దూరంగా ఎక్కడో గుడ్లగూబ వికృతంగా అరిచింది. ఓ కోడిపిల్ల రెక్కలు కొట్టుకొంటూ హృదయవిదారకంగా అరుస్తూంది.
సూర్యుడు కొద్దిగా పైకి వచ్చేడు.
క్రిందనుంచి- తూర్పు కొండల వెనుకనించి ప్రాక్సిమా సెంక్చువరీ దాని వెనుకే ఉదయించింది. నల్లటి ముద్దలా వుంది. గోళీలా గుండ్రంగా వుంది. సూర్యుడికీ, భూమికీ మధ్య వచ్చి నిలబడింది. చిన్న కుదుపు.
సూర్యుడూ, నక్షత్రం, భూమి ఒకే రేఖలోకి రాగానే ఉషస్సు అంతర్దానమై పోయింది.
గ్రహణం!
సూర్యుడు కనపడటం మానేశాడు. అడ్డుగా భయంకరమైన నక్షత్రం, అదే దిశలో భూమివైపు వస్తూ.....
అంతా అంధకారం, ఎక్కడ చూసినా చీకటే.
ఇక మిగిలిన మూడు రోజులూ రాత్రీ పగలూ వుండదు.
యోగవాసిష్టంలో చెప్పింది నిజమవుతూంది.
బైబిల్ లో చెప్పింది ఋజువవుతూంది.
ప్రపంచం అంధకారం బంధురమైపోయింది.
ఒక నక్క మోర యెత్తి వూళ పెట్టింది. ఒక గ్రద్ద రెక్కలు టపటపా కొట్టుకుంది.
పగిలిన కపాలాల మధ్యనుంచి గాలి వీచినప్పుడల్లా ఎవరో ఏడుస్తోన్న ధ్వని.
ప్రకాశరావు గట్టిగా అరవాలనుకున్నాడు. గొంతుక్కేదో అడ్డుపడినట్లు నోటమాట రాలేదు. పండుటాకులా వణికిపోయేడు. అంతలో చెట్టుమీద నుంచి ఓ ఎండుకొమ్మ అతడిమీద పడింది.
అంతే!
రావల్సిన కేక గొంతులో ఆగిపోయింది.
రావల్సిన ఊపిరి గుండెలో ఆగిపోయింది.
కుప్పలా కూలిపోయేడు.
మానసికంగా ఎప్పుడో చచ్చిపోయిన ప్రకాశరావు ఈసారి నిజంగా.....శారీరకంగా కూడా చచ్చిపోయేడు.
* * *
పత్రికాఫీసులేదు. మూతపడిపోయింది.
శైలజ గదిలో మంచంమీద వెల్లకిలా పడుకొని పైకప్పుకేసి చూస్తూ ఆలోచిస్తూంది. ఆమె తన పద్దెనిమిదేళ్ళ (వూహవచ్చిన తర్వాత) జీవితాన్ని సమీక్షించుకొని ఆలోచిస్తే ఆమెకి అది చాలా నిస్సారంగానూ, అర్ధరహితంగానూ కనిపించింది.
ఏం సాధించింది తను?
ఈ ప్రపంచంలో చాలామంది ఏమీ సాధించరు. కానీ వాళ్ళకి బ్రతుకుతున్నామన్న తృప్తి అన్నా వుంటుంది. మరి తనకుందా?
ఆలోచిస్తే.....ఉన్నట్టే వుంది.
ఒక కుటుంబాన్ని పోషిస్తున్నానన్న తృప్తి, తమ్ముళ్ళనీ, తండ్రినీ.....
మిగతా కోర్కెల గురించి ఆలోచిస్తే.....ఈ చివరి నాల్గు రోజుల్లో కూడా తన శృంఖలాలు తెంచుకొని అనుభవించకుండా ఏది అవుతుంది? ఒక పెళ్ళికాని స్త్రీ జీవితంలో పెళ్ళికాదని తెలిసి కూడా (జీవితం యింకో నాలుగురోజులే కాబట్టి) ఎందుకు నైతిక విలువలకి కట్టుబడి వుంటుంది? కేవలం కుటుంబ గౌరవం రక్షించటానికేనా?
'కుటుంబం'
చాలా మంచి.... గౌరవప్రదమైన పదం అది.
ఒక నిశ్శబ్ధపు అర్ధరాత్రి అకస్మాత్తుగా మెలకువ వస్తే కోరలు బయటపెట్టి చుట్టుముట్టే కోర్కెలు గుర్తొచ్చేయి. రాణీ అన్నట్టు అది మానసిక వ్యభిచారమా? కోర్కె శారీరకము, అందులో ఎవరినయినా వూహించుకొంటే అది మానసిక వ్యభిచారం.
ఆమెలో చిన్న కోర్కెబలంగా పురులు విప్పుకొంటూంటే చాలా చాలా చిన్న కోర్కె, ఆ నిర్మానుష్యమైన వీధులగుండా విశృంఖలంగా పరుగెత్తాలని.
పిచ్చి కోర్కె.
ఫ్రాయిడ్ చెప్పినట్టు అంతర్గపు టాలోచన అసంకల్పిత చర్యని అనిబద్దంచేస్తుంది.
ఆమెకి నవ్వొచ్చింది.
అంతలో తలుపు చప్పుడయింది. తండ్రి లోపలి వచ్చేడు. ఆమె లేవబోతూవుంటే వారించి ప్రక్కనే కూర్చున్నాడు.
"నీ దగ్గరెంత డబ్బుందమ్మా?"
ఆమె ఆశ్చర్యపడినా, దాన్ని పైకి కనుపించనివ్వకుండా "పదో ఇరవయ్యో వుండొచ్చు నాన్నా!" అంది.
"అబ్బే, అంత తక్కువ కాదు. అయిదొందలన్నా కావాలి?"
"అయిదొందలా? అంత నా దగ్గరెక్కడిది నాన్నా?"
అతడు కొంచెంసేపు నిశ్శబ్ధంగా వుండి ఆ తర్వాత ఆ నిశ్శబ్దాన్ని చెదరగొడ్తూ అన్నాడు- "పోనీ నీ గొలుసు అమ్మేస్తే?"
ఆమె చప్పున తనవైపు చూసుకొని, విస్మయంగా తలెత్తి, "ఇప్పుడంత అవసరం ఏమొచ్చింది నాన్నా?" అంది.
ఇంకా నాల్గురోజుల్లో ప్రపంచం ఆఖరవబోతూ వుంటే ఇప్పుడెందుకు అంత డబ్బు? ఆమె రెట్టించి అడిగింది. అతడికి చెప్పక తప్పలేదు.
"పక్క పల్లెలో ఋద్భుదానందపు స్వామి వారు వెలిసేరమ్మా ఆయన యిచ్చిన తాయెత్తు కొంటే ప్రళయం ఏమీ చెయ్యదట" నసుగుతూ అన్నాడు.
ఆమెకి ముందు నవ్వొచ్చింది. ప్రాణభయం చదువుకున్నవాళ్ళనీ, చదువుకొని వాళ్ళనీ, అందర్నీ మూర్ఖుల్ని చేస్తూంది. కానీ ఆమెకి సంతోషం కూడా వేసింది. ఏ విధంగానైనా తమ ప్రాణాల్ని నిలబెట్టటానికి తమ తండ్రి.....ఈ కుటుంబ పెద్ద శాయశక్తులా ప్రయత్నం చేస్తున్నాడు.
"ఎంతట నాన్నా, ఆ తాయెత్తు?"
"అయిదొందలట" అన్నాడు ఆయన. కూతురు ఆ మాత్రం ఆసక్తి చూపించటం ఆయనకి సంతోషకరంగా వుంది. తన మాటలు తేలిగ్గా కొట్టిపడేస్తుందనుకున్నాడు. ఇంటిల్లిపాదినీ పోషిస్తున్న కూతురంటే అతనికే మూలో భయం.
ఆమె మెడలోంచి గొలుసుతీసి యిస్తూ అంది- "ఒక తాయెత్తు ఇంట్లో ఉంచుకొంటే ఆ ఇల్లు నిలబడ్తుందీ అన్న నమ్మకం నీకుంటే దాన్ని నేనెందుకు పాడుచెయ్యాలి నాన్నా.....తీసుకో....."
వెంట్రుకల మధ్య హుక్కు చిక్కుకొని ఒక పట్టాన రావడం లేదు.
"ఇంట్లో పెట్టుకోవడం కాదమ్మా చేతికి కట్టుకోవాలి. నా చేతికి కాదనుకో...." నవ్వేడు. అయితే ఆ నవ్వులో జీవంలేదు. "ఉన్నవి ఒక ఐదొందలే. ఇంటిల్లిపాదికీ ఎక్కడ్నుంచి తేగలం?"
"నాకు వీటిమీద నమ్మకంలేదు నాన్నా" అన్నది. లోలోపల మనసులో మాత్రం -'నాకు ఈ బ్రతుకుమీద కూడా పెద్దగా ఇష్టం లేదు నాన్నా' అనుకొన్నది.
హుక్కు విడివడింది. గొలుసు ఆమె చేతిలోకి వచ్చింది.
"పోన్లే అమ్మా ఎవరి నమ్మకాలు వాళ్ళవి" అతడు గొలుసు వంక చూస్తూ అన్నాడు. "ఒక చిన్న తాయెత్తు తమ్ముడి చేతికి కడితే వాడు వంశం నిలబెడతాడు."
గొలుసు అందిస్తున్న చెయ్యి క్షణం పాటు స్థంభించింది. గుండెల్లో ఆవేశం ఆవేదన రూపంలో ఉవ్వెత్తున పొంగింది. అతడి ఒళ్ళోకి గొలుసు విసురుగా వచ్చిపడింది. అది తీసుకుని అతడు వెళ్ళిపోయేడు. ఆమె ఒంటరిగా మిగిలిపోయింది.
అప్పుడొచ్చింది ఆమెకు దుఃఖం.....తెరలు తెరలుగా కట్టలు తెంచుకొని.
తాయెత్తు మనిషిని రక్షిస్తుందా లేదా అన్నది కాదు అక్కడి ప్రశ్న కుటుంబంలోని వ్యక్తుల మధ్య బంధాల గురించిన ప్రశ్న అది.
కుటుంబం.
చాలా మంచి పదం అది. తల్లి, తండ్రి, తమ్ముడు..... సున్నితమైన బంధాలూ.
ఇన్ని సంవత్సరాలు రెక్కలు ముక్కలా చేసుకుని తను యీ కుటుంబాన్ని నిలబెట్టింది. తన సర్వస్వం ధారపోసింది. అయినా ఎవరో ఒకరే బతకాల్సివస్తే దానికి తన కొడుకునే తన వంశం నిలబెట్టేవాడుగా తండ్రి ఎన్నుకొంటున్నాడు. ఏమి వ్యవస్థ యిది? ఇందులో బ్రతకటం కన్నా స్త్రీ చచ్చిపోవటం నయం.
ఆమె కన్నీటితో తలదిండు తడిసిపోయింది. ఎక్కిళ్ళు పైకి వినిపించకుండా ఏడుస్తోంది.