Previous Page Next Page 
లేడీస్ హాస్టల్ పేజి 24

                                              

                                                           అధ్యాయం -4
   
   
    సికింద్రాబాద్ స్టేషన్ లో రైలు కదలటానికి సిద్దంగా వుంది. కిరణ్మయి ఫ్లాట్ ఫారం మీద నిలబడి వుంది. రాయన్న రైల్లో కిటికీదగ్గిర కూర్చున్నాడు. ఇద్దరూ ఏం మాట్లాడాలో తోచనట్లుగా ఒకరినొకరు చూసుకుంటున్నారు. కిరణ్మయికి రిజర్వేషన్ దొరకలేదు. ఆ విషయం ఆమెకు బాధని కలిగించడం లేదు. కారణం ఉదయంనించీ రాయన్నలో కనిపిస్తున్న స్పష్టమైన మార్పు!! ఆమె నిద్ర లేచేసరికి అతడు ప్రాక్టీసుకి వెళ్ళిపోయాడు. తిరిగి వచ్చేసరికి క్రితంరోజు తాలూకు విషాద ఛాయలు అతడి ముఖంలో లేవు. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కూడా వెళ్ళాలన్న తన ఆలోచనని మార్చుకుంది కిరణ్మయి.
   
    "ఒంటరిగా వెళుతున్నానన్న బాధ కాదు కిరణ్మయీ, మన కుటుంబ కాకులమధ్య నిన్ను ఒంటరిగా వదిలి వెళ్ళడం బాధగా వుంది. మనసొప్పడం లేదు" అన్నాడు రాయన్న.
   
    "ఈ కాకుల బారినించి తప్పించుకోవడం, వదిలించుకోవడం నాకేం కష్టం కాదు. మీరు సంతోషంగా వెళ్ళి లాభంగా తిరగిరండి చాలు" అంది కిరణ్మయి.
   
    అతడిలో స్థిరపడిన ఆత్మస్థయిర్యం ఆమెకు కొండంత బలాన్నిస్తోంది.
   
    గార్డు పచ్చజెండా వూపుతున్నాడు. కదలబోతున్నట్లుగా రైలు కూత వేసింది. రాయన్న చేతులు కిరణ్మయి చేతిమీద బిగుసుకున్నాయి. "చెప్పకూడదని తెలుసు కిరణ్. కానీ ఏమీ చెప్పలేక పోవడం కంటే తెలిసిన ఆ చిన్న పదాన్ని ఉచ్చరించకుండా వెళ్ళడానికి మనస్కరించడం లేదు. "థాంక్స్ కిరణ్మయీ" అన్నాడు. శ్రావణ మేఘాల చిరుజల్లు శరీరాన్ని పులకరింపచేస్తే మనసు కార్తీక పౌర్ణమి వెన్నెలై వికసించినట్లు అప్పటి వరకూ కిరణ్మయి పడ్డ వేదనంతా మాయమయి ముఖం సంతోషంతో విప్పారింది. ఉద్వేగం మాటల్ని మింగేసింది.
   
    "ఏమన్నా చెప్పు కిరణ్మయీ" అన్నాడు రాయన్న.
   
    "లైఫ్ ఈజ్ ఎ ఛాలెంజ్. ఫేస్ ఇట్."
   
    రైలు కదిలింది.
   
                                                                *    *    *
   
    కిరణ్మయి సూట్ కేస్ లో బట్టలు సర్దటం మొదలు పెట్టింది. ఆమె మనసు మాత్రం క్రితంరోజు లాయర్ వెంకటరత్నంతో జరిగిన సంభాషణని నెమరు వేస్తోంది. రాయన్న ఢిల్లీ వెళ్ళాక ఆమె ఆయన్ను కలుసుకుంది.
   
    "పోలీసులు ఛార్జ్ షీట్ ఫెయిల్ చేయడానికి టైముందని చెప్పారు. ఇప్పుడిక ఈ లోపల నేను చేయగలిగిందేమైనా వుంటే చెప్పండి" అడిగింది.
   
    "మీరేం చేయాలి. చెయ్యగలరు అన్నదానికి ముందు అసలు ఈ కేసులో మనకు కావలసిందేమిటో చూద్దాం. రాయన్న హత్య చేయలేదని మనం నమ్ముతున్నాం. అయితే ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అసలిది హత్యా? ఆత్మహత్యా అన్న ప్రశ్నలకు మనకు సమాధానాలు కావాలి" కిరణ్మయి అవునన్నట్టు తలూపింది.
   
    "అసలా హాస్టల్ విషయమే చాలా అస్తవ్యస్తంగా వుంది. వార్డెన్, కేర్ టేకర్స్ ఎవరూ లేకపోవడం, బయటివాళ్ళు ముఖ్యంగా మగవాళ్ళు ఎప్పుడు పడితే అప్పుడు లోపల గదుల్లోకి వెళ్లిపోవడం ఏ లేడీస్ హాస్టల్లోనూ జరగకూడని విషయాలు! అమ్మాయిలకు క్షేమకరంకాని పరిసరాలివి. ఇకపోతే రాయన్న చెప్పినదాని ప్రకారం లక్ష్మి చాలా మంచిపిల్ల, అమాయకురాలు. రాయన్నతో తప్ప మరెవరితోనూ చనువు, స్నేహాలని పెంచుకోలేదు. అలాంటిది కన్యకాదని పోస్టుమార్టం రిపోర్టులో తేలిందంటే మనకు, రాయన్నకు కూడా తెలియని కథేదో నడిచినట్టేకదా. అలాంటి హాస్టల్లో ఇలాంటి విషయాలు పూర్తి రహస్యాలుగా నిలిచిపోవు. ఎవరికైనా కొంతయినా తెలిసే వుంటుంది. అది వాళ్ళనించి మనం రాబట్టుకోవాలి."
   
    "నిజమే లాయర్ గారూ మనం వెళ్ళి ఎంక్వయిరీ చేస్తే కొన్ని విషయాలు బయటపడవచ్చు. కొందరమ్మాయిలు తమకు తెలిసిందాన్ని నలుగురికీ చెప్పుకోవాలనుకుంటారు. కాని వాళ్ళంతటవాళ్ళుగా వచ్చి చెప్పేధైర్యం చెయ్యరు. ఒకసారి వెళ్ళి కలిస్తే ఏదో ఒక రకంగా తమ అనుమానాలని వ్యక్తం చేస్తారు. మనం వెళదామా?" ఉత్సాహంగా అడిగింది కిరణ్మయి.
   
    వెంకటరత్నం నవ్వాడు. "చూడమ్మా, నేను లాయర్ని పెర్రీమేసన్ లా అపరాహ పరిశోధకుడిని కాను. మన ప్రజలు అమెరికన్ ప్రజల్లాంటివారు కాదు. హత్య జరిగితే ఎదురుగా ఉండి ప్రత్యక్షంగా చూసినా ఈ కోర్టు లిటికేషన్లకు భయపడి ఆ విషయాన్ని మహా రహస్యంగా దాచాగల సమర్ధులు. నా బాధ్యత రాయన్న హంతకుడు కాడు అని నిరూపించడం వరకే. హంతకుడు ఎవరు అని శోధించటం కాదు. నేను ఫ్రాంక్ గా చెప్తున్నందుకు మరోలా భావించకు."
   
    "నిజమేనండి, అయామ్ సారీ కాని ఈ విషయంలో నేను చేయగలిగింది చెప్పడానికి అభ్యంతరం ఉండదుగా."
   
    "ఏ మాత్రమూ లేదు. లా చదివినవాడిని, 'లా'లో లొసుగులు బాగా తెలిసినవాడిని, చట్టం ఏ పరిధిలో చట్టానికి అనుగుణంగా ఎలా నడుచుకోవాలో నేను చెప్తాను. అలా చెయ్యండి. మీ గురించి..... అంటే రాయన్న భార్యగా తెలిసినవాళ్ళెవరయినా ఆ హాస్టల్లో వున్నారా?"
   
    "ఊహు. పెళ్ళికి హాస్టల్ అమ్మాయిలు ఎవరూ రాలేదని ఆయన అనుకోవడం విన్నాను. తన స్నేహితుడు రాజారావు కూడా ఆ టైంకి ఊళ్ళోలేడు."
   
    "గుడ్, అయితే రేపే మీరు ఆ హాస్టల్లో కొన్నాళ్ళుండే ఏర్పాటు చేస్తాను. మీకు పెళ్ళయిన విషయం గాని, మీరు రాయన్న భార్య అన్న విషయం గాని మీ అంతటమీరుగా ఎవరికీ చెప్పవద్దు. రాయన్న ఢిల్లీ నుంచి రావడానికి ఎన్నాళ్ళు పడుతుంది?"
   
    "వారం పదిరోజులు పట్టవచ్చు."
   
    "అయితే పదిరోజులపాటు హాస్టల్లో ఎవరికైనా గెస్ట్ గా వుండొచ్చు. కాలేజీ అడ్మిషన్ కోసం వచ్చినట్లు చెప్పవచ్చు. మన కేసుకి పనికొస్తాయనిపించే విషయాలు మాత్రమే కాదు. ఆ హాస్టల్లో అవకతవకల గురించి అన్ని వివరాలు నాకు కావాలి. అపురూపలక్ష్మి లాంటి అమాయకమైన అమ్మాయిలు తన వాళ్ళందరినీ వదిలి చదువుకోసం వస్తే రక్షణ కల్పించడానికి వుద్దేశించబడ్డ హాస్టల్లో ఇలాంటి దురాగతం జరగడానికి కారణాలు ఏమిటో తెలుసుకోండి. ఒక సైకాలజిస్టుగా ఈనాటి అమ్మాయిల్లో మార్పు తెస్తున్న భావపరిణామాల మూలకారణాలు ఏమిటో అరా తియ్యండి. అన్నింటిని మించి లక్ష్మి హత్య జరగకముందు పదిరోజుల నించి ఈరోజు వరకు ఆ హాస్టల్లో జరిగిన సంగతులేవైనా మనకు ఉపయోగపడేవి తెలుసుకోండి. ఏమైనా సమస్య ఎదురైతే నాకు కబురు చెయ్యండి. ఈ హాస్టల్ విషయంలో నేను డైరెక్టుగా రంగంలోకి దిగడానికైనా వెనకాడను" అన్నాడు వెంకటరత్నం. అతడి మాటల్లో ఆవేశం కనిపించింది. అతడి కూతురు గుంటూరు హాస్టల్లో మెడిసిన్ చదువుతోంది.
   
                                                                  *    *    *

 Previous Page Next Page