కారు ఇంటివేపు నడపసాగాడు శ్రీకాంత్. చలపతి మాట్లాడటం మానివేశాడు. అతని భయం పెరిగిపోతున్నట్లు గమనించాడు శ్రీకాంత్.
ఇంటికి చేరేవరకూ ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. గార్డెన్ లో కుర్చీల్లో కూర్చుండిపోయారు చాలాసేపు. చాలా భయంకరంగా ఉందా ఆ మౌనం.
"ఇంక పడుకుంటాను!" అన్నాడు చలపతి లేచి నిలబడుతూ.
"ఒకే! కారీ అన్......." తను లేవకుండా అన్నాడు శ్రీకాంత్. సావిత్రీ చలపతి లోపలి కెళ్ళిపోయారు.
సావిత్రికి దూరంగా పడుకొన్నాడు చలపతి.
"గుడ్ నైట్ సావిత్రీ!" అన్నాడు దుప్పటి కప్పుకుంటూ. అతని ప్రవర్తనకి సావిత్రి ఆశ్చర్యపోయింది. ఆమె క్కూడా భయం వేస్తోందతన్ని చూస్తుంటే.
తెల్లారిపోయింది ముగ్గురికి నిద్ర లేదా రాత్రి.
హాస్పిటల్ కెళ్ళాడానికి సిద్దమయ్యాడు. సావిత్రి ఎలా ప్రయత్నించినా దుఃఖం ఆపుకోవడం సాధ్యం కావడం లేదు. ఉండుండి ఉప్పెనలా విరుచుకుపడుతోంది దుఃఖం.
"ఇంక వెళ్దామా!" ఆ గదిలో కొస్తూ అడిగాడు శ్రీకాంత్.
"ఓ! నేను రెడీ! సావిత్రీ! వెళదామా మరి!" పిలిచాడు చలపతి.
దేముడి పటం ముందు నుంచుని దణ్ణం పెట్టుకొని చలపతి దగ్గరకొచ్చి నిలబడింది సావిత్రి.
"వెళ్ళే ముందు మీ ఇద్దరినీ ఓ కోరిక కోరుతున్నాను........" అన్నాడు చలపతి.
సావిత్రి ముఖం పాలిపోయింది.
ఇద్దరి చేతులూ అందుకొన్నాడు చలపతి.
"మీ ఇద్దరి చేతులు నా సమక్షంలో కలపండి! నేను తిరిగి రాకపోతే ఈ బంధమే మీకు శాశ్వతం కావాలి!"
వాళ్ళ చేతులు తన చేతిలో కలుపుతూ అన్నాడు చలపతి. బొమ్మలా తమ చేతుల్ని అతని అధీనంలో ఉంచారు శ్రీకాంత్, సావిత్రీ.
చలపతీ కళ్ళ వెంబడి బొటబొటా నీళ్ళు కారిపోయినాయ్.
"నాకంటే అదృష్టవంతుడెవరూ ఉండర్రా శ్రీకాంత్! అనుకొన్నదల్లా నెరవేరే అదృష్టం ఎంతమంది కుంటుందో నువ్వే చెప్పు ......." అన్నాడు దుఖం అపుకొంటూ.
కారు హాస్పిటల్ చేరుకుంది. వెంటనే చలపతిని స్పెషల్వార్డులో ఎడ్మిట్ చేసుకొన్నారు. మధ్యాహ్నం పన్నెండింటి వరకూ అక్కడే గడిపారు శ్రీకాంత్, సావిత్రీ!
"పదండి! మనం ఇంటికెళ్ళి భోజనం చేసివద్దాం!" అన్నాడు శ్రీకాంత్ సావిత్రితో.
"నాకేమీ తినాలని లేదు!" అంది సావిత్రి.
"అలాగయితే నేనూ ఏమీ తినను సావిత్రీ! హంగర్ స్త్రయిక్ చేస్తాను!" అన్నాడు చలపతి. గత్యంతరం లేక శ్రీకాంత్ తో పాటు బయల్దేరింది సావిత్రి. చలపతి క్కావలసిన పళ్ళూ, రొట్టి వగయిరాలన్నీ ముందే ఏర్పాటు చేశాడు శ్రీకాంత్.
శ్రీకాంత్ తో ఆ ఇంట్లో అడుగు పెట్టాలంటే బాధ కలుగుతొందామెకి. ఉదయం చలపతి తామిద్దరి చేతులు కలిపినా సంఘటన ఇంకా మర్చిపోలేదు . అది గాయంలా సలుపుతోంది మనసుని. తనలో శ్రీకాంత్ ప్రియురాలి పోలికలున్నాయట! ఎంత దురదృష్టం! ఆ ఆలోచనే అసహ్యంగా ఉంది తనకి.
శ్రీకాంత్ భిజనం వడ్డించి అతన్ని లోపలికి పిలిచిందామె. టేబుల్ ముందు కూర్చుని ఒక్క ప్లేటే ఉండడం చూచి "మరి మీకు" అంటూ అడిగాడు శ్రీకాంత్.
"నేను తర్వాత తింటాన్లెండి."
అసలు భోజనం చేయదేమో అన్న అనుమానం కలిగింది శ్రీకాంత్ కి.
"చూడండి, మ,ఈ విషయాలన్నీ చూస్తూ వుండమని చెప్పాడు చలపతి! దయచేసి మీరు కూడా భోజనం చేయండి!" నెమ్మదిగా అన్నాడు.
ఆ మాట వింటూనే మరింత బాధపడిపోయింది సావిత్రి. తన విషయాలు చూస్తూండమని చలపతి చెప్పాడట! అంటే ఇప్పటి నుంచే తన భర్తగా వ్యవహరించవచ్చుననుకొంటున్నాడెమో ! చీ! మగాళ్ళ బుద్దులే ఇంత!
"నా విషయాలు నేను చేసుకోగలను లెండి. మీరు త్వరగా కానిస్టే నేను తింటాను........" కొంచెం కోపంగా అందామె.
శ్రీకాంత్ లోలోపలే నొచ్చుకున్నాడు. అదేమీ బయటికి తెలీనీకుండా భోజనం అయిందనిపించి బయటకు నడిచాడు. మరికొద్ది సేపటి తర్వాత తనూ నాలుగు మెతుకులు ఎంగిలి పడి ప్లాస్కులో హార్లిక్స్ తీసుకొని తలుపులన్నీ మూసి వేసి బయటకొచ్చిందామె.
తాళాలు వేశాక ఇద్దరూ కార్లో బయలుదేరారు. హాస్పిటల్ చేరుకునేసరికి చలపతి పక్కనున్న పేషెంట్ తో అతని జబ్బు గురించి మాట్లాడుతున్నాడు.
ఆ రాత్రి సావిత్రి అక్కడే ఉండిపోయింది.
"నేను రేపు ఉదయమే వస్తాను......." అని ఇద్దరికీ చెప్పి వెళ్ళిపోయాడు శ్రీకాంత్.
ఉదయమే లేచి హోటల్నుంఛీ కాఫీ ఫలహారాలు తీసుకుని మళ్ళీ చలపతి దగ్గరకు చేరుకున్నాడు.
"ఏరా! వచ్చావా? అసలు రాత్రి నిద్రపోయావా? నా ముఖంలె! మీ ఇద్దరినీ నానా అవస్థా పెట్టేస్తుంటే ఇంక మీరు నిద్రకేం నోచుకుంటారు! సావిత్రి కూడా తెల్లార్లూ అలా కుర్చీలో కూర్చునే వుంది. ఇంకో రోజు ఓపిక పట్టండి బ్రదర్! అపరేషనట గదా! అటో ఇటో తేలిపోతుంది! అన్నాడు చలపతి.
కాసేపు కూర్చున్నాక ఇంటికి బయల్దేరాడు శ్రీకాంత్.
"మీరు కూడా ఇంటికి రారాదూ? స్నానం అదీ ముగించి వద్దురు గానీ......"
చలపతి తో చెప్పి శ్రీకాంత్ తో పాటు బయల్దేరింది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోతుంటే కనుమరుగయ్యే వరకూ రెప్పలు వాల్చకుండా చూశాడు.
చలపతి ఇంటిదగ్గర రాజ్యలక్ష్మి కూర్చుని ఎదురు చూస్తుంది. నర్సరాజు పంపాడుట! చలపతి హాస్పిటల్లో వున్న నాలుగు రోజులు ఆ ఇంటిదగ్గరే వుండి సహాయం చెయ్యాలని వచ్చిందట! స్నానం ముగించి వంట ప్రయత్నం మొదలెట్టింది సావిత్రి.
రాజ్యలక్ష్మి కూడా ఆమెకు సహాయం చేయసాగింది.
శ్రీకాంత్ తన గదిలో నుంచి చాలాసేపు బయటకు రాకుండా గడిపాడు. మధ్యలో సావిత్రే కాఫీ తయారుచేసి తీసుకొచ్చి అతనిముందుంచి వెళ్ళిపోయింది.
కాఫీ తాగిన కాసేపటికి కుర్చీలోనే నిద్రపోయాడు శ్రీకాంత్. మెలుకువ వచ్చేసరికి బాగా ఆలస్యమయిపోయింది. టైం పన్నెండున్నర అవుతోంది. లేచి వంటింటి వేపు నడిచాడతను. సావిత్రి కనిపించలేదక్కడ. ఆమె గదిలోకి వెళ్ళి చూశాడు. అక్కడా కనిపించలేదు.
ఆశ్చర్యంతో ఇల్లంతా చూసాడతను. చివరకు తన గదిలో బల్ల మీద ఆమె వుంచిన చీటీ కనిపించింది!
"మీరు మంచి నిద్రలో ఉన్నారు. నిద్రాభంగం చేయడం ఇష్టం లేక నేనే హాస్పిటల్ కెళ్ళిపోతున్నాను. రాజ్యలక్ష్మి వాళ్ళింటి కెళ్ళింది. మళ్ళీ సాయంత్రం వస్తుంది. మీకు భోజనం టేబుల్ మీద వుంచాను -సావిత్రి."
చాలాసేపు అక్కడే నిలబడిపోయాడు శ్రీకాంత్! ఆమె తననెందుకు లేపలేదు! తనతో మాట్లాడటమే చికాకుగా వుందా చలపతి చేసిన పనులకి తనెలా బాధ్యుడవుతాడు? ఒకవేళ తనూ ఆమెని కాంక్షిస్తున్నాడని అనుకోంటోందేమో!
తన మనస్తత్వం ఆమె ఇంకా గ్రహించలేదు. చలపతికి మాట ఇచ్చాడు తను. నిజమే కాని చలపతి ఎలాంటి అపాయమూ లేకుండా బయట పడతాడన్న నమ్మకం ఉండబట్టే అలాంటి హామీ ఇచ్చేడు. సావిత్రి కూడా అలాంటి పరిస్థితుల్లోనే వప్పుకోందన్న నమ్మకం కూడా తనకుంది. అలా ఒప్పుకున్నందువల్ల ఆమెకు చలపతి మీద ప్రేమ లేదని తను అంచనా వేయలేదు.
భోజనం చేసి కారులో హాస్పిటల్ చేరుకున్నాడు శ్రీకాంత్. చలపతి అప్పుడే భోజనం చేస్తున్నాడు! అతనిని చూడగానే సావిత్రి లేచి నిలబడింది. ఆమెతో చలపతి ఎదురుగా ఆ విషయం మాట్లాడదల్చుకోలేదు శ్రీకాంత్.