Previous Page Next Page 
సుహాసిని పేజి 25


    గౌతమ్ ఏకాంతంలో ఆమెను పలకరించాలని ఆత్రుత పడుతూ రోజులు గడుపుతున్నాడు.

    ఆమె మాటల్లో రమణపట్ల ఆరాధనాభావం అతడిని కృంగదీస్తోంది. వారి మధ్య అపార్ధాలు సృష్టించబడాలన్న కోర్కె అతడిలో అంతర్గతంగా ఉంది. సంస్కారం ఆ కోర్కె నణగద్రొక్కడానికి ప్రయత్నిస్తోంది.

    ఒక రాత్రి హాస తనే అతడిని పిలిచింది.

    వెంటనే పలికాడతడు.

    "అశరీరవాణీ! యిప్పుడు నువ్వే నాకు సాయపడాలి...." అంది ఆమె.

    "హాసా!" అన్నాడతడు, "నువ్వు నన్నడక్కూడదు__ఆజ్ఞాపించాలి...."

    "పరీక్షల పేరు చెప్పి పుస్తకాల ముందు కూర్చుంటున్నాను. రమణ కారణంగా ఏకాగ్రత కుదరడం లేదు నాకు. అతడిని కలుసుకోకుండా ఎప్పుడూ పుస్తకాలముందే ఉంటున్న మూలాన మంచి మార్కులు తెచ్చుకోకపోతే అవమానంగా వుంటుంది నాకు. నువ్వే నన్ను కాపాడాలి"

    "నేనేం చేయాలో చెప్పు హాసా!"

    "పరీక్షల్లో నా ప్రశ్నలు చెబుతాను. సమాధానాలు నువ్వు నా చెవిలో పలకాలి సరేనా?"

    హాసకు పరీక్షల్లో తనవల్ల సాయం....గౌతమ్ మనసుప్పొంగింది.

    "మరి నీ సబ్జెక్ట్సేమిటో చెప్పు!"

    హాస అతడికి చెబుతూంటే నోట్ చేసుకున్నాడు.

    ఆరోజు నుంచీ అతను ట్యుటోరియల్ కాలేజీల చుట్టూ తిరుగుతూ కొంత డబ్బు వెచ్చించి అవసరమైన పుస్తకాలూ అవీ కొన్నాడు.

    అతడు తను సేకరించిన పుస్తకాల గురించి చెబితే ఆమె ఎంతో సంతోషంగా, "వెరీ గుడ్! నువ్వు నాకు పనికొస్తావు" అంది.

    "హాసా! ఒక్క విషయం గుర్తుంచుకో. ఏదో ఓ రోజున మనం ఒకరికొకరెదురు పడవచ్చు. అప్పుడు మనం ఒకరినొకరు గుర్తుంచుకోవాలంటే ఎలా?"

    "నువ్వు నాకెదురు పడతావా? ఆ పనేదో యిప్పుడే చేయకూడదూ?" ఆత్రుతగా అందామె.

    "ప్రస్తుతానికి నేను అశరీరవాణిని. అందువల్ల అది సాధ్యం కాదు."

    "అసలు నువ్వెవరు?"

    "హాసా! ఈ ప్రశ్న నీ గుండెలోతుల్లోంచీ వచ్చినప్పుడు నేనెవరో చెప్పకుండా నీకు తెలుస్తుంది."

    హాస నిట్టూర్చి, "గుండె లోతుల్లోంచీ ప్రశ్నలు వేయడం నాకెప్పటికి తెలుస్తుందో?" అంది.

    "అది ఒకరు నేర్పితే వచ్చేది కాదు. కానీ నా గురించి నీకేమనిపిస్తోంది!"

    "అంతా నా భ్రమగా తోస్తోంది. నా మెదడుకున్న అద్భుత శక్తివి నీవనిపిస్తోంది."

    "అదే నిజం. కానీ గుర్తులు చెప్పవు?"

    "గుర్తులంటే ఎలాంటివి?"

    "నీకూ, నీ తల్లిదండ్రులకీ తప్ప మరెవరికీ తెలియనివి"

    హాస అతడికి తన శరీరంలోని ఓ పెద్ద పుట్టుమచ్చ గురించి చెప్పి, "నీ గుర్తు కూడా చెప్పు" అంది.

    గౌతమ్ ఆమెకు తన గుర్తు చెప్పాడు, "ఇవి ఎవరికీ కనిపించనివి. మనకు మాత్రమే తెలిసేవి"

    "ఇంకో గుర్తు చెబుతాను" అంది ఆమె.

    "చెప్పు" ఉత్సాహంగా అడిగాడు.

    "చాలామంది నేను నాలో నేనే మాట్లాడుతున్నానని అనుకుంటున్నారు. నా మనసులో మాట్లాడుకున్నా నీకు వినపడుతుందనుకో. కానీ కానీ నీ జవాబులు స్పష్టంగా చెవిలో వినిపిస్తూంటే నోరారా మాట్లాడాలనిపిస్తోంది. అందుకని ఓ ఉపాయమాలోచించాను. ఓ టాయ్ ఫోన్ కొన్నాను. అదెప్పుడూ నా దగ్గరే ఉంచుకుంటున్నాను. నీతో మాట్లాడేటప్పుడు రిసీవర్ చెవి దగ్గర వుంచుకుంటున్నాను. చూసేవాళ్ళకి ఆడ్ గా అనిపించదు-ఫోన్ కి కనెక్షనుంటేనేం? లేకపోతేనేం? ఆ ఫోన్ నెంబరు నీకు మాత్రమే చెబుతాను-గుర్తుంచుకో....అయిదు ఒకట్లు....ఫైవ్ వన్స్...."

    "థాంక్యూ హాసా!"

    "హలో! మనమెప్పుడు కల్సుకుంటాం?"

    "నువ్వెప్పుడు కావాలంటే అప్పుడు నన్ను పిలవచ్చు...."

    "మాట్లాడుకోవటం గురించి కాదు నేనడుగుతూంట....మనమెప్పుడు కలుసుకుంటాం...."

    గౌతమ్ నిట్టూర్చి "అదే నేనుకాదు, నువ్వే చెప్పగలవు" అన్నాడు.

    హాస పరీక్షలప్పుడు గౌతమ్ ఆఫీస్ కు సెలవుపెట్టి ఇంట్లో వుండి ఆమె అడిగే ప్రశ్నలకు జవాబులు చదివి చెప్పాడు.

    ఆఖరి పరీక్ష తర్వాత ఆమె అతడికి కృతజ్ఞతలు చెప్పుతూంటే, "ప్రేమబలంతో ఏ పరీక్షలయినా ఎదుర్కోవచ్చు.... ఈ పరీక్షలో లెక్కా...." అన్నాడు గౌతమ్.


                                         23


    హాసకు పరీక్షలయిపోయాయి. చాలా బాగా రాశానని ఉత్సాహంగా వుందామె. ఒక రోజంతా స్నేహితురాండ్రందరూ కలిసి సంతోషంగా గడిపారు.

    మర్నాడు....

    రమణ తిన్నగా హాస గదిలోకెళ్ళి సూటిగా ఆమెతో మాట్లాడాడు.

    అతడి ధైర్యానికామె ఆశ్చర్యపోయింది.

    ఆ ధైర్యం ఒక్క రోజుది కాదని ఆమెకు తెలుసు.

    రోజూ వస్తున్నాడతడు తమ యింటికి. ఆ యింట్లో కాబోయే అల్లుడిగా అంతా అతణ్ణి గుర్తించేశారు.

    కోదండపాణికీ, దక్షిణామూర్తికీ ఈ సంబంధం నచ్చేసింది. ఆడవాళ్ళయితే సరేసరి! అప్పుడే హాస అదృష్టాన్నభినందించేస్తున్నారు.

    తన గదిలోకి ధైర్యంగా అడుగుపెట్టిన రమణ వంక ఆమె మొదటిసారిగా పరీక్షగా చూసింది.

    మేలిమి బంగారు చాయ. నల్లటి ఉంగరాల జుత్తు. మాయ తెలియదనే కళ్ళు, నిర్మలమయిన చూపులు. ఇవన్నీ కలసిన సుమారు ఆరడుగుల విగ్రహం.

    అప్రయత్నంగా ఆమెకు ప్రకాశరావు గుర్తు వచ్చాడు. అతణ్ణి చూసీ చూడగానే "మగాడు" అనిపిస్తుంది. ఇతడు కూడా మగతనం వుట్టిపడ్తున్నా చూడగానే "మగవాడు" అనిపిస్తుంది. అందుక్కారణం "మనవాళ్ళే" అని పార్వతమ్మ తరచుగా అనడం కాదు.

    రమణ చాలా తక్కువగా నవ్వుతాడు. అతడి ముఖం ఎంతో గంభీరంగా వుంటుంది. కానీ అందువల్ల అతడి అందం చెదరలేదు. హుందా పెరిగింది.

    "ఈ రోజు మనం పార్కుకి వెడదాం" అదీ అతడి మాట. అందుకామె జవాబివ్వకుండా తననే చూస్తుంటే మళ్ళీ, "ఈ రోజు మనం పార్కు కెడదాం" అన్నాడతడు.

    ఆమె నవ్వింది.

    హాస నవ్వితే పూలు వికసించినట్లు సహజంగా వుంటుంది. ఆమె చాలామందికి మాటలతో కాక నవ్వుతో సమాధానమిస్తూంది.

    ఆ నవ్వు సాధారణంగా ఎదుటివారికి సంతోషాన్నే కలిగిస్తుంది.

    ఆ నవ్విప్పుడు రమణకు సంతోషాన్నే కలిగించింది.


                                                                 *    *    *    *


    సన్నటి తుంపర.

    వాన పడుతున్నట్టు లేదు.

    పూల వానలాగుంది.

    పార్కులో ఒకరికొకరు ఎదురెదురుగా హాస, రమణ.

    రమణ గంభీరంగా వున్నాడు.

    హాస చిరునవ్వుతో వుంది.

    అతడు రెండు అరచేతుల్నీ దగ్గరగా చేర్చి వ్రేళ్ళతో విన్యాసాలు చేస్తున్నాడు. ఆమె చేతివ్రేళ్ళు ఒడిలోని టాయ్ ఫోన్ నెంబరు తడుముతున్నాయి.

    ఇద్దరూ తడుస్తున్నారు కానీ వారికా స్పృహ లేదు.

    "హాసా!" అన్నాడతను.

    "ఊఁ" అందామె.

    "నీది చాలా అందమయిన పేరు" అన్నాడతను.

    ఆ క్రెడిట్ మా తాతయ్యది. ఆయనే నాకీ పేరుపెట్టారు" అంది హాస.

    "ఇలాంటి పేరు మీ తాతగారు పెట్టారంటే నాకు చాలా ఆశ్చర్యంగా వుంది. సాధారణంగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చాలా పెద్ద పేర్లు పెడుతూంటారు. నాదలాంటిపేరే! హైస్కూల్లో చేరినప్పుడు నేనే గోలపెట్టి నలభయ్ అక్షరాల పేర్లో మూడక్షరాలుంచుకున్నాను. నీ విషయమూ అంతేననుకున్నాను...."

    హాస నవ్వింది.

    "మా తాతగారు జాతకం చూసి నేను భారతదేశ చరిత్రనే మార్చేటంత గొప్పదాన్నవుతానన్నారు. ముందాయన నాకు చరిత్ర అనే పేరుపెట్టాలనుకున్నారు. నచ్చలేదు. తర్వాత చరిత అనుకున్నారు. అదీ నచ్చలేదు. చివరికి చరిత్ర అని అర్ధం వచ్చే పదాలకై వెతికి 'ఇతిహాస' అన్న పేరు నిర్ణయించారు. ఇంకా నాకు నామకరణం చేయకుండానే నన్ను ఆయన ముద్దుగా "ఇతిహాస, ఇతిహాస్" అనేవారుట. ఆయనకు సంస్కృతంలో ప్రవేశముంది. ఇతిహాస అంటుంటే ఆయనకు ఇది హాస అన్నట్లు స్పురించింది. సంస్కృతంలో ఇతి అంటే ఇది అనేకదా అర్ధం! ఆ విధంగా నా పేరు హాసగా మారిపోయింది."

    ఆమె మాట్లాడుతూంటే ఎక్కడ పోగొట్టుకుంటానో అని ముత్యాలేరుకుంటున్న వాడిలా ఆత్రుతగా విన్నాడు రమణ. ఆమె పూర్తి చేయగానే "నేనూ ఇక జాతకాన్ని నమ్మాల్సుంటుంది" అన్నాడు.

 Previous Page Next Page