22
రమణ తరచుగా కోదండపాణి యింటికి వెడుతున్నాడు. అక్కడ అతడితో దక్షిణామూర్తి, పార్వతమ్మ, గిరిధర్, కోదండపాణి మాట్లాడుకున్నారు. అప్పడప్పుడు సుభద్ర కూడా అతడితో మాట్లాడుతుంది.
హాస మాత్రం అతడితో ఒక్కసారి కూడా మాట్లాడలేదు. అసలామె అతడి కంటికే కనబడేది కాదు.
పార్వతమ్మ ఒకటి రెండుసార్లు ఆమెను రమ్మని పిలిచింది.
"నాకు సిగ్గు" అంది హాస.
అది అబద్ధమని పార్వతమ్మకు తెలుసు.
"పాపం, అతడు వచ్చిందే నీకోసం" అంది పార్వతమ్మ.
"అలాగని నీతో చెప్పాడా?"
రమణ ఒకసారి కోదండపాణి కోసం వచ్చానన్నాడు. ఇంకోసారి దక్షిణామూర్తి కోసం అన్నాడు. ఒకసారి గిరిధర్ కోసం అన్నాడు.... ఆఖరికి పార్వతమ్మగారి వద్ద పాతకాలం పాటలు వింటాకన్నాడు.
అతడెన్ని చెప్పినా వచ్చేది హాస కోసమేనని అందరికీ తెలుసు.... ఆఖరికి గిరిధర్ కి కూడా ఆ విషయం తెలుసు.
"అతడు ణా కోసం వచ్చినప్పుడు నేనతడితో మాట్లాడతాలే...." అనేది ఆమె.
"వచ్చింది నీ కోసమే, మొహమాటానికలా అంటాడు" అంటుంది పార్వతమ్మ.
"అమ్మో! ఆ మొహమాటమెంతో తెలుసుకుంటానుండు...." అని హాస తనకు స్వతంత్రమున్న వాళ్ళందర్నీ ఉసిగొల్పింది.
దక్షిణామూర్తి అతడికి అడక్కపోయినా తన ఆరోగ్య రహస్యాలూ, ఆహారపుటలవాట్లూ చెప్పేవాడు. స్వాతంత్ర్య పోరాట సమరంలో తను చేయని సాహస కార్యాల గురించి చెప్పేవాడు. ఆనాటి నైతిక విలువల గురించి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవాడు.
పార్వతమ్మ తన పుట్టింటివారి గొప్పతనం చెప్పేది. దక్షిణామూర్తికి తననిచ్చి పెళ్ళి చేయడం ఆవిడ తండ్రికి సుతరామూ యిష్టం లేదుట.... ఒకసారి పార్వతమ్మ తండ్రి ఏదో ప్రమాదంలో యిరుక్కుంటే దక్షిణామూర్తి ప్రాణాలకు తెగించి రక్షించాడు. ఆ కృతజ్ఞత కొద్దీ ఆయన కూతుర్నిచ్చాడు. ఆ తర్వాత మామగారి సాయంతో దక్షిణామూర్తి కూడా గొప్పవాడయ్యాడు. మామగారు పోయాక దక్షిణామూర్తి పేరుకు మాత్రమే ఇంటికి యజమాని. ఇల్లంతా పార్వతమ్మ పద్ధతిలో నడిచేది.
"ఆడపెత్తనం మంచిది కాదంటారు. మా యింట్లో ఏం లోటొచ్చింది?" అని రమణ మెప్పుకోసం చూసేదావిడ. రమణ మెచ్చుకునేవాడు.
సంభాషణలో అతడు అన్యమనస్కంగా ఉన్నట్లనిపిస్తే పార్వతమ్మ ఉత్సాహం కోసం హాస ప్రసక్తి తెచ్చి, "మా మనుమరాలివన్నీ నా పోలికలే. ఇప్పడు దాన్ని చూసి మళ్ళీ నీకు వయసొచ్చిందా అని పొరబడతానే అంటారాయన...." అనేది.
అప్పుడు రమణ ఆవిడలో హాస పోలికలు వెతుక్కుని తృప్తిపడేవాడు.
గిరిధర్ కి లెక్కలంటే ప్రాణం. అందులోనూ కాల్క్యులస్ మరీ యిష్టం వాడికి. మొదటిరోజు పాఠం విన్నాక వాడది అక్కకు చెప్పబోయాడు. వినలేదు బామ్మ, తాత అయిపోయాక తండ్రికి చెప్పే ధైర్యం లేక బిక్కముఖం వేసుకుని తల్లి దగ్గరకు వెళ్ళాడు. వాడిమీద జాలిపడి ఆవిడ వాడు చెప్పినంతా వింది.
ఆ రాత్రి ఆమె భర్తతో భోజనాల దగ్గర, "తాగడానికి గ్లాసులో చారు పొయ్యనా? చారుకి డీవై బైడీయక్స్ పొయ్యనా....?" అనే సరికి కోదండపాణి అదిరిపోయాడు.
చారుకి "డివై బై డీయక్స్" ఏంటో గిరిధర్ కే అర్ధం కాలేదు.
"చారులో వేసే ఉప్పు, చింతపండు, చారుపొడి, పోపు అన్నీ కలిపి వై అనుకుంటే డీవై బై డీయక్సు మంచినీళ్ళే కదా" అంది సుభద్ర.
"ఆ డీబాడీయా ఏంటే?" అంది పార్వతమ్మ.
"అది కాల్క్యులస్ తెలిసిన వాళ్ళకి తప్ప అర్ధం కాదు.... అమ్మకిప్పుడు నాకంటే బాగా అర్ధమైపోయింది" అంటూ సంతోషంగా అరిచాడు గిరిధర్.
తల్లికి చెప్పినకంటె కాస్త తీవ్రంగానే డీవై బై డీయక్సు గురించి గిరిధర్ కు రమణ చెబుతుండేవాడు. నెల్లాళ్ళలో గిరిధర్ ఇంటర్మీడియేట్ కుర్రాళ్ళకి చెప్పగల స్థాయికి ఎదిగిపోయాడు.
వీళ్ళు ముగ్గురూ హాస ప్రోత్సాహంమీద రోజుకో విధంగా రమణను విసిగించడానికి పథకం వేసేవారు. అతడు వెళ్ళిపోయాక అది తల్చుకుని ఎంజాయ్ చేసేవారు.
కోదండపాణి, హాస ప్రోత్సాహం లేకుండానే రమణను బోరు కొట్టేవాడు. ఆయన తరచుగా, "రాజీవ్ గాంధీ ఇలా చేస్తే బాగుంటుంది, ఎన్టీఆర్ ఇలా చేస్తే బాగుంటుంది" అని ప్రతి క్లిష్ట సమస్యకూ పరిష్కార మార్గం సూచిస్తూంటే రమణకు సహనం చచ్చి, "మీరు రాజకీయాల్లో ప్రవేశిస్తే జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ ఏ సమస్యలూ ఉండవు...." అన్నాడు.
కోదండపాణి గర్వంగా నవ్వి, "రాజకీయ సమస్యలో సమస్యలా? తొందరగా ఏదో ఓ నిర్ణయం తీసుకుంటే మంచి జరిగిందే జరిగింది. లేదూ ప్రజలు నష్టపోతారు. సమస్యలంటే యింటి సమస్యలే సమస్యలు. ఏ పొరపాటు జరిగినా ఇంటిల్లపాదీ నష్టపోతారు. ఇంటి సమస్యలు పరిష్కరించుకోలేక వాట్నించి తప్పించుకోవడం కోసం చాలామంది రాజకీయాల్లో ప్రవేశిస్తారు. వాళ్ళకి ఇంటి సమస్యలు పరిష్కరించే మార్గం తెలిసిందంటే రాజకీయాలు వదిలి హాయిగా యింటిపట్టునే వుంటారు" అన్నాడు.
"పోనీ, మీరవే వాళ్ళకు నేర్పకూడదూ?" అని రమణ అంటే__
"ఏదీ_ఇంటి సమస్యలు పరిష్కరించడం నాకూ చేతకావడం లేదు. ఎటొచ్చీ మన నాయకుల్లా వాటినుంచి తప్పించుకు పారిపోను...." అన్నాడాయన.
ఇవన్నీ హాసకు తెలుస్తూనే ఉండేవి. ఆమె ఏకాంతంలో ఇవన్నీ గౌతమ్ కి చెప్పుకునేది.
గౌతమ్ అవన్నీ విని ఆనందించేవాడు.
హాస రమేష్ ను పొగిడితే, "గొప్పతనం నీ అందానిది. నీ వ్యక్తిత్వానిది. నిన్నెవరయినా అలా ప్రేమించగలరు..." అనేవాడు గౌతమ్ ఆమెతో.
"ఇంతవరకూ నన్నెవరూ అలా ప్రేమించలేదు....!" అని హాస అంటే....
"నాకంటే ఎక్కువ తెలుసా నీకు?" అన్నాడు గౌతమ్.
"ఎవర్నువ్వు?" హాస ప్రశ్న.
"ప్రస్తుతానికి అశరీరవాణిని నాకు శరీరముంటే రమణ కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించగలను."
"రమణను నా దగ్గరకు పంపింది నువ్వు. రమణంటే నీకు అసూయ ఎందుకు?" హాస నవ్వు.
ఆ నవ్వుకు గౌతమ్ బదులు నిట్టూర్పు. రమణను పంపింది తను కాదని హాసకు చెప్పలేడు.
హాస నవ్వు....
గిరిధర్ బామ్మని పిలవడం.
"నీలో నువ్వు నవ్వుతూ మాట్లాడుకునే బదులు పాపం, అతడొచ్చినప్పుడు కబుర్లు చెప్పొచ్చుగా" బామ్మ మందలింపు.
"అతడు నాకోసం రాలేదు. మీకోసం వచ్చాడు........." హాస సమాధానం.
"అది అబద్ధం"
"అబద్ధం చెప్పే వాళ్ళతో నేను మాట్లాడను"
"కానీ ఆ అబ్బాయి నిన్ను ప్రేమిస్తున్నాడు పాపం."
"ఆ ప్రేమలో బలం లేదు....అసలతడు నన్ను ప్రేమిస్తున్నాడని రుజువేమిటి?"
"మేమందరం ఎంత విసిగించినా భరిస్తున్నాడు.... అదే రుజువు మరి...."
"ప్రేమ అంత బలమైనదయితే ధైర్యంగా నన్ను పిలిచి మాట్లాడొచ్చుగా."
బామ్మ ఈ విషయం రమణకు చెప్పినట్లుంది. అతడోరోజున ధైర్యంగా హాసను పిలిచాడు.
"నాకు పరీక్షలా. పరీక్షలయ్యేదాకా ఎవరితోనూ మాట్లాడను అయాం సారీ."
హాసకు నిజంగానే పరీక్షలు మరి.
కానీ తనకు పరీక్షా సమయం వచ్చిందని ఆమెకు తెలియదు.
* * * *
గౌతమ్ ఆఫీసుకు వెడుతున్నాడు.... అక్కడ చరితను చూస్తున్నాడు....
చరిత అతడి వైపు చూడదు. కానీ ఓరకంట ఆశగా గమనిస్తుంది.
అతడు తన్ను పిలిచి మాట్లాడాలని ఆమె కోరిక.
గౌతమ్ తన్ను ప్రేమిస్తున్నాడని ఆమె నమ్ముతోంది. అతను హాసను ప్రేమిస్తున్నట్లామెకు తెలియదు. అందువల్ల అతడి సందిగ్ధావస్థ గురించి తెలియదామెకు.
"ఇవ్వాల్సిన ధైర్యాన్నిచ్చాను. ఇంకా తటపటాయిస్తాడెందుకు?" ఇదీ చరిత సందేహం అయితే "ప్రేమలో అతడు పసిబాలుడు" అన్న వెంకట్రత్నం మాటలు ఆమె చెవుల్లో గింగురు మంటుంటాయి.
"మళ్ళీ ధైర్యాన్నివ్వాలా?" అని ఆమె అనుకుంటూంటుంది. కానీ అందుకు అహం అడ్డొస్తోంది.
పెళ్ళయ్యాక ఎలాగూ తప్పదు. పెళ్ళికి ముందు కూడా ఆడదే అహాన్ని చంపుకోవాలా? ఇదీ ఆమె బాధ!
ఏరోజు కారోజే అతడు తన్ను పలకరిస్తాడని ఎదరు చూస్తుందామె! అలా రోజులు గడిచిపోతున్నాయి.
అప్పుడప్పుడు గౌతమ్ చరితను పిలుస్తున్నాడు కానీ అది ప్రేమ పిలుపు కాదు. అఫీషియల్ పిలుపు. ఆ సమయంలో అతడామె వైపు కూడా చూడకుండా మాట్లాడుతున్నాడు. ఆమె నిరుత్సాహ పడుతోంది.