సాయంత్రం కార్లో ఇంటికొస్తున్నాప్పుడు నెమ్మదిగా అడిగాడు" ఉదయం నాతో చెప్పకుండా వెళ్లిపోయారేం?"
"మీరు నిద్రలో వున్నారు. అందుకని......."
"లేపచ్చు కదా? మీరొక్కరే అంతదూరం వెళ్ళటం కష్టం కదూ! కనీసం మెయిన్ రూడ్ వరకూ నడిచేవెళ్ళుంటారు.
ఆమె మాట్లాడలేదు.
"నేను చెప్పదల్చుకొంది ఒక్కటే - ఏవేవో ఊహించుకొని బాధపడకండి ! ఇంకొకరిని బాధపెట్టకండి."
"మిమ్మల్ని బాధించాలని నేనెప్పుడూ అనుకోలేదూ!" ఉద్వేగంతో అంది సావిత్రి.
"అనుకోకపోయినా జరుగుతుందదే! చలపతి మాట్లాడిన మాటలు మర్చిపోండి. వాటిగుంచి ఆలోచించడం కూడా అనవసరం! మనిద్దరం కోరుకొంటుంది ఒక్కటే. చలపతి కేమంగా ఇంటికి తిరిగిరావాలి. అంతే........." కాంపౌండ్ లోపల కారాపుతూ అన్నాడు శ్రీకాంత్.
బయట కుర్చీల్లో కూర్చున్న ఇద్దరు స్త్రీ పురుషులు అతన్ని చూడగానే లేచి నిలబడ్డారు.
"నమస్తే సార్!" నమస్కరించారు వాళ్ళు.
"ఏమిటి?" అడిగాడు శ్రీకాంత్. అతని వెనుకే తనూ నిలబడిపోయింది సావిత్రి.
"సాయంత్రం రవీంద్రభారతిలో మా అసోసియేషన్ వాళ్ళు ఇస్తోన్న సాంసృతిక ప్రదర్శనకి మీరు రావాలి. ఇది మా ఇన్విటేషన్."
"ప్రయత్నిస్తాను!" అన్నాడు అతను.
"అలాగంటే కాదు సార్! తప్పక రావాలి." అన్నాడతను.
"ఇంక వస్తామండీ! అన్నట్లు మీ శ్రీమతిని కూడా తీసుకురండి!" అని మర్యాదపూర్వకంగా మరోసారి నమస్కరించి వెళ్ళిపోయారు వాళ్ళు.
వాళ్ళు వెళ్ళిపోయాక నెమ్మదిగా లోపలికొచ్చి నిలబడ్డారిద్దరూ , సావిత్రికి వాళ్ళ పొరపాటు తెలిసిపోయింది. తననే శ్రీకాంత్ భార్య అనుకొంటున్నట్లున్నారు!
"వాళ్ళ మాటలేమీ పట్టించుకోకండి. వాళ్ళ కేలా చెప్పాలో నాకూ తోచలేదు...." అన్నాడు శ్రీకాంత్.
ఆమె మాట్లాడలేదు . నెమ్మదిగా ఇంట్లోకి వెళ్ళిపోయింది.
* * *
చలపతిని ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్ళారు! దుఃఖం పట్టలేక పోతున్న సావిత్రిని శ్రీకాంత్ ఒదార్చల్సివచ్చింది. ఇద్దరూ బయట బెంచీ మీదే ఆత్రుతతో ఎదురుచూస్తూ కూర్చున్నారు. మూడు గంటలు గడిచిపోయినాయ్! శ్రీకాంత్ ఆదుర్దాగా వచ్చేపోయే డాక్టర్లని అడుగుతూనే ఉన్నాడు.
"ఇంకొక్క అరగంటలో అయిపోతుంది" అని చెపుతూనే వున్నారు వాళ్ళు.
తనకు తెలిసన ఓ డాక్టర్ బయటకు వచ్చాడు.
"పేషెంట్ పరిస్థితి ఎలా వుంది?" అడిగాడు శ్రీకాంత్.
"ఇప్పుడే ఏమీ చెప్పలేం......"
మరో డాక్టరు వచ్చి "ప్రమాదం నుంచి ఇంకా బయటపడలేదు"అని చెప్పాడు గంబీరంగా.
ఆ మాటతో సావిత్రి వెక్కి వెక్కి ఎడ్చేయ్యసాగింది.
"ఏడవకండి ఇప్పుడే మనం ధైర్యంగా ఉండాలి" అన్నాడు శ్రీకాంత్.
చలాపతి బయటకు తీసుకొచ్చే సరికి మధ్యాహ్నం రెండయింది. అతనికి ఇంకా స్పృహ రాలేదు.
"మీరు అదృష్టవంతులు, ఆపరేషన్ సక్సెస్ అయిందట" అన్నాడు శ్రీకాంత్ డాక్టర్లతో మాట్లాడి వస్తూ.
ఆ మాట వింటూనే సావిత్రి ముఖం కళకళ లాదిపోయింది!
"స్పృహలో కేప్పుడోస్తాడట?"
"బహుశా సాయంత్రానికల్లా మాట్లాడగలుతాడు."
"అలాగయితే నేను ఇక్కడే కూర్చుంటాను. మీరు వెళ్ళి భోజనం చేసి రండి."
"మరి మీ సంగతేమిటి?"
"నాకసలు ఏమి తినాలనిపించడంలేదు!"
"పోనీ ఓ పని చేయండి. యిక్కడికి దగ్గరలో ఓ హోటలుంది. అక్కడ కాఫీ ఫలహారమయినా తీసుకొని వద్దురుగానీ రండి."
"మరి అయన దగ్గర........"
"ఆ నర్సు ఎలాగూ ఉంటుంది! ఎంత, మనం పావుగంటలో వచ్చేయవచ్చు మళ్ళీ" కాదనలేకపోయింది సావిత్రి.
అనుకున్నట్లే పావుగంటలో తిరిగొచ్చేశారిద్దరూ. సాయంత్రానికి చలపతిలో చలనం కలిగింది. నెమ్మదిగా కళ్ళు విప్పి చూశాడు. సావిత్రి, శ్రీకాంత్ నీ చూసి చిన్నగా నవ్వాడు.
"ఇప్పుడేమీ మాట్లాడకు, బాగా విశ్రాంతి తీసుకో" అన్నాడు శ్రీకాంత్.
మరి కాసేపట్లో మళ్ళీ నిద్రలో మునిగిపోయాడతను.
ర్రాత్రి బాగా పొద్దుపోయాక ఇంటికి బయల్దేరాడు శ్రీకాంత్.
"మీరు దయచేసి రేపు తెల్లారుజామున ఓసారి రాగలరా?" అడిగింది సావిత్రి అతనితో గడప వరకూ వస్తూ.
"ఏమిటి పని?"
"నన్ను గుడికి తీసుకెళ్ళాలి!"
"సరే....."
ఆమె చలపతి మంచం పక్కనే కింద చాప పర్చుకొని పడుకొంది.
అంతకుముందు రెండు రాత్రులు నుంచీ నిద్రలేక పోవడంతో చెవిలో బిగ్గరగా వినిపించేవరకూ మెలకువ రాలేదు.
"బాగా అలసిపోయినట్లున్నారు!" నవ్వుతూ అన్నాడతను.
సిగ్గుపడిపోయింది సావిత్రి. దుస్తులు సవరించుకుని లేచి నుంచుంది. అప్పటికింకా పూర్తిగా తెల్లారలేదు. మసక చీకట్లు అలుముకునే ఉన్నాయ్.
"పదండి వెళదాం!" అంటూ నిద్రలో వున్న చలపతి వంక ఓసారి చూసి బయటకు నడిచింది.
ఇద్దరూ కారులో కూర్చున్నారు.
"ముందు యింటికెళ్ళలి! నేను స్నానం చేశాక గుడికి వెళదాం!" అంది శ్రీకాంత్ తో.
మాట్లాడకుండా కారు ఇంటివేపు నడపసాగాడతను. నిద్రలేకపోవడం చేత అతని ముఖంలో ఎంతో అలసట కనిపిస్తోంది. కళ్ళు రెండూ ఎర్రబడిపోయినాయ్.
తను కేవలం చలపతి విషయాలే చూసుకొంది! అతను అన్ని విషయాలు చూసుకోవాల్సి వచ్చింది. చలపతిని హాస్పిటల్లో చేర్చడం, డాక్టర్ లతో మాట్లాడటం, తనని ఇంటికీ , హాస్పిటల్ కి తిప్పడం - ఓ పక్క చలపతికేమవుతుందొన్న దిగులు. అతని సత్తువను పూర్తిగా హరించి వేసినాయ్.
శ్రీకాంత్ ని చూస్తుంటే అంతరాంతరాళ్లో జాలి పెల్లుబిక్కిందామెకి. అతని కున్న సమస్యలకు తోడు తనూ ఒకటి రెండుసార్లు అనుచితంగా ప్రవర్తించి అతని మనసు నొప్పించింది.
తమకి సహాయం చేయాల్సిన అవసరం లేకపోయినా, అంతగా ఆడుకొన్న అతన్నితనూ చలపతీ కలిసి నొప్పిస్తున్నారు. ఇంత కంటే హాస్యాస్పదం ఇంకేమయినా వుంటుందా? అతని ఆసరా, అండ లేకపోతే తనేమయిపోయేదీపాటికి! చలపతికి ఇంతమంచి వైద్యం జరిగేదా?
ఇంటిముందు కారపాడు శ్రీకాంత్.