Previous Page Next Page 
నిశ్శబ్దసంగీతం పేజి 26

 

    "అయితే రారన్నామాట!"
    మాధవ వెళ్ళిపోతాడు అన్న భావం వచ్చి హృదయమంతా నిరాశా నిండుకోగా, నిస్పృహతో అంది జానకి.
    మోహన్ కొన్ని క్షణాలు జనకి మోహంలో కి చూసి చిరునవ్వుతో "మీరు రమ్మంటే వస్తాను" అన్నాడు.
    "అవసరమయితే ఉత్తరం రాస్తాను. మీ చిరునామా ఇయ్యండి" అంది జానకి.
    జానకి అందించిన నోట్ బుక్ లో తన అడ్రస్ రాసి వెళ్ళిపోయాడు మోహన్.
    మోహన్ కు తను మాధవ భార్య అని తెలియదని జానకికి తెలీదు. తన భర్తకు అత్మీయుడైన స్నేహితుడిగా నిస్సంకోచంగా అతని సాయం స్వీకరించడానికి సిద్దపడింది.
    మోహన్ వెళ్ళిపోయాక మాధవకు తన మనసులో శూన్యం మరీ భరించరానిదయింది. అంతటి వేదనలోనూ ఆ ఇంట్లో తనూ, జానకీ మాత్రమే ఉంటున్నామన్న భావన అతనికి గిలిగింతలు పెట్టింది.
    కాఫీ కప్పు తెచ్చి తన దగ్గర బల్లమీద పెట్టి తలవంచుకుని జానకి వెళ్ళి పోతుంటే ఒళ్ళు మండింది మాధవకు.
    "నాకు కాఫీ అక్కర్లేదు తీసుకు పో !" అన్నాడు కోపంగా.
    "మరి టీ తీసుకురానా?"
    "అక్కర్లేదు"
    "ఏం కావాలి మరి? పాలు తాగుతారా?"
    "ఏం అక్కర్లేదు. నువ్విక్కడి నుండి వెళ్ళిపోవటం కావాలి" కసిగా అన్నాడు మాధవ. తన మనసులో ఇలా మంటలు రేగుతున్నాయే! ఒక్కసారి ఆప్యాయంగా గుండెలకు హత్తుకుని తనని ఒదార్చకూడదు? ఎందుకీ ముభావం? ఏం సాధిద్దామని?
    అక్కణ్ణించి వంటింట్లోకి పారిపోయి కూలబడి కుళ్ళి కుళ్ళి ఏడ్చింది జానకి.
    తనను చూస్తేనే మాధవకు అసహ్యం కలుగుతుంది. ఇంక మాధవ మనసులో గాయాన్ని తనేం మన్పగలదు?
    ఇంత అనర్ధానికి కారణం తనే! ఆనాడు తను అంత ప్రాధేయపడకుండా ఉంటె మాధవ తన మెడలో తాళి కట్టవలసిన స్థితి వచ్చేది కాదు. హాయిగా ఆ సరళనే పెళ్ళి చేసుకునేవాడు. కాత్యాయనికి మాధవ ప్రవర్తన వల్ల కష్టం కలగటానికి కారణం తనే. తన మనసులో పొంగులు వారే మాతృత్వపు మమకారన్నంతా మాధవపై ప్రసరింపజేస్తూ చివరి ఘడియల్లో మాధవను చూడాలని కూడా కోరుకోలేదు. కోరుకున్నా పంతానికి ఆ కోరికను అణచుకుంది. తనే కారణం ఇంతటికీ......
    వదిన బారి నుండి బయటపడి, అన్న మనోవ్యధను దూరం చెయ్యాలనే ఆలోచించింది కాని దాని వల్ల మిగిలినవాళ్ళ కెంత కష్టం కలుగుతుందో ఊహించలేకపోయింది. రెండవ విహవానికి తను అభ్యంతరం చెప్పననడంతో సమస్యలు లేకుండా పోతాయనుకుందే కాని అమృతమూర్తి లాంటి కాత్యాయని అలాంటి అమానుషచర్యకు ఒప్పుకోదనీ , ఆ కారణంగా స్పర్ధలు తప్పవనీ అర్ధం చేసుకోలేకపోయింది.
    ఇప్పుడింక తన చేతులలో ఉన్నదీ, చెయ్యవలసింది ఒక్కటే - మాధవకు తన నుండి విముక్తి కలుగజెయ్యడం. తన దారి తను చూసుకుంటే మాధవ సరళను పెళ్ళి చేసుకుంటాడు. తనకు దారనేది ఏముందీ చూసుకోవటానికి? అయినా తప్పదు వెళ్ళిపోవాలి.


                                                       *    *    *

    "ఇవిగో తాళం చెవులు" తాళం చెవుల గుత్తి తన కందిస్తున్న జానకిని తెల్లబోయి చూశాడు మాధవ.
    "నాకెందుకు తాళాలు?"
    "నేను వెళ్తున్నాను"
    "ఎక్కడికి?"
    "ఇంకా నిర్ణయించుకోలేదు"
    మనసంతా నలిగిపోయి ఉన్న మాధవకు ఒళ్ళు భగ్గుమంది. "అయినా నువ్వెందుకు వెళ్ళటం? పోవలసినవాడిని నేను. ఇది నన్ను పొమ్మని చెప్పటమా?"
    "మీరు పోవలసినవారా? నేను మిమ్మల్ని పొమ్మని అనగలిగేపాటిదాన్నా?"
    "ఎందుకీ నంగనాచి కబుర్లు? నువ్వు దాచినా మా ప్లీడరు నాకంతా చెప్పాడులే! చివరి ఘడియల్లో నేను రాకుండా చేసి అత్తయ్య ఆస్తంతా రాయించుకున్నవుటగా!"
    కసిగా అనేసిన మాధవ తెల్లగా పాలిపోయిన జానకి ముఖం చూసి విలవిలలాడిపోయాడు. తన మాటలు పచ్చి అబద్దాలని అతనికి తెలుసు. జానకి తనకి దూరమైపోతుందన్న భావన అతని వేదనామాయమైన మనసుకు మరింత అల్లకల్లోలం చేసి అతనిలో యుక్తా యుక్త జ్ఞానాన్ని హరించింది.
    చాలాసేపటివరకూ మాట్లాడలేక పిండి బొమ్మలా నించున్న జానకి చివరకు నోరు మెదిపింది.
    "ఆ ఆస్తి నేను కోరలేదు. మీది మీకిచ్చేద్దమనే అనుకుంటున్నాను. అసలే మీ మనసు చికాగ్గా ఉన్న సమయంలో ఈ సంగతులన్నీ తేవటమెందుకని ఇన్నాళ్ళూ....."
    "నా కంటికి కనిపిస్తే డబ్బు ప్రస్తావన తెస్తానేమో అని తప్పుకు తిరుగుతున్నావు...."
    మరొక కొరడా దెబ్బ! నిలబడటానికి ఊతం కోసమా అన్నట్లు తలుపును రెండు చేతులతో గట్టిగా పట్టుకుంది జానకి. పెదవులు బిగించిన జానకి ముఖం చూడలేక చటుక్కున తల తిప్పుకున్నాడు మాధవ.
    జానకి ఆ తలపుచెక్కను గట్టిగా పట్టుకునే బదులు వచ్చి తన నల్లెసుకోకూడదు!
    తెలిసి తెలిసి ఎందుకిలా అబద్దలాడతారు? అని గుండెల్లో తలపెట్టి మందలించకూడదు!
    "నాకా ఆస్తి గొడవలేమీ తెలియవు. నా పేర పిన్ని వ్రాసిన ఆస్తిని మీకిచ్చేయ్యటానికి ఆనాడే నిర్ణయించుకున్నాను. మన లాయరుగారిని చూడటమే తప్ప ఆయనతో నేనెన్నడూ మాట్లాడలేదు. మీరాయనతో మాట్లాడి, వ్యవహారమంతా పరిష్కరించుకొండి. మీరెప్పుడు , ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ పెడతాను."
    "నీ దయాధర్మ బిక్షం నాకేం అక్కర్లేదు. నా ఈ క్షోభంతా అత్తయ్య ఆస్తి నీకిచ్చినందుకు అనుకోకు. డబ్బు కోసమే కాక ప్రేమ కోసం పాకులాడే మనుష్యులుంటారు!"
    "మీ మీద దయ చూపే పాటిదాన్నా? మీది మీరు తీసుకుని నాకీ అనవసరపు బరువు నుండి విముక్తి కలుగజేయ్యండి"
    "నాకా ఆస్తి అక్కర్లేదని చెప్తోంటే నీక్కాదూ? అత్తయ్య చివరి రోజుల్లో నాకొక్క ఉత్త్రమయినా రాయకుండా నువ్వు సంపాదించిన ఆస్తిని నువ్వే దాచుకో! ఆ ఆస్తి నీ చేతుల్లో ఉంటే నువ్వు ఒకరి ఆశ్రయం కోసం ప్రాధేయపడక్కర్లేదు. మిగిలినవాళ్ళు నీ ఆశ్రయం కోసం ప్రాకులాడుతారు. నేను రేపు వెడతాను."
    జానకి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది.
    ఇంకా ఇంకా తనతో ఆస్తి తీసుకోమని వాదిస్తుందని ఆశపడ్డ మాధవ జానకి అలా వెళ్ళిపోవటంతో నిరుత్సాహంతో కుంగిపోయాడు.
    జానకి తన చుట్టూ అల్లుకున్న ఈ గంభీర్యపు గోడలేలా పగలగొట్టాలి? తనకు నిజంగా జానకి కావాలనే విషయం జానకికెలా అర్ధమవుతుంది?
    జానకి మళ్ళీ పది నిమిషాలలోనే వచ్చింది. వీలునామా కాగితాలు మాధవ ముందు పెట్టింది.
    "ఇవి దేనికి?" కనుబొమలు చిట్లిస్తూ అన్నాడు మాధవ.

 Previous Page Next Page