"నేను మీతో వచ్చేస్తాను." వాళ్ళు నవ్వారు.
"మీ ముత్తవ్వగారు రాజవల్లిగారు. రాజవల్లినగర్ లో ఉన్నారు. ఆవిడకి నువ్వంటే చాలా ప్రేమ. అక్కడికి వెళతావా?"
"నన్ను ప్రేమించేవాళ్ళు ఉన్నారా?"
"ఉన్నారు. ఒకరు కారు, చాలామంది నువ్వు అధైర్యపడకు రాజవల్లి నగర్ కి వస్తావా?"
"వస్తాను."
వాళ్ళలో ఒకమ్మాయి చిరునవ్వుతో "మమ్మల్ని నమ్మి వెంటనే బయలుదేరావు. మేము నిన్ను మోసం చేస్తే ఏం చెయ్యగలవు?" అంది,
శకుంతల వెల వెలపోయింది.
"ఇది మొదటి పాఠం - నేర్చుకో! ఎప్పుడూ అవతలి వాళ్ళను పూర్తిగా నమ్మకూడదు. నమ్మనట్లు తెలియనీయకూడదు. ఎప్పుడూ నీ జాగ్రత్తలో నువ్వుండాలి. మేము నీ స్నేహితుల మనటానికి ఆధారం ఇదిగో!"
బంగారు గొలుసు- బంగారు లాకెట్ తో చిన్నప్పుడు తన మెడలో వుండేది. లాకెట్ లో రవ్వలు పొదిగివున్నాయి. అది చాలా ఖరీదైనదని ఇప్పుడు శకుంతలకు తెలుసు.
"ఇంత ఖరీదైన వస్తువు నీ కిస్తున్నాం కనుక మేము దొంగలము కాము."
"ఈ గొలుసు మీ కెలా వచ్చింది.
"మీ అమ్మ ఇచ్చారు. నువ్వు బయటకు వచ్చాక-నీకు ఆనవాలుగా చూపమని!"
"అమ్మా! ఎక్కడుంది ఇప్పుడు?"
"ఇప్పుడెక్కడున్నారో, మాకూ తెలీదు. ఈ గొలుసు ఆవిడ మా కిచ్చి చాలా రోజులయింది. శర్మగారింట్లో ఉండే రోజులలోనే ఇచ్చారు."
"కానీ.....నేను మిమ్మల్నెప్పుడూ చూడలేదే?"
"మేము మీ ఇంటికి రాలేదు. మీ అమ్మే మా దగ్గిరకి వచ్చేవారు."
"మీ రెక్కడ ఉంటారు?"
"అది ఇప్పుడు చెప్పవలసిన అవసరం లేదు. మేమూ నిన్ను పూర్తిగా నమ్మలేము. నువ్వూ మమ్మల్ని నమ్మవలసిన అవసరం లేదు. నీ నిర్ణయాలు నువ్వు తీసుకోగల వయసూ, అనుభవమూ ఉన్నాయి నీకు!"
"ఒక్కమాట చెప్పండి! అమ్మ బతికి ఉందా?"
"అది కూడా మాకు తెలీదు!"
"పదండి నేను మీతో వస్తాను!"
"మాతో రావటానికి వీల్లేదు - కావాలనుకుంటే, నిన్ను రాజవల్లి నగర్ లో మీ ముత్తవ్వగారి దగ్గిర దింపుతాము."
"రాజవల్లి నగర్ కె తీసికెళ్ళండి."
"మాతో రా!"
అప్పుడు చూసింది శకుంతల-వాళ్ళిద్దరూ సైకిల్స్ మీద వచ్చినట్లు.
"నేనిక్కడ ఉంటానని మీ కెలా తెలిసింది?"
"మాకు దివ్యదృష్టి ఉంది." ఒకమ్మాయి నవ్వింది.
"నువ్వు హోంలోంచి బయటపడి నప్పటినుంచీ - నిన్ను అనుసరిస్తూనే ఉన్నాము, మీ నాయనమ్మగారు నిన్ను ఎప్పటిలా ఆదరంగా చూసి ఉంటే- మేము మా దారిన వెళ్ళిపోయి ఉండేవాళ్ళం!"
"మీకా సంగతులన్నీ ఎలా తెలిసాయి?"
"మీ ఇంట్లో పనిమనిషికి మే మిచ్చిన రెండు రూపాయలు చెప్పాయి!"
"ఓ!" ఏదో అద్భుత లోకంలో ఉన్నట్లుగా ఉంది శకుంతలకు.
వాళ్ళిద్దరూ టికట్ కొని శకుంతలను ట్రైన్ లో ఎక్కించారు.
"మీరు రారా?" అంది శకుంతల భయంగా.
"అలా భయపడకూడదు. ఈ ట్రెయిన్ తిన్నగా రాజవల్లి నగర్ చేరుకుంటుంది. అక్కడ రెండు నిముషాలకంటే ఆగదు. ఆ స్టేషన్ లో మాలా డ్రెస్ చేసుకున్న అమ్మాయి నిన్ను మీ ముత్తవ్వగారి ఇంటికి తీసికెల్తుంది!"
"థాంక్యూ మీరు నాకు ఇంకో సాయం చెయ్యాలి. నేను ఇలా రాజవల్లి నగర్ వెళ్ళినట్లు మా డాడీకి ఇన్ ఫాం చెయ్యండి-లేకపోతే వర్రీ అవుతారు."
"అలాగే!"
ట్రెయిన్ కదిలింది. వాళ్ళు కనపడుతున్నంతవరకూ చెయ్యి ఊపుతోనే ఉంది శకుంతల.
15
శకుంతలను చూడగానే ఆదరంగా రెండు చేతులూ జాపింది రాజవల్లి.
"రా తల్లీ! ఎన్నాళ్ళకు చూస్తున్నాను నిన్ను?"
ఆ పరిసరాలను వింతగా చూస్తోంది శకుంతల.
రాజవల్లి దగ్గిరగా వచ్చి నమస్కారం చేసి ఆవిడ తలమీద ముద్దు పెట్టుకుంటే, నర్వస్ గా కదిలింది.
"నాకు మీ రసలు గుర్తులేదు. నేను శకుంతలానే అని ఎలా గుర్తుపట్టారు?"
"మీ నాన్న నీ సంగతులు ఎప్పటికప్పుడు నాకు రాస్తూనే ఉన్నాడమ్మా! ప్రతి పుట్టిన రోజుకీ నీ ఫోటో నాకు అందుతోనే ఉంది. కళ్ళతో చూడకపోయినా, రోజు రోజుకీ నువ్వెలా ఎదుగుతున్నావో నాకుతెలుసు."
"ఏ నాన్న?" అప్రయత్నంగా అడిగేసింది. ఆ మాటలు నోటి నుంచి బయటకు రాగానే శకుంతలకే ఎలాగో అనిపించింది. తల వాలిపోయింది.
"మీ అసలు నాన్న - మనవడుగారు-శర్మగారు-ఉత్తముడమ్మా, ఆయన! ఈ ముసలిదాని గుండెలల
శోకం అర్ధం చేసుకున్నాడు. ఉత్తరాలతో ఓదార్చేవాడు. మన కుటుంబంమీద ఇంత ఆపద విరుచుకు పడుతుందని అనుకోలేదు. మీ అమ్మను తలుచుకొంటే, జాలితో గుండె తరుక్కుపోతుందమ్మా! ఆనాడు - అంత అకస్మాత్తుగా ఎందుకు వెళ్ళిపోయిందో ఇప్పుడర్ధమవుతోంది."
రాజవల్లి మాటలు శకుంతలకు కొన్ని అర్ధమయ్యాయి. కొన్ని అర్ధం కాలేదు. కానీ, ఆవిడ తన తల్లిని అపరిమితంగా ప్రేమిస్తోందని మాత్రం అర్దమయింది. ఆ కారణం చేత ఆవిడ అంటే అభిమానం కలిగింది.
"నేను మిమ్మల్ని ఏమని పిలవను?"
"మీ పెద్దవాళ్ళందరిలో నీ కెవరంటే ఎక్కువ ఇష్టం?"