Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 26

 

           గదిలో సూదిపడితే వినిపించేటంత నిశ్శబ్దం వ్యాపించింది. మాస్టారు ఏదో అనబోయి, ఏమీ అనలేక "సర్లే కూర్చో" అన్నాడు. ఆయన మొహంలో మాత్రం 'నువ్వు నాకు గుర్తున్నావ్ సుమా' అన్న భావం కనపడుతూంది.
   
                                       *    *    *    *
   
    పైకి కనపడదు, ప్రదర్శించడుగానీ సోమయాజి శరీరం ఆజాను భాహుడిగా పెరగటానికి ఆయత్తమవుతున్నది.
   
    కావల్సిన కళ్ళే కావాల్సిన వాటిని గమనిస్తూ వుంటాయి.
   
    పై సంఘటన జరిగినరోజు, తరువాతి తరగతులు లేకపోవడంవల్ల అతడు తొందరగా ఇంటికి వచ్చాడు.
   
    అప్పటికే వేసవికాలం ప్రవేశిస్తూ వుంది.
   
    అతడు స్నానం చేద్దామని పెరట్లోకి వెళ్ళాడు. తువ్వాలు గోడమీద వేస్తే అదే బైటవారికి గుర్తు.
   
    అతడు బట్టలువిప్పి స్నానం చేయటం ప్రారంభించాడు.
   
    అంతలో చేతిమీద తువ్వాలు వేసుకుని వైదేహి పెరట్లోకి వచ్చింది. సన్నగా కూనిరాగం తీస్తూ కూలిన గోడవైపునుంచి లోపలి ప్రవేశించబోయి, లోపలున్న సోమయాజిని చూసి నాలిక్కర్చుకుని వెనుదిరిగింది.
   
    అతడు సిగ్గుతో కుంచించుకుపోయాడు. అతడప్పుడు నగ్నంగా వున్నాడు.
   
    ఆమె తనని చూడగానే చప్పుణ చలించటంలోగానీ వెనుదిరగటంలోగానీ తత్తరపాటు లేదు. పైగా కళ్ళల్లో సన్నటి నవ్వు కనబడింది కూడా తను లోపల వున్నట్టూ నిజంగా ఆమెకు తెలీదనే అతను అనుకున్నాడు. ఆ తరువాత దాని గురించి మరి ఆలోచించలేదు.
   
    కాని ఆమె ఆలోచిస్తూ వుందన్న విషయం అతడి వూహకందనిది.
   
    అతడు స్నానం పూర్తిచేసి బయటకి వస్తూవుంటే పెరటిగుమ్మం దగ్గిర ఆమె నిలబడి వుంది.
   
    "తొట్టిలో నీళ్లన్నీ ఖాళీ చేశావా - కొద్దిగానైనా వుంచావా" అంది. ఆమె కళ్ళల్లో చిరునవ్వు అలాగే వుంది.
   
    "తోడిపెట్టనా?" అని అడిగాడు.
   
    "ఊఁ...."
   
    అతడు నూతిలో చేద వేస్తూంటే ఆమె అతడినే చూస్తూ నిలబడింది.
   
    మగవాడి ప్రతీ విజయం వెనుకా ఒక స్త్రీ వుంటుందంటారు. అది నిజమో కాదో తెలీదు కానీ మగవాడి ప్రతీ అపజయం ముందూ మాత్రం ఒక స్త్రీ తప్పక వుంటుంది.
   
                                     6

    సోమయాజి ఇంటికి బడి చాలా దూరం. దాదాపు అరగంట నడక. ప్రొద్దున్న ఎనిమిదింటికల్లా బయల్దేరేవాడు. తొమ్మిదింటికీ బడి. అది రెండింటివరకూ సాగేది. ఇంటికొచ్చేసరికి రెండున్నర అయ్యేది.

    అందరూ తినగా మిగిలిన భోజనం చేసేవాడు.
   
    పల్లెలో సైకిలు పెద్ద బావ తీసుకున్నాడు. ఇక్కడిది రంగారావుది. నడిచివెళ్లి రావటం అతడికి ఒక సమస్య అవలేదు. అంతకన్నా ఎక్కువ పనే చేసేవాడు పల్లెలో. తిండి దగ్గరే సమస్య వచ్చేది. ఎదుగుతున్న వయసు. దానికితోడు ప్రొద్దున్నుంచి కాలుతున్న కడుపు. కంచంముందు కూర్చుంటే సగం కడుపు నిండగానే గిన్నె ఖాళీ అయ్యేది.
   
    దమయంతి ఆర్ద్రమైన కళ్ళతో చూసేది. ఆమె మటుకు ఏం చెయ్యగలదు? అతడు వచ్చిన కొత్తలో కాస్త ఎక్కువ బియ్యం ఎసట్లో పోసింది. అన్నం మిగిలేసరికి మరదలు "అదేమిటమ్మా? పట్నంలో ఖర్చు సంగతి నీకు తెలీదూ! కాస్త పిడికిలి జాగ్రత్తగా చూసుకో" అని అన్యాపదేశంగా హెచ్చరించింది. ఎప్పుడూ వంటింట్లోనే తచ్చట్లాడే రంగారావు తండ్రి "ఏమైందేమైంది" అనుకుంటూ వచ్చి, విషయం విని తన కూతుర్ని మందలించాడు.
   
    "కోడలు పిల్ల మంచిది కాబట్టి సరిపోయిందే. నిన్ను కళ్ళలో పెట్టుకుని చూసుకుంటూంది. జాగ్రత్తగా వుండు. దుబారా చెయ్యకు" అంటూ కూతుర్ని తిట్టి మెచ్చుకోలు కోసం చిన్న కోడలువైపు చూశాడు.
   
    దమయంతికి కళ్ళలో నీరు తిరిగింది. లోపలి విషయాలు తెలియని వాళ్ళయితే ఈ ఆప్యాయతకి 'ఆహో ఓహో' అనుకుంటారు. తియ్యటి మాట అద్ది కత్తితో కోయటం వీళ్ళకే సాధ్యమవుతుంది. ఒక తండ్రి, తన కూతుర్ని, రెక్కలు విరిగిన పక్షిలా తిరిగివచ్చిన దానిని, తనింటిలో వుంచుకుని పోషించవలసిందిపోయి కొడుకు యింటిలో వంటమనిషిని చేశాడు. అయినా కూడా ఆప్యాయతల నాచుక్రింద ఈ భయంకర సత్యాలని ఎవరూ బైటపడనివ్వరు.
   
    ఆ తరువాతెప్పుడూ ఆమె మరో పిడికెడు బియ్యం ఎక్కువ వెయ్యటానికి సిద్దపడలేదు. మరీ ఆకలిగా వున్న రోజున సోమయాజి ఆపుకోలేక అడిగాడు. "కొంచెం ఎక్కువ వండకూడదా" అని ఆమె మొహం తిప్పుకుని, "సర్దుకోవాలి బాబూ" అంది. అతనేదో అనబోయి వూరుకున్నాడు. మనుష్యులూ - మనస్తత్వాలూ -పరిస్థితులూ ఇప్పుడిప్పుడే అతడికి అర్ధమవుతున్నాయి.
   
    ఆకలి వరకూ ఫర్వాలేదు. కానీ కడుపునొప్పి తరచు వస్తూంది. పట్నం బియ్యం ఆలు పడటంలేదు. ఒకరోజెందుకో రంగారావుకి సగం నిద్రలో మెలకువ వచ్చి పెరటి తలుపు తీసి వుండటం చూసి బయటకు వచ్చి, దూరంగా స్నానాలు గదిపక్క రాతిమీద కడుపు పట్టుకుని మెలికలు తిరుగుతున్న సోమయాజిని చూసి "ఏమైందిరా" అని అడిగాడు. గతకొద్ది కాలంలో ఆ మాత్రం ఆప్యాయతకు కూడా నోచుకొని సోమయాజి బావురు మని ఏడ్చేశాడు.
   
    ఆ మరుసటిరోజు ప్రొద్దున్న ఇంట్లో చిన్న సభ తీరింది. "మేం చచ్చిపోయామనుకున్నావ్ రా. అంత నొప్పి పెట్టుకుని చెప్పకపోతే ఎలా?" అంది చిన్నక్క దాదాపు కన్నీళ్లు పెట్టుకుని వచ్చిన కొత్తలో చెప్తే "కాస్త వాము తినరా పోతుంది" అన్న చిన్నక్క!!
   
    ఆ సాయంత్రం సోమయాజి ఆస్పత్రికి వెళ్ళాడు. ఆ డాక్టరు రంగారావు స్నేహితుడే వైద్యశాస్త్రజ్ఞుల మీద అపనమ్మకాన్ని పోగొట్టటానికా అన్నట్టు ఎప్పుడూ నవ్వుతూ వుంటాడాయన. కళ్ళలో దయ కనబడుతూంది.
   
    సోమయాజిని దాదాపు అరగంట పరీక్షించి "ఏమీ లేదోయ్ కొన్ని మందులు వ్రాసిస్తాను. మాత్రలు కూడా వాడండి. ఒకటి రెండు నెలల్లో తగ్గిపోతుంది" అన్నాడు కాగితం మీద వ్రాస్తూ.
   
    పాత స్నేహితుడితో కాసేపు మాట్లాడటానికి ఆగిపోతూ "నువ్వు వెళ్ళరా, నేను తీసుకొస్తానులే" అన్నాడు రంగారావు సోమయాజి ఇంటికి వచ్చేశాడు.
   
    రాత్రి రంగారావు ఇంటికి రాగానే మందు తెచ్చారా అని భార్య అడిగింది.
   
    విశాలంగా నవ్వుతూ "వాణ్ని బాగా తిట్టానులే. మందులు 'వ్రాసి' ఇవ్వడం ఏమిటని ఏం? నాకా మాత్రం చనువులేదూ....? వెంటనే లోపలికి వెళ్ళి బీరువాలోంచి తీసి ఇచ్చాడు" మనమంటే ఏమనుకున్నావ్ - అన్నట్టూ భార్యవైపు చూస్తూ ఎర్రమందున్న సీసా, మాత్రల పొట్లం అందించాడు.

    "ఒరేయ్ నాయనా ఇదిగో తీసుకోరా, మీ బావగారు తెచ్చారు" అని పిల్చింది ఆవిడ. లోపల్నుంచి సోమయాజి వచ్చాడు. "స్నేహితులంటే అలా వుండాలండీ" అంటూంది ఆమె భర్తతో. సోమయాజి పొట్లమూ, సీసా తీసుకుని లోపలికి వెళుతూంటే, "ఈ రోజునుంచీ వాడరా బాబూ అశ్రద్ద చేయకు. పరీక్షలు దగ్గిరకొస్తున్నాయి" అంది ఆప్యాయంగా.
   
    ఎర్రమందు నోటినంతా చేదు చేసింది. గూట్లోపెట్టి పొట్లం విప్పి మాత్రవేసుకోబోతూ అనుమానం వచ్చి మీద పేరు చూశాడు. అతడు అంత తెలియనివాడేమీ కాదు. మామూలు ఒళ్ళు నొప్పులూ, జ్వరానికి ధర్మాసుపత్రిలో యిచ్చే మాత్రలవి. బయటయితే అయిదు పైసలు ఖరీదు చేస్తాయి. ఆస్పత్రిలో అయితే ఊరికే ఇస్తారు.
   
                                       *    *    *    *
   
    రంగారావు పీనాసి కాదు కానీ అదో తరహా మనిషి తనవాళ్ళకి బాగానే పెడతాడు. వస్తూ వస్తూ సాయంత్రప్పూట పళ్ళూ, ఫలాలు తీసుకొస్తాడు. ఇంటిల్లిపాదికీ పెడతాడు. మళ్ళీ అందులో మినహాయింపులూ, దాచుకోవటాలూ ఏమీ వుండవు. ఉన్నట్టుండి అతడికి తను డబ్బు అనవసరంగా ఖర్చు పెడుతున్నానని జ్ఞాపకం వస్తుంది. అదిగో - అప్పుడే ఇలా ప్రవర్తిస్తూ వుంటాడు.
   
    అలా ప్రవర్తించిన విషయాల్లో పుస్తకాలు కూడా వున్నాయి. చేరి నెలరోజులయినా పుస్తకాలు కొని పెట్టలేదు. రంగారావు ఉద్దేశ్యం ఆ పుస్తకాలకయ్యే ఖర్చు 'పల్లెవాళ్ళే' భరించాలని!
   
`    రోజులు అలాగే గడుస్తున్నాయి. "రోడ్డు పక్కన సగం ధరకే అమ్ముతారు. వెళ్లి చూడకూడదూ" అనేవాడు అప్పుడప్పుడు.
   
    ఈ అవకాశాన్ని లెక్కల మాస్టారు చాలా బాగా ఉపయోగించుకున్నారు. "ఏదిరా నీ పుస్తకం?" అని నిలదీశాడు.
   
    "నే....నే.....నేనింకా కొ..... కొనలేదండీ"
   
    "వెనక్కి వెళ్ళి నిలబడరా నత్తివెధవా ? పుస్తకం కొనేవరకూ అలాగే నిలబడుతూ వుండు" అన్నాడాయన.
   
    ఆ రోజునుంచీ అది నియమం అయింది.
   
    ప్రతిరోజూ మాస్టారు క్లాసులోకి రాగానే యాభైజతల కళ్ళూ అపహాస్యంగా నవ్వుతూ అతడివైపు చూసేవి. అతడు మౌనంగా లేచి వెనక్కి వెళ్ళి నిలబడేవాడు. ఇలాగే రోజులు గడుస్తున్నాయి.

 Previous Page Next Page