Previous Page Next Page 
వెలుగుబాట పేజి 25

   
    మరొకరు తనకు నీతులు చెబుతూ మాట్లాడటం భరించలేక పోయింది. అక్కడినుంచి లేచి వచ్చేసింది. థెరిసా, శాంతమ్మలలో ఎవరూ మరి కొంచెం సేపు కూచోమని అనలేదు.
    అవమానం, దుఃఖం- ఈ రెండు ఝాన్సీ మనసుని అల్లకల్లోలం చేస్తున్నాయి. శాంతమ్మ చెప్పిన మాట నిజమేనా? థెరిసా కూడా బలపరిచిందికదా! థెరిసా ఎందుకంత కఠినంగా మాట్లాడింది. అవును కూతురికి కాబోయే మొగుడికోసం వచ్చిన ఆడపిల్లతో కఠినంగా కాక, మరెలా మాట్లాడుతుందీ? కుమార్ ఒప్పుకున్నాడా! ఎందు కొప్పుకోడూ? మేరీ  కేమి తక్కువ? అయితేమాత్రం, తననంత తేలిగ్గా మరచిపోతాడా? మరచిపో లేనంతటి మధురానుభూతు లేమున్నాయి తమమధ్య? అతడి భార్యగా ఉద్యోగం సంపాదించుకుని, అతడి కుటుంబాన్ని ఇంట్లోంచి వెళ్ళగొట్టడం తప్ప అతడికోసం తను చేసిందేముందీ?
    మేరీ కూడా ఈ మధ్య తనతో ముభావంగా ఉంటోంది శాంతమ్మ చెప్పింది నిజమే అయి ఉంటుంది.
    ఈ ఆలోచనలనతో ఎప్పుడూ సతమత మయిపో సాగింది ఝాన్సీ.
    ఒకరోజు మేరీ వచ్చి "మేడమ్! నేనీ ఆస్పత్రిలో రిజైన్ చేస్తున్నాను. డాక్టర్ కుమార్ గారి ప్రైవేట్ క్లినిక్ లో  జాయినవుతున్నాను. అని చెప్పింది.
    ఎర్రగా కాలుతున్న సుత్తితో గుండెలమీద కొట్టినట్లయింది ఝాన్సీకి, కొద్ది సేపటివరకూ తనని తాను నమ్మాళించుకొంటూ మాట్లాడలేక పోయింది. కొన్ని నిముషాలు సమాధానంకోసం ఎదురుచూసి మేరీ వెళ్ళిపోబోయింది.
    వెళ్ళిపోతోంది! మేరీ  వెళ్ళిపోతోంది? కుమార్ దగ్గరకే వెళ్ళిపోతోంది! ఝాన్సీ తలలో సముద్రపుహొరు! గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్న క్షోభ- "మేరీ?" అనిపిలిచింది గట్టిగా- వెళ్ళిపోతున్న మేరిని ఎలాఅయినా ఆపుచెయ్యటానికి ప్రయత్నిస్తున్నట్లు. అంత గట్టి అరువుకి విస్తుపోయి చూసింది మేరీ! ఝాన్సీ తనను తాను సంబాళించుకొని శాంతంగా "ఎందు కిక్కడ రిజైన్ చేస్తున్నావు? ఇది గవర్నమెంట్ జాబేకదా!" అంది.
    " అది నా స్వవిషయం" గంభీరంగా అంది మేరీ. ఝాన్సీలాంటి అభిమానవంతురాలికి ఆ సమాధానం చాలు, కాని, ఆ సమయంలో ఝాన్సీ మానాభిమానాల విషయము పూర్తిగా మరిచిపోయింది. ఏదో ఆరాటం, అశాంతి.  మేరీని ఎలా అయినా ఆపాలనే తపన "అక్కడ ఇంతకంటే  ఎక్కువ జీతం వస్తుందా?" "డాక్టర్  కుమార్ దగ్గర జీతం ప్రస్తావనలేదు మేడమ్. మేమంతా ఒకే కుటుంబంగా  కలిసిపోబోతున్నాము. కుమార్ గారి ప్రాక్టీస్ బాగా పెరుగుతోంది ఆయన తమ్ముడు  బాలయ్య కాంపౌండర్ గా వచ్చేశాడు ఆయన దగ్గరకి. పేరుకి కాంపౌండర్ కాని, ఇంచుమించు తన అసిస్టెంట్ లా తయారు చేస్తున్నారాయన్ని కుమార్. అక్కడ నర్సు అవసరం చాలా ఏర్పడుతోంది. అందుకే నేను వెళ్ళిపోతున్నాను."
    ఒక విధంగా సిగ్గుపడుతూ చెప్పింది మేరీ. సిగ్గుపడుతున్నప్పుడు ఆ ముఖం మరింత అందంగా ఉంది- ఈ సారి మేరీ వెళ్ళిపోతున్నప్పుడు చూస్తూకూచుంది. ఝాన్సీ అపాలనే ప్రయత్నం చప్పగా చల్లారిపోయింది. తలలో హొరూ, గుండెలలో చప్పుళ్లూ తగ్గిపోయి, వ్యక్తిత్వాన్నంతటినీ తీవ్రమైన స్థబ్దత ఆవరించుకొంది.
    ఆ స్థితిలో ఇంటికొచ్చిన ఝాన్సీని చూసి తల్లి తల్లడిల్లిపోయింది. "అదేమిటీ అలా ఉన్నావు! ఒంట్లో కులాసాయేనా?" అని చెంపమీద చెయ్యిపెట్టి చూడబోయింది. ఆ  చెయ్యి  తోసేసింది. ఝాన్సీ. ఏమిటీ, శత్రువుని చూసినట్టు చూస్తున్నావ్? నీ కాల్లో ముల్లుగుచ్చుకున్నా నేను సహించగలనా? ఎంత కష్టపడి ఎలా పెంచానో మరిచిపోయావా? ఆనాడే నేనూ ఇంత విషం పుచ్చుకొనివుంటే, నాకు నీకు ఈనాడు ఇన్ని బాధలుండకపోయేవి." అంది తల్లి ఏడుస్తూ ఝాన్సీ స్థితి చూస్తుంటే ఆవిడకి నిజంగానే ఏడుపోస్తూంది భయమూ వేస్తూంది.
    ఝాన్సీ భరించలేక రెండు చేతులూ జోడించి "అమ్మా! నీకు పుణ్యముంటుంది- నన్ను కొంచెం సేపు పడుకొనియ్యి- నాకు కొద్దిగా విశ్రాంతి కావాలి- అంతే!" అంది. ఆ స్థితిలో ఝాన్సీతో ఇంకేమైనా మాట్లాడతానికి ధైర్యం చాలలేదు తల్లికి- తలుపులు మూసుకుని గదిలో పడుకున్న ఝాన్సీ భోజనానికీ రాలేదు- కాఫీకీ రాలేదు- సాయంత్రమైనా లేవలేదు. అక్క ఒకటి రెండుసార్లు తలుపు తట్టబోతే, తల్లి వారించింది. ఆ మరునాడు ఉదయానికి తలుపులు తీసుకుని బయటికి వచ్చింది ఆమె. ముఖం బాగా వదిలిపోయి వున్నా స్థిమితంగా వుంది. మామూలుగా అందరితోనూ మాట్లాడి కాఫీ ఫలహారం చేసి ఆస్పత్రికి వెళ్ళిపోయింది. "హమ్మయ్య" అనుకుంది తల్లి- ఝాన్సీ కలవరానికి కారణం ఆమె ఊహించగలిగింది. కాలం గడిస్తే అన్నీ  సర్దుకుపోతాయని నిశ్చింతగా ఊపిరి తీసుకుంది.
    కొత్త నర్స్ వచ్చింది ఝాన్సీ  అసలు డ్యూటీమీద ఉండటంలేదు. పేషంట్స్ కూడా బాగా పలచబడిపోయారు. అందరూ కుమార్ ఆస్పత్రికి వెళ్తున్నారు కాబోలు! వచ్చిన కొద్ది మందినీ నర్సు, కంపౌండరూ చూసి పంపుతున్నారు. ఝాన్సీ  మెడికల్ జర్నల్ చదువుతున్నట్లు నటిస్తూ తన లోకంలో తానుండిపోతుంది. నర్సు లంచ్ టై మయిందని చెబితే, అప్పుడు యాంత్రికంగా లేచి ఇంటికెళ్ళి తల్లి పెట్టింది మాట్లాడకుండా తిని స్లీపింగ్ టాబ్లెట్  వేసుకుని నిద్రపోతుంది అంతే! మరునాడు ఉదయమే  లేవటం. మెలకువ వచ్చినా, ఇంకొక నిద్రమాత్ర మింగుతుందేకాని, బయటికిరాదు. ఈ  స్థితి తల్లికి చాలా ఆందోళనగా ఉంది ఏం  చెయ్యాలో  అర్ధంకావడంలేదు. ఏదన్నా మాట్లాడదామన్నా ఝాన్సీ చాలా ముభావంగా ఉంటుంది. అసలు కూతుర్ని సమీపించాలంటేనే భయంగా ఉంది తల్లికి.
    ఇంట్లో నిద్రమాత్రలయిపోయాయి. ఆస్పత్రిలో లేవు. ఆ గ్రామంలో మందులషాపు లేదు. కుమార్ క్లినిక్ కి వెళ్ళి అడగాలనుకుంది ఆమె.
    "కుమార్ ని చూడటానికి ఇదొక వంకా?" అని ప్రశ్నించుకుంది అంతరాత్మ. ఆత్మాభిమానం ఉరకలు వేస్తున్న మనసును కొద్దిగా వెనక్కులాగించి చివరకు బయలుదేరటానికే నిశ్చయించుకుంది.
    ఝాన్సీ వెళ్ళేసరికి కుమార్ ఆపరేషన్ చేస్తున్నాడు. బాలయ్య, మేరీ అతనికి సహకరిస్తున్నారు. ఒక చిన్న  వరండానే  ఆపరేషన్ ధియేటర్ గా మార్చాడు. వెనుకవైపు తెరలు తప్ప గోడలేదు. అతని దృష్టి అంతా ఆపరేషన్ మీదనే కేంద్రీకృమయింది. బాలయ్యకు, మేరీకి ఒకవంక సూచనలిస్తూ, మరొకవంక  తాను చేస్తున్న ఆపరేషన్ గురించి బోధిస్తూ ఆపరేషన్ చేస్తున్నాడు. ఆ సమయంలో అతడొక మహాతపస్విలా ఉన్నాడు. తన పని, ఆ పనిలో మెలకువలు, ఆ పనిలో సరికొత్త పురోభివృద్ధి, ఇవే అతని కళ్ళముందున్నట్లుగా మిగిలిన లోకంలో ఏవీ తనకంటనట్టుగా ఉన్నాడు.

 Previous Page Next Page