సంతోషంగా వచ్చిన మూర్తి ఇల్లంతా నిశ్శబ్దంగా గంభీరంగా ఉండడం గమనించి "అంతా కులాసానా!" ప్రశ్నించాడు జానకమ్మను.
"కులాసాయే బాబూ? కాని అలా చూడు మీ బావ మరిదికో గ్రహం పట్టింది కొన్నాళ్ళయి, మీ అవిడ చెప్పే ఉంటుంది. లేకపోతే చూడు, తీసుకెళ్ళి ఏ ఆసుపత్రిలోనో పారెయ్యక దాన్ని పట్టుకు ఏడుస్తున్నాడూ?" అన్నారు రంగనాధం నెమ్మదిగా విసుక్కుంటూ.
"బావా చాలా కాలాన్కి వచ్చారు." నవ్వుతూనే పలకరించాడు శ్రీనివాసరావు.
కృష్ణ సమ్మంధం విషయం మాట్లాడధమని...." అంటూ శ్రీనివాసరావు ఎదురుకుర్చీలో కూర్చున్నాడు మూర్తి.
"ఎక్కడ? ఏదైనా కనుక్కున్నారా?" ఏదో మాట్లాడాలనే ఉద్దేశ్యంతో ప్రశ్నించాడు శ్రీనివాసరావు అతని కాసక్తిలేకపోయినా.
ఆ. ఆ అన్నీ బాగున్నాయోయ్. కాని అమ్మాయి కాస్త నల్లగా ఉంటుంది మనవాడే మంటాడో అని....."
"వద్దు బావా? వాడి అంగీకారం లేందే మీరే నిశ్చయానికీ రాకండి" హెచ్చరిస్తూన్నట్టన్నాడు శ్రీనివాసరావు.
"మీ అక్కయ్య చంపేస్తోందోయ్, వాడు కానీలే. ఎలానూ రెండు మూడు నెలల్లో వస్తాడు అంటే వినడంలేదు. మొన్న వెళ్ళి వాళ్ళ అమ్మయిని చూసి వచ్చింది. నిశ్చయం చేసెయ్యమంటుంది,"
"దాని మొహం, ఓ దానికొకటి అయితే మాటవినిపోతారు. అలాటి తెలివితక్కువ పని చెయ్యకండి" అన్నాడు శ్రీనివాసరావు.
తర్వాత రంగనాధం జానికమ్మా అందరూ అదే సలహా యిచ్చారు.
రాదను చూసిన మూర్తి "ప్చ్. ఎంత అందమైన అమ్మాయి? పాపం ఎన్నాళ్ళయి జ్వరం?" అంటూ ప్రశ్నించాడు.
"పదిహేను రోజులైంది. ఇవ్వాళ బొత్తిగా స్పృహ లేదు" స్వగతంలా అంటూ "అమ్మా రాధా" అని నెమ్మదిగా పిల్చాడు.
చలనం లేదు. పైగా అదోలా అయిపోతూంది. రాధ కంగాఉర్గా డాక్టరుకి కబురు చేశాడు శ్రీనివాసరావు.
డాక్టరు రాధను పరీక్షించి ఇంజక్షనిచ్చి, ఇవతలికొస్తూ వెనుదిరిగి, తన వెనుకనున్న శ్రీనివాసరావు తో 'ప్చ్ మన ప్రయత్నం మనం చేశాం. తర్వాత భగవంతుని దయ. మీరు ధైర్యంగా ఉండండి ఓ గంటలో తెలివి రావచ్చు" అంటూ ముందుకు చరచరా నడిచి వెళ్ళిపోయాడు.
నిమిషాలు లెక్కపెడుతూ, ఆత్రుతగా రాధ వైపు చూస్తూ, మౌనంగా మ్లానవదనంతో కూర్చున్నాడు శ్రీనివాసరావు.
ఇల్లంతా గంభీర నిశ్శబ్దమావరించింది. బరువుగా క్షణాలు దొర్లుతున్నాయి.
శ్రీనివాసరావు కళ్ళు నిర్విరామంగా వర్షిస్తున్నాయి. ఎటో వెళ్ళి వచ్చిన రంగనాధం గబగబా శ్రీనివాసరావు దగ్గరకొస్తూ "కొంప తీశావు గదరా.....చెరువుక్రింద మళ్ళు తనఖాపెట్టావట. పదివేలరూపాయలకి రాధని కొన్నావట. ఏమీరా నీకే పొయ్యేకాలం" అంటూ తల రెండు చేతుల్లో పట్టుకుని శ్రీనివాసరావు ఎదురుగా చతికిల బడ్డాడు.
"ఆ. ఏవిటీ బుగ్గలు నొక్కుకుంది జానికమ్మ.
ప్రశ్నార్ధకంగా శ్రీనివాసరావు వైపు చూశాడు మూర్తి. అయోమయంగా చూస్తూంది శాంత.
గబగబా కళ్ళుతుడుచుకుని "అవును రాదను పదివేలకు కొన్నాను. అది నా కూతురు కాబట్టి" అన్నాడు శ్రీనివాసరావు.
"ఏమిటిరా పిచ్చి వాగుడు!" అంటూ కోపంగా లేవబోతున్న రంగనాధం చేతులు రెండూ పట్టుకుంటూ, "ఇంకెందుకు నాన్నా ...... నేచేసిన పాపం నేను కప్పుకోవడం? పిచ్చితల్లి నన్ను నాన్నా అని పిలవకుండానే వెళ్ళిపోతూంది. మీ కందరికీ ఇబ్బందిలేకుండా మీ పరువుపోకుండా. నేనెక్కడ పెళ్ళి చేస్తానో అనే దిగులు మీకు లేకుండా.... రాధ వెళ్ళిపోతూంది. నేనుకట్టుకున్న పిచ్చికగూళ్ళు కాలరాసి పోతూంది. రాధా అమ్మా రాధ మంచం పట్టెను తలకొట్టుకుంటూ చతికిల పడి, హృదయం పగిలిపోయేలా.... "అమ్మా నన్ను మోసం చేసి వెళ్ళిపోతున్నావు కదూ! అవును మీ అమ్మను నేను మోసం చేశాను.....నువ్వు....నువ్వు...నా బిడ్డవు కాదన్నాను.....మీ అమ్మమీది కసి.....నీమీద తీర్చుకుంటున్నాని గ్రహించలేక పోయానమ్మా.....నన్నొక్కసారి నాన్నా అనిపిల్చి చచ్చిపో" ఆమె తలకు తన తల ఆనించి రోదిస్తూన్న శ్రీనివాసరావు జబ్బపట్టుకు ముందుకి లాగుతూ "ఏమిటి శ్రీనూ అంటున్నావు నాకేమీ అర్ధంకావడంలేదు" అన్నాడు మూర్తి. సంభ్రమాశ్చర్యాలు ముప్పిరగొన్నాయందరి వదనాల్లో. తెల్లబోయి చూస్తున్నారు శ్రీనివారావు వైపు.
"ఈ నిజం నిప్పులా నా గుండెల్ని కాలు స్తూంది బావా! రాధ నా కూతురు, రమ కూతురు రమ నుంచి విడాకులు పొందాలనే సంకల్పంతో అలా అబద్ధమాడాను. ఇంకా ఆమెమీద నాకు కసి......పగ.... అన్నీ అలా అబద్ధమాడి తీర్చుకోవాలనుకున్నాను.....ఏమిటి తీర్చుకున్నాను? ఇలా నాలా రమ ఏడవలేదు .... నేను ఏడుస్తున్నాను....." అంటూ మళ్ళీ రాధ వదనంలోకి చూస్తూ "అమ్మా రాధా....మరింక నాతో పొలానికి రావూ?....పద్ధ్హేనిమిదేళ్ళ జీవితంలో ఎన్ని బాధలకు గురయ్యావమ్మా....ఈ రాక్షసుడి కడుపున పుట్టి. పద్దెనిమిదేళ్ళు పరులపంచన అనాధగా బ్రతికి పోనీ ఇప్పుడైనా ఇకపై నయినా సుఖపడతావనుకున్నాను. నీకు నూరేళ్ళూనిండి" అతని గొంతు పూడిపోయింది. ఉన్మత్తుళ్ళా జుట్టు పీక్కుని విలపిస్తున్నాడు శ్రీనివాసరావు.
రాధ పక్కలో కూర్చుని ఆప్యాయతగా. "మా యింటి మహాలక్ష్మివా తల్లీ" అని...."తండ్రీ ఏడుకొండలవాడా రక్షించు నాయనా" అంటూ ప్రార్ధనలు చేస్తూంది జానకమ్మ.
"ఓరి అప్రాచ్యపు వెధవా? ఇన్నేళ్ళొచ్చి ఇంకా అబద్ధాలే అడుగుతున్నావురా? ముందే అలా ఎందుకు ఏడవలేక పోయావు?.... ఏడు దాని ఉసురెక్కడికి పోతుంది. అసలు సంధ్యవేళ నిండుమనిషిమీద నిందమోపి తగలేసేకా? ఆ వేళ తెలియదురా అనుభవం ఇలా ఉంటుందని.
"అబ్బా! ఊరుకోండి ఎవరన్నా వింటే నవ్విపోతారూ! ఏదో తెలివితక్కువ పనిచేశాడు. అఘోరిస్తున్నాడు. గుట్టుగా మనలోనే దాచుకోవాలి సంగతి - అంతేకాని ఈ సంగతి ఎవరికన్నా తెలిస్తే మొహాన ఉమ్మేయరూ? ఏదో మన పిల్ల మనింటి కొచ్చింది. అది బ్రతికి బయట పడితే అంతేచాలు" అంటూ భర్తను మందలించింది జానకమ్మ.
"అమ్మా..." సన్నగా మూలిగి వత్తిగిలింది రాధ. ఒక్కసారి అందరి వదనాల్లో ఆనంద రేకలు విరిశాయి.
కొన్ని క్షణాల తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచింది రాధ. నెమ్మదిగా ఆమె నోట్లో గ్లూకోజ్ నీళ్ళు పోసింది జానకమ్మ.
తన కొడుక్కు ఇచ్చి పెళ్ళి చెయ్యాలనే ఉద్దేశంలో ఇలా అబద్ధమాడుతున్నాడని అపార్ధం చేసుకున్న మూర్తి తొందర పనులున్నాయంటూ వెళ్ళిపోయాడు.
* * *
మూర్తి అత్తవారిని సంప్రదించకుండానే. రామకృష్ణ కు సంబంధం స్థిరం చేశాడు. "అబ్బాయి చూడాలికదా? అని అవతలవారు అంటూన్న......మా అబ్బాయి మా మాట కాదనడు. మీ ఇష్టమొచ్చిన సంబంధంరైటు చెయ్యండని మాకు ఉత్తరం వ్రాశాడు. మా అబ్బాయి ఫోటో చూసి అమ్మాయి నచ్సుతుంది కదా! అంటూ ఓ గొలుసు చేయించి అత్తవారికి తెలియకుండానే ప్రధానం అంటూ నిశ్చయంచేశాడు మూర్తి.
"వచ్చేటప్పుడు తోవేకదా అని మామయ్య ఇంట్లో దిగుతాడేమో మనవాడ. మనింటికే తిన్నగా వచ్చెయ్యమని వ్రాయండి" అంటూ హెచ్చరించింది భర్తని కామేశ్వరి.
"ఆ పిల్ల జబ్బుపడిందికదా? ఓ సారి చూసి రారాదూ?......బాగుండదని మీ అన్నయ్యని మెప్పించడంకోసం. ఏమంటావ్?" భార్యనడిగాడు మూర్తి.
"ఫోన్లెద్దురూ....వాడిప్పుదధి రమ కూతురంటే నమ్మేవారెవరు? అలా అని మనవాడి కంటగట్టాలని నే వెళ్ళను బాబూ. మనవాడొచ్చి వాడికా నాలుగు అక్షింతలూ పడేదాకా ఇల్లు కదలను" అంది కామేశ్వరి.
"నిన్ను చూడాలనుంది. నా ఆరోగ్యమేమీ బాగులేదు తొందరగా వీలుచూచుకుని వచ్చెయ్" అంటూ కొడుక్కి ఉత్తరం వ్రాశాడు మూర్తి.
* * *
రాధ టెంపరేచర్ నార్మలు కొచ్చింది. ఆ ఇంట్లో వ్యక్తులందరి మొహాల్లో ఆనందరేకలు విరిశాయి. అందరూ కంటికి రెప్పలా గారంగా చూస్తున్నారు రాదని.
పథ్యం, చారూ అన్నం తినిపిస్తూ జానకమ్మ "నాతల్లి మీ అమ్మా, నాన్నా మూర్ఖత్వం కాదు గాని ఎన్ని బాధలుపడ్డావమ్మా!" అంటూ కళ్ళు వత్తుకుంది.
ఆమె వదనంలోకి ఆశ్చర్యంగా చూస్తూ...."మా అమ్మా నాన్నా మీకు తెల్సా బామ్మగారూ?" ప్రశ్నించింది రాధ.