Previous Page Next Page 
వెలుగుబాట పేజి 26

 

    ఆపరేషన్  ముగిసి చేతులు కడుక్కుని తలుపువైపు తిరిగాకకాని, అతడు ఝాన్సీని చూడలేదు. చూడగానే అతని కళ్ళలో చిత్రమైన మెరుపు కనిపించింది.
    "హలో! ఝాన్సీ!" అంటూ ఆమె  దగ్గరగా వచ్చేసి- కనిపించటంలేదు. ఇవాళ నువ్వే వచ్చావు" అన్నాడు.
    అతని కంఠంలో ఏమీ  మార్పు లేదు. కళ్ళలో కాంతి మరింత ఎక్కువయింది. మనిషికి ఆపాదమస్తకమూ ఉత్సాహము తొణికిసలాడుతోంది.
    "మా ఆస్పత్రికి వస్తున్నావా! ఎప్పుడు?"
    "నేను నీ కోసం చూస్తున్నానే?"
    "ఎప్పుడంటే, అఫ్ కోర్స్ రెండూ, మూడు, ఆ ప్రాంతాలలో. అప్పటివరకు నాకు పని వుంటుంది. చూస్తున్నావుగా! ఈ చుట్టుప్రక్కల గ్రామాలలో కూడా మంచి ఆస్పత్రి లేకపోవటంతో, నా ప్రాక్టీస్ బాగా పెరిగిపోతోంది. వర్క్ వదిలిపెట్టి రావటం మంచిదికాదు కదా? ఆ తరువాత వస్తే నువ్వు వెళ్ళిపోతున్నావు."
    "నా కోసం ఎందుకొస్తున్నావు?"
    "ఎందుకు? ఎందుకంటే? ఈ  ప్రశ్నకు నేను సమాధానం చెప్పలేను. బైదిబై! ఇందాక, "నేను నీ కోసం చూస్తున్నాను" అన్నావుగా? ఎందుకు?"
    పక పక నవ్వుతున్నాడు కుమార్ అల్లరిగా, ఝాన్సీ తల బాగా  క్రిందికి దిగిపోయింది.
    "రా! కూచో! భోజనం చేద్దామా?" మృదువుగా అడిగాడు కుమార్.
    "భోజనమా? ఎక్కడ?"
    "ఇక్కడే సుందరమ్మగారింట్లో!"
    "ఇక్కడ భోజనం చేస్తావా?"
    "అప్పుడప్పుడు. పని ఎక్కువగా ఉన్నప్పుడు, తరచుగా- ఇక్కడే తినేసి ఇక్కడే రెస్ట్ తీసుకుంటాను...."
    "మేరీ!"
    "మేరీ, బాలయ్య పనికాగానే ఇంటికెళ్ళిపోతారు."
    "ఎంత అదృష్టం."
    "ఆహ? ఇప్పుడే ఎలా గుర్తించావ్? నా కెప్పుడో తెలుసు, నేను అదృష్టవంతుణ్నని!"
    "మేరీ, సరళ, సుందరమ్మ- అందరూ నిన్ను అభిమానించేవారే!"
    "నువ్వు....నువ్వు అభిమానించవా నన్ను?"
    "నీ తల్లినీ, తండ్రినీ, ఇంట్లోంచి వెళ్ళగొట్టాను. అదే, నా అభిమానం!"
    "ఓ! ఫర్ గెటిట్! మనుష్యుల్లో ఉండే బలహీనత ఇదే! ఎప్పుడూ పాతవి తవ్వుకుంటూ కూచుంటారు. లేకపోతే రాబోయేవి ఊహిస్తూ మధనపడతారు. వర్తమానంలో జీవించు, నీ ముందున్న కర్తవ్యాన్ని ఆలోచించు."
    "ఏమిటి నా ముందున్న కర్తవ్యం?"
    "తక్షణ కర్తవ్యం భోజనం! లే!"
    "నేను భోజనానికి రాలేదు. నిద్రమాత్రల కోసం వచ్చాను."
    "వాట్!"
    ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవిచేసి ఆమె వంక నిశితంగా చూశాడు. ఆమె కళ్ళచుట్టూ ఉన్న నల్లని వలయాలు అప్పుడు గమనించాడు.
    అతని కనుబొమలు ముడిపడ్డాయి.
    "నువ్వు నిద్రమాత్రలు మింగుతున్నావు దేనికి?"
    "నీకు నిద్రరావటం లేదా? అయితే నా దగ్గర పని చెయ్యి. హాయిగా నిద్ర పడుతుంది."
    ఉలికిపడి అతడి ముఖంలోకి దీనంగా చూసింది.
    కుమార్ సర్దుకుంటున్నట్లు "ఐమీన్, నా దగ్గర బోలెడు వర్క్ ఉంది. కష్టపడి పనిచేస్తే హాయిగా నిద్రపడుతుంది. పోనీ, మీ ఇంటిదగ్గరయినా ఏదైనా పనిచెయ్యి, నిద్ర చచ్చినట్లు వస్తుంది. లేకపోతే పుస్తకాలు తీసి చదువు. అంతేకాని, నిద్రమాత్రలు వాడకు. ముందు భోజనానికి రా?" అన్నాడు. ఝాన్సీ  కాదనలేకపోయింది.
    సుందరమ్మ స్వరూపమూ, ఆమె ఇల్లూ కూడా చాలా మారిపోయాయి. ఇదివరకటికంటె, నాజూకుగా అందంగా ఉంది డైనింగ్ టేబిల్ మీద బౌల్స్ లో రకరకాల పదార్ధాలు వడ్డించి ఉన్నాయి. మధ్యలో పళ్ళు ఉన్నాయి. నేపికిన్స్ ఇస్త్రీ చేసి టేబిల్ మీద అందంగా  సర్దింది. ఇంత ఆధునికత ఆమె ఎప్పుడు నేర్చుకుందా, అని  ఆశ్చర్యపోయింది ఝాన్సీ. సుందరమ్మ ఝాన్సీని చూసి ఆప్యాయంగా "ఇవాళ నువ్వు కూడా వచ్చావు. నాకు చాలా సంతోషంగా ఉంది" అంది.
    ఝాన్సీ కూచుని "కుమార్ తల్లిదండ్రుల్ని ఇంట్లోంచి పంపేసినందుకు మేరీకి నా మీద కోపంగా ఉంది. మీకు కోపంగా లేదా?" అంది.
    "లేదు. ఆడదాని నిస్సహాయత ఎలాంటిదో స్వయంగా అనుభవించాను. మావాళ్ళు  తమ్ముణ్ణీ పొట్టనబెట్టుకున్నావు" అని నన్ను తిట్టారు. అందులో ఎంత నిజం ఉందో, నువ్వు శాంతమ్మను వెళ్ళగొట్టడం లోనూ అంతే నిజం ఉంది."
    ఝాన్సీ  కళ్ళు మెరిసాయి. ఆ ముఖంలో బడలిక ఒక్క సారి ఎగిరిపోయినట్లయింది.
    "అలా చెప్పండి. ఊరికే తనను తను హింసించుకొంటుంది" అన్నాడు కుమార్ నవ్వుతూ.
    ఆ మాటలు మరింత మంచిగంధంలా సోకాయి ఝాన్సీ మనసుకి.
    "అదీగాక, నీ మీద నా కెప్పుడూ, ఏ పరిస్థితుల్లోనూ కోపంరాదు."
    "ఎందుకనో?"
    "ఎందుకంటే..... నువ్వు మా కుమార్ భార్యవి కానుక!"
    "గుండె ఝల్లుమంది ఝాన్సీకి శరీరమంతా విచిత్రంగా  కంపించింది. ఓరగా కుమార్ వైపు చూసింది. ఆమెనే చూస్తున్న కుమార్  చిలిపిగా నవ్వాడు. ఝాన్సీ  తలవంచుకుని భోజనం చెయ్యటంలో మునిగిపోయింది. మరొక్కసారి తలెత్తి చూడటానికి ఆమెకు ధైర్యం చాలలేదు.
    చాలా రోజుల తర్వాత ఇద్దరూ సెంటర్వరకూ కలిసి నడిచి చేతులూపుకుంటూ చెరోదారికీ విడిపోయారు.
    కూతురు రావలసిన టైంకి రాకపోతే కంగారు పడుతున్న ఝాన్సీ తల్లి ఝాన్సీ రాగానే "హమ్మయ్య! వచ్చావా!" అంది.
    ఝాన్సీ తల్లిని సూటిగా చూస్తూ "అంత ఆందోళన ఎందుకమ్మా? నేను ఎవరితోను లేచిపోను. నన్ను కష్టపడి పెంచిన నీ బుణం తీరేవరకూ చావను కూడా చావను" అని విసురుగా  వెళ్ళిపోయింది. మ్రాన్పడిపోయింది తల్లి. కూతురి సుఖంలో కొత్తగా కనిపిస్తున్న వికాసం చూసి ఆనందించాలో, భయపడాలో అర్థంకాలేదు తల్లికి.
    ఆ రోజు నిద్ర మాత్ర ల్లేకుండా, హాయిగా నిద్ర పోయింది ఝాన్సీ.

 

                                                             *    *    *

 Previous Page Next Page