Previous Page Next Page 
వెలుగుబాట పేజి 24

 

    "ఏంటో బాపనమ్మా, అంతా అయోమయంగా ఉంది. ఆ రోజు సొంత తోబుట్టువల్లే మాట్లాడాడు- ఈ రోజు మొహమైనా చూళ్ళేదు."
    "ఓట్ల కోసం వచ్చినవాళ్ళు అలాగే ఉంటారులే శాంతమ్మతల్లీ! తమకు ఓట్లిచ్చి గెలిపించిన ప్రజల్ని మరిచిపోయి, దేవుడికి పూజలు చేస్తారు.
    సరేలే  నువ్వేదో  పూజ చేయిస్తానన్నావు సాయంత్రం గుళ్ళోకెళ్దాం రా"
    ఇద్దరూ సాయంత్రం గుడికి బయల్దేరారు  పట్టుచీర అడ్డ కట్టుకుని హంగామాగా ఉంది ఝాన్సీ తల్లి,
    దేవుడి దర్శనం కోసం గుడిముందు బారులు తీరి వున్నారు జనం. దేవుడి దర్శనం కోసం కొంత, హరిజనులు కూడా గుళ్ళోకి ప్రవేశించే వింత చూడాలని కొంత, యమ్మెల్యేగారి సన్మానం చూడాలని మరికొంతా. గ్రామస్తులు సహజమైనా కుతూహలం కొద్ది వచ్చినవారేకాక కార్యకర్తలు నానా విధాలా తంటాలుపడి పోగుచేసిన జన సమూహం కూడా ఉన్నారు. అంచేత రద్దీ చాలా ఎక్కువగా వుంది.
    ఝాన్సీ తల్లి చొరవగా జనాన్ని  తోసుకుంటూపోబోయింది కాని, జనం ఆమెను వెనక్కు నెట్టేసారు. కొద్ది దూరంలో వున్న పురోహితుణ్ని గుర్తించి "దీక్షితులుగారు, దీక్షితులుగారు" అని కేకేసింది. పళ్ళెంలో అక్షింతలు సర్దుతున్న దీక్షితులు ఒకసారి అటువైపు చూసి, తీక్షణంగా కనుబొమలు ముడిచి, గర్భమంటపంలోకి వెళ్ళిపోయాడు.
    నూరు రూపాయలూ, యాభై రూపాయలూ, పాతిక రూపాయలూ టికట్ పెట్టగలిగిన వాళ్ళంతా "అడ్డదారిన" దేవుడి దగ్గర  కెళ్ళిపోతున్నారు. మిగిలినవాళ్ళు క్యూలో తొక్కిసలాడి పోతున్నారు.
    పట్టుచీరతో, వంటినిండా రాళ్ళ నగలలో మదగజయానంతో వచ్చిందొకావిడ- ఆవిడని చూడగానే ఝాన్సీ తల్లి సంబరపడిపోతూ "పార్వతమ్మా! నేను గుర్తున్నానా?" అని పలకరించింది- ఆవిడ ఆగి ఝాన్సీ తల్లిని నిదానించి చూసి, అసహ్యించుకొంటున్నట్లుగా ముఖం పెట్టి "ఏవిటీ? ఈ మధ్య నీ కూతురు హరిజనుడితో ఒకింట్లోనే ఉందిటగా! చూస్తూ  ఊరుకున్నావా? లేకపోతే, దగ్గరుండి నువ్వే కాపురం చేయించావా?" అని ఈ సడించుకుంటున్నట్లుగా ముందుకు పోయింది. ఆవిడ క్యూలో నిలబడలేదు. ఎవరో వచ్చి ఆవిడని నేరుగా లోపలి తీసుకుపోయారు, టికట్ లేకపోయినా. గుడి ఆవరణలోని కళ్యాణ మంటపంలో యమ్మెల్యేగారి సన్మాన సన్నాహాల తాలుకూ సన్నాయి ప్రారంభమయింది. కన్నీళ్ళు నిగ్రహించుకోలేకపోతోంది ఝాన్సీ తల్లి.
    "శాంతమ్మతల్లీ నేనిక్కడుండ లేను పోతాను" అంది- శాంతమ్మకు కూడా మనసంతా చాలా భారమయింది. "ఈ గోల చూస్తావుంటే, నాకూ పూజ చేయించాలని లేదు- పోదాంపద!" అంది.
    ఇటు పూజలకు అటు సన్మానాలకు దూరంగా ఇళ్ళకు మళ్ళుతోన్న ఆ ఇద్దరు స్త్రీలకూ, విచిత్రంగా తామిద్దరూ ఒకటే అనిపించింది. భాషకందని ఆ భావాన్ని ఇద్దరిలో ఒక్కరూ వ్యక్తంచెయ్యలేకపోయారు.

    
                                                             *    *    *

    ఆ రోజు హాస్పిటల్ కి కుమార్ రాలేదు. ఝాన్సీ మనసంతా అల్లాకల్లోలంగా ఉంది. కుమార్ ఎప్పటిలాగే పన్నెండు తర్వాత తన దగ్గరకువచ్చి, తనకు సహాయం చేస్తోంటే, అంతరంగంలోని అశాంతి చాలావరకు చల్లబడేది ఝాన్సీకి.
    తమ ఇద్దరిమధ్యా పరిష్కరించుకోవలసిన సమస్య అలాగేవుందని తెలిసినా ఆ సమస్యను ఎదుర్కోలేక, దానిని తప్పించుకుంటూ తృప్తిపడసాగింది.
    ఈ రోజు కుమార్ రాకపోవటంతో, తాను తప్పించుకొంటున్న సమస్య మరింత వికృతంగా భయపెట్టసాగింది. భరించలేక తానే మేరీ ఇంటికి బయలుదేరింది, కుమార్ విషయం తెలుసుకోవటానికి.
    ఝాన్సీనిచూసి శాంతమ్మ ఏమంత సంతోషించలేదని ఆవిడ ముఖం చూస్తేనే తెలిసిపోతుంది. అయినా అభిమానం గానే "రా! కూచో" అంది తరువాత ఇద్దరికీ మాటలు కరువయ్యాయి. శాంతమ్మ విసిగి "ఏం ఇలా వచ్చావు?" అంది. ఝాన్సీ  రుమాలుతో ముఖం తుడుచుకుని, "కుమార్ ఎలా ఉన్నారు? ఇవాళ కనపడలేదు. అందుకని...." అంది.
    "ఇవాళ కనపడలేదు" అంటే రోజూ కనిపిస్తున్నాడా? ఒక్కరోజు కనిపించకపోతే వెతుక్కుంటూ ఇంటికొచ్చేసిందా? శాంతమ్మ ముఖం కఠినంగా అయిపోయింది.
    "కుమార్ ఊళ్ళో లేడమ్మా! ఆశ్చయ్యని ఎవరికో చూపిస్తానని వెళ్ళాడు- ఏమో సామానులు కూడా కొనాలన్నాడు" అంది. అంతలో ఝాన్సీ రాక గమనించి మేరీ తల్లి థెరీసా కూడా అక్కడికి వచ్చింది. ఆవిడ ముఖంలోనూ ప్రసన్నతలేదు- శాంతమ్మ ఉన్నట్టుండి "డాక్టరమ్మా! మా అబ్బాయికీ మేరీకి పెళ్ళిజరుగుతుంది. త్వరలోనే చెయ్యాలనుకుంటున్నాం!" అంది.
    ఝాన్సీ ముఖం నెత్తురుచుక్కలేనట్టు పాలిపోయింది' శాంతమ్మ అక్కడితో ఆగలేదు.
    "డాక్టరమ్మా! అమ్మ చెప్పినట్టువిను, పెద్ద వయసులో ఆవిడకి దుఃఖం కలిగించకు, మావోడు నా మాట కాదంటే. నేను భరించగలనా?"
    ఝాన్సీ మాట్లాడలేకపోయింది. థెరిసా శాంతమ్మకంటె కొంత కఠినంగా "డాక్టర్! మీరిక్కడికి వచ్చినట్లు మీ అమ్మగారికి తెలుసా?" అని అడిగింది సూటిగా.
    ఝాన్సీ తెలియదన్నట్లు తలవూపింది. "మీకు చెప్పవలసిన దానిని కాను, కాని, ఇది మంచిపద్ధతి కాదు. మీ అమ్మగారికి నచ్చజెప్పి ఆవిడని  ఒప్పించి రండి. లేకపోతే  ధైర్యంగా ఎదిరించిరండి. అంతేకాని, ఇలా దొంగచాటుగా రాకండి.
    అవమానంతో ఝాన్సీ ముఖం ఎర్రబడిపోయింది.

 Previous Page Next Page