Previous Page Next Page 
యుగాంతం పేజి 27

   

     అందరూ అతడివైపే చూస్తున్నారు. అమెరికా ప్రెసిడెంట్ నెమ్మదిగా తలెత్తాడు. ఒకే ఒక మాట "చైనా అధీనంలో వున్న లాండ్ ఆఫ్ యుటోపియాని రష్యన్ నౌకాదళం చుట్టుముట్టింది" అన్నాడు.
   
                                    *    *    *
   
    "ఒక కళేబరాన్ని పాతిపెట్టాలి ఎవరైనా రండి" ఆమె అర్దిస్తోంది. "నా భర్త శరీరం నక్కలపాలు కాకూడదండీ....." ఆమె వేడుకొంటుంది.
   
    "ఇంత పెద్ద ప్రపంచంలో ఇద్దరు మనుష్యులే లేరా? తోటి మనిషి దిక్కులేని చావు చస్తుంటే - శరీరాన్ని పాతిపెట్టటానికి యిద్దరు దయామయులే లేరా?" అంటూ అరుస్తోంది.
   
    ఇళ్ళ తలుపులు వేసి వున్నాయి. కిటికీ తలుపులు మూసి వున్నాయి. రెండ్రోజుల్లో అందరూ చావబోతుంటే చచ్చినవాడి కోసం ఏడవటం కొందరికి విచిత్రం, కొందరికి సహజం. ఎవరొస్తారు బైటకి? చావుపట్ల భయం మనసునిండా నింపుతోంది.
   
    మనిషి నిర్లిప్తతని చూసి భూమి మరింత బీటలు వారింది. చీకటి మరింత నల్లగా రంగు పులుముకుంది. నక్షత్రాలు విషాదంగా చూస్తున్నాయి. రోడ్డు మధ్యలో నిలబడి ఆమె అడుగుతోంది.
   
    చాలా చిన్న కోర్కె.
   
    "నా భర్త చనిపోయేడండీ. కొంచెం ఖననం చెయ్యటానికి చెయ్యి అందించండి. ఒక్క పార మట్టి వెయ్యండి. అలా వదిలెయ్యకండి. చీకిపోయి శిథిలమవకుండా నాలుగడుగుల గొయ్యితియ్యండి. అంతేనండీ, అంతకన్నా నేను మరేమీ కోరను. తోటి మనిషి చచ్చిపోతే అలా హృదయాలు శిలలు చేసుకొని నిర్లిప్తంగా వుండిపోకండి."
   
    "ఎవరూ రారమ్మా....."
   
    ఆమె వెనక్కి తిరిగి చూసింది.
   
    వృద్దుడు.
   
    తను అన్నం పెట్టిన అంధుడు.
   
    "మనిషి ఎప్పుడో చచ్చిపోయేడమ్మా! ఇవి జీవచ్చవాలు ఓ నిర్భాగ్యపు శవాన్ని పాతెయ్యటానికి ఈ జీవచ్చవాలు రావు."
   
    ఆమె ముందు, వెనుకే అతడు.
   
    ఆమెలో ఇప్పుడు వేదన లేదు. రోదించటం లేదు. భయం లేదు. నిర్లిప్తత, అంతే చుట్టూ వున్న వాతావరణం ఆమెలో సున్నితత్వాన్ని చంపేసింది.
   
    చిన్నపారతో అతను మట్టి తవ్వసాగేడు.
   
    ఆమె రెండు చేతులతోనూ మట్టి ఎత్తి పోయసాగింది. భర్త శవాన్ని పాతిపెట్టడం కోసం భార్య తవ్వడం....
   
    మూడు గంటలు ఆ చీకటిలో, ఆ స్మశానంలో వాళ్ళిద్దరూ నిర్విరామంగా పనిచేసిన తర్వాత ఆరడుగుల గొయ్యి ఏర్పడింది.
   
    రెండు చేతులతోనూ మృత కళేబరాన్ని ఎత్తి పట్టుకొన్నాడు వృద్దుడు. అప్పుడిక ఆమె ఏడుపు ఆపుకోలేకపోయింది. కెరటాలు కెరటాలుగా లోపల్నుంచి ఏడుపు తన్నుకొచ్చింది. అతనిమీద పడి ఏడుస్తూ, "నన్ను చచ్చిపోనీ తాతా! నన్నూ కప్పెట్టు....." అంది గోడు గోడున విలపిస్తూ.
   
    ఆ అంధుడు తడుముకొంటూ శరీరాన్ని గోతిలో ఉంచేడు. భర్త శరీరాన్ని వదలటానికి ఆమె వప్పుకోవటం లేదు. బలవంతం మీద ఆమెని విడదీసేడు.
   
    వీడిన జుట్టుతో, చెదిరిన బొట్టుతో ఆమె మూర్తీభవించిన దైన్యంగా వుంది.
   
    మట్టి పెళ్ళలు పెళ్ళలుగా శవం మొహం మీద పడుతోంది. అయిదు నిముషాల్లో శవాన్ని కప్పటం పూర్తయింది.
   
    "పదమ్మా యిక" అన్నాడా వృద్దుడు. "ఏముందిక్కడ? మట్టిలో పుట్టిన మనిషి అందులోనే కలిసిపోయేడు. ఈ రోజు కాకపోతే రేపు నువ్వూ, నేను కూడా కలిసిపోవల్సిందే. మనసు దిటవు పరచుకో. ఈ ఒక్కరోజు ఏడుపు దిగమింగుకో. ఎంత ఆత్మస్థయిర్యంతో నువ్వీ కార్యం నిర్వహించావో తల్చుకుంటే నాకే వళ్ళు గగుర్పొడుస్తూంది. మీ వాళ్ళ కెవరికీ ఈ సంగతి చెప్పకమ్మా, ఎందుకు చెప్పటం? రేపు చనిపోయే వాళ్ళకి ఈ రోజు చనిపోయిన వాడి సంగతి చెప్పి వేదన కలిగించడం ఎందుకు? నీలోనే ఈ అగ్నిపర్వతాన్ని దాచుకో."

    అతడు అలాగే నిలబడి వున్నాడు.
   
    ఆమె కదిలింది.
   
    చీకట్లో హరికేన్ లాంతరు వెల్తురు నెమ్మదిగా అదృశ్యమై పోయింది.   

                                                                      *    *    *
   
    "ఇంకా పన్నెండు గంటలు....." అనుకొన్నాడు రమణ.....రాత్రి పదకొండు గంటలకి. అది రాత్రో పగలో అనవసరం. కేవలం గడియారం వల్లే అది తెలుస్తూంది.
   
    ఒక భయంకరమైన ప్రళయాన్ని ఎదుర్కొనటానికి ప్రపంచం సిద్దమవుతుంది.
   
    క్రితం నాలుగు రోజులూ వున్న అలజడి లేదు.
   
    మరణం దగ్గరవుతున్న కొద్దీ మనిషిలో స్తబ్దత ఆవరించింది.
   
    రమణ ఆలోచిస్తున్నాడు.
   
    'చావబోయే ముందు క్షణం మనిషి ఏం కోరుకొంటాడు? స్త్రీ ఏం కోరుకుంటుంది.'
   
    గృహిణి భర్త వళ్ళో, చుట్టూ పిల్లలు వుండగా ఆఖరి క్షణాలు గడపాలని కోరుకుంటుంది.
   
    మానసిక వ్యభిచారిణి అయితే....పక్కింటివాడితో హాయిగా ఏ ఏకాంత ప్రదేశంలోనో విహరిస్తూ - సెంట్రల్లీ ఎయిర్ కండిషన్డ్ ఇల్లూ, చివరి రోజు అందంగా, ఆనందంగా-
   
    వ్యభిచారిణి తన జీవితంలో తారసపడిన విటుడ్ని.....తనతో మనస్సు విప్పి మాట్లాడిన ఒకే ఒక వ్యక్తిని తన భర్తగా ఊహించుకొంటూ మరణిస్తుంది.
   
    మరి పురుషులు?
   
    అతనికి ఆలోచన అందలేదు.
   
    రకరకాల వ్యక్తులు.
   
    రకరకాల మానసిక బలహీనతలు.
   
    కెలిడియో స్కోప్.
   
    అతడు ఆలోచనలో వుండగానే బయట తలుపు కొట్టిన చప్పుడు లీలగా వినిపించింది. వెళ్ళి తీసేడు.
   
    ఎదురుగా మాలతి.
   
    అతఃదు అడుగు వెనక్కి వేసి ఆశ్చర్యం నిండిన కంఠంతో, "మాలతీ!" అన్నాడు అస్పష్టంగా.
   
    ఆమె మాట్లాడలేదు. తలెత్తి అతనివైపు చూసి కళ్ళు దించుకొంది.
   
    అతడు తడబడుతూ, "ఇంత రాత్రిపూట ఒంటరిగా....." అన్నాడు.
   
    ఆమె నెమ్మదిగా చేతిని పైకెత్తింది.
   
    మసక చీకట్లో మెరుస్తూ ఆమె చేతిలోంచి అది క్రిందకు జారింది-
   
    పసుపుతాడు!
   
    అతడు దిగ్భ్రమతో నిలబడిపోయేడు. సర్వశక్తులు కూడగట్టుకొని, "ఏమిటి.....ఏమిటిది మాలతీ" అన్నాడు.
   
    ఆమె ఎక్కువ మాట్లాడలేదు. ఎంతో లోతయిన ఆలోచననయినా ఆమె మౌనంగా.... కళ్ళతో చెప్తుంది. అప్పుడు మాత్రం ఒకే మాట మాట్లాడింది.
   
    "వచ్చేశాను రమణా-అన్నీ వదులుకొని."
   
    అతడి మనసు అర్ధమైంది. ఆమె చేతిని అందుకొని "మాలతీ...." అన్నాడు. ఆ రాగరంజితమైన రసానుబంధపుటాస్వాదనలో వాళ్ళిద్దరూ అలా ఎంతసేపు వున్నారో తెలీదు.
   
    రమణే ముందు తెప్పరిల్లేడు.
   
    తల విదిలించి "పద" అన్నాడు.
   
    "ఎక్కడికి?"
   
    "మీ ఇంటికి."
   
    ఆమె చివుక్కున తలెత్తింది.
   
    అతను అన్నాడు. "ఈ సమాజపు కట్టుబాట్లనీ- మీ నాన్నగారు విధించిన ఆంక్షల్నీ దాటటం ఈ జీవితపు ఆఖరిరోజు మనకి కష్టం కాదు. అసలు దాటటమే మన ఆశయమయితే ఇంతకాలం దానికోసం మనం ఆగటం ఎందుకు? వద్దు మాలతీ. మన ఇరవై నాలుగు గంటల వైవాహిక జీవితం మీ వాళ్ళకి వ్యధని కలిగిస్తుందని తెలిసినప్పుడు......ఈ వివాహం మాత్రం ఎందుకు? వివాహం కన్నా ప్రేమ గొప్పది మాలతీ! మన అదృష్టం కొద్దీ అది మనకి లభ్యమైంది. దాన్నే అనుభవిద్దాం. నా తలపుల్లో నువ్వూ, నీ తలపుల్లో నేనూ హాయిగా ప్రాణాలు వదిలేద్దాం. డానికి ఒకరికొకరం దగ్గరగా ఉండటమెందుకు? నేను నీకన్నా నిన్ను ప్రేమిస్తున్నానన్న భావనని ఎక్కువగా ప్రేమిస్తున్నాను మాలతీ! నీకన్నా నీ తలపుల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాను. అది చాలు నాకు."

 Previous Page Next Page