కిరణ్మయి వూహించినట్లుగానే ఇంట్లో పరిస్థితి అసహ్యంగానే తయారయింది. అత్తగారు, మామగారు, ఆడపడుచు ఇంకా ఇంట్లోనే వున్నారు. తనవాళ్ళకీ, వాళ్ళకీ ఘర్షణలు జరుగుతూనే వున్నాయి. కిరణ్మయి ఇంట్లో అడుగుపెట్టగానే రెండువైపులనించీ ప్రశ్నలవర్షం కురిసింది. రాయన్న ఏమయ్యాడు, ఎక్కడున్నాడు, పోలీసులేమన్నారు. ఇంటికి రాకుండా ఎక్కడికో వెళ్ళడంలో ఆంతర్యమేమిటి వగైరా వగైరా. ఆమె మానసిక ఆందోళనగాని, సంఘర్షణగాని వాళ్ళ దృష్టికి రాలేదు.
కిరణ్మయి వీటన్నింటికి అతీతురాలయినట్లు గదిలో పడుకుని హాయిగా నిద్రపోయింది. ఉదయం లేవడంతోనే తిరిగి సాధింపులు ప్రారంభం అయ్యాయి. అవేమీ పట్టనట్లు తను సూట్ కేస్ సర్దుకోవడం మొదలు పెట్టింది. కిరణ్మయి నోరు విప్పకుండా, తనగదిలోంచి బయటకు రాకుండా కూర్చోవడం వాళ్ళ అహాన్ని దెబ్బతీస్తోంది. తిరిగి ప్రశ్నలు....ఎక్కడికి, ఎందుకు, ఎవరితో? -కిరణ్మయి దేనికీ సమాధానం చెప్పలేదు.
"ఏమిటి తల్లీ సర్దుతున్నావు. ఇవి నీ బట్టలేనా?" అడిగింది అత్తగారు. ఆమె చీరలతోపాటు పంజాబీ డ్రెస్సులు పెట్టుకోవడం చూసి.
"అవును." అంది కిరణ్మయి ముక్తసరిగా.
"పెళ్ళికిముందు సంగతేమిటోగాని ఇప్పుడివన్నీ మా ఇళ్ళల్లో కుదరవు."
"ఇప్పుడు నేను మీ ఇంటికి రాబోవడంలేదు లెండి" అనబోయి ఆగిపోయింది. తనెక్కడకు వెళుతున్నదీ ఎందుకు వెళుతున్నదీ చెప్పనప్పుడు వాదనలు అనవసరం. కిరణ్మయి మాట్లాడలేదు.
"చూడవమ్మా వియ్యపురాలా! మీ అమ్మాయి ఏ ప్రశ్నకు జవాబు చెప్పదు. ముంగిలా కూర్చుంది" కోపంగా అరిచిందావిడ.
"ఎక్కడికే ప్రయాణం? ఇప్పటికే నీ గురించి అనరాని మాటలన్నీ అనిపించుకుంటున్నాం. ఇంకేం పడాలమ్మా" కటువుగా అడిగింది తల్లి.
తల్లి అంటే దేవతా స్వరూపం అనీ, ఆప్యాయతకి అనురాగానికి మరో రూపం అనీ, స్త్రీ అంటేనే సౌజన్యానికీ, మృదుత్వానికీ ప్రతీక అనీ భావించే సమాజంలోని ఇద్దరు తల్లులు!! వీళ్ళు తల్లులు కాగలరుగాని మాతృమూర్తులు కాలేరు. ఎక్కడుంది లోపం? చదువు సంస్కారం లేని జాతి పునాడుల్లోంచి పుట్టిన వాళ్ళయినందువల్లా? కాకపోవచ్చు..... ఉన్నత వర్గానికి, ఉన్నత కుటుంబాలకు చెంది చదువుకుని విద్యావంతులయిన స్త్రీలు కూడా ఇదే రకంగా ప్రవర్తించడం కిరణ్మయి చూసింది. ఎంతటి నాగరిక కుటుంబాల్లోనయినా తోటి స్త్రీల మనఃక్లేశానికి కారణం స్త్రీలె అవుతున్నారు. కాకపోతే వారి భాష కాస్త నాగరికం కావచ్చు. అంతే!
"ఇంత జరుగుతున్నా సమాధానం చెప్పవేమే?"
కిరణ్మయి జవాబు చెప్పలేదు, మనసులోనే అనుకుంది. "ఏం చెప్పనమ్మా! పదిమందికి వినిపించాలని గొంతుచించుకుని అరిచే నీకు నా మూగవేదన వినిపించేలా ఏ భాషలో చెప్పను?"
పైకి మాత్రం "....రెండ్రోజులు పనిమీద వెళ్తున్నాను. వారం తరువాత వస్తాను" అంది.
"ఎక్కడికి-"
లేడీస్ హాస్టల్ కని చెప్పలేదు. అనవసరం.
"ఎక్కడికీ వెళ్ళనవసరంలేదు. ఇంట్లోనే వుండు. ఆ కోర్టు వ్యవహారం ఏదో తేలటానికి ఎలాగు రెండు మూడేళ్ళు పడుతుంది. ఏదైనా వుద్యోగం చూసుకో" అన్నాడు తండ్రి. అతడి మొహంలో సంతోషం కొట్టొచ్చినట్టు కనపడుతూంది. 'కూతురికి పెళ్ళిచేయలేదన్న అపవాదు రాకుండా పెళ్ళికి పెళ్ళీ జరిగింది, కూతురు ఇంటిలోనే వుండి సంపాదించబోతుంది" అన్న సంతోషం!!!
ఇలాంటి మనుష్యులుంటారా అనుకోలేదామె! ఇంతకన్నా నికృష్ట మనస్తత్వాల గురించి సైకాలజీలో చదివింది ఆమె!
రెండ్రోజులు గడిచాయి.
ఆ రోజు పొద్దున్నే పేపర్ చూసి ఆమె ఉలిక్కిపడింది. చివరిపేజీలో వార్త చదువుతూంటే ఆమె చేతులు కంపించాయి. ఇది వూహించలేదామె. పేపర్ పక్కనపడేసి లేచింది. తొందర తొందరగా తయారై రాయన్న స్నేహితుడిని కలుసుకోవడానికి బయల్దేరింది.
* * *
ప్రెసిడెంట్ జట్టుకి, పాకిస్తాన్ జట్టుకి మధ్య మూడు రోజుల క్రికెట్ మ్యాచ్ ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఆ రోజే మొదలవబోతోంది.
రెండేళ్లుగా భారతజట్టు చాలా హీనమయిన పరిస్థితిలో వుంది. ఒకటి రెండు వన్ డే మ్యాచ్ లు తప్ప అన్ని పోటీల్లోనూ చిత్తుగా వోడిపోతోంది. క్రికెట్ ను అతిగా అభిమానించే భారత ప్రజలను చాలా బాధపెడుతున్న విషయం అది పాకిస్తాన్ టీమ్ వస్తున్నారనగానే 'ఆ ఏముంది. వాళ్ళది యుద్ద ప్రాతిపదికలో ఆడే టీమ్ వాళ్ళతో ఆడి మన వాళ్ళు మరో అపజయ పరంపరలో తలలు వంచుకునేలా చేస్తారు' అని ముందుగానే జోస్యం చెప్పేసుకున్నారు.
మూడు రోజుల ఎగ్జిబిషన్ మ్యాచ్ కాబట్టి రెండు టీముల్లోనూ కొత్తవాళ్ళకు అవకాశం ఇచ్చారు. సాధారణంగా ఈ మ్యాచ్ లకు అంతగా రష్ వుండదు. కాని పాకిస్తాన్ జట్టు ఆట చూడటానికి స్టేడియం చాలా వరకు నిండింది.
పాకిస్తాన్ కెప్టెన్ టాస్ గెలిచి ఫీల్దింగు ఎన్నుకున్నాడు. భారత జట్టు ఓపెనింగ్ శ్రీకాంత్, రామన్ చేశారు. నలభై పరుగులతర్వాత ఇద్దరూ అవుటయ్యారు. అజారుద్దీన్ ముందు, తరువాత టెండూల్కర్ వచ్చారు. పదినిముషాలకి టెండూల్కర్ అవుటయ్యాడు. దానితో భారత జట్టులో కొద్దిగా టెన్షన్ మొదలయింది. తర్వాత వచ్చిన ఆటగాడు ఒక్క పరుగు కూడా చెయ్యకుండా అవుటయిపోవడంతో భారతజట్టు అరవై రెండు పరుగులకే అతి ముఖ్యమయిన నలుగురి ఆటగాళ్లను పోగొట్టుకుంది. అజారుద్దీన్ కి తోడుగా గట్టిగా నిలబడి ఆడగలిగే ఆటగాడు కావాలిప్పుడు. అజారుద్దీన్ సైగతో రాయన్న బ్యాట్ పుచ్చుకుని ఆటస్థలంలోకి అడుగు పెట్టాడు. ఇంటర్నేషనల్ లెవల్లో కాకపోయినా నేషనల్ లెవల్లో అతడు చాలా ఆటలే ఆడాడు. కాబట్టి తనమీద తనే నమ్మకంతో ఏమాత్రం భయం లేకుండా ఆటస్థలం మధ్యకు నడవసాగాడు.
సాధారణంగా ఒక కొత్త ఆటగాడు ఫీల్డ్ లోకి వస్తుంటే అందులోనూ కాస్త నిలబడగలడన్నవాదు వస్తుంటే ప్రేక్షకులు సంతోషంతో చప్పట్లుకొడుతూ అతడిని ఆహ్వానిస్తారు. రంజీట్రోఫీ ఆటల్లో రాయన్న గురించి తెలిసినవాళ్ళు కాబోలు అతడిని చప్పట్లతో ఆహ్వానించారు. అంతలోనే మరోపక్కనించి పిల్లి కూతలు, విజిల్స్ మొదలయ్యాయి. ఎన్నడూ ఎరుగని ఆహ్వానం అది! రాయన్న తొట్రుపడ్డాడు. నిలదొక్కుకున్నధైర్యం, ఆత్మస్థయిర్యం సడలినట్లనిపించింది. తనకుతానుగా ధైర్యంగా తెచ్చుకుని పిచ్ దగ్గరకు నడిచాడు.
మొదటి రెండు బాల్స్ అతడు డిఫెన్సివ్ గా ఆడాడు. కొద్దిగా నిలదొక్కుకున్న ధైర్యం వచ్చింది. ఓవర్ పూర్తవడంతో అక్రమ్ బౌలింగ్ తీసుకున్నాడు. మొదటి బంతికి అజార్ ఒక పరుగు తీశాడు. ఇప్పుడు రాయన్న అక్రమ్ బౌలింగ్ లోకి వచ్చాడు. చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఆడుతున్నాడు. ఒక్క పరుగూ చెయ్యలేకపోయాడు. స్టేడియంలో ఒక పక్క కలకలం. "వాడిని తన్ని తగలెయ్యండి. వాడికి ఆడే అర్హతలేదు" ఎవరిదో స్త్రీ స్వరం. ఆ వెంటనే ఈలలు, కేకలు ఆ గోలంతా తన గురించే అని తెలియగానే రాయన్నకు నీరసం ఆవహించింది. ఆ రోజు ఢిల్లీ పేపర్లలో రాయన్న బెయిల్ మీద వచ్చి ఆడటం గురించి ప్రముఖంగా పడింది. అది మరింత ఆజ్యం పోసింది...."ఆడవాళ్ళను హత్యచేయడంలో కాదురా నీ మగతనం. ఆటలో చూపించు" ఎవరో హిందీలో గట్టిగా అరిచారు. రాయన్న ముఖం మాడిపోయింది. ఆ విషయం గ్రహించినట్లుగా ఆ ఓవర్ పూర్తయ్యాక అజారుద్దీన్ అతడి దగ్గరగా వచ్చి భుజం తట్టాడు. రాయన్న బలవంతంగా నవ్వాడు. అతడి బ్యాటింగ్ వచ్చేసరికి మళ్ళీ అరుపులు. అమ్మాయిలే అరవడం మొదలుపెట్టడంతో అబ్బాయిల్లో హుషారెక్కువయినట్లుంది.
బంతి వేగంగా వస్తోంది. రాయన్న తన దృష్టినంతా దానిమీదే కేంద్రీకరించి బ్యాట్ తో సిద్దంగా వున్నాడు. అప్పుడుపడింది అతడి చెవుల్లో ఆ మాట. "రేపిస్ట్.....ఒరేయ్ రేపిస్ట్" అని! కెరటంలా మాట తరువాత మాట బాణం తరువాత బాణం వచ్చినట్టే..... స్థాణువులా నిలబడిపోయాడు. బాల్ పక్కనించే వెళ్ళి స్టంప్స్ కి తగిలింది. చుట్టూవున్న పాకిస్తాన్ ఆటగాళ్ళంతా గాలిలోకి ఎగిరారు. స్టేడియంలో ఈలలు, అరుపులు..... అయిపోయింది!! రాయన్న బ్యాట్ పట్టుకుని పెవిలియన్ వైపు అడుగులు వేస్తున్నాడు. స్టేడియంలో కూర్చున్న పన్నెండువేల మంది కళ్ళు తనమీదే కేంద్రీకరింపబడినట్లు, వాళ్ళింకా తననో చీడపురుగును చూస్తున్నట్లుగా చూస్తూ, హేళనగా నవ్వుతున్నట్లు భావన.
కాళ్ళు నడవడానికి నిరాకరిస్తున్నాయి. మనసు పరుగెత్తమని హెచ్చరిస్తోంది. ప్రేక్షకుల మధ్యనించి నడుస్తుంటే రకరకాల కామెంట్స్.
"నీలాంటివాళ్ళు జైల్లో వుంటే మంచిదిరా ఫీల్డ్ లోకి వచ్చి మమ్మల్ని కూడా చంపుతావెందుకు?"
డ్రెస్సింగ్ రూంలోకి ఎలా చేరాడో అతడికే తెలియదు. బ్యాట్ పక్కన పడేసి ఓ కుర్చీలో కూలబడి తల రెండు చేతులతో పట్టుకున్నాడు. తోటి ఆటగాళ్ళు ఎవరూ సానుభూతి కూడా చెప్పలేదు. అతడొక్కడే కూర్చుని ఆలోచిస్తున్నాడు.
ఓడిపోయాడు. కూడగట్టుకుని వచ్చిన ధైర్యం అంతా సడలిపోయి ఘోరంగా వోడిపోయాడు. అన్నింటిని మించి కిరణ్మయి తనమీద పెట్టుకున్న ఆశల్ని నమ్మకాన్ని కూడా దారుణంగా ఓడించేశాడు.