Previous Page Next Page 
ఆనందోబ్రహ్మ పేజి 23

                              4
   
    పదోరోజు అయ్యాక బంధువులు బట్టలు సర్దుకోవటం ప్రారంభించారు. ఉన్న మనిషి పోయిన విషయం అపుడపుదే మర్చిపోతున్నారు. కబుర్లు ప్రారంభమయ్యాయి. పిల్లల అల్లరి సరేసరి. హాస్యోక్తులు కూడా మొదలయ్యాయి.
   
    గాజులు బ్రద్దలు కొట్టడానికి భార్య లేదు. బాధపడే కొడుకు చాలా కాలం క్రితమే పోయాడు. సోమయాజి చిన్నవాడు. ఇంకెవరున్నారు?
   
    అకస్మాత్తుగా అక్కడి కెవరయినా తెలియనివారు వస్తే వారికి అది పదోరోజు కర్కో, పదిమంది చేరిన పండగో అర్ధంకాదు. అలావుంది అక్కడ పరిస్థితి. కొంతమంది పెళ్లి సంబంధాల గురించి చర్చిస్తున్నారు. వీరేనా మొన్న గుండెలు బాదుకుని ఏడ్చింది అన్న అనుమానం వస్తుంది.
   
    సోమయాజి ఏడవలేదు. అతడి కంట నీటిచుక్క రాలలేదు. కానీ గుర్తుతెచ్చుకునేవాడు. ఇది రోజుల బాధ కాదు. నెలల తరబడి, సంవత్సరాల తరబడి వుండేబాధ. ముందు తక్కువ వుండి తర్వాత ఎక్కువయ్యే బాధే నిజమైన బాధ. ప్రొద్దున్నపూట నీడలా తక్కువయ్యేది బాధ కాదు.
   
    అతడికి రాత్రిళ్ళు నిద్రపట్టేది కాదు. అప్పుడప్పుడు పక్కగదుల్లోంచి పెద్దల గుసగుస వినిపించేది.
   
    చివరికి పదకొండో రోజు అది బ్రద్దలై బైటపడింది.
   
    "వెళ్లినాయన ఏమీ చెప్పకుండా వెళ్లిపోయాడు. రాతకోతలు అసలే లేవు. ఉన్నది పొలమూ, ఇల్లూ ఎం చేద్దాం?" అని అడిగాడు పెద్దల్లుడు. చాలా మామూలుగా, ఇది సాధారణమైన విషయంలా.
   
    మామూలుగా మాట్లాడుతున్న వాళ్ళందరూ ఒక్కసారిగా మౌనం వహించారు. కానీ ఆ ప్రసక్తి వచ్చేసరికి ఉద్వేగం కనబడింది.
   
    "చెట్టంత పెద్దమనిషే వెళ్లిపోయినప్పుడు, ఈ చిన్న ఆస్థులు లెక్క ఏమిటి నాయనా" అన్నాడు మూడో అల్లుడి తండ్రి. ఈ మూడో అల్లుడే ప్రస్తుతం అక్కడ వుండి పొలం విషయాలు చూస్తున్నాడు. ఏదీ నిశ్చయమవకుండా ఇప్పటిలాగే సాగిపోతే అతడు ఆ పొలాన్ని చూసుకుంటూ వుండిపోవచ్చు నెమ్మదిగా భుక్తం చేయవచ్చు.
   
    "అయినా పదో రోజునే చర్చ ఏమిటి?" అన్నాడు రెండో అల్లుడు అతడు కూడా మూడోవాడితో కలిసి గ్రామంలోనే వుంటాడు. నిజానికి వారిద్దరూ ఎనిమిదోరోజు రాత్రే ఈ విషయం గురించి మాట్లాడుకుని, దున్నేవాడిదే భూమి అన్న నిర్ణయానికి వచ్చారు.
   
    "అవును ఇవన్నీ ఇప్పుడే చర్చిస్తే ఆయన ఆత్మ క్షోబిస్తుంది......" అన్నాడు రెండో అల్లుడి తండ్రి. అందరూ ఆయన మాటవైపు మొగ్గటం చూసి నాలుగోవాడు కదిలాడు. అందర్లోకి అతడే తెలివైనవాడు. ఎక్కడో దూర ప్రదేశంలో వుంటాడు. ఎంత దొరికితే అంత విభజించి పట్టుకుపోదామని చూస్తున్నాడు. దీనికోసం మళ్ళీ ఇంతదూరం రావటం ఇష్టంలేదు. ఇప్పుడు తను మాట్లాడకపోతే ఈ వ్యవహారం ఈ రోజు తేలిపోదు బ్రహ్మాస్త్రం వేశాడు.
   
    "ఇంటికీ, పొలానికీ పత్రాలు లేవని మీరే అంటున్నారాయె. ఉన్న ఒక్క వారసుడూ సోమయాజే! ఆడపిల్లలు ఎలాగో సర్దుకుపోవచ్చు. తల్లీ తండ్రీ లేని కుర్రవాడు ఏదో ఒక పత్రం వ్రాసి అతడి కిచ్చేస్తే సరిపోతుంది".
   
    తన మాటలు అక్కడి వారిమీద పిడుగుపాటులా పనిచేస్తాయి అని అతడికి తెలుసు. దాంతో వాళ్ళు తమ నిర్ణయాల్ని మార్చుకుని వీలైనంత తొందరగా పంపకాలు మొదలుపెడతారని అనుకున్నాడు. అయితే తనకన్నా తెలివయినవారు అక్కడున్నారని అతడు వూహించలేదు. ఆ తెలివైనది అతడి పెద్ద వదిన. సోమయాజి పెద్దక్కయ్య.
   
    "ఏం నాయనా, నీ కూతురు భ్రమరాన్ని గానీ సోముడికిచ్చి చేద్దామనుకుంటున్నావా?" అంది. అందరూ ఘొల్లున నవ్వారు. కథ అటు తిరిగేసరికి అతడినోరు మూతపడింది.
   
    సోమయాజి ఇదంతా చూస్తున్నాడు. మొట్టమొదటిసారి మనుష్యుల్లోపల వుండే మరో మనుషుల్ని చూస్తున్నాడు వీరేనా తాతయ్య వస్తూంటే తలుపు పక్కన ఒదిగి ఒదిగి నిలబడినవారు? వీరేనా తాతయ్య ముందు తలెత్తటానికి కూడా భయపడినవారు? అతడికి కాకులు జ్ఞాపకం వచ్చినాయ్. పిండాన్ని చిద్రం చేసి తిన్న కాకులు.
   
    కృష్ణుడు రవ్వంత స్వార్ధపూరితుడయ్యేసరికే తాతయ్య ఆ రోజు అంత బాధపడ్డాడే! ఈ రోజు ఈ తన మనుష్యుల్ని గమనించి ఆయన ఆత్మ ఎంత క్షోభిస్తుందో!!
   
    ఆయన ఆ రోజు చెప్పిన మాటలు నిజమే.
   
    ఆయన (మొదటి) తరం తమ్ముళ్ళ కోసం కూడా త్యాగం చేసింది. కృష్ణుడి (రెండో) తరం 'తన కుటుంబం' వరకూ వచ్చి యుగసంధిలో ఆగింది. ఈ (మూడో) తరం పక్కవాడి ఆస్థికూడా కబళించాలానే ప్రయత్నంలో ఉంది.
   
    అతను ఆలోచనల్లో వుండగానే ఆఖరి అల్లుడు కదిలాడు. "సోమున్ని మాతోపాటు తీసుకుపోతాము" అన్నాడు. అక్కడ సూదిపడితే వినిపించేటంత నిశ్శబ్దం వ్యాపించింది.
   
    "అవును, ఎలాగూ వచ్చే సంవత్సరంతో అతని చదువు ఇక్కడ అయిపోతుంది. పై చదువులకి వేరే పట్నం పోవటం ఎందుకు? మాతో వచ్చేస్తాడు. ఇక ఆస్థి అంటారా? అది అతగాడు పెద్దయ్యాక చూసుకుందాం" అన్నాడు. అతగాడు అంత అలా ముందుకొచ్చేసరికి అందరూ తాత్కాలికంగా పట్టు సడలించుకున్నారు.
   
    రెండో కూతురు కల్పించుకుని, "పండగలకీ పబ్బాలకీ అందరూ ఇక్కడికి రావొచ్చు. పురుళ్ళ ఖర్చు ఎలాగూ ప్రతీ సంవత్సరమూ వుండనే వుంటుంది" అంది ఆ ఖర్చులన్నీ మేమే భరిస్తాం అన్నట్టు ధ్వనిస్తూ.
   
    "సోముడి ఖర్చు  నిమిత్తం మేము ప్రతీనెలా ఒ పాతిక పంపిస్తాము అన్నయ్యగారూ" అన్నాడు రెండో అల్లుడు పెద్దవాడితో.
   
    అందరూ తొందర తొందరగా తమ తమకి వచ్చే లాభనష్టాల గురించి ఆలోచించారు. దీనికి ఒప్పుకున్నారు.
   
    సోమయాజి కేవలం శ్రోతే అయ్యాడు. పల్లెని వదిలిపోవటం అతడికి ఇష్టంలేదు. కానీ ఎవరూ అతడి అభిప్రాయం అడగలేదు.
   
    ఆ రోజు కూడా అతినికి నిద్ర పట్టలేదు. పక్కగదిలో చిన్న అక్కయ్య భర్తతో మాట్లాడే మాటలు వినపడ్డాయి.
   
    "అసలే పట్నంలో మనకి ఖర్చులు ఎక్కువంటే, మళ్ళీ వీడిని తీసుకుపోదామంటారేమిటండీ...."
   
    బావగారి నవ్వూ వినిపించింది. "పిచ్చి మొహమా! చంటిని బడికి తీసుకువెళ్ళటం నుంచీ కూరగాయలు తేవటం వరకూ ఒక కుర్రాడుంటే బావుండునని ప్రతిరోజూ సాధించేదానివిగా! నీ తమ్ముడు నీకు ఆ పాటి సాయం చేయడూ...."
   
    భర్త తెలివికి అబ్బురపోయినట్టు ఆమె కొద్దిసేపు మాట్లాడలేదు. కొంచెం సేపటికి తేరుకుని "మరీ పాతిక రూపాయలేమిటండీ బిచ్చమేసినట్టూ.....కనీసం యాభై అడగాల్సింది" అంది.
   
    సోమయాజి అక్కడినుంచి కదిలాడు. అతనిలో క్రోధమూ, ఉక్రోషమూ, వ్యధ, బాధలాంటి భావాలేమీ లేవు.
   
    చిరునవ్వుతో చిన్నక్కయ్య.....పెద్దతనంతో పెద్దక్కయ్య.....ముగ్ధగా మూడో వదిన.....అందరూ వస్తారట పండక్కి ఏ కవి వ్రాశాడిది? ఓ భావకుడా, నీ అంత మూర్ఖుడు ఈ ప్రపంచంలో మరొకడు వుండడోయీ.
   
    పిల్ల గోదావరి అతడిని నిశ్శబ్దంగా ఓదార్చింది. మల్లెపందిరి అతడికా ఆఖరి రాత్రి వీడ్కోలు యిచ్చింది.
   
    ఎద్దుల బండి కిర్రున కదిలింది.
   
    ఇరుగమ్మలు, పొరుగమ్మలు అతడి నిష్క్రమణాన్ని చూస్తున్నారు.
   
    ఇంటి ఎత్తరుగులు - ఇంటిముందు ఆటస్థలం .... అన్నిటికీ చూపుల్తోనే వీడ్కోలు చెప్పాడు.
   
    బండి కదిలింది.
   
    ఊరు దాటుతూంటే కృష్ణుడు రొప్పుకుంటూ వచ్చాడు. పంచె అంచు నుంచి పది రూపాయలు తీసి అతని చేతిలో పెట్టాడు. "ఊరుకాని ఊరు వెళుతున్నావు, ఇంతే వుంది. తీసుకో" అని కోరాడు.
   
    తాతయ్య పోయినప్పుడు రాలేదు. దహనం చేస్తూంటే రాలేదు. ఇప్పుడొచ్చినయ్ కన్నీళ్లు. తాతయ్య కృష్ణుడి మనసులో నాటిన బీజం అంత తొందరగా మహావృక్షమై ఫలిస్తూంటే వచ్చినయ్ కన్నీళ్లు.
   
    బండి కదిలింది.
   
    కాలువ పక్కనుంచి కొత్తగా వేసిన దారిలో పయనిస్తూంది.
   
    ఊరిని వదిలింది.
   
    పైర్ల మధ్యగా సాగుతుంది.
   
    అదే ఆఖరుసారి అన్నట్లు తలెత్తి పల్లెని చూశాడు సోమయాజి.
   
    దారి వెడల్పు చేయటం కోసం వూడలు కొట్టేసిన మర్రిచెట్టు బోసిగా కళావిహీనంగా కనబడుతూంది.
   
    ఊరంతటికీ ఆశ్రయమిచ్చిన చెట్టు ఊర్పోయి, ఊర్జిత్వాన్ని కూల్పోయి, కాస్త ఓదార్పు కోసం చూస్తున్నట్టూ వుంది.
   

                                                       5
   
    నదీ ప్రవాహాన హాయిగా ఈదుకుపోతున్న చేప పొరపాటున ఒడ్డున పడితే ఎలా వుంటుందో అలా వుంది సోమయాజి స్థితి. నీరు ఎటువైపునుందో చేపకి తెలీదు. ఇసుకలో ఎగిరెగిరి పడుతుంది. గిలగిలా కొట్టుకుంటుంది.

 Previous Page Next Page