Previous Page Next Page 
ఈనాటి శకుంతల పేజి 23

    "మా అమ్మమ్మ అంటే....."    
    "అయితే అమ్మమ్మా అని పిలువు."    
    రాజవల్లి కి దగ్గర ఎనభై ఏళ్లుంటాయి. అయినా ఆరోగ్యం గానే ఉంది. కాళ్ళు నొప్పులు తప్ప మరేబాధలూ లేవు. ఆ వయసులో కూడా అతి చాకచక్యంగా తన ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ తానే చూసుకుంటుంది.    
    దాసీలు శకుంతల కొక గది సిద్దంచేశారు. శకుంతల కోసం ప్రత్యేకించి ఒక దాసీని కుదిర్చింది రాజవల్లి. దాని పేరు శామీ! శ్యామల పేరుకి అపభ్రంశరూపం కాబోలు! మాటలో కొంచెం యాస ఉన్నా శామీ చూడడానికి నాగరికంగానే ఉంది. పరికిణీ ఓణి వేసుకుంది. మెళ్ళో నల్లపూసలున్నాయి. మొగుడు "దేశం వెళ్ళిపోయాడట! కథ విషాదంగా ఉన్నా చెప్పే తీరుకి నవ్వుకొంది శకుంతల. శకుంతల శ్రద్దగా వినటం చూసి, శామీ మరింత హుషారుగా చెప్పసాగింది. తను మళ్ళీ మారుమనువు చేసుకో వచ్చట! కానీ అందుకు తప్పు కట్టాలిట! అందుకే తమ పల్లెలోంచి బయటికొచ్చి పని చేస్తోందట! ఇదివరలో తమ అడంగు లెవరూ అడవులలో గ్రామాలు వాదిలి బయటకు వచ్చేవారు కాదట! ఇప్పుడిప్పుడు పనుల కోసం వస్తున్నారుట! తమ ఆడవాళ్ళూ, మొగవాళ్ళూ చాలామంది ఫ్యాక్టరీలలో పని చేస్తున్నారట!    
    ఫ్యాక్టరీల సైరన్ రొదలు తప్ప మిగతా కాలమంతా ఆ టౌన్ నిద్రపోతున్నట్లు ఉంటుంది. రాజవల్లి గారి పెద్ద దివాణంలాంటి భవనం కాక- అక్కడ మరో రెండు ఆధునిక పద్దతిలో కట్టిన మేడలున్నాయి. అని ఫ్యాక్టరీల మేనేజింగ్ పార్టనర్స్ వట! కొత్తగా కట్టిన సినిమా హాల్లోంచి మొదటి ఆటకూ, రెండో ఆటకూ ముందు పాత సినిమాపాటలు తెలుగువీ, హిందీవీ వినిపిస్తుంటాయి.    
    రాజవల్లి శకుంతలను దగ్గిర కూచోపెట్టుకొని, విమల గురించీ, అనసూయ గురించీ, శకుంతల ఇతర స్నేహితుల గురించీ ప్రశ్నలు వేస్తోంటే శకుంతల సమాధానం చెప్తోంది. ఆ సమయంలో వచ్చాడు రమేష్.    
    అతడు శకుంతలను చూసి తెల్లబోయాడు. శకుంతల భయంతో వణికింది. రాజవల్లికి మరింత దగ్గరగా జరిగింది.    
    "భయపడకమ్మా! ఇతడు మన ఫ్యాక్టరీలకు కూలీలను సప్లయ్ చేసే ఏజంటు. మన చేతికింద బతికే మనిషికి మనం భయపడక్కర్లేదు" అంది రాజవల్లి.    
    ఈడ్చి కొట్టినట్లయింది రమేష్ కి. అతడి ముఖం పాలిపోయింది. శకుంతలకి చాలా ఆనందం కలిగింది.    
    "అమ్మా! శకుంతల నీకు....."    
    ఏదో చెప్పబోతోన్న రమేష్ కి అడ్డుపడి విదిలిస్తున్నట్లు__ "ఆ కథలన్నీ మేం విన్నాం లేవయ్యా" అంది. బిక్కముఖం వేసుకు నిలబడ్డాడు రమేష్.    
    అతడిని అలా చూడటం శకుంతలకు చాలా ఆనందంగా ఉంది. మనవరాలి ఆనందం చూసి రాజవల్లికి మరింత హుషారు వచ్చింది.    
    "మనవడుగారికి వీలయినంత త్వరలో బయలుదేరి రమ్మని ఉత్తరం వ్రాయండి."    
    "మనవడుగారా!"    
    "అవునండీ! శ్రీధర్ శర్మగారు! పెద్దదాన్నయి పోతున్నాను. ఈ వ్యవహారాలన్నీ బాధ్యతగల మనిషికే అప్పగించాలి!"    
    ఆ మాటలు విన్న రమేష్ ముఖం చూస్తోంటే - శకుంతలకు చప్పట్లు కొట్టి నాట్యం చెయ్యాలనిపించింది. కృతజ్ఞతా సూచకంగా రాజవల్లి వళ్ళో తలపెట్టి పడుకుంది. రమేష్ తనను తను నిగ్రహించుకొని మామూలుగా "చిత్తం" అని వెళ్ళిపోయాడు.    
    రాజవల్లి రమేష్ ని నమ్మి ఊరుకోలేదే తను వేరుగా శర్మకు ఉత్తరం వ్రాయించింది.    
    శర్మ రాలేదు కానీ, వెంటనే ఉత్తరం వ్రాశాడు. తన తల్లికి జబ్బుగా ఉందనీ వీలయినంత త్వరలో వస్తాననీ, అందులో శకుంతలకు వేరుగా ఉత్తరం పెట్టాడు.    
    "బేబి!    
    నువ్వు రాజవల్లినగర్ వెళ్ళావన్న విషయం గర్ల్ గైడ్స్ ద్వారా విని ఆశ్చర్యమూ, ఆనందమూ కలిగాయి. నా బేబీ ఎంత త్వరలో ఎంత పెద్దదయిపోయింది? బేబీ! స్వతంత్రించి నిర్ణయాలు తీసుకోవటానికి సాహసమే కాక, ఆలోచన కూడా ఉండాలి. అది మరచిపోకు, త్వరలో నీ దగ్గరికి వస్తాను. నీ ఆనందాన్ని చూసి ఆనందిస్తాను!   
                                                                                                         ఉంటాను.   
                                                                                                         నీ డాడీ!"   
    ఆ ఉత్తరంలో స్పష్టంగా లేకపోయినా శర్మ నొచ్చుకున్నట్లు లీలగా తోచింది శకుంతలకి వెంటనే తను రాసింది.    
    "డాడీ!    
    నేను ఇక్కడికి ఆలోచించి రాలేదు. సాహసించి అసలు రాలేదు. ఒక షాక్ లో వచ్చాను. అవన్నీ తరువాత చెప్తాను. మీరు వెంటనే ఇక్కడికి రావాలి! పోనీ, నేనే అక్కడికి వచ్చెయ్యనా? నన్ను నానమ్మ  తిడితే, నేను ఏడిస్తే, మీరూ ఏడవకూడదు మరి! బైదిబై! ఇక్కడొక బూచీ ఉన్నాడు డాడీ. మీకూ నాకు తెలిసిన బూచాడే! వాడిని చూస్తే నాకు చాలా భయం! కానీ, అమ్మమ్మ వాడికి భలే బుద్ది చెపుతుంది. అప్పుడు వాడి ముఖం మీరు చూసి తీరాలి. వస్తున్నారా?
    
                                                                                                  మీ బేబీ."
    
    ఆ ఉత్తరానికి తిరుగుటపాలో వచ్చాడు శర్మ. శర్మను చూడగానే "డాడీ!" అంటూ పరుగున అతడి దగ్గరకు వెళ్ళింది శకుంతల. ఆనందముతో వెలిగిన శకుంతల ముఖాన్ని చూసి రాజవల్లి ఆనందించింది. అక్కడ ముఖం మాడ్చుకొని నిలబడింది రమేష్ ఒక్కడే! ఎలాగైనా శకుంతలను తన ఆధీనంలోకి తెచ్చుకోవాలనే పట్టుదల లేకపోతే, అతనక్కడ నిలవగలిగేవాడు కాడు. శర్మకు అక్కడ జరుగుతున్న మర్యాదలు, లభిస్తున్న ఆదరణా అతడి కెంత కంటకంగా ఉన్నా, మనసు నెంత కోస్తున్నా - అక్కడనుంచి కదలలేక పోయేవాడు.    
    "మనవడుగారూ! శకుంతల ఎప్పటినుండో మన ఫ్యాక్టరీలు చూడాలని ముచ్చటపడుతోంది. పసిపిల్లను ఒక్కదాన్నీ పంపటం ఇష్టం లేక ఇన్నాళ్ళూ పంపలేదు. అమమయికి దగ్గరుండి అన్నీ చూపించండి. రెండు ఫ్యాక్టరీల మేనేజర్లకీ ఫోనులు చేయించాను" అంది రాజవల్లి. అప్పుడు రమేష్ కూడా అక్కడ ఉన్నాడు. అతడిప్పుడు ఎక్కువకాలం రాజవల్లిగారింట్లోనే ఉంటున్నాడు. పాతకాలపు దివాణం అలవాట్లుపోని ఆ ఇంట్లో అతడికి తిండికి లోటులేదు.    
    శకుంతలా శర్మలతో రమేష్ కూడా బయల్దేరబోతోంటే, "ఆగండి" అంది రాజవల్లి. రమేష్ కనుబొమలు చిట్లించి చూశాడు. కానీ, ఆగిపోయాడు. అతడి చికాకు చూపులు రాజవల్లి లక్ష్యపెట్టలేదు.

 Previous Page Next Page