదు, దూరంగా అడవికూడా కనిపిస్తుంది. అదంతా చీకటి ముద్దలాగా ఉంటుంది. ఊరికీ - అడవికీ మధ్య పెద్ద లోయలాంటిది ఉంది. దాని మీదుగా ఒక రాతి వంతెన ఉంది. రాక పోకలన్నీ ఆ వంతెనమీదుగా జరుగుతాయి. సాధారణంగా చీకటిపడ్డాక ఆ వంతెనమీదుగా ఎవరూ వెళ్ళరు. అనాసక్తంగా మేడమీదుగా తిరుగుతున్న శకుంతలకి దూరంగా ఒక టార్చిలైట్ వెలుగు కనపడింది. ఆశ్చర్యంగా అలా చూస్తుంటే, ఆ టార్చి వెలుతురులో ఇద్దరు నడవటం కనిపించింది. ఆ టార్చిలైట్ ఉండుండి ఒకసారి వెలిగి, అంతలో ఆరిపోతోంది.
శకుంతల ఆశ్చర్యంతో, "అదేమిటి? అటునుంచి ఎవరు వెళుతున్నారు? అటు దారేముంది?" అంది.
శామి చూసి___ "అదా! కర్రొంతెన చాలా పాతది ఎప్పటి నుంచో ఉండాది. నడుస్తోంటే ఊగుతాది ఇప్పుడెవ్వరూ పోటంలేదు ఈల్లెవరో అడవిదారి బాగా తెలిసినోళ్ళ లాగున్నారు" అంది.
శకుంతల అటే చూస్తోంది, టార్చి వెలుగులో ఇద్దరు యువకులు స్పష్టంగా కనిపిస్తున్నారు. వేసుకొన్న బట్టలూ, వేషమూ సరిగా తెలియటం లేదు, కానీ, ఆ ఇద్దరిలో ఒక యువకుడు ఒడ్డూ, పొడుగూ అచ్చు రాజు నడకలాగే వుంది. 'తన భ్రమా? మనసులో రాజు నిండి వుండటంవల్ల అలా కనిపిస్తోందా? కాదు - కాదు! రాజు నడక తనకు బాగా గుర్తు. ఒకసారి ఎందుకో ఎడమకాలి మోకాలి కింద గాయమయింది. అది నయమయింది, కానీ, ఆ తరువాత నుంచి రాజు కొద్దిగా కుడివైపు ఒరిగి నడవసాగాడు. అది రాజు నడకే, అతను రాజే!'
"శామీ! నీకా దారి తెలుసా?" అటు వేలు చూపిస్తూ అంది.
"తెలుసు. అప్పు డెప్పుడో పెద్దొంతెన కట్టకముందు దానిమీంచే యెళ్ళేవోళ్ళం!"
"మనం వెళదామా?"
"ఇప్పుడా?" బెదిరిపోయింది శామి ఇంత చీకట్లో మా వోళ్ళే ఎల్లరు. ఇప్పుడయి ఊళ్లు లేవమ్మా! ఈ వొంతెనొచ్చిన కాడ్నుంచీ మా ఊళ్ళన్నీ ఇటే వచ్చినయ్! అటంతా ఒట్టి అడవి."
శకుంతల కూడా కానీ, కుతూహలం అణగటం లేదు.
"ఎలాగైనా వెళ్ళలేమంటావా?"
"ఓయమ్మో! పులులుంటాయి, పాములుంటాయి, ఎలుగుబంటి పట్టిందంటే ముక్కు కొరికేస్తాది. ఏటమ్మా! అడవిలోకి పోదామంటా రేటి?"
"మరి వాళ్ళెలా
శామి కాస్త ఆలోచించింది.
"ఆఁ ! అటు ఒకప్పుడు ఊరుండేదమ్మా! ఆ వంతెనదారి నుంచి అడ్డుదారి కూడా వుంది. కానీ, ఇప్పుడా ఊళ్ళో ఎవరూ ఉంటంలేదు."
"శామీ! పోదాంపద!" అప్పటికప్పుడే బయలుదేరింది శకుంతల
శామీ భయంతో వణుకుతూ, మీరెళ్తే మీయెంట మీ బాడీగార్దొస్తాడు మావూళ్ళో ఆడోళ్ళనేఁ చెయ్యరు కానీ తుపాకి మనిషి కనిపిస్తే దూరంనుంచే బాణమేసి కొట్టేస్తారు" అంది.
శకుంతల ఆలోచించింది.
"లే! త్వరగా బయలుదేరు నేను నీ చీర కట్టుకుని నీతో కలిసి బయటికొస్తాను. నిను వాళ్ళు పట్టించుకోరుగా! నేను అమ్మమ్మగారి దాసీలలో ఒకతే ననుకుంటారు."
తనకు కనపడిన యువకులిద్దరూ ఎక్కడ దూరం పోతారొ అనే ఆరాటంతో గబగబా క్రిందకొచ్చి, శామి చీర కట్టుకుని నెమ్మదిగా బయటపడింది. ఆ పెద్ద భవంతిలో ఎవరి గదులువాళ్ళకీ ప్రత్యేకించి వున్నాయి కనుక, శకుంతల బయటికి రావటం మిగిలిన వాళ్లకు తెలియలేదు.
గేటు దగ్గర ఘూర్ఖా, "ఎవరూ? మాణిక్యమా? అన్నాడు.
శకుంతల అవునన్నట్లుగా తల ఊపింది.
"రమేష్ దగ్గిరకేనా? దొంగ సచ్చినోడు అటు ఇటు బెలే మింగుతున్నాడు" అని ఊసాడు వాడు.
శకుంతల అప్పటికే రోడ్డుమీద కొచ్చేసింది. వెనుక శామి! 'ఇక్కడి దాసీలు రమేష్ దగ్గిరకి వెళ్లటం అలవాటుగా జరుగుతోంది కాబోలు! అందుకే ఘూర్ఖా పట్టించుకోలేదు. బయటి వాళ్ళెవరైనా లోపలికి రావటానికి ప్రయత్నిస్తే అప్పుడు హెచ్చరికతో ఉండేవాడు. ఆహా__ఏం తండ్రి? ఛీ! అతడు తండ్రా?' శకుంతల చక చకా నడుస్తోంది. ఇద్దరూ బ్రిడ్జి దగ్గర కొచ్చేశారు.
ఇరుకుగా ఆ కొండమీద నుంచి ఈ కొండమీదకు ఉయ్యాలకట్టి నట్లుగా వుంది అది. శకుంతల అడుగుపెట్టగానే అటూ - ఇటూ ఊగింది పట్టుకోడానికి కూడా ఏం లేదు. భయంతో గుండె జలదరించినా, అడుగు ముందుకే వేసింది.
దూరాన టార్చిలైట్ వెలుగు మళ్ళీ కనపడింది. చుట్టూ చీకటి కావటంవల్ల దూరాన ఉన్నా చక్కగా కనిపిస్తోంది. ఆ లైట్ తనకు మార్గదర్శకంగా ముందుకు నడవసాగింది. అడుగు తీసి అడుగువేస్తోంటే ఉయ్యాలలా ఊగసాగింది వంతెన. బేలన్స్ చేసుకుంటూ నడిచింది. అవతలి ఒడ్డుకు చేరుకొంది.
శామి కూడా వంతెన దాటి అటు వున్న దారి చూపించింది దూరానికి ముళ్ళడొంకలూ, తుప్పలులా కనిపించినా, ఆ దారి పదిమంది నడిచిపోయే దారిలాగా బాగా నలిగి వుంది. ముళ్ళూ, తుప్పలూ లేకుండా! ఆ దారిలో వాళ్ళు చకచకా కొద్దిదూరం నడిచారో లేదో సింహాల్లాంటి వేట కుక్కలు భయంకరంగా అరుచుకుంటూ వాళ్ళమీదపడ్డాయి.
శకుంతల భయంతో బిగ్గరగా, "రాజూ!" అని అరుస్తూ తన పైటచెంగు ఆ కుక్కల ముఖాలమీద వేసింది.
అంతలోనే బిగ్గరగా ఈల వినిపించింది. కుక్కలు మొరగటం ఆపేసి తోకాడిస్తూ నిలబడి పోయాయి. కానీ, అప్పటికే శకుంతల పైట కొంగు కుక్కల నోట్లో చిరిగి పీలికలయింది. భయంతో గుండెలకు చేతులడ్డు పెట్టుకుంది, టార్చిలైట్ దూరంనుంచి శకుంతలా, శామీల ముఖాల మీద పడింది దూరంగా వున్నా ఇద్దరిలో ఒకడు వాళ్ళ దగ్గరకు వచ్చాడు. శకుంతల భయంగా చూసింది. అంతే! "రాజూ!" అంటూ అతనిమీద వాలిపోయింది.
శకుంతల చుట్టూ చేతులు వేసి, తన భుజంమీద వున్న స్వెట్టర్ ఆమె భుజాల చుట్టూ కప్పాడు రాజు. అతడి చేతులు ఆమె భుజాలను బుజ్జగింపుగా భయం లేదన్నట్లుగా తట్టాయి.