ఆరూ-తొమ్మిది
బయట వెన్నెల పిండారబోసినట్టు వుంది. వెనీషియన్ బ్లైండ్స్ లో నుంచి చంద్రుడు సగం సగం కనబడుతున్నాడు. మేడ పై వరకూ పాకిన విరజాజి కిటికీలోంచి సౌరభాలను వెదజల్లుతూ వుంది.
దూరంగా ఎక్కడో పదకొండు గంటలు కొట్టిన చప్పుడు.... మళ్ళీ నిశ్శబ్దం. ఊరంతా ప్రశాంతంగా నిదురపోయినట్టుంది.
ఇంటాక్సికేషన్ పూర్తిగా తగ్గిపోయినా, ఇంకా కొద్దిగా మత్తుగా వుంది.
పక్కకు తిరిగాడు. పసిపాపలా అమాయకంగా నిదురపోతూ వుంది మాలతి. రెప్పలు మూసుకుని ఉన్నప్పుడు అందాన్ని ద్విగుణీకృతం చేసే కంజాత దళాల్లాంటి కళ్ళు, కొనదేలిన నాసిక, గుండ్రంగా సున్నాలా ముడుచుకున్న పెదవులు, పెదవి క్రింద చిన్న గుంట....
నేను చాలా అదృష్టవంతుణ్ణి.
పాలనురుగులాంటి తెల్లటి చీరేలో, గువ్వలా పడుకొని వున్న మాలతిని చూస్తే ఏదో తెలియని స్పందన హృదయంనిండా వ్యాపించింది. చెంపలమీద చెదిరిన ముంగురుల్ని చూపుడు వేలితో నెమ్మదిగా చెవి వెనుకకు సరిచేశాను. ఆ మాత్రం స్పర్శకే కళ్ళు విప్పింది. నిద్రమత్తువల్ల కనురెప్పలు బరువుగా కిందికి వాలుతూ ఉంటే, కొంచెం జరిగి, మెడమీదుగా చేయివేసి సన్నగా నవ్వింది.
"నిద్ర పట్టటంలేదా?" మృదువుగా అడిగింది.
దగ్గిరగా- తన వెచ్చని ఊపిరి నా పెదవులను కాల్చేసేటంత దగ్గిరగా జరిగాను. 'ఉహూఁ' అన్నాను.
"అయితే ఏం చేద్దాం?" అడిగింది. వెంటనే ఏదో అర్ధమయినట్టు నాలిక కరుచుకోవటం స్పష్టంగా కనిపించింది. సిగ్గుతో చెక్కిళ్ళు రాగరంజితాలయాయి, చురుగ్గా జవాబు చెప్పబోయాను. నన్ను జవాబు చెప్పనివ్వకుండా తనే- "జోల పాడనా" అంది వెంటనే.
మాలతి తెలివైన పిల్ల.
"పాడు" అన్నాను. అస్పష్టంగా రహస్యం చెబుతున్నట్లు- "నోటితో కాదు..."
"ఛా.... అల్లరి...."
అల్లరి చేయకుండా ఒక్కక్షణం ఉండగలిగాను. కానీ మనసు ఊరుకోదుగా. తల ఎత్తబోయాను.
"లేవకు స్రీ ...." అంది. ఆ కంఠంలో చిలిపితనం లేదు. కొంచెం ఆశ్చర్యపోయాను. ఏదైనా బరువైన విషయం మాట్లాడబోయేముందు తన కంఠం అలా విచిత్రంగా ధ్వనిస్తుంది. ఒక్కక్షణం చాలా నిశ్శబ్దంగా గడిచింది.
"శ్రీ....."
"ఊఁ" అన్నాను.
"ఒక్క విషయం అడగనా?"
నేను మాట్లాడలేదు. తనకు అయిష్టమైన పనిని విమర్శించేటప్పుడు చాలా సూటిగా మాట్లాడుతుంది మాలతీ. ఇంక ఎదురు మాట్లాడటం ఒక విధంగా సాహసమే అవుతుంది.
"మన పెళ్ళయిన రోజులు జ్ఞాపకం ఉన్నాయా శ్రీ?"
ఈ ఉపోద్ఘాతం దేనికో అర్ధంకాలేదు.వింటూ వుండిపోయాను. ఒక్కక్షణం మా ఇద్దరి మధ్యనుంచీ నిశ్శబ్దం పారిపోయింది. తనలో తానే అస్పష్టంగా అనుకొంటున్నట్టు అంది-" ఆ సాయంత్రాలు ఎంత బావుండేవి? ఐదు అవుతూ ఉండగానే బాల్కనీలో నిలబడి నీ కోసం ఎదురు చూసేదాన్ని, సైకిళ్ళమీదా, స్కూటర్లమీదా, హడావిడిగా పరుగెత్తే జనం, కార్ల రొద.... అకస్మాత్తుగా మలుపు తిరిగి నువ్వు కనబడేవాడివి. వీటన్నిటితో సంబంధం లేకుండా ఏదో లోకంలో ఉన్నట్టూ, ఆలోచించుకొంటూ తల వంచుకొని తొందర తొందరగా నడుస్తూ వచ్చేస్తుండేవాడివి. నువ్వు దగ్గిర పడేకొద్ది ఏదో తెలీని ఉద్వేగం నా మనసంతా వ్యాపించేది. 'వచ్చేశావు..... నువ్వు వచ్చేశావు' అన్న భావం నాలో ఏదో స్పందన కలిగించేది. ఆ భావంలో ఉండే ఆనందం కోసం ఎన్నేళ్ళయినా అలా చూడగలననిపించేది.
నువ్వు జనరల్ మేనేజర్ వయ్యావు. స్టేటస్ పెరిగింది. కారు కొనుక్కోబోతున్నాం. పెద్ద సర్కిల్స్ లో ఫ్రెండ్స్. క్లబ్బులు.... కానీ నాకెందుకో ఆ రోజులు, ఆ సాయంత్రాలూ- అవే బావుండేవి" ఆమె కంఠం బరువుగా పలికింది. "నువ్వు మారిపోతున్నావు శ్రీ. కొద్దికొద్దిగా మారిపోతున్నావు. అదే నాకు భయంగా వుంది. సాయంత్రాలు ఇంకో గంట ఎక్కువ సేపు క్లబ్బులో గడిపి ఇంటికి రావటం అలవాటు చేసుకొన్నావు. ఆ అలవాటు ఇప్పుడు అవసరంగా మారింది. దీనికి నేనేమని సమాధానం చెప్పుకోను? నేనూ, నా సాన్నిధ్యం నీకు ఇంతకుముందు ఇచ్చేటంత ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయా? అదే నిజమైతే నేను భరించలేను శ్రీ. భరించలేను" ఆమె కంఠం బరువుగా పలికింది. "నిన్న నువ్వు మాట్లాడుతూ వుంటే గదంతా ఏదో వాసన వ్యాపించింది".
ఉలిక్కిపడ్డాను. తనే అంది, "ఇక ఈ అలవాటు కూడా అవసరంగా మారితే...." ఒక్కసారి ఊహించలేనంత ఆవేదన ఆమె కంఠంలో వినిపించింది. ఇంక మాట్లాడ లేకపోయింది.
ఆ క్షణంలో చచ్చిపోదామనిపించింది. ఇంత రాత్రివేళ ఇలా 'బరస్ట్' అయిందీ అంటే, ఓహ్ నిజంగా ఈ రోజు పగలంతా నరకం అనుభవించి వుంటుంది తను. నేను రోగ్ ని, ఇడియట్ ని.
అంతలో ఆలోచనలనుంచి తేరుకొని అన్నాను- "నువ్వేదో అనవసరంగా ఆలోచించీ వూహించుకొనీ బాధపడుతున్నావ్ మాలతీ! అసలు నిన్న ఏం జరిగిందో చెప్పకపోవటం నాదే తప్పు. నిజంగా నిన్న భలేరోజు. ఆడిన ప్రతి ఆటలోను అదృష్టం నన్నే వరించింది. అందరూ 'స్టన్' అయిపోయారనుకో. రాత్రి ఆటలోంచి లేచేసరికి దాదాపు వెయ్యి గెయిన్ కనబడింది. దాంతో ఫ్రెండ్స్ అందరూ బలవంతం చేసేరు పార్టీ ఇమ్మని. వాళ్ళతోపాటు.... నే....నూ పుచ్చుకోక తప్పలేదు. అదయినా 'బీర్' అంతే."
మాలతి మాట్లాడలేదు.
నేను చేసింది తప్పు. దాన్ని ఒప్పుకుంటే సరిపోదు. ఇక ముందు చేయకూడదు. ఇది సంస్కారం నాకు నేర్పిన పాఠం.
ఆ గదిలో కొన్ని నిముషాలు నిశ్శబ్దము రాజ్యం చేసింది. నేనేదో మాట్లాడబోయాను. అంతలోనే దూరంగా ఎక్కడో, ఎవరో సన్నగా రోదిస్తున్న ధ్వని విన్పించింది. కొంచెం సేపటిలోనే పెద్దదయిన ఆ కంఠం సావిత్రిదని గుర్తించాను.
అది మా కలవాటే.
ఈ బిల్డింగ్ కాంపౌండ్ వాల్ కి అవతలివైపు ఆనుకొని వున్న పాక రిక్షా సోములిది. రోజూ సంపాదించిన దానిలో సగం త్రాగేయంది వుండలేడు వాడు. అప్పుడు జానపద చిత్రాలలో హీరో అయిపోతూ వుంటాడు. సావిత్రి పూర్ విక్టిమ్.
"ఎందుకు, పాపం వాడు దాన్నలా చితక బాదుతాడు?" నాలో నేను అనుకొంటున్నట్టు అన్నాను.
"వాడు మాత్రం ఏం చేస్తాడు? తాగినప్పుడు ఒళ్ళు మరిచి పోతాడు. తెలివి వచ్చిన తరువాత బాధపడతాడు" అంది మాలతి.
* * *
సాయంత్రం అయిదయింది.
బాల్కనీలోనిలబడి చూస్తున్నాను. ఇంటిముందు అందంగా తోట, చిన్న పోర్టికో.... ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగిన నాకు, కలలో కూడా వూహించని పరిస్థితుల్లో మాలతితో పెండ్లవడమూ, అదృష్టం కలిసిరాగా ఒక్కో మెట్టూ పైకి- పైపైకి - హైసర్కిల్స్, కొత్త పరిచయాలు, కొత్త అలవాట్లు....
అకస్మాత్తుగా నిన్నటి రాత్రి సంభాషణ జ్ఞాపకం వచ్చింది.
నిన్న.....
నిన్న!
వెయ్యి.
ఆడిన మూడు గంటల్లోనూ వెయ్యి. ఇదే విధంగా వస్తే సంవత్సరములో? ఇక ఆలోచించలేకపోయాను. లక్షలు!
నా ఆలోచనకు నేనే నవ్వుకొని టైమ్ చూసుకొన్నాను. అయిదూ ముప్పై అయిదు. క్లబ్ కి టైమ్ అవుతోంది. నిజంగా ఈ అలవాటు మాలతి అన్నట్లు అవసరంగా మారిపోయింది. ఈ విషయం ఇంతవరకూ గమనించలేదు.
మళ్ళీ టైమ్ చూసుకొన్నాను. సెకను ముల్లు తొందరగా తిరుగుతూ వుంది. పెద్దముల్లు తొమ్మిది మీదా, చిన్నముల్లు ఆరుమీదా- పావు తక్కువ ఆరు....
వెళ్ళాలి....
దూరంగా రోడ్డుమీద జనం.... కార్లు....
మెయిన్ రోడ్డునుంచి చీలిపోయి మా బిల్డింగ్ ముందునుంచి వెళ్ళిపోయిన మట్టిరోడ్డు దాదాపు నిర్మానుష్యంగా వుంది. పదేళ్ళ పాప నెమ్మదిగా నడుస్తూంది- సావిత్రి కూతురిలా వుంది. సావిత్రి పాక వెనుక స్థలంలో అంట్లు తోముకుంటూంది. ఇక్కణ్ణుంచి స్పష్టంగా కనిపిస్తూంది.
పాప ఇంటి ముందునుంచి వెళుతూంది. చేత్తో దేనినో పైకి విసిరి మళ్ళీ పట్టుకొంటూ వుంది. అలా ఆడుకొంటూ చాలా దూరం నుంచి నడుస్తూంది అనుకొంటా. అది పదిపైసల బిళ్లో, పావలా కాసో!
చాలా చీప్ గేమ్, చూపుడు వేలిక్రింద బొటనవేలు వుంచి దానిమీద నాణెం పెట్టి పైకి ఎగరవేస్తూంది. తరువాత రెండు చేతులూ దొప్పలా వుంచి ఆ నాణెం పడేటట్లు చేస్తూంది.
క్రిందికి దిగి గేటు దగ్గరకొచ్చాను. పాప ఇంటిముందు నుంచి వెళుతూంది. చేతిలో నాణేన్ని మళ్ళీ పైకి ఎగరవేయబోయి నన్ను చూసి సిగ్గుపడి ఆపేసింది.