నీతోనూ నలుగురికీ చెప్పుకోడాన్కి సిగ్గుపడి పోయాడమ్మా! వాడి గుండెల్లో బాధంతా ఇముడ్చుకుని లోకం ఏం అవిపోతుందో అని స్నేహితుడి కూతురు నని చెప్పుకుంటున్నాడు. వాడే, నా కొడుకేనమ్మా నీ తండ్రి."
"బామ్మగారూ?..." నిర్ఘాంతపోయింది రాధ. "అవునమ్మా.....పోనీ నీరు పల్లనికే పారుతుందని భగవంతుడు నీవారి దగ్గరకు నిన్ను చేర్చాడు."
ఏవేవో ఆలోచనలతో తల వేడెక్కి పోతూంటే హృదయం తీవ్రంగా స్పందిస్తూంటే ఏదో శూన్యంలోకి చూస్తూ మౌనంగా ఉండిపోయింది కొన్ని క్షణాలు.
"ఇంకొంచెం తీసుకురానా అన్నం" అడిగింది జానకమ్మ.
"వద్దు బామ్మగారూ......అయితే నిజంగా మీరు నాకు"......సంభ్రమంగా జానికమ్మవైపు చూసింది రాధ.
"అవునమ్మా......బామ్మని నీ తండ్రి తల్లిని. మీ అమ్మ కెంత చెప్పాను తల్లీ కాపురం నిలబెట్టుకోమని...."
"అయితే మా అమ్మ మీ ఎవ్వరిమాటా వినేది కాదా బామ్మా!" తన తండ్రి తల్లి అని అనుకోగానే. పట్టలేని సంతోషం. ఆమె తన ఆత్మీయురాలనే స్వతంత్రం ఏవేవో అడిగి తెల్సుకోవాలనే ఉత్సుకత, మెల్లగా లేచి కూర్చుంది రాధ.
"ఉహు.....పడుకో మీ నాన్న ఇప్పుడప్పుడే నీ కలా చెప్పవద్దన్నాడు. హైరానా పడకు. ఎలా గోలా ఇద్దరూ కలసి నిన్ను దిక్కుమాలిన దానిగా చేశారు కొన్నాళ్ళు.....ఏదో జరిగిపోయిందెందుకు, ఇద్దరూ మూర్ఖులే, మీ అమ్మా నాన్నా కూడా.....పడుకోమ్మా.....నీ తండ్రి ఇంట్లో నువ్వున్నావు. తాతగారు చూస్తే నన్ను తిడతారే తల్లీ..." కంగారుపడిపోయింది జానికమ్మ - రాధ వణుకుతూ లేచి కూర్చునేసరికి.
"సరే పడుకుంటాలే బామ్మా...." చిన్నగా నవ్వి నడుం వాల్చింది రాధ.
సాయంత్రం శ్రీనివాసరావు పొలంనుంచి వచ్చేలోపల అందర్నీ రంగనాధాన్నీ శాంతనీ నిజంగా నాకు బాబయ్య నాన్నగారేనా అని ప్రశ్నించింది రాధ. నిజమేనమ్మా అని రమ తమ ఇంట్లోంచి వెళ్ళిపోవడం, తన కొడుకేదో అనుమానించడం అన్నీ నెమ్మదిగా చెప్పి రమే మావాడేదో కోపంలో తిట్టాడని విడాకులిచ్చింది అన్నారు రంగనాధం.
"అయితే నాన్న తిట్టినంతమాత్రాన విడాకులిచ్సిందా అమ్మ?" నమ్మలేనట్టు చూస్తూ ప్రశ్నించింది రాధ.
"ఆమె ఉద్యోగం చెయ్యడం మగవాళ్ళతో తనువుగా మాట్లాడ్డం వీడికిష్టమయ్యేవికావు. ఆమె మానేదికాదు. వారిద్దరూ ఓ చోటా, మేమో చోటా కదమ్మా ఉండేవారం. నగలు పెంచేసుకున్నారు. టపీమని విడాకులిచ్చి వెళ్ళిపోయింది కాని కాస్త ముందూ, వెనుకా ఆలోచించిందా!" అంటూ ఆగారు రంగనాధం.
"మీరేమన్నా సలహా యివ్వకపోయారా?" అతని వదనంలోకి సూటిగా చూసి చిన్నగా నవ్వింది రాధ.
"నేనో పాపిష్టివాణ్ణి ఆ.....అట్టె మాట్లాడి మనస్సాందోళన చేసుకోకు..... చూశావా వీణ్ణి పట్టలేకపోయావనుకో ఈ నెలరోజులూ వచ్చేస్తున్నాడు" అంటూ రమాకుమారి ని ఎత్తుకున్నారు రంగనాధం గదిగుమ్మం వరకూ నడిచి.
"నా కివ్వండి తాతయ్యా" అంటూ నెమ్మదిగా కూర్చుని చేతులు చాచింది రాధ.
రమ నెత్తుకు ముద్డులాడుతూ "బాబూ అక్కయ్య దగ్గరికి రాకుండా నిన్ను పట్టుకునే వారు కదూ తాత" అంది రాధ.
రాధ క్రమంగా కోలుకుంటూంది, రంగనాధం ఓ రోజు కూతురి దగ్గరకు ప్రయాణమై "అడిగేస్తాన్రా ఎవడి కోసం చేసుకుంటుంది మేనరికం అన్నారు శ్రీనివాసరావుతో.
"రామకృష్ణ ఆ మధ్య ఉత్తరం వ్రాశాడు నాన్నా చాలా కాలం తర్వాత. వాళ్ళ నాన్న కెలా ఉందో అని కంగారుపడుతూ వ్రాశాద్. ఇతను తనకేదో జబ్బని వ్రాశాడు కాబోలు. జవాబు వ్రాశానులెండి. మరేం భయపడకు మీ నాన్న పిడుగులా ఉన్నాడని. బహుశా వారం రోజుల్లో బయలుదేరుతాడు. ముందు మనింటికే వస్తాడేమో లెండి వాణ్ణి అడిగి..."
"అబ్బే. అలా కాదు. మూర్తితో మాట్లాడి వస్తాను" అంటూ అయిన ప్రయాణం మానకూడదన్నట్లు వెళ్ళిపోయాడు రంగనాధం.
సాయంత్రం పొలం నుంచి వచ్చిన శ్రీనివాసరావు రమాకుమార్ నెత్తుకుని రాధ మంచం మీద తలవైపున కూర్చుంటూ ఎలా ఉందమ్మా వంట్లో? ఏమిటో చాలా రోజులై నాతో ఫ్రీగా మాట్లాడ్డం మానేశావు. మీ తాతయ్య నీ పెళ్ళి మాటలకోసం అత్తయ్య ఇంటికి వెళ్ళారు తెల్సా?" అన్నాడు.
ఎన్నిరోజులయో అనుకుంటూంది రాధ. నీ తండ్రిని నేనని అతను ఎందుకు చెప్పకూడదు? ఇంట్లో అందరికీ చెప్పినట్టు తనకీ ఓ రోజు చెప్తాడేమోఅని. కాని అతను మామూలు బాబయ్యగానే మాట్లాడుతున్నాడు.
"మీ కెందు కనవసరంగా పెళ్ళి ఖర్చులు మా నాన్న దగ్గరకు నన్ను దిగబెట్టెయ్యండి" అంది. పెదవులు బిగబడుతూ-
"మీ నాన్న దగ్గరకు వెళ్ళనన్నావు ఓ రోజు" నవ్వుతూ ప్రశ్నించాడు శ్రీనివాసరావు.
"అహ వెళ్తాను. మా నాన్నదగ్గరకు నన్ను తీసుకెళ్ళండి పెళ్ళాన్ని మోసగించి వదిలేసి పెద్దమనిషిలా చలామణీ అవుతూన్న అతణ్ణి చూసి.. అన్ని అడిగెయ్యాలి?.....నేను. నేనేం పాపం చేశానని. నన్నెందుకు లోకంలో దిక్కు లేనిదాన్ని చెయ్యాలని." ఆమెకు దుఃఖం పొర్లుకొచ్చింది.
మెల్లగా రాధ తల తన వడిలోకి తీసుకుని, ఆర్ద్రకంఠంతో "నన్ను క్షమించమ్మా..... నేను నేనే నీ తండ్రిని. నీ కెవరో చెప్పారింట్లో. అందుకే నామీద కోపంగా ఉంటున్నావు" అన్నాడు శ్రీనివాసరావు.
"అమ్మ మీమీద కోపగించుకుని ఏం చెయ్య గలిగింది? నేనేం చెయ్యగలను? నాన్నా.....నేను ఏం పాపం చేశాను నాన్నా? సమర్దుడైన తండ్రి కడుపున పుట్టి.....ఆవేళ హోటల్లో...." అంటూ వెక్కివెక్కి ఏడుస్తూంది రాధ.
రమని క్రిందకు దించి.....రాధ తల హృదయానికి హత్తుకుంటూ. "చచ్చిన పాముని కొట్టడమెందుకమ్మా?" మీ అమ్మ పవిత్రురాలు అందుకే ఆమె రక్తమాంసాలు పంచుకు పుట్టిన బిడ్డ పతనం కాకుండా భగవంతుడు కాపాడాడు. నన్ను క్షమించమ్మా ఇంకెప్పుడూ ఇలా కంట తడిపెట్టకు." అంటూ ఓదార్చారు శ్రీనివాసరావు.
కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా దొర్లిన తర్వాత- మొహం కళ్ళూ చీర చెరగుతో తుడుచుకుని. "వాసూరావ్ రానీండి నాన్నా నాకు పెళ్ళి ప్రయత్నాలు చెయ్యొద్దు" అంది రాధ....
"అంటే..... అతణ్ణి...."
"ఛ ఛ, కాదు నాన్నా..... మీ దగ్గర ఓ సంగతి దాచాను. కాని....నేను వాసూరావ్. అతని మిత్రుడు రామకృష్ణా వచ్చేదాకా ఎవ్వరికీ చెప్పనని మాట ఇచ్చాను ఎన్నిసార్లో ముఖంలో ఆవేదనలో ఆ సంగతి మీకు చెప్పాబోయి మానేశాను."
"ఎవ్వరి కిచ్చావ్ మాట? బొమముడిపాటుతో రాధవైపు చూస్తూ అన్నాడు శ్రీనివాసరావు.
"ఆ మిత్రులిద్దరికీ....మీరేమీ ప్రశ్నించవద్దు క్షమించండి. బరువుగా ధ్వనించింది ఆమె గొంతు.
"సరేలే నీ ఇష్టం" అన్నాడు శ్రీనివాసరావు.
రాధ శ్రీనివాసరావు కూతురే అనీ. రమను నిష్కారణంగా నిందించి వదిలేశాడనీ. కూతురు కనకే పదివేలు ఇచ్చి హోటల్లో కొన్నాడనీ ఇంకా ఇంకా అనేక రకాలుగా గుసగుసలాడేరు ఊళ్ళో వారు.
ఎవ్వరేమనుకున్నా ఖాతరు చెయ్యడంలేదు శ్రీనివాసరావు.
* * *
కూతురి దగ్గర నుంచి వచ్చిన రంగనాధం....."ఏం కూతుళ్ళు ఏమి అభిమానాలు.....మనకొంప దోచుకుతిన్నారా? రాధను కోడల్ని చేసుకోండి మీరుకోరిన కట్నం నాకొడుకిస్తాడని అంటే..... ఆ మూర్తి...వాడే మన అల్లుడు. సమ్మంధం నిశ్చయం చేసేసుకున్నాం, మరెలా మావగారూ అన్నాడు" అంటూ గుమ్మంలో చతికిలబడ్డారు.
"పోనీండి నాన్నా ఆమాత్రం సంబంధం రాధకి రాకపోదు" చిరాగ్గా అన్నాడు శ్రీనివాసరావు
"అన్న కూతురని తల్లి లేనిపిల్ల నీ అభిమానం లేకుండా కామేశ్వరే కాదంది. అంటే పోన్లెండి. దాని అన్నం ఎక్కడుంటే అక్కడే పడుతుందీ" అన్నది జానకమ్మ.
"పోనీ మనపిల్లకి అందంలేదా? చదువు లేదా? మనమేం కట్నం ఇవ్వలేమా? చేసుకో నివ్వండి పై సంబంధం" రోషంగా అంది శాంత.
ఆ రోజంతా కామేశ్వరి కొడుక్కి పిల్లను చేసుకోడానికి నప్పలేదు అని నిష్ఠూరాలాడుకున్నారు రంగనాధం శాంతా, జానకమ్మా.
"పిన్నీ నీ కూతురు అందం అంటూ గర్వంగా మాట్లాడుటున్నావ్. కొంపదీసి పెళ్ళివార్ని తీసుకురాకు. కొన్నాళ్ళు నా క్రాఫ్ చూసి పారిపోతారు" అంటూ నవ్వింది రాధ.
"ప్చ్.....చారెడు తల అంతా రాలిపోయింది" అంది జానకమ్మ.
రామకృష్ణ రాకకోసం ఎదురుచూస్తున్న రాధకు కాలం దీర్ఘంగా నడుస్తూన్నట్లనిపిస్తోంది.
* * *
"వెళ్ళిపోవడాన్కి ప్రయాణమౌతూన్న రామకృష్ణని ముందు ఎక్కడి కెళ్తావ్?" ప్రశ్నించాడు వాసూరావ్.
"ఎక్కడికెళ్తాననుకుంటున్నావ్?" అన్నాడు రామకృష్ణ నవ్వుతూ.
"రాధని చూడాలని......" అంటూ తల వాల్చాడు వాసూరావ్.
"అవును తెలిసి ఎందుకు ప్రశ్నించావ్! మరెక్కడా వదిలిపెట్టను. మా ఇంటికి తీసుకుపోతాను. పెళ్ళి చేసుకున్నానని చెప్తాను. మీరేమీ రభస చెయ్యకుండా ఊరకున్నారా సరే, లేదా ఏదన్నా ఉద్యోగం చేసి బ్రతుకుతాం" అన్నాడు రామకృష్ణ.
ప్లెయిన్ ఎక్కబోతూన్న రామకృష్ణ జేబులో రెండు కాయితాలు పెడ్తూ తర్వాత చదువుకో...ధైర్యంగా ఉండు అంటూ హెచ్చరించాడు వాసూరావ్.
ఉత్తరాలు చదివిన రామకృష్ణకు తల తిరిగి నట్టనిపించింది.
మొదటి ఉత్తరం
"కృష్ణా! అన్నయ్య మా నాన్నగారు పోయారని చాలా రోజుల క్రితమే వ్రాశాడు. కాని ఆ సంగతి నీకూ చెప్పలేదు. నాన్నగారు లేచి ఆ ఇంట్లో రాధ ఉంటుందని నువ్వు ఇక్కడే చదువు వదిలి వెళ్ళిపోతావ్ అందుకని చెప్పలేదు. తర్వాత నేను రాధసంగతి తెలియపరచమని వ్రాసిన ఉత్తరానికి జవాబు. రాధ ఎవరితోనో లేచిపోయిందని వచ్చింది. అన్నయ్య వ్రాసిన ఉత్తరం కూడా ఇచ్చాను చదువుకో కృష్ణా, అందుకే పెద్దలు వంశం. సంప్రదాయం అంటారు. రాధ అమ్మ భర్తకు విడాకులిచ్చింది. రాధ నిన్ను నమ్మించి మోసంచేసింది. జరిగిన దంతా పీడకలగా విస్మరించి గతం మరిచిపో భవిష్యత్ నిరాశామయం చేసుకోక నీ తల్లి తండ్రులు తెచ్చిన అమ్మాయిని తొందరగా పెళ్ళి చేసుకో నీ హృదయంలో ఏర్పడిన గాయం మానేమార్గమదే. మళ్ళీ త్వరలోనే కలుసు కుందాం. నీ దగ్గర ఇన్ని రోజులు ఈ సంగతి దాచినందుకు క్షమించు కృష్ణా, ఒక స్నేహితుడిగా నీ ధ్యేయం. నీ భవిష్యత్ శోభాయమానంగా విరాజిల్లాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నాను.
ఇట్లు నీ ప్రియమిత్రుడు
వాసూరావ్
రెండవ ఉత్తరం
"తమ్ముడూ, రాధ గురించి అడుగుతూ నువ్వూ రామకృష్ణా వ్రాసిన ఉత్తరాలు అందాయ్. నాకు జవాబు వ్రాయడానికి కలం ఆడలేదు తమ్ముడూ, రాధ మనింట్లోంచి ఎవరినో తీసుకు లేచిపోవడం. మన నౌఖర్లు చూసి చెప్పారు. ఆమెను కలియాలని స్టేషను కెళ్ళాను. ఊరంతా గాలించాను. కాని ఆమె జాడ తెలియలేదు. కొన్నాళ్ళుగా ఓ యువకుణ్ణి రాధ కలుస్తూందని మన మిత్రులు కొందరు చెప్పారు. మనమేం చేస్తాం? దానికి పెళ్ళి చెయ్యాలను కున్నాను. దాని ఖర్మ పోయింది. అంటూ వ్రాసిన ఉత్తరం.
రామకృష్ణ హృదయం విలవిల తన్నుకుంది. రాధ.....రాధ ఎంతపని చేసింది? అమాయకంగా ముగ్ధలా ఉండే రాధ కులట. ఆమెను తాను పెళ్ళి చేసుకున్నాడు. ఛీ.... ఛీ....అతని కళ్ళల్లో ఎర్రగా జీరలు తేలే, మొహం పీక్కు పోయింది. కొన్నిక్షణాల తర్వాత అలసినట్టయి పోయిన రామకృష్ణ బరువుగా కళ్ళు మూసుకున్నాడు.
ముందు ఎక్కడికెళ్ళాలి. అని ప్రశ్నించుకున్న రామకృష్ణ అమ్మా నాన్నా దగ్గరకి వెళ్తే మళ్ళీ పెళ్ళి గొడవ, మామయ్య ఇంటికెళ్ళి కొన్ని రోజులు ఏకాంతంగా అతని పొలంలో ఉండి పోతాను అనే నిశ్చయానికొచ్చాడు.
* * *